డైలీ సీరియల్

అన్వేషణ -3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అవునండి.. మా బాబాయ్‌కి కుర్తా పైజమా కావాలిట.. అదీ మన ప్రైమ్ మినిస్టర్ మోదీగారి స్టైల్లో..’ అని నవ్విందామె.
‘విత్ వెస్ట్‌కోట్?’
‘యా.. యా.. ఎగ్జాట్లీ..’
‘మరి సైజు?..’
‘సైజు.. అదిగో ఆ బ్లూషర్ట్ వేసుకున్నాడే.. సరిగ్గా అలా ఉంటాడు మా బాబాయ్.. ఒడ్డూ పొడుగూ అంతే..’ చెప్పిందామె, కొంచెం దూరంలో వున్న ఒక వ్యక్తిని చూపిస్తూ.
ఇద్దరూ పక్కనే వున్న షాపులోకి వెళ్లి, షాపువాడికి ఆ బ్లూషర్ట్ వ్యక్తిని చూపించి ఆ సైజులో కుర్తా పైజమా వెస్ట్‌కోట్‌తో ఇమ్మన్నాడు అనిరుధ్. పావుగంటలో ఆ పని ముగిసింది.
ఇద్దరూ బయటికి వచ్చి కాస్సేపు అలా తిరిగి, ఒక చోట కూర్చున్నారు.
‘నాలుగు రోజుల్లో మా వూరు వెళతాను. అపుడు మా బాబాయ్‌కి ఇచ్చి రావాలి. అవునూ మీరేం కొనరా?’ అడిగిందామె.
‘లేదండి... ఊరికే చూద్దామని వచ్చాను.. ఇంతకుముందు నేనెప్పుడూ శిల్పారామం చూడలేదండి’ అనిరుధ్ చెప్పాడు.
‘మీరు ఇక్కడ.. కాదా?’
‘కాదండి.. టూ ఇయర్స్‌గా ఉంటున్నాను.. ’ అని తర్వాత తన ఊరు, యుఎస్ వెళ్లడం, తిరిగి వచ్చేసి కొన్నాళ్లు ఉద్యోగం చెయ్యడం, సొంతంగా కంపెనీ పెట్టుకోవడం అన్నీ చెప్పుకొచ్చాడు అనిరుధ్.
‘ఓ.. నేనూ ఇక్కడిదాన్ని కాదు.. నెల్లూరు నెరజాణని’ అని కిసుక్కున నవ్వి ‘మంచి కాలేజీలో జాబ్’ అని వచ్చాను. మా పిన్ని గారింట్లో ఉంటున్నాను.. మా పిన్ని అంటే మా అమ్మ చెల్లెలు.. ఇందాకా బాబాయ్ మా నాన్న తమ్ముడు’ తన గురించి చెప్పిందామె.
‘మీరే నయం ఇంటి భోజనం తింటున్నారు’
‘అదేం? మీరు?’
‘మెస్సు భోజనం.. వాళ్లు పెట్టింది మనం తినాలి..’ నవ్వుతూ చెప్పాడు.
‘అవునూ! అందరూ అమెరికా అంటూ పరుగులు తీస్తుంటే మీరేమిటి అక్కడనుంచి వచ్చేశారు...?’ అతడినే చూస్తూ నవ్వుతూ అడిగిందామె.
‘అవును కదా!.. నిజంగా అది కొందరికి ఓ భూతల స్వర్గమేనండి.. అగ్రరాజ్యం.. కానీ, నాలాంటివాడికి సరిపడని దేశం.. నాకు హాయిగా పలకరించే వాళ్లు కావాలి. అలా సరదాగా నడుచుకుంటూ వెళ్లి చాయ్ తాగి వచ్చే వాతావరణం ఉండాలి.. అక్కడ నాకదేం కనిపించలేదు... అందరిలోనూ ఏదో హడావిడి... జస్ట్ దే ఆర్ మూవింగ్ మిషీన్స్!... క్షణం వేస్టయితే ఒక డాలర్ మిస్సయిపోతావేమోనన్న ఆరాటం... పలుకరింపులో నాకు ఎక్కడా ఆత్మీయత కనిపించలేదు. అందుకే అక్కడ ఉండలేక నేను వచ్చేశాను.
బహుశా ఇదంతా నా అవగాహనా లోపం కావచ్చు... భ్రమేకావచ్చు... అక్కడ కూడా మంచి స్నేహితులు, హితులు, మంచి ఫ్యామిలీస్ ఉండవచ్చు... ఎందుకో నేనక్కడ ఇమడలేక వచ్చేశాను....’ చాలా ప్రశాంతంగా నిర్మొహమాటంగా చెప్పాడు అనిరుధ్.
‘అవునట!... కొందరు ఇలాగే చెప్పారు. కొందరు ఇండియాలో ఏం ఉంది బడ్లీ ఇండియా అన్నారు. కానీ, ఇండియాలో అన్నీ ఉన్నాయి... ఇక్కడ లేనిదల్లా ఒక్క డిసిప్లిన్!... అయినా నేపాల్‌లో ఉంటూ పప్పూ మామిడికాయ డిష్ తినాలనుకోవడం మన వెర్రి కాదూ...’అని అతడికేసి చూసింది నవ్వుతూ..
అంటే ఆమె తన అభిప్రాయాన్ని తప్పుబట్టిందా? అతడికి అర్థం కాలేదు.
‘మీరన్నది నిజమే! చెప్పానుగా. నేనెందుకో అక్కడ ఇమడలేకపోయానని. అసలు నేను అమెరికా వెళ్లిందే మా అమ్మమ్మ పట్టుదలమీద. ఆమాటకొస్తే అమెరికా ఎక్కడుందో, ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలీదు. ఆమెకు తెలిసినవాళ్లు తమ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని పదే పదే గొప్పగా చెబుతుంటే నన్నూ అక్కడికి వెళ్లి ఉద్యోగం చెయ్యమని చెప్పడం మొదలెట్టింది. వెళ్లాను ఆమె కోర్కె తీర్చాను. నాలుగు డబ్బులూ సంపాదించాను. ఇప్పుడు ఆమె వార్థక్యంలో చివరి మజిలీలో ఉంది... ఆమెకేదైనా అయితే?!... ఇక్కడనుంచైతే ఐదారు గంటల్లో వెళ్లి ఆమెకు సపర్యలు చేయగలను... అదే యు.ఎస్.నుంచైతే... నాకు ఊహించడానికే భయం వేస్తుంది’ చెప్పాడు. చివరి మాటలంటుంటే అతడి కంఠం వణికింది.
‘సారీ...’ నొచ్చుకున్నదామె.
‘ఫర్వాలేదండి...’
‘మరి అమ్మానాన్నా?’
‘లేరు.’
‘....’ అతడికేసి చూసింది ప్రశ్నార్థకంగా.
‘నేను పుట్టకముందు నాన్న పుట్టాక అమ్మ చనిపోయారు... అలా నేనో...’ ఇంక మాట్లాడలేకపోయాడు.
‘ఓఁ... సారీ...’
‘అప్పట్నుంచీ అంతా నాకు అమ్మమ్మే... రెక్కలు ముక్కలుచేసుకుని పెంచింది’ ఏ దాపరికం లేకుండా చెప్పుకున్నాడు.
కొందరికి చూడగానే చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. పరిచయమై కొన్ని గంటలే అయినా చాలాకాలంగా వాళ్లు మనకి పరిచయస్తుల్లా, సన్నిహితుల్లా అనిపిస్తుంది.
దీనికే మహాకవి కాళిదాసు అన్నాడు. ‘జననాంతర సౌహృదాని’అని. ఏ జన్మలోనో వాళ్లతో ఉన్న సన్నిహిత సంబంధం జన్మజన్మలకూ మనల్ని వెంటాడుతుంది.
హిమజతో పరిచయం అనిరుధ్‌కి అలానే అనిపించింది. అందుకే ఆమెదగ్గర ఏ భేషజం లేకుండా చెప్పేశాడు.
‘ఒక విధంగా మీరు అదృష్టవంతులు. ఏ బంధువుల ఇంటనో అనాధలా బ్రతక్కుండా అమ్మమ్మ నీడలో పెరిగారు’ ఓదార్పుగా అన్నట్లు అన్నదామె.
అవునన్నట్లు తల ఊపాడు. తర్వాత ఆలోచిస్తే హిమజ చెప్పిందీ నిజమనిపించిందతనికి.
‘ఇక వెళదామా ఎనిమిదవుతోంది...’ అన్నదామె వాచీ చూసి. ఇద్దరూ లేచారు.
‘సారీ అండీ నా పర్సనల్ విషయాలలో మీకు బోర్‌కొట్టించాను’అన్నాడు అనిరుధ్ నొచ్చుకుంటూ.
‘సారీ ఎందుకు? మీరు మనసువిప్పి మాట్లాడారు. అలా మాడ్లాడే వాళ్లటే నాకిష్టం. ఏవో గొప్పలు చెప్పి బిల్డప్‌లిచ్చే వాళ్లంటే నాకసహ్యం... ఇప్పుడు మనం మనసువిప్పి మాట్లాడుకునే ఫ్రెండ్స్ అయిపోయాం...’అంటూ హాయిగా నవ్విందామె.
ఆ మాటకి ఆమె ముఖంలోకి చూశాడు అనిరుధ్. స్వచ్ఛంగా అనిపించింది. సంతోషంగా అనిపించింది. ఈ సిటీలో తనకో మంచి ఫ్రెండ్ దొరికిందనుకున్నాడు.
‘ఒక మంచి కాఫీ తాగుదాం’అన్నాడు శిల్పారామంనుంచి బయటికి వచ్చాక. అలాగే అన్నట్లు తలూపిందామె.
కొంతదూరం వచ్చి ఇద్దరూ ఓ బడ్డీ హోటల్లో కాఫీ తాగారు.
‘ఎర్రగడ్డదాకా ఆటోలో వెళదాం... అక్కడనుంచి మీరు అటూ, నేను ఇటూ వెళ్లొచ్చు...’అని చెప్పి ఆమె సమాధానంకోసం ఎదురుచూడకుండా ఆటో పిలిచాడు అనిరుధ్.
** ** **
ఇంటి తాళం తీసి లైటువేసి హాల్లో సోఫాలో కూర్చుండిపోయాడు అనిరుధ్. అతడికి మనసంతా రిలాక్స్‌గా అనిపిస్తోంది.

- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842