డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన ఆమె రూపం, ఇంద్రియ నిగ్రహం చూసి ముగ్ధుడైన దుష్యంత మహారాజు ఆమె నిలా ప్రశ్నించాడు. ‘‘కల్యాణీ! నీవు ఎవరు? ఎవరి కుమార్తెవు? ఈ వనానికి ఎందుకు వచ్చావు? మొదటి చూపులోనే నీవు నా మనస్సును హరించావు. నీ వివరాలు చెప్పు’’.
ఇంకా ఇలా అన్నాడు. ‘‘నేను పూరు రాజవంశంలో జన్మించాను. ఈ దేశానికి మహారాజును. క్షత్రియ కాని స్ర్తి పట్ల నా మనస్సు చలించదు. వివస్త్ర పట్ల నా మనస్సు పోదు. నేను నిన్ను వరిస్తున్నాను. నన్ను వరించి నా రాజ్యమనుభవించు.’’
రాజు అలా పలుకగా శకుంతల నవ్వుతూ ఇలా అంది. ‘‘దుష్యంతా! నేను తపస్వి, పూజ్యుడు, ధర్మజ్ఞుడు, మహర్షి అయిన కణ్వుని పుత్రికను. నేను స్వతంత్రురాలిని కాను. తండ్రి అధీనంలో ఉన్నాను. కాశ్యపుడు నాకు తండ్రి, గురువు కూడా. నీవు అతన్ని నాకై అడగాలి. అంతేకాని ఇలా అనుచితంగా ప్రవర్తించడం తగదు’’.
దుష్యంతుడు మరల ఆమెను ఇలా ప్రశ్నించాడు.
‘‘పూజ్యుడు, ఊర్ధ్వరేతస్కుడు అయిన మహర్షి నియమవ్రతుడు. ధర్మదేవుడైనా నడవడి నుండి చలిస్తాడేమో కాని మహర్షి చలించడు. మరి నీవు అతనికి కుమార్తెవు ఎట్లా అయినావు? ఇదీ నా సందేహం. నీవు చెప్పాలి’’.
అప్పుడు శకుంతల మహర్షి వద్దకు తను ఎలా వచ్చిందో చెప్పసాగింది.
‘‘రాజా! పూర్వం ఒకసారి ఒక ఋషి వచ్చి నా గురించి ప్రశ్నిస్తే పూజ్యుడైన నా తండ్రి అతనికి ఇలా చెప్పాడు.
‘‘పూర్వం విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేయసాగాడు. అతను ఇంద్రపదవి కోసం ఇలా తపస్సు చేస్తున్నాడని భావించి ఇంద్రుడు అప్సరస అయిన మేనకను పిలిచి ఇలా చెప్పాడు. ‘తన తపశ్శక్తితో విశ్వామిత్రుడు నన్ను నా పదవి నుండి తోస్తాడేమో! నీవు అప్సరసలలో అగ్రగణ్యవు. నీ అందచందాలతో అతని మనస్సు చలింపజేయి. అతనికి తపోభంగం కలిగించు. నేను ఈ పదవిని కోల్పోరాదు’.
అందుకు మేనక ‘దేవేంద్రా! విశ్వామిత్రుడు తపశ్శాలి. కోపిష్టి. అతనికి కోపం కలిగిస్తే నన్ను శపిస్తాడు. అతని తపస్సుకు, క్రోధానికి మీరు కూడా భయపడ్తారు. మరి నేను భయపడనా? అతను త్రిశంకు కోసం ఇంకొక స్వర్గమే సృష్టించాడు. అలాటి మహాత్ముడు అతను. ఎవరు అతన్ని చూసి భయపడరు? అతను తన తపశ్శక్తితో మేరు పర్వతాన్ని విసరి వేయగలడు.
లోకాలను దహించగలడు. అలాంటి తపస్సంపన్నుని నాలాంటి స్ర్తి ఎలా తాకగలదు? అతను నన్ను భస్మం చేస్తాడు. అష్టదిక్పాలకులే అతన్ని చూసి భయపడగా నేను భయపడనా? కాని నీ చేత పోషించబడే నేను నీ ఆజ్ఞను అమలు చేయకుండా ఎలా ఉండగలను? కనుక ఈ కార్యంలో వాయువు, మన్మథుడు నాకు సహాయపడుదురుగాక!’’
ఇంద్రుడు సరేనని ఆమెవెంట వారిద్దరినీ పంపాడు.
మేనక విశ్వామిత్రుని ఆశ్రమం చేరుకొని అతనికి నమస్కరించి, నాట్యం చేయడం మొదలు పెట్టింది. అప్పుడు వాయువు ఆమె వస్త్రాన్ని తొలగించాడు. వస్త్రాన్ని తీసుకోవాలి అన్న మిషతో ఆమె ఋషి ముందుకు వచ్చింది. అలాంటి మేనకను చూచి ముని మోహంతో ఆమె సాంగత్యం కోరాడు. వారిద్దరూ ఆ వనంలో స్వేచ్ఛగా, ఇష్టంగా చాలాకాలం విహరించారు. ఇలా మేనకతో క్రీడించి ముని తన తపస్సును క్షీణింపజేసుకున్నాడు. మేనక యందు ఆ మునికి శకుంతల జన్మించింది. తన పని పూర్తవగానే మేనక ఆ పసిగుడ్డును ఆ హిమాలయ సానువులలో విడిచిపెట్టి ఇంద్రసభకు వెళ్లిపోయింది. ఆ పసిపాపను క్రూరమృగాలు తినకుండా శకుంతాలు రక్షి ంచాయి. కణ్వమహర్షి మాలినీ నది తీరానికి వెళ్లినపుడు ఆ పాపను చూచాడు. పక్షులన్నీ ముని కాళ్లమీద పడి ‘ఈ బాలికను నీవు కుమార్తెగా పెంచుకో’ అని ప్రార్థించాయి. మహర్షి ఆ బాలికను తెచ్చి శకుంతల అన్న పేరు పెట్టి తన కుమార్తెగా పెంచుతున్నాడు. నాకు తండ్రి కణ్వమహర్షియే’ అని శకుంతల దుష్యంతునితో తన జన్మవృత్తాంతం తెలిపింది.
దుష్యంతుడు ఆమెతో ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! నీవు క్షత్రియ కన్యవని నాకు అర్థమైంది. నీవు నా భార్య కావడానికి అన్ని అర్హతలు కలదానవు. నీ కోసం నేను ఏమి చేసి నిన్ను సంతోషపెట్టగలను? సకల ఆభరణాలు నీ కోసం తెస్తాను. నా సమస్త రాజ్యము నీదే. నీవు నాకు భార్యవైతే చాలు. నన్ను గాంధర్వవిధితో వివాహం చేసుకో. గాంధర్వ వివాహం క్షత్రియులకు తగినదే’’.
అప్పుడు శకుంతల అతనితో ఇలా అన్నది. ‘‘మహారాజా! ముహూర్తకాలం వేచి ఉండు. నా తండ్రి వచ్చి నన్ను నీకు ఇచ్చి వివాహం చేస్తాడు. కన్య తండ్రి రక్షణలో, తర్వాత భర్త పుత్రుల రక్షణలో ఉండాలి కాని ఆమెకు స్వతంత్రం పనికిరాదు. ఆశ్రమంలో పెరిగిన నేను తపస్వి అయిన తండ్రికి తెలియకుండా నినె్నలా వరించగలను?’’
దుష్యంతుడు ఆమెను ఇలా బ్రతిమాలాడు. ‘కల్యాణీ! నేను నీ కోసమే ఇక్కడ ఉన్నాను. నీవు స్వతంత్రురాలివి. నన్ను వరించు. ధర్మప్రకారం తన్ను తాను దానం చేసుకోవచ్చు. అలాగే అష్టవిధ వివాహాల్లో గాంధర్వం ఒకటి. (వివాహాలు - బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం). మొదటి నాలుగు బ్రాహ్మణులకు ప్రాశస్త్యం. మొదటి ఆరు క్షత్రియులకు ధర్మసమ్మతం. గాంధర్వ రాక్షసాలు క్షత్రియులకు ధర్మమే. కనుక నీ కోరికతో ఉన్న నన్ను గాంధర్వ విధిలో వివాహం చేసుకో.’’
శకుంతల ఇలా అంది. ‘‘రాజా! గాంధర్వ వివాహం ధర్మసమ్మతం అయితే నా నియమం కూడా చెప్తాను విను. నాకు పుట్టిన నీ కుమారుడినే నీ తర్వాత రాజును చేయాలి. దీనికి నీకు సమ్మతమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను.’’
(ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి