డైలీ సీరియల్

అన్వేషణ -6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్లలతో తనకి పరిచయాలు లేవు. టెన్త్ వరకూ సరే! ఆపైన ఇంటర్‌లోనూ తనకి ఆడపిల్లలతో పరిచయాలు లేవు. వాళ్లతో జల్సాలు చేయడానికి తనదగ్గర డబ్బులేదు. మంచి బట్టలూ ఉండేవి కావు.
ఇంజనీరింగ్‌లో ఆడా మగా బాగా కలివిడిగా ఉండేవారు. కేరింతలు, పిక్నిక్‌లు, పార్టీలు... కావలసినంత ఎంజాయ్‌మెంట్! కానీ అనిరుధ్ వీటన్నింటికీ దూరంగా ఉండేవాడు. అందరూ తనను ‘బుక్‌హాలిక్’ అని గేలిచేసేవారు. అదే నిక్‌నేమ్‌తో పిలిచేవారు.
అవి అతడేం పట్టించుకునేవాడు కాదు. తనగోల్ ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించి, మంచి ఉద్యోగంలో చేరడం... అమ్మమ్మని ఇక కష్టపడకుండా సుఖపెట్టడం...
అతడు తన లక్ష్యం సాధించాడు. ఆమె తన దగ్గరికి రాకపోయినా, ఆ ఊళ్ళోనే ఉంచి అమ్మమ్మని సుఖపెడుతున్నాడు. ఆమేరకు అతడికి తృప్తిగానే అనిపిస్తోంది.
ఇంక - జీవితంలో పరిచయమైన హిమజని తన భార్యగా తెచ్చుకుంటే... అంతకన్నా ఆనందం ఏమంటుంది?! అనుకుంటున్నాడిప్పుడు.
‘ఇప్పుడు హిమజ ఏం చేస్తూంటుంది? నిద్రపోతూంటుందా? ఫోన్ చేస్తే...’ అనుకుని టైము చూసుకున్నాడు. పదకొండు గంటలు దాటుతోంది. నిద్రపోతున్నదేమో... అనుకుంటూ సెల్ అందుకున్నాడు రింగ్ చేద్దామని.
ఇంతలో సెల్‌ఫోన్ రింగయ్యింది. ఎవరా అని చూసేసరికి హిమజ! ‘ఈ టైములో హిమజ!’ ఆశ్చర్యంలో ఉబ్బితబ్బిబ్బవుతూ ఆన్‌చేసి హలో అన్నాడు.
‘ఏయ్ అనిర్! ఇంకా నిద్రపోలేదా?’ అడిగిందామె.
‘లేదు హిమా! ఏదో అలా కూర్చుండిపోయాను... అరగంట క్రితమే మీల్స్ చేసొచ్చాను.. నువ్వు నిద్రపోలేదా?’
‘లేదు... జనరల్‌గా నేను పదకొండు తర్వాతే నిద్రపోతాను కాస్సేపు టీవీ చూసి, కాస్సేపు ఏదో చదువుకొని...’
‘శిల్పారామం నుంచి వచ్చిన తర్వాత చాలాసేపు అలా కూర్చుండిపోయాను...’
‘ఆలోచిస్తూనా’
‘ఒక విధంగా అంతే...’
‘దేనిగురించి?’
‘దేనిగురించి అంటే...’
‘నీగురించీ నా గురించీనా?’ అతడు నవ్వేశాడు.
‘నేనూ ఆలోచిస్తున్నాను... నాగురించీ, నీ గురించీ...’ అని నవ్విందామె.
అనిరుధ్‌కి ఏమనాలో అర్థం కాలేదు.
‘ఏమని అడగవేం?’ అన్నదామె.
అప్పుడూ ఏం మాట్లాడాలో అతడికి అర్థం కాలేదు. వౌనంగా ఉండిపోయాడు.
‘మన పరిచయం తమాషాగా జరిగింది కదూ! అదే ఆలోచిస్తున్నాను. కొన్ని కొన్ని సంఘటనలు జీవితంమీద ఎంత అందమైన తీపి గుర్తులు వేస్తాయి కదా!..’ అన్నదామె.
‘అవును! నేనెప్పుడూ అదే అనుకుంటాను’ నిజాయితీగా చెప్పాడు.
‘మొదట్లో అనుకున్నాను ఒక మంచి మనిషి పరిచమయ్యాడని.. తర్వాత ఒక మంచి ఫ్రెండు దొరికాడనుకున్నాను.. ఇప్పుడు.. కొద్దిసేపు ఆగిందామె.
హిమజ ఏం చెబుతుందా అని ఆత్రంగా ఎదురుచూశాడు అనిరుధ్. ఆమె చెప్పే మాట స్పష్టంగా వినాలని సెల్‌ఫోన్ స్పీకర్‌ను చెవికి దగ్గరగా ఉంచుకున్నాడు.
‘ఇప్పుడు మరింకేదో కావాలని ఉంది అనిర్!’ అన్నదామె.
‘ఏం కావాలని?’ అని అడగాలనుకున్నాడు. యథావిధిగా అతడికి బిడియం అడ్డొచ్చేసింది. అడగలేకపోయాడు. అతడికి మాటలు రావడంలేదు.
‘నీకేం అనిపించడంలేదా?..’ క్షణం పోయాక అడిగిందామె గుసగుసలాడినట్లు.
‘నాకు.. నాకూ అలానే అనిపిస్తోంది హిమా..’ అతి బలవంతంమీద గొంతు పెగల్చుకుని అన్నాడు.
‘మరి ఈ మాట ఇప్పటిదాకా చెప్పలేదేం?..’ ప్రశ్నించిందామె వస్తున్న నవ్వుని ఆపుకుంటూ.
అనిరుధ్ మాట్లాడలేదు. మళ్లీ సందిగ్ధం అతడిని ఆవహించింది ఏం చెప్పాలో తోచక.
‘సిగ్గుపడ్డావా.. భయపడ్డావా..?’
‘ఊఁ.. రెండూనూ..’ నూతిలోంచి మాట్లాడినట్లు అన్నాడు.
‘పది పదిహేను రోజులుగా నిన్ను గమనిస్తున్నాను అనిర్! నీలో నువ్వే గందరగోళ పడుతున్నావ్. నా ముఖంలోకి నువ్వు చూసినపుడల్లా నీలో ఏదో అలజడి స్పష్టంగా కనిపించేది.. ఏదో నాతో చెప్పాలని తాపత్రయం.. అది చెప్పలేకపోతున్నావన్న నిస్సహాయత.. నువ్వు బాగా స్ట్రగుల్ అవుతున్నావని నాకు అనిపించింది. అనిర్! మన ఇద్దరిమధ్యా అరమరికలు లేవు. భేషజాలు లేవు. నా దగ్గర నీకు కావలసినంత చనువుంది. నువ్వు చెప్పాలనుకున్నది ఓపెన్‌గా చెప్పొచ్చుగా అనిర్! ఎందుకు నీలో నువ్వు స్ట్రగుల్ అవుతావు?’ ఒక గైడ్‌గా, అత్యంత సన్నిహితురాలిగా నిదానంగా అన్నట్టు చెప్పింది హిమజ.
‘హిమా! నువ్వు.. నువ్వు నాకు కావాలి.. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అభ్యర్థిస్తున్నట్లు ఉద్వేగంగా అడిగేశాడు అనిరుధ్. ఆమెకు అలా చెప్పడంతో ఇప్పుడతడికి ధైర్యం వచ్చేసింది. ఏమైతే అదవుతుందిలే అని తన మనసులో మాట చెప్పేశాడు.
‘అబ్బా! ఎంత ధైర్యం వచ్చేసింది నీకు.. ఏదీ మళ్లొక్కసారి చెప్పు..’ నవ్వుతూ అన్నదామె.
‘చెబుతాను.. ఈసారి ఎన్నిసార్లయినా చెబుతాను హిమా!.. మనం పెళ్లి చేసుకుందాం.. ఐ వాంట్ యూ హిమా..’ అన్నాడు మరింత ఉద్వేగంగా.
***
హిమజతో మనసు విప్పి మాట్లాడిన తర్వాత అనిరుధ్‌కు ఎంతో తేలిక పడ్డట్లు అనిపించింది. అమ్మమ్మ తర్వాత ఆమెలాంటి ఓ బలమైన ఆలంబన దొరికినంత సంతోషంగా అనిపించిందతడికి.
ఇద్దరూ మరింత సన్నిహితులయ్యారు. స్నేహం స్థానే ప్రేమ పెరిగి పెద్దదయ్యింది. రోజులు గడుస్తున్నకొద్దీ ఒకరికోసం ఒకరన్నట్లుగా కలిసిపోయారు.
సినిమాలకీ,, షికార్లకీ వెళ్లారు. భాగ్యనగర్ చుట్టుప్రక్కల విహార, వినోద ప్రాంతాలకూ వెళ్లారు.
ఆమె కేరింతలు అతడికెంతో హాయిగా, మరెంతో ఆనందంగా, చిలిపిగా అనిపించసాగాయి.
అతడు ఆమెలా కేరింతలు కొట్టలేడు. మొదట్నుంచీ అతడి తత్వమే అంత.
అతడు పెరిగిన వాతావరణం.. సమాజంలో అతడిపట్ల ఎదురైన చిన్నచూపు.. అనిరుధ్‌ని అలా తయారుచేశాయి.
అందరూ కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే అతడు మాత్రం ఎక్కడో ఓ చోట కాళ్లు ముడుచుకుని కూర్చునేవాడు.
అతడికేవేవో నిక్‌నేమ్‌లు పెట్టి గేలిచేసేవారు తోటి పిల్లలంతా. టెన్త్‌లో జడపదార్థం అన్నారు.
ఎవరేమనుకున్నా అనిరుధ్ అలానే ఉండేవాడు. ఏదో న్యూనతాభావం అతడిని ఎప్పుడూ వెంటాడేది. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842