డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ శకుంతలను కోడలుగా అనుగ్రహించు’’.
దుష్యంతుని మాటలు విన్న రాణి వారిద్దరినీ దీవించింది. తర్వాత శకుంతలను ఆభరణాలతో అలంకరించి పట్టమహిషిని చేశారు. శకుంతల పుత్రునికి భరతుడు అన్న పేరు పెట్టి యువరాజును చేశాడు దుష్యంతుడు.
తర్వాత భరతుడు అందరి రాజులను జయించి సార్వభౌముడు అయ్యాడు. అతను అనేక యజ్ఞాలను చేశాడు. కణ్వమహర్షి అతనిచేత అశ్వమేదయాగం చేయించాడు. భరతుని వల్ల ఈ భూమి భారతిగా ప్రసిద్ధి పొందింది.
యయాతి చరితము
దేవదానవులకు మూడు లోకాల్లో ఉన్న ఐశ్వర్యం కోసం సదా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రాక్షసగురువైన శుక్రాచార్యునికి మృతసంజీవని విద్య తెలుసు. అందువల్ల అతను యుద్ధంలో మరణించిన రాక్షసులను తన విద్యతో బ్రతికించేవాడు. కాని దేవగురువు బృహస్పతికి ఈ విద్య తెలియదు. కనుక దేవతలను బ్రతికించలేకపోయేవాడు. క్రమంగా దేవతల సంఖ్య తగ్గిపోతోంది. అప్పుడు వారంతా సమావేశమయి ఎలాగైనా శుక్రుని నుండి ఈ విద్య నేర్చుకోవాలని తలచారు. అందుకు ఎవరు సమర్థుడు? అని ఆలోచించి బృహస్పతి పుత్రుడైన ఢకచుని పిలిచి ఇలా అన్నారు. ‘‘కచా! మేమంతా నీకు నమస్కరిస్తున్నాము. మాకు సహాయం చేయి. తేజస్సు గల బ్రాహ్మణుడైన శుక్రుని వద్ద నుండి విద్యను గ్రహించు. అప్పుడు నీకు కూడా మాతోపాటు యజ్ఞంలోని హవిర్భాగం ఇస్తాము. శుక్రాచార్యుడు రాక్షసరాజైన వృషపర్వుని దగ్గర ఉంటాడు. అతను దానవులను రక్షిస్తున్నాడు. అతని పుత్రిక దేవయాని. ఆమెని సంతుష్టి పరచడానికి నీవే సమర్థుడవు. నీ ప్రవర్తన ఇంద్రియ నిగ్రహం, దయ, తీయని పలుకులు, ఆచారం, వీటన్నిటి చేత దేవయాని సంతృప్తి చెందుతుంది. ఆమె సంతుష్టి పొందితే ఆ విద్యను తప్పక పొందగలవు’’.
కచుడు ఆ విద్యను నేర్చుకోవడానికి ఒప్పుకొని వృషపర్వుని నగరానికి వెళ్ళి శుక్రునితో ఇలా అన్నాడు. ‘‘అంగిరస పౌత్రుడు, బృహస్పతి పుత్రుడు కచుడనే నామధేయము గల నేను నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. మీకోసం నేను వెయ్యి సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తాను’’.
శుక్రుడు ఇలా అన్నాడు. ‘‘కచా! నేను నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను. నిన్ను గౌరవిస్తే బృహస్పతిని గౌరవించినట్లే’’.
ఈ విధంగా కచుడు శుక్రుని శిష్యుడయ్యాడు. అతను నిత్యమూ తన గురువునూ, దేవయానినీ సేవిస్తూ అన్ని విధాలుగా దేవయానిని సంతోషపెట్టాడు. వనంలో ఉన్న కచడు పూలతో, ఫలాలతో దేవయానిని సంతోపెట్టాడు.
దేవయాని కూడా ఆడుతూ పాడుతూ బ్రహ్మచర్యం పాటిస్తున్న అతనిని సంతోషపెట్టింది. అలా ఐదువందల సంవత్సరాలు గడిచాయి. దానవులు అతని గురించి అంతా తెలుసుకున్నారు. వారికి బృహస్పతి మీద ద్వేషం కనుక కచుని సంహించలేకపోయారు. మృత సంజీవినీ విద్య అతనికి దక్కకూడదని అతన్ని చంపి ముక్కలు ముక్కలు చేసి తోడేళ్ళకు వేశారు. సాయంత్రానికి కచుడు లేకుండానే గోవులు ఆశ్రమానికి తిరిగి వచ్చాయి. అలా వచ్చిన గోవులను చూచి దేవయాని తండ్రితో ఇలా అంది. ‘‘తండ్రీ! సూర్యుడు అస్తమించాడు. గోవులు తిరిగివచ్చాయి. కాని కచుడు రాలేదు. అతను మరణించి ఉంటాడు. అతను లేకుండా నేను జీవించను’’.
అప్పుడు శుక్రుడు కుమార్తెతో ఇలా అన్నాడు. ‘‘నీవు దిగులుపడవద్దు. కచుని నేను బ్రతికిస్తాను’’ అని అతను మృతసంజీవిని విద్యతో కచుని పిలిచాడు. కచుడు తోడేళ్ళ శరీరాలను చీల్చుకొని బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు.
దేవయాని అతన్ని ‘‘ఎందుకు ఆలస్యమైంది?’’ అని అడిగింది. అతడు ఇలా చెప్పాడు. ‘‘సమిధలు, కుశలు, కట్టెలు తీసుకొని వస్తూ అలసట చేత వటవృక్షం కింద విశ్రమించాను. అసురులు నన్ను చూసి ‘‘నీవు ఎవరవు?’’ అని అడిగారు. ‘‘నేను బృహస్పతి పుత్రుడను కచుడను’’ అని చెప్పాను. వెంటనే వారు నన్ను చంపి తోడేళ్లకు వేసి వెళ్లిపోయారు. మహాత్ముడైన గురువు విద్య చేత బ్రతికి నీ దగ్గరకు వచ్చాను’’.
ఇంకొక రోజు దేవయాని కోసం పూలు పళ్లు తేవడానికి అరణ్యానికి వెళ్లాడు. దానవులు మళ్లీ అతనిని చంపి సముద్ర జలాల్లో కలిపివేశారు. కచుడు ఎప్పటికీ రాకపోతే చూసి చూసి దేవయాని తండ్రితో చెప్పింది. శుక్రుడు మళ్లీ తన విద్య చేత అతన్ని బ్రతికించాడు. కచుడు తిరిగి వచ్చి జరిగిన విషయం దేవయానికి చెప్పాడు.
మూడవసారి రాక్షసులు కచుని చంపి, తగులబెట్టి పొడిచేసి దాన్ని సురలో కలిపి శుక్రునికే ఇచ్చారు. కచుడు సమయానికి రాకపోవడంతో దేవయాని తండ్రికి చెప్పింది. అతను మరణించి ఉంటాడు. అతను లేకపోతే తాను జీవించనన్నది.
అపుడు శుక్రుడు ఆమెతో ఇలా అన్నాడు. ‘‘తల్లీ! కచుని ఎన్నిసార్లు పునర్జీవితుని చేసినా అతను మళ్ళీ మళ్ళీ చంపబడుతున్నాడు. నేనేం చేయను? నీవు అతని గురించి ఇక దుఃఖించకు. దేవతలంతా నా శక్తి వల్ల నీకు నమస్కరిస్తూ ఉంటే నీవు ఇలా దుఃఖించడమేమిటి? ఆ బ్రహ్మచారిని బ్రతికించినా మరల చంపబడుతాడు’’.
అప్పుడు దేవయాని ఇలా అంది.
‘‘తండ్రీ! తపోనిధి అయిన బృహస్పతి కుమారుని కోసం దుఃఖించకుండా ఎలా ఉంటాను? అతడు ఉత్తమ బ్రహ్మచారి. తపోధనుడు.
ఎంతో సమర్థవంతంగా ఏ పనైనా చేసేవాడు. అతను నాకు ఇష్టమైనవాడు. నా రూపానికి తగినవాడు. నేనే పోయి అతని మార్గం తెలుసుకుంటాను’’. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి