డైలీ సీరియల్

అనే్వషణ -9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికి ఐదోనెల గర్భిణి! గుండెలమీద పిడుగు పడ్డట్టయ్యింది...’
ఆమె చెప్పడం ఆపింది. ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా ఆమెను ఉద్వేగానికి గురిచేశాయి. చేత్తో గుండెమీద రాసుకుంది నాలుగైదుసార్లు. అనిరుధ్ అచేతనంగా కూర్చుండిపోయాడు ఆమెనే చూస్తూ.
‘హుఁ... భగవంతుడు నాకు మరో పరీక్ష పెట్టాడ్రా... దాన్ని ఇంటికి తీసుకొచ్చి చావబాదాను ఎవరో చెప్పమని. ఎవరేంటి... అందరూ అంది నవ్వుతూ. పిచ్చిది... దానికేం తెలుసు?!... నా ప్రశ్నకి దానికి అసలు అర్థమే తెలీదు. ఇంక సహనం నశించిపోయి మళ్లీ కొట్టాను... పచ్చిగా అడిగాను. వాడువీడు... వీడు వాడు...అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడింది తప్ప ఏమీ చెప్పలేకపోయింది.
మీ మామయ్యకి చెప్పి కడుపు తీయించేయమని అడిగాను. తీయిస్తాం... మళ్లీ ఇది కడుపు తెచ్చుకోదని గ్యారంటీ ఏమిటి? చంపి పారెయ్ పీడా వదిలిపోతుందన్నాడు. మీ అత్తమ్మా అదే అన్నది. ఏం చేయాలో నాకు తోచలేదు. కన్న కొడుకు చూస్తే అలా. కూతురు చూస్తే ఇలా... యెదవ జన్మ ఎందుకిచ్చాడో భగవంతుడు అని కుమిలి కుమిలి ఏడ్చాను. అలా మరో ఇరవై రోజులు పైగా గడిచిపోయింది. అది మామూలుగా ఏమీ జరగనట్లు గంతులేస్తూ తిరుగుతూనే ఉంది. మళ్లీ దాన్ని డాక్టరు దగ్గరికి లాక్కుపోయి కడుపు తీయించమని ప్రాధేయపడ్డాను. ఆ పరిస్థితుల్లో కడుపు తీస్తే తల్లికీ, బిడ్డకీ ప్రమాదం అన్నాడు. పెద్ద డాక్టరుకి చూపించమన్నాడు. చూపించే స్తోమతా నాకులేదు... బిడ్డపోయినా తల్లి బ్రతికితే అదొక సంతృప్తి. కానీ చేజేతులా కూతుర్నికూడా చంపుకోనా?! మనసొప్పలేదు. ఇంటికి తీసుకొచ్చి వెర్రి ఆవేశంతో చచ్చేలాకొట్టాను దాన్ని. తెల్లారి చూస్తే అది ఇంట్లో లేదు. చుట్టుప్రక్కల వెతికాను. లేదు. దరిద్రం వదిలింది- అన్నది మీ అత్తమ్మ. శనిముండ చస్తే సరి అన్నాడు మీ మామయ్య.
రెండు నెలలు పైగా దాని ఆచూకీ తెలియలేదు. నిజంగా అది చచ్చిపోయిందా- అని భయపడ్డాను. బాధపడ్డాను. కొన్ని రోజులకి ఎవరో చెప్పారు మీ అమ్మాయి ఒన్‌టౌన్‌లో కనిపించిందని. ఆదుర్దాగా వెళ్లి ఒన్‌టౌన్ వీధులన్నీ వెతికాను. అదెక్కడా కనిపించలేదు. అలా అప్పుడప్పుడు ఎవరెవరో చెబుతూనే ఉన్నారు- మీ అమ్మాయిని అక్కడ చూశాం... ఇక్కడ చూశాం... ఆ గుళ్లో కనపడింది... బస్టాండ్‌లో కనపడింది అంటూ. దానికోసం వెతకనిచోటు లేదు. ఈ వంకతో నేను ఇంటి పనిచేయకుండా వెళ్లిపోతున్నానని మీ అత్తమ్మ గొడవ చేసేది. మీ మామయ్య తిట్టిపోసేవాడు. ఇంక నాకూ విసుగొచ్చింది. భగవంతుడికో దణ్ణంపెట్టి బాధను దిగమింగుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాను. కానీ ఇరుగు పొరుగు వాళ్లకి చెప్పాను- అది ఎక్కడేనా కనిపిస్తే దాన్ని కాళ్లూ చేతులూ కట్టేసయినా తీసుకురండి బాబూ- అని.
అలా నెలపైగా గడిచిపోయింది. ఓరోజు పొద్దునే్న వచ్చింది మీ అమ్మ ఇంత పొట్టేసుకుంది. పొట్ట తడుముకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ... దాన్ని చూసి బావురుమని ఏడ్చేశాను. ఎక్కడ తగలడ్డావే మళ్లీ వచ్చావ్? ఎందులోనన్నా దూకి చావలేకపోయావ్? - అంటూ మీ మామయ్య రంకెలు వేశాడు. శనిముండ మళ్లీ దాపురించింది అంటూ మీ అత్తమ్మ తిట్టిపోసింది. పిచ్చిది! నవ్వుతూ ఉండిపోయింది పొట్టరాసుకుంటూ. అప్పటికి దానికి తొమ్మిదో నెల వచ్చి ఉండాలనుకున్నాను. దాన్ని ఇంట్లో పెట్టుకోవడం మీ మామయ్య, అత్తమ్మలకెంత మాత్రం ఇష్టంలేదు. తన తోడబుట్టిన చెల్లెలు అన్న ప్రేమాభిమానాలు మీ మామయ్యకు ఏ కోశానా లేవు. దీన్ని చంపి పారేసినా పాపం లేదు- అంటూ ఓరోజు పెద్ద గొడవచేశాడు. నేను మీ మామయ్య కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడాను... దాని పురుడు వచ్చేవరకూ ఉంటామని, తర్వాత అదీ నేనూ ఇంట్లోంచి వెళ్లిపోతామని... చుట్టుప్రక్కలవాళ్లు కూడా నచ్చచెప్పడంతో ఒప్పుకున్నాడు...
‘పదిహేను రోజులకి ఓ రాత్రివేళ మీ అమ్మ నొప్పి అంటూ అరుస్తూ మెలికలు తిరిగిపోతుంటే ప్రక్కవాళ్ల సాయంతో ఆసుపత్రికి తీసికెళ్లాను. ఓ నాలుగైదు గంటలు నొప్పి అంటూ గిలగిలా కొట్టుకుంది. దానికి తెలీదు అవి పురిటి నొప్పులని. తెల్లజారుఝామున పురుడొచ్చింది. నిన్ను భూమిమీద పడేసింది. అది... అంటే మీ అమ్మ ప్రాణం వదిలేసింది. కూతురు... పిచ్చిది... చనిపోయినందుకు బాధపడాలా? మనవడిని కన్నందుకు సంతోషించాలా? బిడ్డని... అంటే నిన్ను తీసుకుని ఇంటికి వచ్చాను. ‘ఒక దరిద్రం వదిలిందనుకుంటే ఇంకో దరిద్రం వచ్చిందన్నమాట...’అని మీ అత్తమ్మ నా ముఖంమీదనే అనేసింది. భరించడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు... ఆ పరిస్థితుల్లోనే ఎవరో అన్నారు- అప్పలకొండ బావున్నాడు...’అని ఆ క్షణంనుంచీ అదే నీ పేరయిపోయింది...
‘రోజురోజుకీ అక్కడి పరిస్థితులు నాకు ఆందోళనగా అనిపించాయి. ఓరోజు పొద్దునే్న నీకు స్నానం చేయించి వళ్లు తుడిచి పాలుపట్టి పడుకోబెడుతుంటే మీ మామయ్య వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు. వాడు నాతో మాట్లాడ్డానికే వచ్చాడని నాకర్థమయ్యింది. అదికూడా నీ గురించే అనిపించింది. అమ్మా తండ్రెవరో తెలీని ఓ పిచ్చిదాన్ని బిడ్డని మనం ఉంచుకోవడం మంచిదికాదు. అసలు వీడిని ఆ ఆసుపత్రిలోనే వదిలి వచ్చేస్తేనో, లేకపోతే ఎవరికేనా ఇచ్చేసి వచ్చేస్తేనో బావుండేది.
సరే! కూతురు కొడుకు కదా అని తెచ్చుకున్నావ్. మీ కోడలికా ఇష్టంలేదు. దానిమాట కాదని నేనేం చేయలేను. నీ వంట్లో ఓపికాలేదు. మనకి మడులూ, మాణ్యాలూ లేవు. అందుకే నా మాట విను. వీడిని ఏ అనాధాశ్రమంలోనో వదిలేద్దాం. తండ్రెవరో తెలీని బిడ్డని పెంచడం అంటే చాలా కష్టం. చాలా సమస్యలొస్తాయ్. నా మాట విను. అనాధాశ్రమంలో వదిలేద్దాం. సాయంత్రం తీసికెళ్లి ఇచ్చేస్తాను. ఇంకేం మాట్లాడకు- అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. వీడు నీ చెల్లెలు కొడుకురా! అన్నాను కోపంగా. చెల్లెలు... అదో పిచ్చిది... దానికో కొడుకు... రేపు వీడూ పిచ్చివాడైతే ఏమిటి పరిస్థితి? అన్నాడు మీ మామయ్య. ఒక్కసారిగా వెన్నుమీద ఛెళ్లుమని కొట్టినట్లయ్యింది. వాడన్నట్లు వీడూ పిచ్చివాడవుతా? అని భయపడిపోయాను. కానీ, ఎక్కడో ఆశ!... ఇన్ని విధాలుగా చిన్నచూపు చూసిన భగవంతుడు ఓ చిన్న సాయమైనా చేయకపోతాడా!?... నిన్ను మామూలు వాడిలా కరుణించకపోతాడా...అన్న ఆశ! మొండిగా మీ మామయ్యతో అన్నాను- పిచ్చివాడైనా సరేరా వీడిని వదిలిపెట్టను- అని. సరే అమ్మా నీ ఇష్టం. కానీ ఇందర్ని పెంచడం నావల్లకాదు- అన్నాడు మీ మామయ్య వాడికి ఎక్కువైందల్లా నెలరోజుల పసిపిల్లవాడు!...
‘ఆ తర్వాత మీ మామయ్య, అత్తమ్మల ధోరణి నాకు చాలా ఆందోళన కలిగించింది. వాళ్లు నిన్ను ఏంచేస్తారో అన్నదే నా భయం. నేను అనుక్షణం నిన్ను కాపాడుతూ కూర్చోలేను. ఏమాత్రం నేను ఏమరుపాటుగా వ్యవహరించినా నీ నోట్లో ఏ వడ్లగింజో వేసి నినె్నక్కడ చంపేస్తారోనని నా భయం. ఏ స్నానానికో, పెరట్లోకో వెళ్లకుండా ఎలా ఉండగలను? మీ అత్తమ్మకి ఇంటి పనుల్లో సాయపడకుండా ఎలా ఉండగలను? అందుకే ఓ నెలరోజులు ఆ ఇంట్లో ఉన్నాను.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842