డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు రాక్షసరాజు అయిన వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ సరిగా చూడక దేవయాని వస్త్రం స్వీకరించింది. తర్వాత వారిద్దరికీ ఆ వస్త్రం గురించి విరోధం ఏర్పడింది. దేవయాని శర్మిష్ఠతో ఇలా అంది. ‘‘నీవు రాక్షసకన్యవు. నా వస్త్రాన్ని ఎందుకు తీసుకున్నావు? నీకు ఇది మంచి పని కాదు’’.
శర్మిష్ఠకు ఈ మాటతో ఆగ్రహం కలిగి తిరిగి ఇలా అంది. ‘‘నా తండ్రి రాక్షసులకు రాజు. అతను కూర్చున్నా, పడుకున్నా, క్రింద నిలబడి నీ తండ్రి వినయంగా అతన్ని స్తుతిస్తూ ఉంటాడు. నా తండ్రి ఇచ్చే దానాన్ని స్వీకరించే శుక్రుని కుమార్తెవు యాచకీ! ఇంకా మాట్లాడితే నా దాసీలు నిన్ను బయటకు గెంటుతారు’’ ఇలా అని ఆమె దేవయానిని అక్కడ ఉన్న బావిలోకి త్రోసింది. ఆమె చనిపోయిందని తలచి తన నగరానికి తిరిగి వెళ్లిపోయింది.
కొంతసేపటికి అక్కడికి నహుషుని పుత్రుడు యయాతి వచ్చాడు. దప్పిక చేత నీరు త్రాగడానికి ఆ బావి దగ్గరకు వచ్చాడు.నూతిలో పడి వున్న దేవయానికి చూసి ఇలా అన్నాడు. ‘‘అగ్నిశిఖలా వున్న నీవు ఎవరవు? గడ్డితో, సర్పాలతో ఉన్న ఈ కూపంలోకి ఎలా పడ్డావు? నీవు ఎవరి కూతురువు? ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు? నిజం చెప్పు’’.
అప్పుడు దేవయాని ఇలా సమాధానం చెప్పింది. ‘‘దేవతలు చంపిన దైత్యులను తన విద్యతో బ్రతికించే శుక్రాచార్యుని కుమార్తెను. ననె్నరుగవా? నీవు ఎవరవు? ఎందుకు ఇక్కడికి వచ్చావు?’’
రాజు ఇలా అన్నాడు. ‘‘సుందరీ! నేను యయాతి మహారాజును. వేటకై వచ్చి దాహం చేత నీరు త్రాగడానికి ఇక్కడికి వచ్చాను.’’
దేవయాని ‘‘రాజా! నా కుడిచేతిని పట్టుకొని నన్ను గ్రహించు. ఉత్తమవంశంలో పుట్టిన నీవంటే నాకు ఇష్టమే. శాంతుడు, యశస్వి, పరాక్రమవంతుడైన నిన్ను నేను ఎరుగుదును. నన్ను ఉద్ధరించడానికి నీవే యోగ్యుడవు’’.
రాజు ఆమెను కుడిచేత్తో పట్టుకొని బయటకు తీసి ఇలా అన్నాడు ‘‘స్వేచ్ఛగా వెళ్లు’’.
అప్పుడామె ‘‘నా పాణిని గ్రహించావు. కనుక నాకు భర్తవు అవుతావు. నన్ను కుడిచేత్తో స్వీకరించి స్వేచ్ఛగా వెళ్లు అంటున్నావు’’.
యయాతి ఆమె మాటలకు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు. ‘‘్భద్రా! నీవు బ్రాహ్మణకన్యవు. నేను క్షత్రియుడను. అందువల్ల ఈ కలయిక తగదు. శుక్రాచార్యులు లోకానికంతటికీ గురువు. నీవు ఆయన పుత్రికవు. అందువల్ల నాకు ఇప్పుడు భయం కూడా. అందువల్ల ఈ పని నీకు తగదు’’.
దేవయాని ఇలా అన్నది. ‘‘సరే! ఇప్పుడు నన్ను ఇష్టపడకపోతే నా తండ్రి ద్వారానే నిన్ను వరిస్తాను. ఇప్పుడు వెళ్లు’’.
యయాతి ఆమెను వదలి తన నగరానికి వెళ్లిపోయాడు. దేవయాని ఏడుస్తూ ఒక చెట్టుకింద కూర్చున్నది.
దేవయాని రాకపోవడంతో శుక్రాచార్యుడు దాసితో ఇలా అన్నాడు. ‘‘దేవయాని ఇంకా రాలేదు. త్వరగా పోయి ఆమెను తీసుకురా.’’
దాది తొందరగా ఆమెను వెతుకుతూ ఒక చెట్టుకింద దుఃఖిస్తున్న దేవయానిని చూచింది. దాది ఆమెతో ఇలా అన్నది. ‘‘్భద్రా! నీకు ఏమైంది? ఎందుకు ఇలా చెట్టుకింద కూర్చుని ఏడుస్తున్నావు? నీ తండ్రి నిన్ను తీసుకొని రమ్మన్నాడు’’.
దేవయాని ఆమెతో శర్మిష్ఠ చేసిన పని చెప్పి ఇలా అంది. ‘‘దాదీ! నీవు శీఘ్రంగా వెళ్ళి నా తండ్రికి చెప్పు. నేను వృషపర్వుని నగరంలో ప్రవేశించను’’.
దాది వెంటనే రాక్షసమందిరానికి వెళ్ళి శుక్రాచార్యునితో ఇలా చెప్పింది. ‘‘వృషపర్వుని కూతురు శర్విష్ఠ వనంలో దేవయానిని కొట్టింది’’.
ఆది విని శుక్రాచార్యుడు ఏడ్చుకుంటూ దుఃఖంతో వనంలోకి వెళ్ళి కుమార్తెను దగ్గరకు తీసుకొని ఇలా అన్నాడు ‘‘మానవులు తాము చేసిన దోషాల వల్ల సుఖదుఃఖాలు పొందుతూ ఉంటారు. నీవు ఏదో చెడు పని చేసి ఉంటావు. అందువల్ల ఇటువంటి ఫలితాన్ని పొందావు’’.
దేవయాని దుఃఖిస్తూ ఇలా అన్నది. ‘‘వృషపర్వుని కూతురు నాతో అన్నది నిజమా? కాదా? నీవు రాక్షసులను స్తుతిస్తూ ఉంటావని, నేను యాచించేవానికి, దానం తీసుకొనేవానికి కూతురునని హేళన చేసింది. ఇలా అని నన్ను ఈ బావిలోకి త్రోసి వెళ్లిపోయింది...’’
అప్పుడు శుక్రుడు కోపంతో ఇలా అన్నాడు. ‘‘నీవు స్తుతించి యాచన చేసేవాడి కూతురువు కావు. రాక్షసరాజుచే స్తుతించబడే వాడి కూతురువు.
తపశ్శక్తియే నా బలం. ఈ సంగతి వృషపర్వునికి తెలుసు. ఇంద్రునికీ, యయాతికీ తెలుసు’’. ఇలా శుక్రుడు తన కూతురును శాంతపరిచాడు. శుక్రుడు ఇంకా ఇలా అన్నాడు. ‘‘నా విద్య అసమానమైనది. దానివల్లనే ఈ ఐశ్వర్యం. నాకు కుటిలత్వం, దైన్యం, అధర్మప్రవృత్తి లేనే లేవు. ఎవరైతే క్రోధాన్ని సహనంతో తొలగిస్తాడో అతడు ఈ సమస్త జగత్తును జయిస్తాడు. క్రోధాన్ని జయించినవాడు నిందలను సహించేవాడు, ఇతరులను బాధించనివాడు ఐశ్వర్యానికి అర్హుడౌతాడు. క్రోధంతో ఉన్నవాడు చేసే దానం, యజ్ఞం, తపస్సు వ్యర్థమే. కోపం లేనివాడు చేసే యజ్ఞం, దానం, తపస్సు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. నిత్యం కోపించే స్వభావం ఉన్నవాడికి పుత్రుడు భార్య ధర్మం సేవకుడు మిత్రుడు అందరూ దూరవౌతారు’’.
అప్పుడు దేవయాని ఇలా అన్నది. ‘‘తండ్రీ! నాకు ధర్మాధర్మాల మధ్య ఉన్న భేదం తెలుసు. కారణం లేకుండా ఇతరులను ద్వేషించేవారు, హింసించేవారు పాపాత్ములు. వారితో సత్పురుషులు నివసించకూడదు. వృషపర్వుని కూతురు అన్న మాటలు నా హృదయాన్ని అగ్నిలా దహిస్తున్నవి. ఇంతకంటే నాకు మరణమే మేలు’’. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి