డైలీ సీరియల్

అన్వేషణ -10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంక అక్కడ ఉండడం నాకెంత మాత్రం ఇష్టంలేదు. వాళ్లు నినే్నమైనా చెయ్యొచ్చు!... క్షేమంకాదని అనుకున్నాను. ఏ కూలి పనైనా చేసి నిన్ను పెంచాలనుకున్నాను. నా కూతురు... అంటే మీ అమ్మ పేరు పద్మ... మీ తాత ఇష్టంగా పెట్టుకున్న పేర్లు. వెంకటేశ్వరుని ఇల్లాలు పద్మావతీ అమ్మవారి పేరు... దాని గుర్తుగా నిన్ను పెంచి పెద్ద చెయ్యాలనుకున్నాను. నీ తండ్రి ఎవరన్నది తర్వాత విషయం!... అలా నిన్ను తీసుకుని ఇల్లువదిలి వచ్చేశాను. అలా నేను వచ్చేస్తుంటే... పైగా పసివాడిని తీసుకుని వచ్చేస్తుంటా... నా కొడుకు... నన్ను లోటు లేకుండా చూస్తానని మాటిచ్చిన నా సొంత కొడుకు... మీ మామయ్య బెల్లంకొట్టే రాయిలాగ కూర్చున్నాడు... ఆ ప్రక్క వీధిలో, కొండబాబు అమ్మమ్మ సహాయంతో ఓ చిన్న గుడిసెలో జీవితం ప్రారంభించాను. నేను కూలి పనికి వెళ్లినప్పుడు కొండబాబు అమ్మమ్మే నిన్ను చూసేది. ఆ మహాతల్లి చచ్చి ఏ లోకాన ఉందో కానీ చేతులెత్తి మొక్కాలి...’అంటూ ఆమె చేతులు పైకెత్తి దండం పెట్టింది.
‘అలా ఆర్నెల్లు గడిచిపోయాయి. ఒక్కసారి కూడా మీ మామయ్యగానీ, అత్తమ్మగానీ నేను ఉన్నానో, చచ్చానో కూడా చూడ్డానికి రాలేదు. ఆ భగవంతుడే చల్లగా చూశాడు. నీకు మూడేళ్లుదాటాక బడిలో చేర్చాను. అప్పలకొండ పేరుని టీచరమ్మ అనిరుధ్‌గా మార్చింది. ఆ తర్వాత ఊహ తెలిశాక పరిస్థితులన్నీ నీకు తెలుసు...’ అంటూ నీరసంగా మంచంమీద పడుకుండిపోయింది అమ్మమ్మ. కొద్దిక్షణాలు అక్కడ నిశ్శబ్దం అలముకుంది. మాటలు రానట్లు ఉండిపోయారిద్దరూ. ‘అమ్మమ్మా! మా అమ్మని పాడుచేసిన వాళ్లెవరు?... నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు అనిరుధ్. ఆ స్వరంలో కర్కశత్వం లేదు. అభ్యర్థనా లేదు. ఒక విలక్షణమైన గంభీరత ధ్వనించింది.
తలతిప్పి ఆమె మనవడికేసి చూసింది. చెయ్యి చాచింది. దగ్గరికిరా అన్నట్లు. కొంచెం ముందుకు జరిగాడు అనిరుధ్. అతడి తల నిమురుతూ అన్నది. ‘నాకూ తెలీదురా అనిరూదూ! గురుమూర్తికి తెలుసు. అతడిని అడిగి తెలుసుకోవాలనుకున్నాను. తెలుసుకుని ఏంచేయాలి?- అని ఊరుకున్నానురా... ఇప్పుడనిపిస్తోంది తప్పుచేశానా అని... గురుమూర్తి మన వీధి మొదట్లో బజ్జీలేస్తాడు భార్యతో కలసి... వాడికి తెలుసురా...’ అన్నది. అలా చెబుతున్నప్పుడు ఆమె గొంతు వణికింది. చివరి మాట అంటున్నప్పుడు దుఃఖమూ వచ్చింది. ఇంక మాట్లాడలేకపోయింది.
* * *
ఎంత బ్రతిమలాడినా తనతో రావడానికి అనిరుధ్ అమ్మమ్మ ఒప్పుకోలేదు. అంత పెద్ద సిటీలో నేనెలా ఉండగలనురా... ఇక్కడైతే చుట్టూ నన్ను పలుకరించేవాళ్లే. గంటగంటకీ ఎవరోఒకరు వచ్చి కాస్సేపు కబుర్లుచెప్పి వెళుతుంటారు. నేనక్కడ ఉండలేన్రా అనిరూదూ- అన్నదామె మనవడిని బ్రతిమిలాడుతున్నట్లు. ఆమెను మరీ విసిగించడమూ మంచిది కాదనుకున్నాడు అనిరుధ్.
‘ఒరే అనిరూదూ! నువ్వు పెళ్లిచేసుకోరా. అప్పుడొస్తాను. నాకు కాలక్షేపంగా నా మనుమరాలు... అదే నీ పెళ్లాం ఉంటుంది...’ అన్నదామె.
ఆమె చెప్పింది అతడు కాదనలేకపోయాడు. సిటీలో పిల్లలదగ్గరికొచ్చిన తల్లిదండ్రులు కాలక్షేపం కావడంలేదంటూ హౌస్ అరెస్టు అయినట్లు బాధపడిపోవడం అతడికి తెలియందికాదు.
ఆమె కాస్త కుదుటపడిన తరువాత, స్నేహితుడు కొండబాబు, అతడి తల్లి ధైర్యంచెప్పిన తర్వాత అమ్మమ్మకి మరీమరీ జాగ్రత్తలుచెప్పి హైదరాబాద్ వచ్చేశాడు అనిరుధ్.
వచ్చిన దగ్గర్నుంచీ అతడి మనస్సు అస్థిమితంగా తయారయ్యింది. అమ్మమ్మని చూడడానికి వెళ్లిన దగ్గర్నుంచీ రోజూ ఏదోఒక టైములో హిమజతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. అలా మాట్లాడుతుంటే ఆమె చెప్పే అనునయ వాక్యాలు అతడికి ఎంతో సాంత్వననిచ్చాయి.
కానీ, తన పుట్టుక గురించిన వివరాలు తెలిసిన తర్వాత అతడి మనస్సంతా కలచివేసినట్లయ్యింది. భరించలేని అస్థిమితంగా తయారయ్యింది. హిమజకి ఫోన్ చెయ్యడానికేదో బెరుకు. న్యూనతాభావం వెన్నాడుతోంది.
అమ్మమ్మ పెళ్లిచేసుకోరా అనిరుధ్ అంటుంది. ఆమెతో హిమజ గురించి చెప్పాలని ఎంతో ఉవ్విళ్లూరాడు. అమ్మమ్మకి వంట్లోబాగులేదని తెలిసి అక్కడికి వెళ్లినప్పుడు, ఆమెకు కాస్త కుదుటపడగానే హిమజ గురించి చెబుదామనుకున్నాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
తండ్రెవరో తెలీని, ఓ పిచ్చిది తనకి తల్లిఅని తెలిశాక పిల్లనెవరిస్తారు. ఏ ముఖం పెట్టుకుని తనుమాత్రం మీ అమ్మాయిని చేసుకుంటానని అనగలడు.
మతిస్థిమితం లేని ఓ మహిళపై జరిగిన అత్యాచారానికి ప్రతిఫలంగా పుట్టినవాడు తను!
పెళ్లంటే ఇంకా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని అనుకుంటున్న సమాజంలో తన పరిస్థితి ఏమిటి? ఏడుతరాలు కాకపోయినా కనీసం మీ నాన్న ఎవరు? ఏం చేస్తారు? మీ అమ్మెవరు? గృహిణా, ఉద్యోగస్తురాలా? అన్న కనీస వివరాలు కూడా ఇవ్వలేని తను హిమజతో ఎలా మాట్లాడ్డం?...
ఆ న్యూనతాభావంతోనే అతడు హైదరాబాద్ వచ్చి రెండురోజులైనా హిమజకి ఫోన్ చెయ్యలేకపోయాడు. కానీ, ఎంతకాలం ఆమెనుంచి తను తప్పించుకోగలడు. ఏ క్షణమైనా ఆమె ఇంటికి రావచ్చు. లేదా ఆఫీసుకు రావచ్చు. అప్పుడు తన పరిస్థితి ఏమిటి? ఏం చెప్పగలడు?
మా నాన్న ఎవరో ఎలా ఉంటాడో తనకి తెలీదని, తన చిన్నప్పుడే పోయాడని ఓసారి హిమజతో కబుర్లాడుతూన్నప్పుడు చెప్పాడు. అమ్మకూడా తన చిన్నప్పుడే చనిపోయిందని చెప్పాడు.
ఆ వివరాలేమీ ఆమె ఇంతవరకూ రెట్టించి అడగలేదు. కానీ, ఎప్పటికైనా తన పుట్టుక వివరాలు చెప్పక తప్పదు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తనకి పూర్తిగా తెలిశాయి. అయితే అవి ఇంత దారుణంగా ఉంటాయనుకోలేదు.
ఆ వివరాలు బాధాకరమైనవే కాదు. ఒక రకంగా చెప్పాలంటే జుగుప్సాకరమైనవి కూడా. నలుగురూ ముఖం చిట్లించుకునేంతటి హేయమైనవి.
ఎవరికైనా ఏ కష్టమైనా వచ్చినప్పుడు పాత విషయాలు తవ్వి మా బాగా అయ్యిందిలే అని మెటికలు విరిచేవారే ఎక్కువ. నిజాయితీగా సానుభూతి చూపించేవారు మాత్రం బహుకొద్దిమందే ఉంటారు.
ఇప్పుడు హిమజకి తన గురించి ఏంచెప్పాలి?- కొండంత ప్రశ్న అతడి ముందు భూతంలా నిలబడింది.
ఇంటిముందు వరండాలో రెయిలింగ్‌మీద కాళ్లుపెట్టుకుని కూర్చున్న అనిరుధ్‌కి సమాధానం దొరకని ఆ ప్రశ్న బుర్ర తినేస్తోంది.
ఉద్యోగం, సజ్జోగం లేకపోయినా అయోగ్యుడైన తండ్రి అంటూ ఒకడు ఉంటే ఆ పరిస్థితి వేరు. కనీసం పాచిపని చేసుకుంటున్న తల్లి అంటూ ఒకరు ఉంటే ఆ పరిస్థితి వేరు.
కానీ, తన పరిస్థితి అలా లేదు. నిజానికి తన పరిస్థితి తెలిసిఉన్న వాళ్లెవరూ తనకి పిల్లనివ్వడానికి ససేమిరా ఒప్పుకోరు. అలాంటిది హిమజకి తను ఏ విధంగా సరిపోగలడు?! -- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842