డైలీ సీరియల్

అనే్వషణ -- 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓ నెలరోజులు సెలవుపెట్టి వచ్చాట్ట... ఇక్కడేదో పనుందట... నానమ్మ చెప్పింది.’’
‘‘అన్నాళ్లుంటాడా?!... రోజూ వెళ్లి అనిరుధ్‌తో కాస్సేపు కబుర్లు చెప్తూండు... బావ ఎక్కడికేనా రమ్మంటే రాననకు... వెళ్లు...’’
‘‘అలాగే... మరి జాబో...’’
‘‘బోడి జాబు... అవసరమైతే మానేద్దువుగానిలే...’’అన్నదామె. కానీ మనసులో అనుకున్నది ‘లక్ష రూపాయల మనిషికే వల వేస్తున్నప్పుడు బోడి ఎనిమిది వేల రూపాయల ఉద్యోగం ఉంటేనేం ఊడితేనేం’ అని.
ఆ రాత్రి భర్త సత్యానికి అన్నీ చెప్పింది సాయిరమ్య తల్లి. వౌనంగా ఆమె చెబుతున్నదంతా విన్నాడు భర్త. అయితే భర్త అంత ఆసక్తి చూపించక పోయేసరికి ఆమెకు తిక్కరేగింది.
‘‘ఏమిటి? అలా బెల్లంకొట్టిన రాయిలాగా ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోయారు... మన అమ్మాయికి ఇంతకన్నా మంచి సంబంధం తేగలమా మనం...?’’ అని భర్తని నిలేసిందామె.
‘‘చూస్తూచూస్తూ... అన్నీ తెలిసి వాడిని ఎలా ఇంటల్లుడిని చేసుకుంటాం...?’’ అన్నాడు సత్యం.
‘‘ఏడ్చినట్లుంది మీ అనుమానం!... అది ఏ పనికిమాలిన వాడినో ప్రేమించానంటే... అప్పుడేం చేస్తాం?... నెత్తీనోరూ బాదుకుని కిక్కురుమనకుండా తలవంచమా?,... అంతకన్నా ఇది నయం కదూ!... వాడు సాక్షాత్తూ మీ చెల్లెలు కొడుకు... వాడి బాబెవడో మనకెందుకు?... వీడు బాగా చదువుకున్నాడు.
మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయల జీతంట. అమెరికా కూడా వెళ్లొచ్చాడు. బాగానే వెనకేసి ఉంటాడు. అవసరంమేరకు మీ అమ్మకి మంచి వైద్యం చేయిస్తున్నాడు. ఆమె వద్దంటున్నా చేతికి బంగారు మురుగులు చేయించాడు... హైదరాబాద్‌లో ఇల్లూ, కారూగట్రా కొన్నాడేమో కూడాను...’’అంటూ భార్య హితబోధ చేసింది. అయినా అతడు అయిష్టంగానే తలూపాడు.
‘‘మీరో పిచ్చిమాలోకం... అనిరుధ్‌కి నా కూతుర్ని చేసుకుంటానే అమ్మా అని మీరు మీ అమ్మతో అంటే ఆవిడ ఎగిరి గంతేస్తుంది తెలుసా... ఆవిడ సంగతి మీకు తెలీదు... అల్పసంతోషి... అందుకే నేనీవాళ సాయితో కూర పంపించాను... ఆవిడ సంతోషంగా తీసుకుందిట. మనవడికి పెట్టిందట... వాడూ తిన్నాట్ట...’’
‘‘సరే! చూద్దాం...’’అన్నాడు.
‘‘చూద్దాం...చేద్దాం అంటే కాదు. ఎవరేనా ఎగరేసుకు పోగలరు... మనంకాస్త ముందుగానే మేలుకోవాలి... ఎందుకేనా మంచిది మంచిరోజు చూసుకుని మీ అమ్మ చెవిలో ఓ మాటవేసి ఉంచండి...’’
భార్య హితబోధ నచ్చిందతడికి. కానీ, మేనల్లుడు పెంపకం నాకేం సంబంధంలేదని కరాఖండీగా చెప్పినవాడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తల్లిదగ్గరికి వెళ్లి ఈ మాట అడగాలి అని సంశయించాడు. ఆ మాటే భార్యతో అన్నాడు.
‘‘ఆఁ....అవన్నీ ప్రతి కుటుంబాల్లోనూ మామూలే లెండి... ఏవేవో అనుకుంటారు... అవసరానికి మళ్లీ మామూలుగా కలసిపోతుంటారు... అవన్నీ నేను చూసుకుంటానుగానీ, మీ అమ్మ చెవిలో మాత్రం ఓమాట వేసిరండి...’’
‘‘సరే!’’ అన్నాడు.
మేనల్లుడు కళ్లల్లో మెదిలాడు సత్యానికి. నిజంగానే వాడు బాగుంటాడనుకున్నాడు. ఏదైనాకానీ, వాడి జన్మకి పడిన బీజం మంచిదే అనుకున్నాడు. బీజం అనుకున్నప్పుడు ఒక్కసారిగా మనస్సు కలుక్కుమన్నది.
** ** **
ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకు దాబాకి వచ్చిన వీరబాహు లోపల ఎసి రూములో తనకోసం అన్నట్లు ఓ మూల టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతడికి ఎదురుగా తన ముఖ్య అనుచరుడు బోడన్న కూర్చున్నాడు. బోడన్న అసలు పేరు ఏమిటో వాడే మర్చిపోయాడు. అతడి నెత్తిమీద లెక్కపెట్టగలిగినన్ని వెంట్రుకలు మాత్రమే ఉంటాయి. నలభయ్యేళ్లకే వాడికి జుట్టు ఊడిపోయింది. ఎప్పుడు ఎవరు వాడిని ఆ పేరుతో పిలిచారో కానీ వాడికి బోడన్న అని పేరు స్థిరపడిపోయింది.
రాత్రివేళ కావడంవల్ల ఎవరికీ కనిపించకుండా కాస్త వేషంమార్చి బైక్‌మీద వచ్చాడు వీరబాహు. ఎందుకంటే వాడికోసం ఓ హత్య కేసులో పోలీసులు వెతుకుతున్నారు.
హత్య చేసింది ఎవరినోకాదు రహీంకి నిన్నటిదాకా గురువుగా ఉన్న చిన్నగంగప్ప అనుచరుణ్ణే వీరబాహు పొడిచింది. వాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు డాక్టర్లు. బ్రతుకుతాడన్న నమ్మకం లేదన్నది సమాచారం.
తనని రాజకీయంగా పైకి తీసుకొచ్చి, ఒక స్టేటస్ కల్పించిన చిన్న గంగప్పకి ఇప్పుడు రహీంపాషా దూరమయ్యాడు. మునిస్వామినాయుడికి ఝలక్ ఇచ్చినట్లే ఒక సందర్భంలో చినగంగప్పకీ ఝలక్ ఇచ్చాడు రహీంపాషా ఒక కాంట్రాక్ట్ విషయంలో.
అందుకు అతడికి భారీ ప్రతిఫలం ముట్టింది.
దాంతో చినగంగప్ప కారాలు మిరియాలూ నూరుతూ రహీంని లేపెయ్యమని తన అనుచరుణ్ణి పురమాయించేసరికి, వాడినే వీరబాహు లేపేసి రహీంపాషా మెప్పుపొందాడు. ఆ కేసు సంగతి నేను చూసుకుంటాలే అని పాషా అభయమిచ్చాడు. కొన్నాళ్లు ఎక్కడికేనా వెళ్లమని నోట్లకట్ట అందించాడు. కానీ వీరబాహు ఇక్కడే ఉన్నాడు. తమిళనాడు వెళ్దామనుకుంటుండగా కొండబాబు పిలిచేసరికి ఆగిపోయాడు.
చిన్న పనికి లక్ష రూపాయలు వస్తున్నాయంటే అదేదో చేసేసి వెళ్లిపోదామనుకున్నాడు. అయితే లక్ష రూపాయలు ఇస్తాననేసరికి అనిరుధ్ చెప్పిన పని ఒప్పుకున్నాడే గానీ రహస్యంగా తన ప్రస్తుత బాస్ రహీంపాషానుంచి బ్లడ్ శాంపిల్, లేదా తలవెంట్రుకలు సంపాదించడం ఎలా అని రెండురోజులుగా ఆలోచిస్తూనే ఉన్నాడు వీరబాహు.
అంతకంటే ఒకడిని లేపెయ్యమంటే తేలిగ్గా ఆ పని చేసెయ్యగలమని ఇప్పుడు తెలిసొచ్చింది వీరబాహుకి. రహీంపాషా నిద్రపోతున్నప్పుడు కూడా అతడి వంట్లోంచి రక్తం తీయడం కుదిరేపని కాదనిపిస్తోంది. పైగా రహీం నిద్రపోతున్నప్పుడు ఎవరూ అతడి గదిలోకి వెళ్లేసాహసం చేయరు. పెద్దగా ఘోషా పద్ధతి పాటించకపోయినా వాళ్ల ఇళ్లలోకి అంత చనువుగా ఎవరూ వెళ్లరు. హాల్లోనే అతడితో ఎవరైనా మంతనాలు ఆడేది.
ఒకవేళ ఆ ఇంట్లో పనివాళ్ల ద్వారా తన పని చేయిద్దామంటే వాళ్లందరూ రహీంకి కావల్సినవాళ్లు. అతడికి బాగా నమ్మకమైన వాళ్లూను. దానికితోడు వాళ్లందరూ అతడి కులం వాళ్లే.
అనుచరుడితో కలసి అరబాటిల్ పూర్తిచేశాడు కానీ మందు కిక్కూ ఎక్కలేదు, చేయాల్సిన పనికి దారీ దొరకలేదు.
‘‘్ఛ!...నీ...’అని విసుక్కున్నాడు.
‘‘ఏటిగురూ... ఏటయ్యింది?’’ అడిగాడు అనుచరుడు బోడన్న.
‘‘ఏం లేదురా... ఏదో చిన్న సమస్యలే...’’ అనుచరుడికీ చెప్పడం ఇష్టంలేక ఏదో సర్దిచెప్పేశాడు వీరబాహు.
రహీంపాషాకి ఏం రోగాలున్నాయి? ఎప్పుడు ఏ హాస్పిటల్‌కి వెళతాడు? - అని కాస్సేపు ఆలోచించాడు వీరబాహు. వాడికి రహీంపాషాతో తాను హాస్పిటల్‌కి వెళ్లిన సంఘటనలేవీ గుర్తుకురాలేదు.

- ఇంకా ఉంది

--సర్వజిత్ 9010196842