డైలీ సీరియల్

మందపాల జరితలు (మహాభారతంలో ఉపాఖ్యానాలు -- 28)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి మాటలు విన్న అగ్నికి మందపాలుని కిచ్చిన మాట గుర్తు వచ్చింది. ‘‘నీవు ద్రోణుడవనే ఋషివి. బ్రహ్మతత్త్వాన్ని చక్కగా వ్యాఖ్యానించావు. మీ కోరిక తీరుస్తాను. నా వలన మీకు భయం కలుగదు. మీ తండ్రి మందపాలుడు ముందే మీ గురించి చెప్పాడు. నేనేం చేయాలో చెప్పు’’.
ద్రోణుడు ఇలా అన్నాడు ‘‘ఓ అగ్నిదేవా! ఈ పిల్లి పిల్లలు నిత్యం మమ్ములను బాధిస్తున్నాయ. వీటిని నాశనం చేయు’’ అగ్ని పక్షి పిల్లల కోసం అలాగే చేసి పిల్లిపిల్లల్ని దహించాడు.
అక్కడ మందపాలునికి పిల్లల గురించి చింత ఎక్కువైంది. వారికోసం దుఃఖిస్తూ అతను రెండవ పక్షి లిపితతో ఇలా అన్నాడు. ‘లిపితా! నా పిల్లలు ఆ పక్షిగూటిలో ఎలా ఉన్నారో? అగ్ని ప్రజ్వరిల్లి శీఘ్రంగా అన్నింటినీ దహిస్తుంటే నా పుత్రులు తమను తాము రక్షించుకోలేరు. వారి తల్లి దీనురాలై వారిని రక్షించ లేక దుఃఖిస్తుంది. నా పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. కనుక ఎగురలేరు. వారి తల్లి వారి అవస్థ చూడలేక అన్ని వైపులా సహాయం కోసం పరుగులు తీస్తూ ఉంటుంది. నా కుమారులు జరిత ఏ బాధలు పడుతున్నారో? తన పుత్రులకోసం పరితపిస్తూ అతను లిపితతో ఇలా అన్నాడు ‘‘లిపితా నా పిల్లలు ఆ గూళ్ళలో రక్షింపబడ్డారో లేదో తెలియటంలేదు. వారు చిన్న పిల్లలు కనుక అగ్ని నుండి రక్షించుకునే శక్తి వారికి లేదు. వారి తల్లి స్వయంగా అందరినీ రక్షించలేదు. కనుక దుఃఖిస్తూ ఉంటుంది. నా నలుగురు పుత్రులు ఎలా ఉన్నారో?’’
ఋషి ఈ విధంగా విలపిస్తూ ఉంటే లిపిత కోపంతో ఇలా అంది ‘‘తేజస్వులైన ఋషుల పేర్లు వారికి పెట్టావు కదా? ఆ ఋషులే వచ్చి రక్షిస్తారు. నీవు నా సన్నిధిలో నా సవితిని గురించి చింతిస్తున్నావు. కనుక ఆమె వద్దకే వెళ్ళు. నేను దుష్టుని ఆ శ్రయంచిన స్ర్తివలె చరిస్తాను’’.
మందపాలుడు ‘‘నా చింత అంతా నా పిల్లల కోసమే వారు సంకట స్థితిలో ఉన్నారు. పుట్టిన పిల్లలను వదిలిపెట్టి, పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించేవాడు మూర్ఖుడు. నీ ఇష్టం ఏం చేయాలనుకుంటే అది చెయ్య’ ఇలా లిపితతో అని అతను తన పిల్లలను వెతుక్కుంటూ వనంలోకి వెళ్ళాడు. చివరకు అగ్ని దయతో సురక్షితంగా ఉన్న వారిని చూచి ఆనందించాడు. అప్పటికే జరిత వారి దగ్గరకు వచ్చి పేరుపేరున వారిని అక్కున చేర్చుకొంది. ఆ పిల్లలుకాని జరిత కాని అక్కడికి వచ్చిన ఋషితో ఏమీ మాట్లాడలేదు. అతను జరితతో ఆపిల్లల్లో జేష్ఠుడెవడో కనిష్ఠుడెవడో చెప్పమన్నాడు. తను అంత దుఃఖంతో ఉండగా వారు తనతో మాట్లాడకపోవడం శ్రేయస్కరం కాదన్నాడు.
దానికి జరిత ‘‘నీవు ఆ లిపిత దగ్గరికే పొమ్ము. నీకు నా జ్యేష్టునితో కాని ఇతరులతో కాని ఏమి పని?’’ అన్నాడు. మందపాలుడు - ‘‘స్ర్తీలకు పరలోకంలో సవితిపోరు పర పురుష సంబంధం తప్ప ఇంకేదీ వారి పరమార్థాన్ని నాశనం చెయ్యదు. ఈ సవతి పోరు శతృత్వం కలిగిస్తుంది. శరీరాన్ని బాధిస్తుంది. అంతటి పతివ్రత అయన అరుంధతియే అనుమానంతో వశిష్ఠుని శంకించింది. సంతానం కోసం వెనక్కి వచ్చిన నన్ను నీవు తిరస్కరించావు. సంతానం కలిగిన పిదప స్ర్తి భర్తను పట్టించుకోదు. కనుక స్ర్తిని విశ్వసించకూడదు’’.
అప్పుడు ఆ పుత్రులంతా వారి వారి రూపాలతో తండ్రి వద్దకు వచ్చి కూర్చుని అతని ప్రేమను పొందారు. అతను వారితో ఇలా అన్నాడు. ‘‘నేను మీ తల్లి ధర్మజ్ఞతను, మీరు ఋషులని గుర్తించి మీ శక్తియుక్తులు తెలుసు కనుక మీ రక్షణ భారం అగ్నిదేవునికి అప్పగించాను. కనుక ఇక్కడికి రాలేదు. నా గురించి మీరు బాధపడవద్దు. మీకు బ్రహ్మ తత్త్వం సంపూర్ణంగా తెలుసు. ఇలా వారికి నచ్చచెప్పి మందపాల ఋషి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు.

(ఇంకావుంది)

--డాక్టర్ ముదిగొండ ఉమాదేవి