డైలీ సీరియల్

అన్వేషణ -26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాంతో అనిరుధ్ సలహా మేరకు ఆ రైస్ షాప్ తనే నడుపుతూ తండ్రిని విశ్రాంతి తీసుకోమన్నాడు.
కొండబాబు బికాం డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఇద్దరూ ఇంటర్ వరకూ క్లాస్‌మేట్స్.
మనవడు బయటికి వెళ్లడంతో వీధి గుమ్మం ముందు వున్న చిన్న అరుగుమీద కూర్చున్నది, అనిరుధ్ అమ్మమ్మ పక్కింటామెతో కబుర్లు చెబుతూ. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె కొడుకు సత్యం వచ్చాడు. పాతికేళ్లలో ఎప్పుడో తనకి వంట్లో బాగులేనప్పుడు ఇలా వచ్చి చూసి అలా వెళ్లిపోయే కొడుకు తీరుబడిగా తనకి ఆరోగ్యం బాగున్నపుడు రావడంతో కాస్తంత ఆశ్చర్యపోయింది మాణిక్యమ్మ.
‘‘అమ్మా! ఎలా ఉన్నావ్?’’ అనడిగాడు వస్తూనే.
‘‘బానే ఉన్నానురా’’ అంటూ ఆవిడ లోపలికి నడిచింది. మళ్లొస్తా పిన్నీ అని చెప్పి పక్కింటావిడ వెళ్లిపోయింది.
‘‘మీ ఆవిడ భూదేవి బాగుందిరా?’’ అనడిగిందామె కొడుకుని.
‘‘బాగుందే అమ్మా.. అనిరుధ్ ఏడీ.. లేడా?’’
‘‘లేడ్రా.. ఇప్పుడే బయటికి వెళ్లాడు.. కూర్చో..’’ అని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. టీ పెడతానురా అని లోపలికి వెళుతున్న తల్లితో- ‘‘ఇప్పుడేం వద్దమ్మా.. ఇలా కూర్చో..’’ అన్నాడు సత్యం.
‘‘సరే! కాసేపున్నాక పెట్టిస్తాలే.. ఏమిటి సంగతులు?’’ అంటూ వచ్చి అతడికి ఎదురుగా ఎత్తుపీట మీద కూర్చున్నదామె.
కాస్సేపు అటూ ఇటూ చూశాడు సత్యం. తన మనసులో మాట ఎలా మొదలుపెట్టాలా అని తర్జన భర్జన పడ్డాడు లోలోపలే. ఎలా మాట్లాడాలో అన్నీ భార్య భూదేవి ఇంటి దగ్గర రిహార్సల్ వేయించి మరీ పంపించింది. నాలుగు రోజులుగా ఆ భార్యాభర్తలిద్దరూ మల్లగుల్లాలు పడుతున్నారు అనిరుధ్ గురించి ముసలావిడతో మాట్లాడే విషయమై.
‘‘వీడు నాలుగురోజులుంటాడా?’’ అనడిగాడు మేనల్లుడు అనిరుధ్ గురించి.
‘‘ఉంటానన్నాడురా.. ఇక్కడేదో పనుందట.. వాడేదో చెప్పాడు.. నాకవన్నీ తెలియవురా.. ’’ చెప్పిందామె.
‘‘ఏం లేదమ్మా!.. జరిగిందేదో జరిగిపోయింది.. మనవాడు వృద్ధిలోకొచ్చాడు.. అంతే చాలు.. ఏం జరిగిందో దాని గురించి మర్చిపోదాం..’’ అన్నాడు.
అతడి ధోరణి ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడవన్నీ ఎందుకు మాట్లాడుతున్నట్లు.. అనుకున్నది. అయినా ఏమీ అనకుండా అవున్నట్లు తలాడించింది.
‘‘వీడికి వయస్సు వచ్చింది.. పెళ్లి చెయ్యాలి.. ఆ విషయం ఆలోచిస్తున్నావా?’’ అనడిగాడు.
అప్పటికి ఆమెకు కొడుకు ధోరణి అర్థం కాలేదు- ‘‘వాడికి చెప్పానురా.. పెళ్లిచేసుకోరా అనిరూదూ అని.. ఇంకా వాడేం చెప్పలేదు..’’ కొడుకు మాటకి సమాధానంగా అన్నట్లు చెప్పిందామె.
‘‘వాడేం చెబుతాడే అమ్మా.. మనం ఏదో సంబంధం చూడాలి.. చూసి చేసెయ్యాలి.. నీ మనస్సులో ఎవరన్నా ఉన్నారా?’’ అనడిగాడు.
ఆమెకు ఏం చెప్పాలో తోచలేదు. ఈ రెండు రోజుల్లో ఆమె మనస్సులోకి వచ్చిన ఆలోచన- సాయిరమ్య.. ఎప్పుడూ లేనిది అనిరుధ్ వచ్చిన దగ్గర్నుంచి ఆమె ప్రొద్దున్నో, సాయంత్రమో వస్తూ అతడికోసం అంటూ ఏదో తెస్తోంది, మమీ పంపించిందంటూ.
‘‘నాకయితే ఒక ఆలోచన వచ్చిందే అమ్మా.. మన సాయిరమ్యని వాడికిచ్చి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.. మీ కోడలు కూడా ఇదే చెప్పింది..’’ అని తల్లి ముఖంకేసి చూశాడు సత్యం.
ఆ మాట వినడంతో ఒక్కసారిగా మాణిక్యమ్మ ముఖంలో ఓ వెలుగు వెలిగి అంతలోనే మాయమయ్యింది. తన కొడుకేనా ఇలా మాట్లాడుతున్నదని ఆశ్చర్యపోయింది. ఎవడికి పుట్టాడో తెలీని వీడికి పీక పిసికి పారెయ్యమని చెప్పినవాడేనా ఇప్పుడిలా మాట్లాడుతున్నదని ఆశ్చర్యపోయింది. ఎంతో ఎంత మార్పు!
సాయిరమ్మ పదే పదే రావడం, కూతుర్ని అలా ఏదో ఇచ్చి పంపిన కోడలు భూదేవి ఆంతర్యం ఇపుడు అంతా ఆమెకు బాగానే అర్థమయ్యాయి.
‘‘అప్పుడేదో అన్నాను.. అప్పటి పరిస్థితులు వేరు.. అవన్నీ పట్టించుకోకమ్మా..’’ అన్నాడు తల్లి ఏమీ మాట్లాడకపోవడంతో సత్యం ఆమెను మంచి చేసుకునే ఉద్దేశ్యంతో.
ఆమెకు ఏం మాట్లాడాలో తెలీలేదు. అవుననాలా, కాదనాలా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నదామె. అయినా ఇది తను నిర్ణయించేది కాదని, మనవడు అనిరుధ్ నిర్ణయించుకోవాలనీ అనుకున్నదామె.
‘‘పరాయి సంబంధమైతే చాలా సమస్యలొస్తాయి అమ్మా!.. మన అనిరుధ్ తండ్రెవరు, ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం.. అంతేకాదు.. తల్లి పిచ్చిదంటే కూడా పెళ్లి సంబంధాలు రావడం కష్టమే.. ఆలోచించు.. అవన్నీ నీకు తెలియనివి కావు. నీకు నేను చెప్పదగ్గవాడినీ కాదు. ఇప్పుడు పెళ్లి సంబంధాలంటే చాలా కష్టంగా ఉంది..’’’ తల్లిని తమ దారికి తెచ్చుకోవడానికి భార్య భూదేవి చెప్పిన ఒక్కో అస్త్రం వదులుతున్నాడు సత్యం.
మాణిక్యమ్మ కొడుకు చెప్పిన విషయాలు వౌనంగా విన్నది. ఆ విషయాలు ఆమె మనసులో ఈమధ్యకాలంలో సుడులు తిరుగుతున్నవే. అనిరుధ్‌కి పెళ్లిచెయ్యాలంటే ఈ సమస్యలు రాక తప్పదని ఆమెకు బాగానే తెలుసు. మూడు నెలల క్రిందట కొండబాబు తల్లి ఒక సంబంధం తీసుకొచ్చింది అనిరుధ్‌కి. అతడి చదువూ, ఉద్యోగం, జీతం అన్నీ వాళ్లకి బాగానే నచ్చాయి. తల్లి తండ్రి విషయానికి వచ్చేసరికి వాళ్లు మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయారు. ఆ విషయం అనిరుధ్‌కి తెలియకుండా దాచిందామె.
ఇపుడు కొడుకు అదే విషయం ప్రస్తావించేసరికి ఏం చెప్పాలో ఆమెకు తోచలేదు. కాదనీ అనలేదు. అన్నీ తెలిసి తన కూతుర్ని ఇస్తానని ముందుకొచ్చిన కొడుకు సత్యాన్ని కాదనలేకపోయిందామె. గతంలో అతడు ఎలా ప్రవర్తించినా, ఏం చేసినా, తన మనవడిని ఛీకొట్టినా.. ఇపుడు తన కూతుర్ని ఇస్తానని ముందుకొచ్చాడు. కొడుకు తప్పుల్ని క్షమించాలనుకున్నదామె.
ఇపుడు తన మనవరాలిని కాదని, వేరే సంబంధం చూడటం అంత తేలికైన విషయంగా ఆమెకు అనిపించలేదు.
కొండబాబు తల్లేకదా, ఇరుగుపొరుగువాళ్లలో ఒకళ్లిద్దరు కూడా ‘తన మనవడికి సంబంధాలు చూడమంటే’ చూస్తున్నాం.. కానీ విషయం చెప్పకుండా దాచలేం.. చెప్పాక ఎవరూ ముందుకు రావడంలేదు మరి..’ అంటూ చెప్పుకొచ్చారు.దానికితోడు ఈ కాలం పిల్లలు కూడా చాలా కోరికలు కోరుతున్నారు. పెళ్లికొడుని వాళ్లే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. పెళ్లికొడుకు స్టేటస్సే కాదు.. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842