డైలీ సీరియల్

అన్వేషణ -27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడి తల్లిదండ్రుల స్టేటస్ కూడా చూస్తున్నారు.. ఇవన్నీ వాళ్లూ వీళ్లూ చెబుతుంటే ఆమెకు అర్థమయ్యాయి. అర్థమయ్యాక తాను బ్రతికుండగా తన మనవడికి పెళ్లి చెయ్యగలనా అన్న అనుమానం ఈమధ్య ఆమెలో సుడులు తిరుగుతున్నాయి.
పిచ్చిదే అయినా తన కూతురు బాగుండేది. దాని కడుపున పుట్టిన తన మనవడూ బాగుంటాడు.. కానీ అదొక్కటే పెళ్లికి సరిపోదు.
‘‘ఏమిటే అమ్మా! మాట్లాడవ్?.. నీకు ఇష్టం లేదా?..’’ తల్లి ఎంతకీ మాట్లాడకపోయేసరికి అడిగాడు సత్యం.
ఏం చెప్పాలి?.. ఆమెకెటూ పాలుపోవడంలేదు. తననీ, తన మనవడినీ కొడుకూ కోడలూ ఎంతగా విసిరికొట్టిందీ ఆమె అంతరాంతరాల్లో కలుక్కుమంటూనే ఉన్నాయి. ఈనాటికీ... కానీ పరిస్థితులకనుగుణంగా నడచుకోక తప్పదు.. అనుకున్నదామె.
‘‘నాదేం ఉందిరా.. అనిరూదూకి చెబుతాను.. వాడు ఔనంటే అలాగే చేద్దాం..’’ అన్నదామె.
‘‘చెప్పడం కాదమ్మా.. వాడికి పరిస్థితులు కూడా బాగా అర్థమయ్యేట్టు చెప్పు.. కుర్రాడు.. వాడికేం తెలుస్తాయి.. పరాయి సంబంధం చూడాలంటే మాటలు కాదు..
అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు అంటూ విసిగిస్తారు.. ఇపుడు మరీ దారుణంగా ఉన్నాయి సంబంధాలు చూడటం అంటే.. వాడికివన్నీ చెప్పు.. రమ్య గురించి నీకు నేను చెప్పనక్కర్లేదు. డిగ్రీ చదివింది. వాడక్కడ ఉద్యోగం చెయ్యమంటే చేస్తుంది.. పని పాటా వచ్చు.. ఇక దాని అందం చందం, మాటతీరు నీకు నేను చెప్పక్కర్లేదు.. ఇక కట్నం, కానుకలంటావా.. నువ్వెలా చెబితే అలా జరిపిస్తాను.. వాడికి మాత్రం ఎవరున్నారు గనక మనం తప్ప..’’ అన్నాడు సత్యం.
ఆమె అలాగే చెబుతాను అన్నట్లు తలూపింది. లేచి వెళ్లి టీ పెట్టి తీసుకొచ్చింది. ఏమన్నా తింటావా అనడిగింది. ఇప్పుడేం వద్దమ్మా అన్నాడు.
‘‘అనిరుధ్‌తో మాట్లాడమంటావా? రేపు భూదేవిని పంపమంటావా?’’ అనడిగాడు సత్యం తల్లిని.
‘‘ముందు నేను మాట్లాడుతానురా.. అప్పుడు మీరొచ్చి మాట్లాడుదురుగాని..’
‘‘సరే అమ్మా.. వాడికి చెప్పు.. అన్ని విషయాలూ చెప్పు.. కుర్రాడు వాడికివన్నీ అర్థంకావు..’’ అంటూ లేచాడు.
అలాగే అన్నట్లు తలూపిందామె. ‘మరెళ్లొస్తానమ్మా’ అని చెప్పి వెళ్లిపోయాడు సత్యం. అతడు వెళ్లాక చాలాసేపు అలానే కూర్చుండిపోయింది అమ్మమ్మ మాణిక్యమ్మ కొడుకు చెప్పిన విషయాలే పదే పదే ఆలోచిస్తూ.
రాత్రి తొమ్మిది గంటలు కావస్తూంటే అనిరుధ్ వచ్చాడు. అమ్మమ్మని కష్టపెట్టకుండా మామూలుగా తనే కిచెన్‌లోకి వెళ్లి అన్నం పెట్టుకుని తింటాడు, ఆమె నేను పెడతానురా అన్నా వినిపించుకోకుండా. ఆ రోజు అలా వెళ్లి చూసేసరికి అన్నం, కూరా ఎక్కువ ఉండడంతో, ‘‘అమ్మమ్మా నువ్వు తినలేదా?’’ అనడిగాడు.
‘‘లేదురా!.. ’’ అంటూ ఆమె కూడా కంచం తెచ్చుకుని తానూ పెట్టుకుని మనవడికీ భోజనం పెట్టింది.
‘‘ఎందుకింత ఆలస్యం చేశావే అమ్మమ్మా.. పెద్దదానివి నీకు అరగదు.. పెందలాడే తినెయ్యి.. నా కోసం చూడకు..’’ అన్నాడు అన్నం కలుపుకుంటూ.
ఆమె మాట్లాడలేదు. అలాగే అన్నట్లు తలూపింది. భోజనం తినడం పూర్తయ్యాక, కిచెన్ సర్ది ముందు గదిలోకి వచ్చింది అమ్మమ్మ. అనిరుధ్ కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్నాడు.
‘‘ఒరే అనిరూదూ!..’’ అని పిలిచిందామె.
‘‘ఏం అమ్మమ్మా?’’ అన్నాడు.
‘‘సాయంత్రం మీ మామయ్యొచ్చాడురా..’’ అన్నది.
‘‘వచ్చాడా?.. ఏం?.. ఊరికేనా?’’ మామూలుగానే అడిగాడు.
‘‘కాదురా? ... పనిమీదే వచ్చాడు..’’
‘‘పనిమీదా.. ఏంపని?’’ టీవీ సౌండ్ తగ్గించి అడిగాడు అమ్మమ్మనే చూస్తూ.
‘‘నీ పెళ్లి గురించి మాట్లాడ్డానికొచ్చాడురా..’’
‘‘నా పెళ్లి గురించా!?’’
‘‘అవును.. వాడి కూతురు సాయిరమ్యని నీకు చేసుకోమని అడగడానికొచ్చాడు..’’ మనవడి ముఖంలోకి చూస్తూ అన్నది.
‘‘సాయినా?’’
‘‘ఊ.. సాయినే.. నిన్ను అల్లుడిని చేసుకుంటాట్ట..’’
‘‘నువ్వేమన్నావ్?’’
‘‘నిన్ను అడగకుండా నేనేమంటానురా?.. అందులోనూ ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడొచ్చి పిల్లనిస్తానంటే అంత వెర్రిబాగుల్దాన్నా అవునని ఒప్పుకోవడానికి?’’ కాస్త నిష్ఠూరంగానే అన్నదామె.
అనిరుధ్ ఏమీ మాట్లాడలేదు కొంతసేపు.
‘‘జరిగిందేదో జరిగిపోయింది.. అవన్నీ మనసులో పెట్టుకోకమ్మా.. అన్నాడు..’’ చెప్పిందామె.. తర్వాత కొడుకు తనతో మాట్లాడిన అన్ని విషయాలు వివరంగా చెప్పింది. పై సంబంధాల సాధక బాధకాలూ చెప్పింది.
అప్పటికీ అనిరుధ్ మాట్లాడలేదు. కొండబాబు అన్నమాటలే చప్పున గుర్తుకొచ్చాయతడికి- ‘మీ అత్తమ్మ కూతుర్ని నీకిద్దామనుకుంటోందేమో...’ అని. తరచుగా సాయిరమ్య రావడం, తనను బావా అంటూ చనువుగా పిలవడం, మమీ ఇచ్చిదంటూ ఏదో ఒకటి తీసుకురావడం.. అన్నీ క్షణంలో అతడి మస్తిష్కంలో మెదిలాయి.
అయితే అమ్మమ్మ అన్నట్లు వాళ్లు తనపట్ల ప్రవర్తించిన విషయాలేమీ అతడు అంతగా పట్టించుకోలేదు. వాటి గురించి అతడు ఇప్పుడే కాదు, ఎప్పుడూ తీవ్రంగా తీసుకోలేదు. వాళ్ల మనస్తత్వాలే అంత అని తేలిగ్గా తీసుకున్నాడు.
ఇప్పుడు తన మేనమామ వచ్చి అలా అడగడంలోనూ అతడికి వింతగా అనిపించలేదు. కానీ అప్పుడు పనికిరానివాడు ఇప్పుడు ఎలా పనికొచ్చాడోనని అతడు నవ్వుకున్నాడు. పరిస్థితులకి తగినట్లుగా రంగులు మార్చడం అంటే ఇదే కాబోలుననుకున్నాడు.
‘‘నీకు నచ్చితేనే.. లేకపోతే లేదు.. ఇందులో నా బలవంతం ఏదీ లేదురా.. ఒకటి మాత్రం నిజంరా.. మనం ఉన్న పరిస్థితుల్లో పై సంబంధాలంటే మాత్రం కష్టంరా అనిరూదూ! నానె్నవరు? తల్లెవరూ.. అంటూ వివరాలు అడుగుతారు.. వాటికి సమాధానం చెప్పాలి.. లోకం అలా ఉందిరా. ఆలోచించి చెప్పు..’’ అన్నదామె. అందులో నచ్చచెబుతున్న ధోరణి ఏమీ కనిపించలేదు అనిరుధ్‌కి.
‘‘సరేలే అమ్మమ్మా.. ఆలోచిద్దాం.. తొందరేం లేదు..’’ అన్నాడు.
అంతకుమించి మనవడితో ఆ విషయాలు మాట్లాడాలనీ ఆమె అనుకోలేదు. వాస్తవానికి ఆమె ఇంకా ఇదమిద్ధంగా ఎటూ నిర్ణయించుకోలేదు తన మనవడికి సాయిరమ్యని చేసుకోవడమా వద్దా అన్న విషయం. ఆమె లేచి వెళ్లి నడుం వాల్చింది.
కాస్సేపు అలాగే కూర్చుని టీవీ చూశాడు అనిరుధ్. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842