డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం నిషధదేశాన్ని వీరసేనుని పుత్రుడైన నలమహారాజు పాలించేవాడు. అతడు సద్గుణ సంపన్నుడు, అందగాడు, అశ్వశాస్తక్రోవిదుడు. అతనికి పాచికలాడటం అంటే ఎంతో ఇష్టం. అదే సమయంలో విదర్భదేశాన్ని భీమ మహారాజు పాలించేవాడు. అతనికి సంతానం లేక అనేక వ్రతాలు చేస్తూ ఉండేవాడు.
ఆ సమయంలో బ్రహ్మర్షి దమనుడు అతని భవనానికి వచ్చాడు. మహారాజు రాణితో కలిసి అతనిని పూజించాడు. దమనుడు అతని సత్కారాలకు సంతృప్తి చెంది అతనికి ఒక పుత్రిక, ముగ్గురు పుత్రులు కలిగేటట్లు వరం ఇచ్చాడు. వర ప్రభావంచే మహారాజుకు ఒక కుమార్తె, ముగ్గురు పుత్రులు కలిగారు. రాజు వారికి దముడు, దాంతుడు, దమనుడు అని కుమారులకు, దమయంతి అని కుమార్తెకు పేర్లు పెట్టి ఎంతో అపురూపంగా వారిని పెంచాడు.
దమయంతి తన అందం, సౌశీల్యంతో అలంకారాలతో దాసీజనం చేత పరివేష్టింపబడి మహాలక్ష్మిలాగా శోభించింది. ఆమె లాంటి సౌందర్యవతి దేవతలలో కూడా లేదు.
అదేవిధంగా నలమహారాజు తన సౌందర్యంతో సాక్షాత్తు మన్మథుని లాగా ప్రకాశించాడు. దమయంతి దగ్గర ఆమె సఖులు నలుని గురించి ప్రశంసిస్తే, నలుని దగ్గర దమయంతి సౌందర్యం గురించి మెచ్చేవారు. ఈ విధంగా వారిరువురు ఒకరి గురించి ఇంకొకరు వినడం వలన వారిరువురికి ఒకరిమీద ఒకరికి ప్రేమ కలిగింది.
ఒకరోజు నలమహారాజు తన అంతఃపుర ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే అక్కడ విహరిస్తున్న బంగారు హంసలను చూశాడు. అతను వాటిలో ఒక హంసను పట్టుకున్నాడు. అప్పుడు ఆ హంస మహారాజుతో ఇలా అంది. ‘‘రాజా! నన్ను చంపకు. నేను నీకు ప్రియం చేస్తాను. ఓ నిషధరాజా! నీ గురించి దమయంతికి చెప్తాను. అప్పుడు నిన్ను తప్పక కోరుకుంటుంది’’.
అది విని రాజు వెంటనే హంసను విడిచిపెట్టాడు. అప్పుడు ఆ హంస తక్కిన వాటితో కలిసి ఎగిరి విదర్భకు వెళ్లింది. దమయంతి దగ్గరకు వెళ్లగా ఆమె హంసను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ హంస దమయంతితో మనుష్యభాషలో ఇలా అంది.
‘‘దమయంతీ! నిషధదేశపు రాజు నలుడు. అతడు చాలా అందగాడు. అంతటి అందం మానవుల్లో కన్పించదు. అతనికి నీవు తగిన భార్యవు. ఎందుకంటే నీవు స్తల్రలో రత్నానివి. అతను పురుషశ్రేష్ఠుడు.’’
హంస చెప్పిన మాటలు విన్న దమయంతి నలునితో తన గురించి చెప్పుమంది. హంస సరేనని మరల తిరిగి నలుని దగ్గరకు వచ్చి దమయంతి గురించి చెప్పింది.
హంస చెప్పిన మాటలు విన్నప్పటినుంచీ దమయంతి నలునిపట్ల అనురాగం పెంచుకుంది. నిరంతరం అతని గురించి ఆలోచించసాగింది. ఆమెకు వస్త్రాలంకరణపైన, భోగాలపైన ఆసక్తి పోయింది. సఖులు ఈ విషయం భీమ మహారాజుకు చెప్పారు. వారి ద్వారా దమయంతికి నలుని పట్ల ఉన్న అనురాగం గురించి తెలుసుకున్న మహారాజు కుమార్తె స్వయంవరం ప్రకటించాలని నిశ్చయించాడు. వీరులైన వారంతా దమయంతి స్వయంవరానికి రావచ్చునని మహారాజు సమస్త రాజలోకాన్ని ఆహ్వానించాడు.
అప్పుడు ఆ రాజులందరూ ఆభరణాలు, మాలలు ధరించి వాహనాలలో ఆ స్వయంవరానికి వచ్చి భీమరాజు చేత సత్కరింపబడి నగరంలో విడిది చేశారు.
ఆ సమయంలో దేవర్షులైన నారద పర్వతులు లోక సంచారం చేస్తూ స్వర్గానికి వచ్చి ఇంద్రుని దర్శించాడు. దేవరాజు వారిని భూలోకవాసుల కుశలం అడిగాడు.
నారదుడు అందరు కుశలమేనని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు - ‘‘్భలోకంలో యుద్ధంలో మరణించినవారు ఈ లోకంలోకి వస్తారు. ఇప్పుడు అలాంటి శూరులు కన్పించడం లేదు’’.
ఇంద్రుని మాటలకు నారదమహర్షి ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. ‘‘శూరులైన రాజులెవ్వరూ కన్పించకపోవడానికి కారణం ఉంది. విదర్భ రాజైన భీమరాజుకు దమయంతి అనే కుమార్తె కలదు. ఆమె వంటి సౌందర్యవతి ముల్లోకాల్లో ఎక్కడా లేదు. ఆ దమయంతికి స్వయంవరం త్వరలో జరుగ నున్నది. ఆ సౌందర్యవతి తమనే వరించాలనే కోరికతో రాజులంతా కోరుతున్నారు.’’
నారద మహర్షి ఈ విషయం చెప్తున్న సమయంలో లోకపాల కులైన దేవతలూ అగ్ని దేవుడూ అక్కడికి వచ్చి ఈ సమాచారం విన్నారు. వారు వెంటనే ఆనందం తో ‘‘మనం కూడా ఈ స్వయం వరానికి వెళ్దాము’’ అని ఇంద్రునితో అన్నారు. వెంటనే దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు దమయంతీ స్వయంవరానికి విద ర్భకు బయలుదేరారు.
అదే సమయంలో దమయంతిని పొందడానికి నలమహారాజు కూడా బయలుదేరాడు. మార్గమధ్యంలో దిక్పాలకులు మన్మథునిలా ఉన్న నలుని పై నుండి చూచి అతని సౌందర్యానికి ఆశ్చర్యపడ్డారు. వారు తమ వాహనాలను ఆకాశంలో ఆపి నలునితో ఇలా అన్నారు. ‘‘నిషధ రాజేంద్రా! నీవు సత్యవ్రతుడవు. మానవులలో శ్రేష్ఠుడవు. నీవు మాకు దూతవై సహాయం చేయాలి’’.
నలుడు అలాగే చేస్తానని వారికి మాట ఇచ్చి, ‘‘మీరెవరు? నేను ఎవరి దగ్గరకు దూతగా వెళ్లాలి’’ అని వారిని అడిగాడు.
దేవేంద్రుడు అతనితో ఇలా అన్నాడు - ‘‘మేము దిక్పాలకులము. ఇంద్ర, అగ్ని యమ, వరుణులము. ‘నిన్ను చూడాలనే కోర్కెతో వచ్చారని, దిక్పాలకులు నిన్ను కోరుతున్నారని’ దయమంతికి చెప్పు. మాలో ఒకరిని భర్తగా వరించమని మా మాటగా ఆమెకు చెప్పు’’.
అప్పుడు నలుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు. ‘‘అదే కోరికతో వచ్చిన నన్ను దూతగా పంపటం మీకు న్యాయం కాదు. ఒక తస్ర్తిని ఇష్టపడిన తర్వాత ఆమెను ఇతరుల కోసం విడిచి పెడతాడా? ఇతరుల కోసం దూతగా ఆమె దగ్గరికి వెళ్లగలడా? మీరు నన్ను క్షమించండి. ఈ పని చేయలేను’’.
దేవతలు అతనితో ఇలా అన్నారు. ‘‘ఇంతకు ముందు దూతగా వెళ్లడానికి అంగీకరించావు. ఇప్పుడే కారణం చేత వెళ్లనంటున్నావు? నీవు వెంటనే వెళ్లాలి’’.
రాజు ఇలా అన్నాడు - ‘‘అంతఃపురం భటుల గట్టి భద్రత కలిగి ఉంటుంది. నేనెలా ప్రవేశించగలను?’’
ఇంద్రుడు ‘‘నీవు ప్రవేశించగలవని’’ చెప్పగా, ఒప్పుకొని నలుడు దమయంతి అంతఃపురానికి వెళ్లాడు.
ఆ అంతఃపురంలో సౌందర్యంతో ప్రకాశించే పద్మినీజాతికి చెందిన దమయంతిని చూశాడు. ఆమెను చూడగానే ఎక్కువ అయిన తన కోర్కెను మనసులోనే ఉంచుకొన్నాడు. అతన్ని చూచి దమయంతి చుట్టూ ఉన్న స్ర్తిలు అతని అందానికి ఆశ్చర్యపడుతూ అతని పట్ల గౌరవంతో లేచి నిల్చున్నారు.
అతన్ని చూచి సిగ్గుపడిన దమయంతి అతన్ని ఇలా ప్రశ్నించింది ‘‘సుందరాంగా! అమరునిలాగా ప్రకాశిస్తున్న నీవు ఎవరు? ఇక్కడకు ఎలా వచ్చావు? ఈ అంతఃపురం మహారాజు భటులచే సదా రక్షింపబడి ఉంటుంది కదా! నీవెలా ఇందులోకి ప్రవేశించగలిగావు?’’
ఈ ప్రశ్నలకు నలుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘కల్యాణీ! నేను నిషధరాజు నలుడను. దేవతల దూతగా నేను ఇక్కడికి వచ్చాను. దేవతలైన ఇంద్రాగ్నియమవరుణులు నిన్ను వరించారు. వారిలో ఒకరిని నీవు పతిగా వరించు. వారి ప్రభావం చేతనే నేను ఎవరికీ కన్పడకుండా ఇక్కడికి రాగలిగాను. నేను చెప్పవలసింది చెప్పాను. విని నీ బుద్ధికి తోచింది నీవు చెయ్యి’’. ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి