డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుని మాటలు విన్న దమయంతి దేవతలకు నమస్కరించి ఇలా అన్నది. ‘‘మహారాజా! నేను నిన్ను వరించాను. నీవే నా సర్వస్వమని భావిస్తున్నాను. ఈ విషయం నీకూ తెలుసు. హంస చెప్పిన మాటలు విన్నప్పటినుంచి నినే్న భర్తగా కోరుకుంటున్నాను. ఈ రాజులందరూ ఇక్కడికి నా కోసమే వచ్చారు. ఇప్పుడు నీవు ఇలా చెబితే నేను మరణించడానికి విషమో, అగ్నియో, జలమో ఏర్పాటు చేసుకుంటాను’’.
దమయంతి మాటలు విన్న నలుడు మరల ఇలా అన్నాడు. ‘‘దేవతలే నిన్ను కోరుతూ ఉంటే మానవమాత్రుడినైన నన్ను ఎలా కోరుకుంటావు? వారికి ఏ విధంగాను సాటిరాను. నీవు వారిలో ఎవరినైనా వరించిన దివ్య సౌఖ్యాలు పొందు’’.
అతని మాటలకు క్రోధం తెచ్చుకున్న దమయంతి ఇలా అంది. ‘‘దేవతలందరికీ నమస్కరించి నీకు ఈ సత్యాన్ని చెప్తున్నాను. నినే్న భర్తగా అందరి రాజులముందు వరిస్తాను’’.
అపుడు నలుడిలా అన్నాడు. ‘‘కల్యాణీ! దేవదూతగా వచ్చిన నాకు ఏది క్షేమమో తెలుపుము. ఈ విషయాన్ని వారికెలా చెప్పను? వారి కోసం వచ్చిన నేను నా స్వార్థాన్ని ఎలా ఉపయోగించను?’’
అపుడు దమయంతి చిరునవ్వుతో ఇలా అంది. ‘‘మహారాజా! మీ పట్ల దోషం లేకుండా ఒక పని చేయవచ్చును. దేవతలు, మీరు అంతా కలిసి నా స్వయంవరానికి రండి. వారందరి సమక్షంలోనే నిన్ను వరిస్తాను. అలా చేస్తే ఏ దోషమూ ఉండదు’’.
నలుడు తిరిగి దిక్పాలకుల దగ్గరికి రాగా వారు దమయంతి తమ సందేశానికి ఏమి సమాధానమిచ్చిందని అడిగారు.
అపుడు నలుడు ఇలా అన్నాడు. ‘‘మీరు చెప్పినట్లుగానే ఆమె అంతఃపురంలోకి ప్రవేశించాను. దమయంతి ఆమె చెలులు నన్ను చూచి ఆశ్చర్యపోయారు. మీ గురించి వివరంగా చెప్పినప్పటికీ దమయంతి ననే్న వరిస్తోంది. ఆమె నాతో ఇలా అంది. ‘‘మీరందరు కలిసి స్వయంవర సభకు రండి. దేవతల సన్నిధిలోనే నిన్ను వరిస్తాను.’’ దమయంతి చెప్పినది యధాతదంగా మీకు చెప్పాను’’.
స్వయంవర శుభతిథి రోజున భీమ మహారాజు రాజులందరినీ సభామంటపానికి ఆహ్వానించాడు. రాజులతో శోభిస్తున్న ఆ మంటపం నాగులతో ఉన్న భోగవతిలాగా శోభించింది.
అప్పుడు దమయంతి తన సౌందర్యంతో అక్కడి రాజుల కన్నులను, మనస్సులను ఆకర్షిస్తూ ఆ మంటపంలోకి ప్రవేశించింది. రాజులందరూ ఆమె లావణ్యాన్ని, సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయారు.
చెలికత్తె ఆమెకు ఆ రాజుల యొక్క వివరాలు తెలుపుతున్న సమయంలో దమయంతి ఒకే రూపం గల ఐదుగురు వ్యక్తులను చూసింది. వారిలో నిజమైన నలమహారాజును గుర్తించలేకపోయింది. ఐదుగురిలో ప్రతి ఒక్కరు నలునిలాగానే కన్పించారు. ఆమెకు చాలా దుఃఖం కలిగింది. ‘‘వీరిలో నిజమైన నలమహారాజును ఎలా గుర్తించాలి?’’ అని ఆమె ఆలోచించింది. దేవతల లక్షణాల గురించి పెద్దలు చెప్పగా విన్నాను. వాటిలో ఒక్కటి కూడా వీరిలో లేదు. చివరకు ఆ దేవతలనే శరణు వేడాలని నిర్ణయించుకొని ఇలా అన్నది. ‘‘హంసమాటలు విని నలుని భర్తగా వరించాను. ఆ మాట సత్యమైతే దేవతలు నాకు నలుని చూపిస్తారు. మనసా, వాచా, కర్మణా నలుని కాక ఇతరులనెవరినీ భర్తగా భావింపను అన్నది సత్యమైతే దేవతలు నాకు నలుని చూపాలి. దేవతల చేతనే నలమహారాజు నాకు భర్తగా కూర్చబడినాడు. ఇది సత్యమైతే నాకు నలుడు నిజరూపంలో కన్పించాలి. దేవతలు వారి స్వరూపాలలో నాకు కన్పించాలి’’.
దమయంతి చేసిన ప్రార్థన విన్న దిక్పాలురకు ఆమె నలుని యందున్న భక్తి, ప్రేమ, ఆమె యొక్క శుద్ధమైన మనస్సు, సద్బుద్ధి చక్కగా అర్థమైంది. వారు తమ తమ రూపాల్లో ప్రత్యక్షమైనారు. వాడని పూలమాలలు ధరించి, నేలను తాకకుండా, ఛాయారహితంగా ఉన్న దేవతలు ఆమెకు కన్పించారు. వారి ప్రక్కన వాడిన మాలతో, చెమటతో, ఛాయాసహితంగా రెప్పపాటులో నలుడు కన్పించాడు. ఆనందంతో ఆమె నలుని మెడలో స్వయంవర మాల వేసి దేవతల సాక్ష్యంగా నలుని వరించింది. వెంటనే అక్కడ ఉన్న దేవతలు, మహర్షులు ‘సాధు సాధు’ అని ఈ కల్యాణాన్ని ప్రశంసించారు.
నలమహారాజు వారి సమక్షంలో దమయంతితో ఇలా పలికాడు. ‘‘ఓ చక్కని చిరునవ్వుగల సుందరీ! నా శరీరంలో ప్రాణాలు ఉన్నంతవరకు నీయందు ప్రేమతో ఉంటాను’’.
తర్వాత వారిరువురూ దేవతలకు నమస్కరించగా వారు నలుగురూ ఒక్కొక్కరు రెండేసి వరాలు నలునకు అనుగ్రహించిరి. ఇంద్రుడు సంతోషంతో నలునకు శుభప్రదమైన అత్యుత్తమ గతిని, యజ్ఞాలు చేసే సమయాన తమ ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించెను.
అగ్ని నలుడు కోరిన చోట తాను ఉండేటట్లు ఇంకా తన కాంతి గల లోకాలను ప్రసాదించాడు.
యముడు అన్నరసాన్ని, ధర్మమందు ఉత్తమ స్థితిని ప్రసాదించాడు.
వరుణుడు నలుడు కోరిన చోట జలసమృద్ధిని సువాసన కల మాలలను అనుగ్రహించాడు.
ఇలా ఎనిమిది వరాలు నలునకు అనుగ్రహించి లోకపాలురు తిరిగి తమ లోకాలకు ప్రయాణ మయ్యారు. రాజులంతా భీమమహారాజు ఇచ్చిన విందులు, సత్కారాలు గైకొని తమ నగరాలకు మరలి పోయారు. నలదమయంతులు కొంతకాలం భీమరాజు ఆతిద్యం స్వీకరించి నిషధ దేశానికి తిరిగి వెళ్లారు. అక్కడ నలుడు దమయంతితో కలిసి ఎన్నో యజ్ఞాలు చేసి ప్రజలను ఆనంద పరిచాడు. కొంతకాలానికి వారికి ఇంద్రసేనుడనే పుత్రుడు, ఇంద్రసేన అన్న పుత్రిక జన్మించారు. వీరందరితో సంతోషంగా జీవిస్తూ నలమహారాజు సిరిసంపదలతో తులతూగుతూ ఈ పృథ్విని పరిపాలించాడు.
దమయంతి నలుని వరించిన తర్వాత దిక్పాలకులు తిరిగి తమ లోకాలకు వెళ్తున్న సమయంలో వారు ద్వాపరునితో కలిసి వస్తున్న కలిని చూశారు. వారు కలిని ఎక్కడకు వెళ్తున్నావని ప్రశ్నించగా కలి ఇలా అన్నాడు. ‘‘నా మనస్సు దయమంతి యందు లగ్నమై ఉంది. దమయంతీ స్వయంవరానికి వెళ్ళి ఆమెను వరిస్తాను’’.
అప్పుడు ఇంద్రుడు నవ్వి ‘‘దమయంతీ స్వయంవరం అయిపోయింది. మా సమక్షంలోనే ఆమె నలమహారాజును వరించింది’’ అని చెప్పాడు. ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి