డైలీ సీరియల్

అన్వేషణ -29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సరే! వెళ్లు.. జాగ్రత్త..’’ అని సోఫాలోంచి లేచాడు రహీంపాషా. వెనక్కి తిరిగి రహీం వెళ్లబోతూ తూలి పడబోయాడు. చప్పున వీరబాహు వచ్చి పట్టుకున్నాడు. ఎందుకు అలా తూలి పడబోయాడో అతడికి అర్థం కాలేదు. కాళ్లకేదో తగిలినట్లయ్యింది. కాళ్ల వంక చూసుకున్నాడు. ఏమీలేదక్కడ.
చాలా పకడ్బందీగా వీరబాహు చేసిన పనికి రహీం పడబోయాడు. సన్నటి తీగను అతడి కాళ్లకి విసిరాడు. అలాంటివాటిలో వీరబాహు చాలా సిద్ధహస్తుడు. రాత్రి కావడంవల్ల తీగ ఏ మాత్రం కంటికి కనిపించదు.
‘‘ఏమైందన్నా?’’ అడిగాడు రహీంని పట్టుకునే వీరబాహు.
‘‘ఏమోరా తూలింది..’’ ఎందుకు తూలిందో తెలీని అయోమయంలో అన్నాడు రహీం.
‘‘అంటే..’’
‘‘బిపికానీ రెయిజైందేమోరా. రేపోసారి చూపించుకోవాలి..’’’ రహీం అన్నాడు మామూలుగా నడవడానికి ప్రయత్నిస్తూ.
‘‘రేపు ఆసుపత్రికి వెళదాం అన్నా.. పొద్దునే్న వస్తాను...’’’
‘‘నువ్వెందుకురా.. ఎవరన్నా చూస్తే..’’
‘‘పర్లేదన్నా.. వేషం మార్చేస్తాగా... ఇలాంటివెన్ని చూడలేదు మనం.. అయినా మనం కామ్‌గా ఆసుపత్రికి వెళ్లొద్దాం అన్నా..’’ అన్నాడు వీరబాహు.
అదీ నిజమేననిపించింది రహీం పాషాకి. ఏ మీడియావాడైనా చూస్తే అదో పెద్ద వార్తలా రాసేస్తారని, తన ఆరోగ్యం గురించి బయటికి తెలియడం అంత మంచిది కాదనీ అనుకున్నాడు రహీం. అతడు బిపికి మందులు వేసుకుంటున్నాడు. ఈమధ్య షుగరూ వచ్చింది. వీటన్నింటికీ కారణం టెన్షన్ అని డాక్టర్ చెప్పాడు. తనకి టెన్షన్ లేకపోవడం అన్న సమస్యే లేదు. నిత్యం టెన్షనే!
దానికితోడు ఈమధ్య తనకి సిటీలో రెండు ప్రధానమైన గ్రూపులు మునిస్వామి నాయుడు, చినగంగప్ప దూరమయ్యారు. ఒక విధంగా తానే దూరం చేసుకున్నాడు. తాను ఇంత ఎదిగినా ఇంకా ఇంకా తాను వాళ్లకి ఒదిగి ఉండాల్సిరావడం రహీంకి ఎంతమాత్రం ఇష్టంలేదు. వాళ్లు తనని తమతో సమానంగా చూడాలన్నదే అతడి కోరిక. అది వాళ్లకి ఇష్టంలేదు.
అనుచరుడు జీవితాంతం అనుచరునిగానే ఉండాలన్న రూలు లేదు. అనుచరుడూ ఎదుగుతాడు. అలా ఎదిగినప్పుడు అంతకాలం తనకు బాస్‌గా ఉన్నవాళ్లని తనని గౌరవించాలన్నదే రహీం వాదన!
మునిస్వామి నాయుడు ఎన్నికల్లో సీటు దగ్గర తనను విస్మరిస్తే, స్టేటస్‌లో చినగంగప్ప తనను చిన్నబుచ్చడం రహీంకి ఎంతమాత్రం నచ్చలేదు. అలా అతడు వాళ్లిద్దరికీ దూరమయ్యడు. దాంతో రాజకీయ కక్షలు పెరిగాయి వాళ్లమధ్య. ఇపుడు చినగంగప్ప, మునిస్వామినాయుడు వర్గాలు దగ్గరవుతున్నాయి. అది సహించలేకనే చినగంగప్ప ముఖ్య అనుచరుణ్ణి చంపించేశాడు రహీంపాషా.
రహీంని బెడ్‌రూం గుమ్మందాకా తీసికెళ్లి జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్లిపోయాడు వీరబాహు. రూములోకి వెళ్లిన రహీం మంచంమీద పడుకున్నాడన్నమాటేగానీ తూలి ఎందుకు పడబోయానా, నిజంగా బిపి పెరిగిందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆలోచనలతోనే అతడికి చాలాసేపు నిద్రపట్టలేదు.
మర్నాడు ఉదయం పది గంటలకి రహీంపాషా ఆసుపత్రికి బయల్దేరాడు. గడ్డం, మీసాలు పెట్టుకుని, కొంచెం జులపాల జుట్టు పెట్టుకుని ముఖానికి నల్లరంగు వేసుకుని రహీంతోపాటు వచ్చాడు వీరబాహు. వీరబాహు అంత పబ్లిక్‌గా వస్తాడని పోలీసులు అనుకోలేదు. అనుకోరని రహీంపాషాకి, వీరబాహుకి బాగా తెలుసు.
ఆసుపత్రి మెట్లు ఎక్కుతుంటే మళ్లీ రహీం తూలి పడబోయాడు. చటుక్కున రెయిలింగ్ పట్టుకున్నాడు. ఇప్పుడూ ఎవరికీ ఏ అనుమానం రాకుండా, చాలా జాగ్రత్తగా తన కాలు అతడి కాళ్లకు అడ్డం పెట్టాడు వీరబాహు వెనుకనుంచి.
‘‘ఏం అన్నా మళ్లీ తూలుతోందా?’’ అనడిగాడు ఏమీ ఎరగనట్లు వీరబాహు.
‘‘ఏదో కాళ్లకు అడ్డం పడినట్లయ్యిందిరా’’ రహీంపాషా అన్నాడు.
‘‘లేదులే అన్నా నీకలాగే అనిపించుంటాది.. తూలి పడబోయావు..’’ అన్నాడు వీరబాహు.
అంతేకావచ్చు అని తలూపాడు రహీంపాషా. ఆసుపత్రి లోపలికి వెళ్లగానే బయట ఎదురుచూడక్కర్లేకుండా సరాసరి డాక్టర్ రూములోకి వెళ్లిపోయాడు రహీంపాషా. అతడి వెనుక వీరబాహు.
అతడు లోపలికి రాగానే డాక్టర్ కె.వి.రావు విష్ చేశాడు- ‘‘ఏంటిలా వచ్చారు?..’’ వెంటనే అడిగాడు.
‘‘కొంచెం బిపి రెయిజైందనుకుంటాను డాక్టర్‌గారూ.... ఓసారి చెక్ చేయించుకుందామని వచ్చాను..’’ అతడి టేబుల్ ప్రక్కన పేషెంట్లు కూర్చునే స్టూలుమీద కూర్చుంటూ చెప్పాడు రహీంపాషా.
అతడికి బిపి చూడ్డానికి సిద్ధమయ్యాడు డాక్టర్ రావు. తనకి బిపి పెరిగి ఉంటుందన్న ఆందోళనవల్లనే అప్పుడు అతడికి బిపి ఎక్కువగానే ఉంది.
‘‘ఎస్.. బ్లడ్‌ప్రెజర్ ఎక్కువగానే ఉంది. బాగా టెన్షన్‌లో ఉన్నారా?..’’ అడిగాడు డాక్టర్‌రావు.
‘‘పెద్దగా టెన్షన్ అంటూ ఏమీ లేదు డాక్టర్.. మామూలే.. రొటీన్...’’ చెప్పాడు రహీం.
‘‘పోనీ ఓ రెండు రోజులు ఆసుపత్రిలో ఉండండి.. టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది..’’ నవ్వుతూ అన్నాడు డాక్టర్.
‘‘అవునన్నా.. అదే మంచిది.. ఆసుపత్రిలో ఉండు..’’ వీరబాహు చెప్పాడు.
‘‘ఏముందిరా ఆసుపత్రిలో చేరడానికి.. ఫర్వాలేదు డాక్టర్.. టేబ్లెట్లు వాడమంటారా?’’ అనడిగాడు రహీం.
‘‘సేమ్.. ఏమీ మార్చక్కర్లేదు.. ఈ మాత్రం దానికి మీరు రావడమేమంటి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా.. జస్ట్ ఒన్ మినిట్.. మీకు సుగరుంది కదా.. ఎందుకేనా మంచిది అది కూడా చెక్ చేద్దాం..’’ అంటూ నర్స్‌ని పిలిచి ఆర్‌బిఎస్ చేయమన్నాడు డాక్టర్ రావు.
నర్స్ సిరెంజ్ కోసం బయటికి వెళ్లగా, వీరబాహు గబగబా బయటికి వెళ్లి ఆమెను ప్రక్కకు పిలిచాడు.
‘‘రెండో కంటికి తెలియకుండా సుగర్ కోసం తీసుకున్న బ్లడ్ కాకుండా అదనంగా బ్లడ్ తీసి ఇదిగో ఇందులో స్టోర్ చేసి ఇవ్వు.. నీకు ఐదువేలిస్తాను..’’ అని చెప్పాడు.
ఆమె కంగారు పడింది. అయిష్టంగా తలూపింది.
‘‘చూడు నీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కామ్‌గా ఎక్కువ బ్లడ్ తీసేయ్. నేనేదోవిధంగా డాక్టర్‌గారిని మాటల్లో దింపుతాను.. ఐదువేలిస్తాను... ప్లీజ్..’’ అన్నాడు ఒకప్రక్కగా బ్రతిమాలుతున్నట్లు, మరోప్రక్కగా బెదిరింపు ధోరణిలో. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842