డైలీ సీరియల్

నలోపాఖ్యానం-- 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రుడిలా చెప్పగానే కలి ఆగ్రహం చెంది, వారితో ఇలా అన్నాడు ‘‘దేవతల మధ్య ఒక మానవుని దమయంతి పతిగా వరించిందా? దీనికి ఆమెను తప్పక శిక్షించాలి’’
దేవతలు ఇలా అన్నారు ‘‘మేము అనుమతించిన తర్వాతనే దమయంతి నలుని వరించింది. అలాంటి రూపసంపన్నుడు, గుణవంతుడు అయిన రాజును ఏ స్ర్తి వరించకుండా ఉంటుంది? నలమహారాజు సత్యవ్రతుడు, అహింసానిరతుడు. ధర్మమార్గం లో ఉండడమే అతని వ్రతం. సమర్థత జ్ఞానం, తపస్సు, శౌచం, శాంత స్వభావం అతని గుణాలు. అతడు చేసే యజ్ఞాలతో దేవతలు తృప్తి చెందుతున్నారు. అటువంటి మహా రాజును ఎవరైనా శపిస్తారా? అలా చేసినవారు నరకంలో పడతారు’’ ఇలా ద్వాపరునికి చెప్పి దేవతలు వెళ్లిపోయారు. అప్పుడు కలి ద్వాపరునితో ఇలా అన్నాడు.
‘‘నేను నలుని మీద కోపం తగ్గించుకోలేకపోతున్నాను. నేను నలునిలో ప్రవేశిస్తాను. నీవు పాచికలను ఆవహించి నాకు సహాయపడు’’.
ద్వాపరునితో ఇలా ఒప్పందం చేసుకొని కలి నిషధ రాజ్యం చేరి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా పండ్రెండవ సంవత్సరంలో అతనికి ఆ అవకాశం దొరికింది. ఒకరోజు నలమహారాజు మూత్ర విసర్జన చేసి కాళ్లు కడుక్కోకుండా సంధ్యోపాసన చేశాడు. ఇది అవకాశంగా తీసుకొని కలి నలునిలో ప్రవేశించాడు. అలా ప్రవేశించి పుష్కరుని దగ్గరకు వెళ్లి నలునితో పాచికలు ఆడమని అతన్ని ప్రోత్సహించాడు.
‘‘నీవు నాతో కలిసి నలునితో పాచికలాడి అతణ్ణి జయించి నిషధరాజ్యాన్ని పొందుతావు’’ అని పుష్కరునితో చెప్పాడు. కలి అలా ప్రోత్సహించగా పుష్కరుడు వచ్చి నలుని పాచికలాటకు ఆహ్వానించాడు. పుష్కరుడు నలుని సోదరుడు. కనుక అతన్ని ఆహ్వానాన్ని నలుడు త్రోసిపుచ్చలేక పోయాడు. దమయంతి వద్దన్నా వినకుండా పందెం వేయడానికి సిద్ధపడ్డాడు. క్రమంగా ధన కనక వస్తు వాహన గృహాదులను నలుడు పందెంలో వేసి ఓడిపోయాడు. అయినా అతను ఆటను ఆపలేదు. ఎవ్వరూ అతన్ని విరమింపజేయలేక పోయారు.
మంత్రులంతా కలిసి ఆటలో ఉన్న అతన్ని చూచుటకు వచ్చారు. సూతుడు వచ్చి ‘‘కార్యార్థులై పురజనులు ద్వారం చెంత వేచి ఉన్నారని’’ దమయంతికి చెప్పాడు. అప్పుడు దమయంతి దుఃఖిస్తూ నలునితో ఇలా చెప్పింది.
‘‘మహారాజా! మంత్రులు, ప్రజలు ఎంతో భక్తితో తమ దర్శనార్థమై వచ్చి ద్వారం దగ్గర ఉన్నారు. మీరు వారికి దర్శనం ఇవ్వాలి’’. కాని కలి ప్రభావంతో ఉన్న రాజు ఆమె మాటలు లక్ష్యపెట్టలేదు.
ప్రజలు, మంత్రులు ఇక ఇతడు మనకు దక్కడు అని భావించి తిరిగి వెళ్లిపోయారు.
ఈ విధంగా నలుడు పుష్కరుడు ఎన్నో నెలలు పాచికలాడారు. చివరకు నలుడు ఓడిపోయి సర్వమూ పోగొట్టుకున్నాడు.
నలుని పరిస్థితి అంతా చూసిన దమయంతి స్థిమితంగా ఆలోచించి తన పరిచారిక అయిన బృహత్సేనను పిలిచి ఇలా చెప్పింది. ‘‘బృహత్సేనా! మంత్రులను రప్పించి, మహారాజు జూదంలో ఓడిపోయిన ధనం గాక మిగిలిన ధనం ఎంత ఉందో కనుక్కో’’. మంత్రులంతా దమయంతి ఆజ్ఞ విని ఆమె దగ్గరకు వచ్చారు. ఇంకొకసారి ఆమె భర్తకు హితవు బోధించింది. కాని అతను విన్పించుకోలేదు. జూదం నలునికి ప్రతికూలంగా ఉండి అతను సర్వస్వం ఓడిపోతున్నట్లు ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె దాసీని పంపి రదసారథిని పిలిపించి అతనితో ఇలా చెప్పింది. ‘‘వార్షేయా! మహారాజు మంచి స్థితిలో ఉన్నప్పుడు నీతో ఎలా ఉండేవాడో నాకు తెల్సు. ఇప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. మహారాజుకు సహాయం చేయగలిగేది నీ వల్లనే. ఎంత ధనం ఓడిపోతున్నా రాజు జూద వ్యామోహంలో నా మాటలు విన్పించుకోవడం లేదు. నేను నిన్ను శరణు వేడుతున్నాను. వేగంగా వెళ్లే గుఱ్ఱాలను రథానికి పూన్చి మహారాజు సంతానాన్ని కుండిన నగరానికి తీసుకొని వెళ్లు. నా తల్లిదండ్రుల దగ్గర ఈ పిల్లలను ఉంచి నీవు అక్కడే ఉండు. లేదంటే నీ ఇష్టమైన చోటుకు వెళ్ళు’’.
వార్షేయుడు దమయంతి మాటలు విని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రులకు చెప్పాడు. వారి అనుమతిపొంది రథంలో పిల్లలిద్దరినీ తీసుకొని కుండినలో ఉంచి తాను అయోధ్యకు వెళ్లి ఋతుపర్ణరాజు దగ్గర రదసారథిగా చేరాడు.
దమయంతి పిల్లలను విదర్భకు పంపిన కొంతకాలానికి పుష్కరుడు నలుని రాజ్యం, సంపద మొత్తం జూదంలో హరించాడు. అతను నలునితో ఇలా అన్నాడు. ‘‘నీవు సర్వస్వం కోల్పోయావు. నీకు ఒక్క దమయంతి మాత్రమే మిగిలింది. దమయంతిని పెట్టాలన్న ఉద్దేశ్యం ఉంటే ఆట సాగించు’’.
ఈ మాటలతో వ్యధ చెందిన నలుడు తన శరీరం మీద ఆభరణాలుకూడా తీసి అక్కడ పెట్టి ఒంటి వస్త్రంతో దమయంతితో కలిసి నగరాన్ని విడిచాడు. వారు వృక్షాలకున్న ఫలాలను తింటూ వెళ్లసాగారు. కొన్ని రోజులకు ఎంతో ఆకలితో ఉన్న నలునికి బంగారు రెక్కలున్న కొన్ని పక్షులు కన్పించాయి. నలుడు వాటిని చూచి ఇలా తలచాడు.
‘‘ఈ పక్షులు నా ఆహారం అవుతాయి. వీటి వల్ల బంగారం కూడా లభిస్తుంది’’ ఇలా అనుకొని తన ఉత్తరీయాన్ని వాటిపైకి విసిరాడు. పక్షులు ఆ వస్త్రాన్ని కూడా తీసుకొని ఎగిరిపోయాయి. ఆ ఒక్క వస్త్రం కూడా ఒంటిమీద లేక దిగంబరుడై సిగ్గుతో నిల్చున్న నలుని చూచి ఆ పక్షులు ఇలా పలికాయి. ‘‘బుద్ధిహీనుడా! నువ్వు కట్టుబట్టలతో వెళ్తూ ఉంటే మాకు సంతోషంగా లేదు. దిగంబరునిగా నిన్ను చూచి ఆనందించడానికి, నీ వస్త్రాలు అపహరించడానికి వచ్చిన పాచికలం మేము’’.
అప్పుడు దుఃఖంతో ఆ పాచికల్ని చూచి నలుడు దమయంతితో ఇలా అన్నాడు. ‘‘దమయంతీ! ఈ పాచికల వల్లనే నేను సర్వం కోల్పోయాను. ప్రజల గౌరవాన్ని పోగొట్టుకున్నాను. ఆకలితో బాధపడుతున్నాను. చివరకు దిగంబరునిగా మిగిలాను. నీ భర్తగా నీ హితం కోరి చెప్తున్నాను. ఈ మార్గాలన్నీ దక్షిణాపథానికి వెళ్తాయి. ఇంకొక మార్గం విదర్భ రాజ్యానికి మార్గం. తక్కిన మార్గాలలో మహర్షులు ఆశ్రమాలు ఉన్నాయి.’’నలుని మాటలు విన్న దమయంతి ఎంతో వ్యధతో ఇలా అంది. ‘‘మహారాజా! మీ సంకల్పం విన్న నా హృదయం దహించుకుపోతున్నది. సర్వం కోల్పోయి దిగంబరులుగా ఉన్న మిమ్ము విడిచిపెట్టి నేనెలా వెళ్లగలను? ఈ మహారణ్యంలో మీ బాధను నేను మాత్రమే పోగొట్టగలను. కష్టసమయంలో భర్త ప్రక్కన ఉండవలసింది భార్య మాత్రమే’’.

--ఇంకావుంది...

-- డాక్టర్ ముదిగొండ ఉమాదేవి