డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానికి నలుడు ఇలా అన్నాడు. ‘‘దమయంతీ! బాధల్లో ఉన్నవారికి భార్యతో సమానమైన మిత్రుడు కాని మందుకాని ఇంకొకటి లేదు. నిన్ను నేను విడువను’’
దమయంతి ఇలా అన్నది ‘‘మీరు నన్ను విడువరని తెలుసు. కాని మీ బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. విదర్భ వెళ్లాలనుకుంటే ఇద్దరం కలిసే వెళ్దాము. అక్కడ మనం సుఖంగా ఉండవచ్చు’’.
ఈ మాటలకు నలుడు ఇలా అన్నాడు ‘‘కల్యాణీ! నీ తండ్రిగారిల్లు నాకు కూడా స్వంతమే. కాని ఈ కష్ట సమయంలో అక్కడికి వెళ్లలేను’’. దమయంతి చీరనే వారిద్దరూ కట్టుకొని ఆకలి దప్పులతో వారు ఒక విశ్రాంతి మందిరంలోకి వెళ్లారు. అక్కడ అలసిపోయినవారు నేలపై నిద్రించారు. దమయంతికి నిద్ర పట్టింది. కాని నలుడు నిద్రపోలేదు. అతను ఇలా ఆలోచించాడు. ‘‘నా మూలంగా దమయంతి కష్టాలను అనుభవిస్తోంది. నేను లేకపోతే ఆమె దుఃఖంతో తన వారిని చేరుతుంది. నాతో ఉంటే ఆమెకు దుఃఖం తప్ప సుఖం ఉండదు’’ ఇలా ఆలోచించుకొని నలుడు ఆమె చీరలోని సగభాగం చింపి తాను కట్టుకొని నిద్రిస్తున్న దమయంతిని విడిచి వెళ్లాడు. వెళ్తూ ‘‘దమయంతీ! నీవు ధర్మాన్ని ఆచరిస్తావు కనుక సూర్యచంద్రులు, వసువులు, రుద్రులు నిన్ను రక్షిస్తారు’’ ఇలా అని కలి ప్రభావంతో ముందుకు సాగాడు. నిద్రపోతున్న దమయంతిని ఒంటరిగా వదలి వెళ్లిపోయాడు.
నలుడు వెళ్లిన కొంతసేపటికి దమయంతి నిద్ర లేచి భర్త కనపడక ఇలా విలపించింది.
‘‘నాథా! ఈ వనంలో నీవు లేకుండా ఉన్న నాకు భయం కలుగుతున్నది. నన్ను విడువనని ప్రమాణం చేశావు కదా! మరి ఇంత నిర్దయగా ఎందుకు విడిచి వెళ్లావు? ఎవరికీ ఏ అపకారము చేయని నీవు భార్యనైన నాకు ఎందుకింత దుఃఖం కలిగించావు? నిన్ను విడిచి నేనెలా జీవించేది? దుఃఖిస్తున్న నన్ను ఎందుకు వచ్చి ఓదార్చవు?’’
దమయంతి ఇలా విలపిస్తూ అరణ్యంలో నలుని కోసం అటూ ఇటూ పరుగులు పెట్టింది. అదే సమయంలో ఒక కొండచిలువ శీఘ్రంగా అక్కడికి వచ్చి ఆమెను పట్టుకుంది. దమయంతి తన భర్తను తలచుకొని దుఃఖించింది. ‘‘నాథా! ఈ నిర్జనారణ్యంలో ఒక పెద్ద పాము నన్ను పట్టుకుంది. నేనీ దుఃఖ స్థితిలో ఉంటే నన్ను రక్షించడానికి రావెందుకు?’’
దమయంతి ఇలా బిగ్గరగా దుఃఖించగా విని ఒక బోయవాడు అక్కడకు వచ్చి ఆమెను చూచాడు. అప్పుడు అతను కత్తితో ఆ పామును చంపి దాని పట్టునుంచి దమయంతిని విడిపించాడు. తరువాత ఆ వ్యాధుడు ఆమెను ఊరడించి ఇలా అన్నాడు - ‘‘ఓ సుందరీ! ఒంటరిగా ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? ఎవరికోసం దుఃఖిస్తూ వెతుకుతున్నావు?’’
వ్యాధుని ఓదార్పు మాటలు విన్న దమయంతి అతనికి జరిగిన అన్ని విషయాలు చెప్పింది. సగం చీర కట్టుకొని, అత్యంత సౌందర్యవతియైన ఆమెను చూసి వ్యాధుడు మోహితుడై ఆమెను ఓదార్పుగా ఊరడిస్తున్నాడు. కాని సూక్ష్మగ్రాహియైన దమయంతి అతని ఉద్దేశాన్ని గ్రహించింది. ఆమె తనను సమీపిస్తున్న వ్యాధుని ఆగ్రహంతో ఇలా శపించింది - ‘‘నేను నిషధరాజు నలుని తప్ప ఇంకెవరినీ మనసులో సైతం తలచనట్లయితే ఈ వ్యాధుడు మరణించుగాక’’. వెంటనే ఆ వ్యాధుడు నేలపై పడి మరణించాడు.
వ్యాధుడు చనిపోయిన పిమ్మట దమయంతి ఆ అరణ్యం నుంచి బయలుదేరింది. ఆ భీకరారణ్యం క్రూరమృగాలతో, సూర్యరశ్మి కన్పించకుండా చేసే పెద్ద పెద్ద వృక్షాలతో అనేక రకాల పక్షి జాతులతో, పర్వతాలు, నదులు, సెలయేళ్లతో ప్రకాశిస్తోంది. దమయంతి వాటన్నిటినీ చూస్తూ నడిచి నడిచి చివరకు ఒక రాతిపై కూర్చుని భర్త కొరకు మరల ఇలా దుఃఖించింది.
‘‘ఓ పురుషశ్రేష్ఠా! ఎన్నో అశ్వమేధయాగాలు చేసిన నీవు ననె్నందుకిలా ఒంటరిగా ఒదలి వెళ్లావు? సత్యవ్రతా! నా పట్ల ఎందుకు అసత్యమార్గాన్ని త్రొక్కావు? వేదవేదాంగాలు చదివావే! పూర్వం నీవు నాతో చెప్పిన మాటలు సత్యం ఎందుకు చేయవు? సగం చీరతో మిగిలిన నాపై దయ ఎందుకు చూపవు? నన్ను అనాథలాగ ఎందుకు వదలివేశావు? నీ కోసం నేను ఎక్కడ వెతకను? ఎవరిని నీ గురించి అడగను? ఏకాకిని దుఃఖంతో ఉన్న నన్ను ఎందుకు ఆదరించవు?’’
ఈ విధంగా దుఃఖిస్తూ మరల అరణ్యంలో రోజులు నడిచి ఒక తాపసారణ్యాన్ని చూసింది. ఆ ప్రదేశం వశిష్ఠ, భృగు సమానులైన మహర్షులచేత ప్రకాశిస్తోంది. అక్కడ జితేంద్రియులు, పవిత్రులు, మోక్షాన్ని కోరేవారు, జలవాయు భక్షులతో నిండి ఉంది. ఆ ఆశ్రమాన్ని చూచిన దమయంతికి భయం పోయింది. ఆమె ఆ ఆశ్రమంలోకి ప్రవేశించింది. ఆ తాపసులకి వినయంగా నమస్కరించింది. వారు ఆమెను ఆశీర్వదించి కూర్చోమని చెప్పి ఆమెకోసం ఏం చేయాలో చెప్పమన్నారు.
ఆమె వారితో ఇలా విన్నవించింది. ‘‘మహాభాగులారా! స్వధర్మాచరణంలో మీరు కుశలమే కదా! మీ తపస్సుకు మృగ పక్షుల వలన కాని, ఇతరుల వల్ల కాని ఏ విధమైన భంగము వాటిల్లడం లేదు కదా!’’
వారు ఆమె వినయవాక్కులను విని సంతృప్తులై ఆశ్చర్యంతో ఇలా అడిగారు. ‘‘అమ్మా! మాకందరకు కుశలమే. నీవు ఎవతెవు? ఏమి చేయదలచితివి? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీవు వనదేవతవా? పర్వతరాజు కుమార్తెవా? ఇంత తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. సత్యాన్ని చెప్పుము’’.
అప్పుడు దయమంతి వారితో తన వనవృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పింది. ‘‘తపోధనులారా! నేను విదర్భ రాజు తనయను. నా పేరు దమయంతి. యశస్వి, పండితుడు, వీరుడు అయిన నిషధరాజు నలమహారాజు భార్యను. నా భర్త సత్యవ్రతుడు. శత్రుంజయుడు. వేదవేదాంగ పారంగతుడు. అట్టి మహారాజు జూదంలో సర్వం ఓడిపోయి అడవులపాలయ్యాడు. నేను నా భర్తను వెతుకుతూ ఈ అరణ్యంలో తిరుగుతూ, నా భాగ్యం వల్ల మీ దర్శనం పొందాను. మీ సన్నిధికి నా భర్త వచ్చాడా? భర్తృశోకంతో నేనిక జీవించలేను’’.
దుఃఖంతో విలపిస్తున్న దమయంతిని చూసి ఆ తాపసులు ఇలా అన్నారు. ‘‘అమ్మా! మేము తపోదృష్టితో చూశాము. త్వరలోనే నీవు నీ భర్తను చూస్తావు. సర్వ పాపాల నుండి విముక్తి పొంది అతడు పునీతుడు అగును. అతను తిరిగి నిషధరాజ్యాన్ని పాలిస్తాడు’’.
ఈ మాటలు ఆమెతో చెప్పి ఆ తాపసులంతా ఆశ్రమాలతో సహా అంతర్ధానమయ్యారు. ఇది చూసి దమయంతి ఆశ్చర్యపడింది. ‘‘నేను కలగన్నానా? లేక ఇదంతా సత్యమా? ఆ ఆశ్రమాలు ఎక్కడ? తాపసులేరీ? ఆ నదులు, పర్వతాలు ఎక్కడ?’’ ఇలా ఆలోచిస్తూ దమయంతి ఆ ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి చేరి అక్కడ ఒక అశోకవృక్షం దగ్గర కూర్చుని విలపించింది.
మరల భర్తను వెతుకుతూ ఆమె అనేక పర్వతాలను, నదులను దాటుతూ నడుస్తూ నడుస్తూ ఒక సార్ధవాహుల గుంపుని చూచి మెల్లగా వారి గుంపులోకి ప్రవేశించింది. ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి