డైలీ సీరియల్

అన్వేషణ -30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్స్ ముందు కంగారు పడింది. తర్వాత ఎందుకు అనడిగింది.
‘‘వేరే ఒక టెస్టు చేయించాలి.. అందుకాయన ఒప్పుకోవడంలేదు.. ఆయన మంచికోసమే..’’ చెప్పాడు చాలా నమ్మకంగా. ఆమె అయిష్టంగా, ఆమెకు తనదగ్గరున్న బాటిల్ ఇచ్చాడు, అందులో బ్లడ్ నింపమని. ఆమె వెళ్లింది సిరెంజ్ తీసుకుని డాక్టర్‌గారి రూములోకి. ఆమె వెనుకే వీరబాహూ వచ్చాడు.
ఆమె రహీం నుంచి బ్లడ్ తీస్తుంటే, వీరబాహు డాక్టర్‌గారిని అసలు సుగర్ ఎందుకొస్తుంది అని ప్రశ్నించాడు. డాక్టర్ రావు సుగర్ గురించి అతడికి చెప్పడంలో ఉన్నపుడు నర్స్ కావాల్సిన దానికన్నా చాలా అదనంగా బ్లడ్ తీసింది. ఆమె బ్లడ్ తీస్తున్నపుడు రహీం ముఖం ప్రక్కకు పెట్టుకున్నాడు. ఎంత కత్తులతో ఆడుకునేవాడైనా తన వంట్లోంచి రక్తం తీస్తున్నపుడు ముఖం ప్రక్కకే పెడతాడు మరీ పచ్చినెత్తురు తాగేవాడైతే తప్ప.
నర్స్ బ్లడ్ తీసుకుని వెళ్లింది. వీరబాహు కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది, క్షణం సేపు తన పని అయినందుకు.. లక్ష రాబోతున్నందుకు.
***
‘‘ఇంత తేలిగ్గా పని అవుతుందనుకోలేదురా కొండలూ..’’ అన్నాడు అనిరుధ్ తనకు కావలసిన రహీం బ్లడ్ శాంపిల్ చేతికిరాగానే.
‘‘అవునురా.. నేనూ అలాగే అనుకున్నాను.. వీరబాహు అసలు సంపాదించగలడా అని కూడా అనుమానం వచ్చింది నాకు. చాలా ఫాస్ట్‌గానే వచ్చేసింది.. పద డాక్టర్ హేమంత్ దగ్గరకెళదాం... ఆలస్యం ఎందుకు? తొందర చేశాడు కొండబాబు.
రహీంని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడనుంచి బయటపడ్డాక కొండబాబుకి ఫోన్ చేశాడు వీరబాహు. ఎక్కడ కలవాలో చెప్పాడు. వచ్చేటప్పుడు డబ్బు తీసుకురమ్మని కూడా చెప్పాడు. వీరబాహు చెప్పిన చోటుకి కొండబాబు బైక్‌మీద వెళ్లాడు అనిరుధ్.
బ్లడ్ శాంపిల్ తీసుకుని డాక్టర్ హేమంత్ దగ్గరికి వెళ్లారిద్దరూ.
‘‘ఓకె.. తెచ్చారా? కొంచెం టైమ్ పడుతుంది రిపోర్టు రావడానికి..’’ అన్నాడు డాక్టర్ హేమంత్.
‘‘సుమారు ఎన్నాళ్లుసర్?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘ఇక్కడ చెయ్యరు.. అసలు చెయ్యరని కాదు.. కానీ కరెక్టు రిపోర్టు రాదు.. ఆథరైజ్డ్ లాబ్‌లో చేయించాలి.. హైదరాబాద్ పంపాలి..’’ వివరంగా చెప్పాడు డాక్టర్ హేమంత్.
‘‘కెన్ వుయ్ ఎక్స్‌పెక్ట్ ఒన్ వీక్?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘యా.. మాక్సిమమ్ ఈలోగానే వచ్చేట్టు చూస్తాను..’’
‘‘్థ్యంక్యూ సర్..’’ అని ఒక కవర్ అందించాడు అనిరుధ్ డాక్టర్ హేమంత్‌కి.
‘‘్థ్యంక్యూ..’’ కవరు అందుకుని డ్రాయర్‌లో పెట్టుకున్నాడు హేమంత్.
‘‘ఒన్ లాక్ సర్.. ప్లీజ్ కౌంట్..’’ కొండబాబు చెప్పాడు.
‘‘నో థ్యాంక్స్.. ’’ ఇద్దరూ లేచి బయటికి వచ్చేశారు.
‘‘ఒన్ వీక్ ఆగాలన్నమాట..’’ అన్నాడు స్వగతంలా అనిరుధ్.
‘‘జస్ట్ ఒన్ వీక్ .. ఈలోగానే రావచ్చు అన్నాడుగా.. చూద్దాం..’’
ఇంతవరకూ లేని టెన్షన్ ఇప్పుడు అనిరుధ్‌లో మొదలయ్యింది. ఇతడే.. అంటే రహీంయే తనకి తండ్రి అవుతాడా.. ఒకవేళ అయితే!?.. వెళ్లి పలుకరించాలా? ఏమని పలుకరించాలి?
అతడు చేసిన దౌర్భాగ్యమైన పనికి ఎంతగా తను తపనపడిందీ, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదీ, అమ్మమ్మ ఎంతగా కుమిలిపోయిందీ.. ఆ నీచుడికి చెప్పాలి.. రహీం పాషా.. దుర్మార్గుడు!.. ఒక అభం శుభం తెలీని అమ్మాయిని నాశనం చేసినవాడు.. వాడిని పీకపిసికి చంపేసినా పాపం ఉండదు...
కొండబాబు బండిమీద కూర్చున్న అనిరుధ్ ఆలోచనలు అలా సాగుతున్నాయి. ఇంటికొచ్చారు.. వౌనంగా లోపలికి వచ్చిన అనిరుధ్ కుర్చీలో అన్యమనస్కంగా కూర్చుండిపోయాడు. అతడి పరిస్థితి కొండబాబుకి అర్థమయ్యింది.
అలా అస్థిమితంగానే రెండు రోజులు గడిపాడు అనిరుధ్. మూడో రోజు డాక్టర్‌ని కలుద్దామా అనుకున్నాడు. కొండబాబుకీ ఆ ఆలోచన వచ్చింది. రిపోర్టు వస్తే డాక్టర్ ఫోన్ చేస్తాడు కదా అని ఊరుకున్నాడు. ఐదో రోజు ఉదయం ఫోనొచ్చింది డాక్టర్ హేమంత్ నుంచి.
హడావుడిగా వెళ్లారు అనిరుధ్, కొండబాబు. ‘‘నో.. మీరిచ్చిన బ్లడ్ శాంపిల్‌లో మీ డిఎన్‌ఎ మ్యాచ్ కాలేదు.’’ అంటూ రిపోర్టు అందించాడు హేమంత్. ఏం మాట్లాడాలో అనిరుధ్‌కి తెలియలేదు. వౌనంగా రిపోర్టు అందుకున్నాడు. డాక్టర్‌కి మరో కవరు అందజేసి థ్యాంక్స్ చెప్పి వచ్చేశారిద్దరూ.
ఆ మర్నాడు ఉదయం సిటీలో అలజడిగా ఉంది. కారణం వీరబాహుని ఎవరో హత్య చేశారు. కూడళ్లలో జనం గుంపులు గుంపులుగా చేరి చర్చించుకుంటున్నారు.
హాల్లో రిలాక్స్‌గా కూర్చున్న రహీం పాషా ముఖంలో చిరునవ్వు తారట్లాడుతోంది. తన అనుచరుడు వీరబాహు హత్యకు గురయ్యాడన్న విషయం రాత్రి తొమ్మిది గంటలకే అతడికి తెలిసింది. ఎందుకంటే, ఆ మర్డర్ అతడు ప్లాన్ చేసిందే కనుక!
వీరబాహు హత్యకి సరిగ్గా రెండు రోజుల క్రిందటే డాక్టర్ హేమంత్ కార్పొరేటర్ రహీం పాషాకి ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పాడు. అయితే కంగారు పడాల్సిందేమీ లేదని డిఎన్‌ఎ మ్యాచ్ కాలేదని కూడా చెప్పాడు. ఆ టెస్టు చేయించిందెవరని రహీం అడిగాడు. చెప్పాడు హేమంత్. అందుకు కారణమూ చెప్పాడు. ఇంక వాళ్ళ గురించి పట్టించుకోనవసరం లేదనుకున్నాడు.
ఒక లక్ష రూపాయలకోసం తన రక్తం శాంపిల్ ఇవ్వడానికి సిద్ధపడ్డ వీరబాహు రేపు ఏ ఐదు లక్షలకో తనను మర్డర్ చెయ్యడానికి కూడా వెనుకాడడని, ముందుగా వాడిని లేపెయ్యాలని రహీం క్షణాలమీద నిర్ణయం తీసుకున్నాడు. లక్ష రూపాయలు అందుకుని అతడు తమిళనాడు వెళ్లిపోయి ఉంటే బ్రతికేవాడేమో! అయితే డబ్బు చేతికందగానే తన ఉంపుడుకత్తెతో సరదాగా రెండు రోజులు గడపాలని చేసిన తప్పు అతడి ప్రాణాలు తీసింది. రహీం దేన్నయినా సహిస్తాడుగానీ నమ్మకద్రోహాన్ని మాత్రం సహించడని అతడి అనుచరులకి మరోసారి రుజువు చేశాడు.
వీరబాహు హత్యకు గ్రూపుల తగాదాలని జనాలకి తెలిసిన కారణం. కానీ అసలు కారణం మాత్రం ఒక్క రహీంకే తెలుసు.
‘‘మన పని చేశాకనే వాడు చచ్చాడు.. లేకుంటే మళ్లీ మనం మరో మార్గం వెతుక్కోవలసి వచ్చేది..’’ కొండబాబు అన్నాడు.

- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842