డైలీ సీరియల్

అన్వేషణ -32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికే కొడుకు వేస్తున్న చిల్లర వేషాలు తండ్రి దృష్టికివచ్చాయి. మందలించాడు. ఒకటి రెండుసార్లు తన కళ్ళల్లో పడ్డప్పుడు బెత్తానికీ పనిచెప్పాడు అలా తొమ్మిదో తరగతివరకూ నారాయణ చదువు కుంటుకుంటూ సాగింది. టెన్త్‌కివచ్చేసరికి నారాయణ ఇక బడికి వెళ్లడమే మానేశాడు. తండ్రి తిట్టినా దులిపేసుకున్నాడు. దాంతో తనకూ కూలిపన్లకి తీసికెళ్లడమా, లేక ఎవరినో కాళ్లూ గడ్డాలూ పట్టుకుని నౌఖరీలో చేర్చడమా అని మదనపడ్డాడు తండ్రి.
మన మేస్ర్తి ద్వారా ఒక పచారీ షాపులో పెట్టాడు. అక్కడ ఓ నెల్లాళ్లు పనిచేసి, ఆ పనికి ఎగనామం పెట్టేశాడు నారాయణ. కొన్నాళ్లకు బలాదూర్‌గా తిరిగాడు. అప్పటికే తన స్నేహితులు ఒకళ్లిద్దరు రిక్షాలు తొక్కుతుండడంతో తనూ ఓ రిక్షా అద్దెకు తీసుకుని రిక్షా తొక్కడం మొదలెట్టాడు.
అలా ఆ వృత్తిలో ఉన్నపుడు అతడికి చాలా విషయాలు తెలిశాయి. పగటిపూటకన్నా రాత్రిపూట ప్రత్యేక పాసింజర్లను ఎక్కించుకుని ప్రత్యేక లాడ్జిలకు తీసికెళితే బాగా డబ్బులొస్తాయన్న నిజం తెలుసుకున్నాడు. అందుచేత రాత్రిపూట రిక్షా డ్యూటీయే ఎంచుకుని లాడ్జింగులకి అబ్బాయిల్ని, అప్పుడప్పుడు అమ్మాయిల్చి చేర్చడం, దానికి బాగా డబ్బు సంపాదించడం నేర్చుకున్నాడు. తద్వారా పోలీసులతో పరిచయాలు, సంబంధాలు కూడా ఏర్పడ్డాయి.
ఇరవయ్యేళ్లొచ్చేసరికి నారాయణ రిక్షా పులర్స్‌గా బాగా పాపులర్ అయ్యాడు. చాలా అలవాట్లు నేర్చుకున్నాడు. కొడుకుని ఆ స్థితిలో చూస్తున్న తండ్రి లోలోపల బాధపడ్డం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు. కనీసం ఏదైనా ఆఫీసులో ఒక అటెంటర్‌గానైనా తన కొడుకు ఉద్యోగం చేస్తాడన్న అతడి ఆశలమీద నీళ్లు పోసిన నారాయణ, తండ్రిని ఒట్టి చాదస్తం మనిషిగా తీసిపారేశాడు.
చదువుఎలాగూ చంకనాకిపోయింది, కనీసం పద్ధతిగా ఉంటాడనుకున్న కొడుకు సిగరెట్లు, మందూ వగైరా అలవాట్లకు లోనవడం తల్లికి బాధగానే అనిపించింది. ఆమె కొడుకుని మందలించినా వాడు లెక్కచెయ్యలేదు. నీకూ ఆయన చాదస్తం వచ్చిందా అని తల్లిని కూడా విదిలించడం మొదలెట్టాడు.
అలా ఆరేళ్లు గడిచిన తర్వాత నారాయణ ఉన్నట్టుండి రిక్షా తోలడం మానేశాడు. అదేంరా అని తల్లి అడిగితే.. ‘ఎవడు తొక్కుతాడు ఎదవ రిచ్చా.. కాళ్లు పడిపోతన్నయ్..’ అని విసుక్కున్నాడు.
సరిగ్గా ఆ నిర్ణయానికి మూడు నెలల ముందు జరిగిన ఒక సంఘటన నారాయణ మనసులో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. రోజూ తన రిక్షా ఎక్కి సాయంత్రాలు ఎంజాయ్ చేసే ఓ షోకిల్లారాయుడు తన ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఓ రోజు మాటల్లో ఆ విషయం నారాయణకి చెప్పి ఇల్లు కొనుక్కోవడం, అందుకు నారాయణకి ఆయన కొంత డబ్బు కమిషన్‌గా ఇవ్వడం జరిగింది. ఇలా ఇళ్లు అమ్మించడాలు, కొనిపించడాలు చేస్తే కమిషన్ వస్తుందని, అప్పుడే నారాయణకి బాగా అర్థమయ్యింది. అంతవరకూ ఆ వ్యాపారం గురించి పూర్తిగా అతడికి తెలియదు.
దాంతో అతడు ఆ అవతారం ఎత్తాడు. అద్దెకు ఇళ్లు చూపించడాలు వగైరా చేయడం మొదలెట్టాడు. అతడి వేషాభాషల్లోనూ మార్పొచ్చింది చాలా త్వరలోనే. రెండేళ్లు.. మూడేళ్లు.. అలా గడిచిపోయాయి. రిక్షా పుల్లర్స్‌కన్నా ఇది అతడికి చాలా బాగున్నట్లనిపించింది. పైగా గౌరవంగానూ అనిపించింది.
ఆ సమయంలోనే సిటీ చుట్టుప్రక్కల రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా ప్రారంభమవడంతో వాటి బ్రోకర్‌గానూ పనిచేయడం మొదలెట్టాడు. అసలే మాటకారి కావడంతో, ఇతడి చురుకుదనం చూసి నారాయణను పార్ట్‌నర్‌గా పెట్టుకుని వెంకటేశం వెంచర్లువేశాడు. దాంట్లో వాళ్లు బాగా సంపాదించారు.
అలా నారాయణ పదేళ్లలో సిటీలో ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఒక స్థానం సంపాదించుకున్నాడు. సొంతంగా వెంచర్లు వేశాడు. నాలుగు చేతులా సంపాదించాడు. కొడుకు అలా ఎదిగిపోవడం ఇపుడు తండ్రికి సంతోషంగా ఉంది. అతడు కొన్న మారుతీ కారులో వెనుక సీట్లో కూర్చుని వేళ్లమధ్య చుట్ట పెట్టుకుని స్టైల్‌గా విండోమీద చేయివేసి వెళ్తుంటే అతడికి చాలా గర్వంగా ఉంది. అలా అతడిని చూసిన చాలామంది ‘వీడికి ఏం దశ పట్టిందిరా’ అనుకోకుండా ఉండరు!
‘‘ఇది నారాయణ గత చరిత్రా!..’’ అనిరుధ్‌కి చెప్పాడు కొండబాబు.
సాయంత్రం నాలుగు గంటలు కావస్తూన్న సమయంలో వాళ్లిద్దరూ కొండబాబు డాబామీద మామిడిచెట్టు నీడ వచ్చేట్టు కూర్చున్నారు. అనిరుధ్ ఎప్పుడో- సావిత్రి పకోడీలు బాగా చేస్తుందిరా అన్నమాట గుర్తుపెట్టుకుని కొండబాబు భార్య సావిత్రి పకోడీలు చేసి పెట్టింది. ఫ్లాస్కులో టీ పోసి ఇచ్చింది.
ఆ సమయంలో తాము రేపటినుంచి చేపట్టబోయే రెండో డిఎన్‌ఎ టెస్టు వ్యక్తి నారాయణ గురించి చెప్పుకొచ్చాడు కొండబాబు. నిజానికి కొండబాబుకి నారాయణ బాగానే తెలుసు. కానీ అది గతం. ఇపుడు నారాయణ సిటీకి చెందిన పెద్దమనుషుల్లో మూడో వరుసలో కూర్చునే పెద్దమనిషి నారాయణ. కొండబాబు ఒక సాదాసీదా చిన్న వ్యవసాయదారుడు. లేదంటే చిన్న బియ్యం వ్యాపారి.
నారాయణ గురించి కొండబాబకు తెలిసింది అంతే! కానీ అతడి వ్యక్తిగత విషయాలు ఇంకా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి.
నారాయణ భార్య వీరాయమ్మ చాలా ఆడంబరం ప్రదర్శించే మనిషి. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి కవిత ఈమధ్యనే ఇంజనీరింగ్ పూర్తిచేసింది. రెండో అమ్మాయి లలిత ఇంటర్ చదువుతోంది. ఆమె ఈమధ్యనే ఒకడి లవ్వులోనూ పడింది. పెద్దమ్మాయి కూడా ఆమధ్య లవ్వులో పడింది కానీ, అతడు వేస్టుఫెలో అని తెలిశాక వాడిని దూరం పెట్టింది.
పెద్దమ్మాయి సెట్‌రైట్ అయ్యిందనుకున్న సమయంలో చిన్నమ్మాయి వ్యవహారం తెలిసింది నారాయణకి. అతడి గురించి విచారించాడు. అతడు హాస్టల్‌లో ఉంటూ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం వెలగబెడుతున్నాడు. ఎక్కడివాడు, ఎవరి పిల్లవాడు వగైరా వివరాలు తెలుసుకొమ్మని అనుచరులకి పురమాయించాడు నారాయణ. వాళ్లాపనిలో ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్న తల్లి కూతుర్ని చావబాదింది. కూతురు తిరగబడింది. దాంతో నారాయణ భార్యకి నచ్చచెప్పి ఊరుకోబెట్టాడు. ‘మనం కాదంటే వాళ్లు రెచ్చిపోతారు.. నెమ్మదిగా వ్యవహారం చక్కబెట్టాలి’ అని భార్యని ఊరుకోబెట్టాడు.
ఆ రోజుకారోజు సరుకులు తెచ్చుకునే క్రింది వర్గంవారికీ, వారానికోరోజు సరుకులు తెచ్చుకునే మధ్యతరగతివారికీ, ఇబ్బడిముబ్బడిగా డబ్బులున్నవారికీ ఆయా స్థాయిలలో సమస్యలుంటాయని ఇప్పుడే అర్థమయ్యింది నారాయణకి. పిల్లల్ని పెంచడం, అందులోనూ ఆడపిల్లల్ని పెంచడం ఎంత కష్టమో కూడా అతడికి తెలిసొచ్చింది.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842