డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు మరల రాజ్యాన్ని, భార్యాబిడ్డలను పొందుతావు. నా మాట సత్యం. నీ అసలు రూపం కావాలంటే నన్ను తలచుకొని ఈ వస్త్రాన్ని కప్పుకో’’ అని చెప్పి ఒక దివ్యవస్త్రాన్ని నలునకు ఇచ్చి కర్కోటకుడు అంతర్థానమైనాడు.
నలుడు కర్కోటకుని మాటను గౌరవించి ఋతుపర్ణరాజు దగ్గరకు వెళ్ళి తను అశ్వశాస్త్ర నిపుణడనని, తన పేరు బాహకుడని చెప్పాడు. ఇంకా తను కష్టాలలో ఉన్నానని, తనకు ఎవ్వరూ లేరని, తనకు పాకశాస్త్రం కూడా బాగా తెలుసునని పలికాడు. ఋతుపర్ణుడు సంతోషించి తన అశ్వాలకు బలం, బాగుగా పరుగెత్తే శక్తి ఇస్తే బాహుకుని తన అధ్యక్షుడుగా ఉద్యోగం ఇస్తానని తనకు అ అశ్వహృదయం నేర్చుకోవాలన్న కోరిక కలిగిందని చెప్తాడు. ఆ విధంగా నలుడు ఋతుపర్ణుని కొలువులో చేరతాడు.
నలుడు ఆ నగరంలో ఉంటూ నిత్యం దమయంతిని తల్చుకొని ఒక శ్లోకం చదువుకొనేవాడు. ‘‘ఆమె ఇప్పుడు ఎలా ఉందో, ఎవరి ఆశ్రయంలో ఉందో, ఏ కష్టాలు పడుతున్నదో’’ అని తలచుకొని దుఃఖించేవాడు. అది విన్న అతని దగ్గర పనిచేస్తున్న విశాలుడు అతన్నిలా అడిగాడు. ‘‘బాహుకా! నీవు ఎవరిని తల్చుకొని దుఃఖిస్తున్నావు? ఆ స్ర్తి ఎవఠు?’’ అపుడు నలుడు, ఆమె ఒక బుద్ధిహీనుని భార్య అని, అందరికీ ప్రియమైనది, కొన్ని కారణాల వల్ల ఆ మందభాగ్యుడు ఆమెకు దూరమైనాడు. అతను ఆమెను తలచుకొని చింతిస్తూ రాత్రి సమయంలో ఒక శ్లోకం చదువుతాడు. ఆమె ఇప్పుడు ఒంటరిదైపోయింది’’ అని అతనికి సమాధానం చెప్పి ఆ మహారాజు దగ్గరే అజ్ఞాతవాసం చేస్తున్నాడు.
విదర్భ రాజు నలదమయంతులు అరణ్యానికి వెళ్లిన తర్వాత వారి కోసం వెతకటానికి బ్రాహ్మణులను పంపించాడు. వారి జాడ తెలుసుకొని వస్తే ఆ బ్రాహ్మణులకు వేయి గోవులు, అగ్రహారాలను ఇస్తానని చెప్పి వారిని అన్ని దిక్కులకు పంపాడు. వారు అన్ని దేశాలు తిరుగతూ నలదమయంతుల కోసం వెతకసాగారు. అందులో ఒక విప్రుడు చేదిదేశం వచ్చి అక్కడ రాజభవనంలో సునందతో కలిసి ఉన్న దమయంతిని చూసి ఆమె రూపురేఖలను గుర్తుపట్టి ఆమె దమయంతియే అయి ఉంటుందని అనుకున్నాడు. అతను ఇలా తలచాడు. ‘‘రూపురేఖలు చూస్తే నేను పూర్వం విదర్భలో చూసిన దమయంతి అనే తోస్తున్నది. కాని ఈమె రూపురేఖలు బురదలో నుండి పైకి వచ్చిన తామరకాడ లాగున్నవి. రాహువు మ్రింగిన పూర్ణచంద్రునిలాగ ఈమె ముఖము కాంతి హీనంగా ఉంది. ఇష్టమైన భోగాలు, అలంకారాలు, బంధువులు, భర్తకు దూరమై దుఃఖితురాలై ఉంది. ఈమె దుఃఖం ఎప్పటికి అంతమై తిరిగి భర్తతో సుఖిస్తుందో! ఇప్పుడు ఈమెను ఊరడించడమే నేను చేయవలసిన పని’’.
సుదేవుడు ఇలా ఆలోచించి దయమంతి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ‘‘అమ్మా! దయమంతీ! నేను మీ అన్నగారి మిత్రుడను సుదేవుడనే బ్రాహ్మణుడను. మీ తండ్రిగారు పంపితే నిన్ను వెతకడానికి వచ్చాను. విదర్భలోని తల్లిదండ్రులు, సోదరులు, సంతానం అంతా కుశలమే కాని నీవు కన్పించక పోవడం వల్ల వారు దుఃఖంలో ఉన్నారు. చాలామంది బ్రాహ్మణులు నీకోసం అన్ని దేశాలు వెతుకుతున్నారు’’.
తనవారి వార్త విన్న దమయంతి సుదేవుని చూచి దుఃఖించింది. ఏకాంతంగా అతనితో జరిగిన విషయాలు అన్నీ చెప్పింది. అలా ఏడుస్తూ విషయాలు చెప్తున్న ఆమెను చూసి సునంద తల్లికి చెప్పింది. సునంద మాటలు విని రాజమాత సుదేవుని పిలిపించి విషయం అడిగింది. సుదేవుడు ఆమెకు జరిగిందంతా వివరంగా చెప్పాడు.
నలుడు జూదంలో ఓడిపోవడం, భార్యాభర్తలు రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళ్లడం, అన్ని సంగతులు వివరించాడు. విదర్భ రాజు ఆదేశానుసరం తాము దమయంతిని వెతుకుతూ వచ్చి రాజభవనంలో ఆమెను చూడగా, ముఖం మీద పుట్టుమచ్చ వలన తాను ఆమెను గుర్తించానని చెప్పాడు.
అతని మాటలు విని రాజమాత దమయంతిని దగ్గరకు తీసుకొని ఇలా అంది. ‘‘తల్లీ! నీవు నా సోదరి కుమార్తెవే. నీవు పుట్టినప్పుడు నిన్ను చూశాను. ఈ ఇల్లు నీ తండ్రి ఇల్లులాంటిదే!’’
రాజమాత మాటలు విన్న దమయంతి, సంతోషంతో ఇలా అంది ‘‘అమ్మా! నేనెవరో తెలియనప్పుడే నాకు ఆశ్రయం ఇచ్చి ఆదరించారు. నేను నా పిల్లలను, భర్తను చూడాలని కోరుతున్నాను. నన్ను అక్కడికి పంపించండి’’. ఆమె మాటలు విన్న రాజమాత పరివారాన్ని ఇచ్చి ఆమెను పల్లకీలో విదర్భకు పంపింది. విదర్భ చేరిన దమయంతిని చూసి ఆమె బంధువులంతా సంతోషించారు.
తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన దమయంతి వేదపండితులను పూజించి వారి దీవెనలు తీసుకుంది. ఆమె తండ్రి కూడా తన కుమార్తెను తిరిగి తీసుకొని వచ్చిన సుదేవునికి వేయి గోవులు, ఒక గ్రామం, ధనం సమర్పించాడు. తర్వాత దమయంతి తల్లితో తాను జీవించాలంటే నలుని తీసుకొని రావాలని కోరింది. మహారాణి కూతురి దుఃఖం గురించి భర్తతో చెప్పింది. వెంటనే మహారాజు నలుని వెతుకుటకు బ్రాహ్మణులను అన్ని దిక్కులకు పంపాడు. అలా వెళుతున్న వారితో దమయంతి ఇలా చెప్పి పంపించింది. ‘‘మీరు వెళ్లే ప్రతి జనసమూహంలో ఈ వాక్యం పలకండి ‘అనురాగవతియైన ప్రేయసి నిద్రిస్తున్న సమయంలో సగం చీరతో ఆమెను విడిచిపెట్టి వెళ్లిన జూదరివి నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆమె నీ కోసం నిరీక్షిస్తోంది. దుఃఖిస్తోంది. భార్య ఎప్పుడూ భర్తచేత రక్షింపబడుతుంది. భరింపబడుతుంది. ఈ రెండు బాధ్యతలను విడిచిపెట్టావు. దయాస్వరూపుడవైన నీవు నాయందు దయచూపు’ ఈ మాటలు మీరు అన్నప్పుడు ఎవరు సమాధానం చెప్పునో అతని గురించి తెలుసుకొని నాకు చెప్పండి. అతను అన్న మాటలు కూడా నాకు చెప్పండి’’.
ఈ మాటలు గుర్తుంచుకొని ఆ బ్రాహ్మణులు నలమహారాజును వెతుకుతూ అన్ని దిక్కులా బయలుదేరి గ్రామాలు, రాజ్యాలూ, వనాలు, ఆశ్రమాలు వెతుకుతూ దమయంతి చెప్పిన మాటలు వెళ్లిన ప్రతి ప్రదేశంలో అనసాగారు.
అలా వెతకటానికి వెళ్లిన వారిలో పర్ణాదుడనే బ్రాహ్మణుడు తిరిగి వచ్చి దమయంతితో ఇలా చెప్పాడు ‘‘తల్లీ! నేను అనేక ప్రదేశాలు తిరిగి నీవు చెప్పమన్నట్లుగానే చెప్పాను. చివరకు అయోధ్య చేరి ఋతుపర్ణుని సభలో ఈ వాక్యాలు అన్నాను. సభలో ఎవరూ మాటలాడలేదు కాని రాజుయొక్క రథసారథి బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకొని అందరి గురించి అడిగి చాలా దుఃఖించాడు. అతను పొట్టి చేతులతో, వికృతరూపంతో ఉన్నాడు. కాని రథాలను అతి వేగంగా నడపడంలో కడు సమర్థుడు. పాకశాస్త్రంలో నిపుణుడు. ఏడ్చి ఏడ్చి చివరకు అతడు నాతో ఇలా అన్నాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి