డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరానికి వచ్చిన ఋతుపర్ణునికి అక్కడ స్వయంవరపు ఏర్పాట్లు కనిపించలేదు. అతను భీమరాజును కలియగా అతను వారి కొరకు ఏమి చేయాలో చెప్పమనెను. భీమరాజుకు ఋతుపర్ణుడు అకస్మాత్తుగా నగరానికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. అయినా వారికి సత్కారాలు చేసి వారిని విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకోమన్నాడు. ఋతుపర్ణుడు తాను భీమరాజుకు నమస్కరించడానికి వచ్చానని చెప్పాడు కాని స్వయంవరం గురించి చెప్పలేదు. భీమరాజుకు అంత చిన్న కారణానికి ఋతుపర్ణుడు ఇంత దూరం ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. కాని కారణం అడగడం మర్యాద కాదని ఊరుకున్నాడు. బాహుకుడు గుర్రాలకు పరిచర్య చేసి రథం మీదనే కూర్చున్నాడు.
దమయంతి నలుని రథసారథ్యం తెలుసు కాని ఆమెకు వారిలో నలుడు కనిపించలేదు. ఆమె నలుని వెతకడానికి పరిచారికను పంపాలనుకొంది. ఆమె కేశిని అనే దూతికను పిలిచి రథసారథి గురించి వివరాలు తెలుసుకొని రమ్మంది. పర్ణాదుడు అన్ని ప్రదేశాలలో అన్న మాటలు అతనితో చెప్పి అతని సమాధానం తెలుసుకొని రమ్మని చెప్పి పంపింది.
కేశిని బాహకుని దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది ‘‘పురుషశ్రేష్ఠా! దమయంతి మిమ్మల్నిలా అడిగింది. మీరు ఎప్పుడు బయలుదేరారు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? సత్యం పలకండి’’
బాహుకుడు ఇలా సమాధానం చెప్పాడు ‘‘ఋతుపర్ణుడు దమయంతి స్వయంవరం గురించి తెలుసుకొని నూరు యోజనాలు శీఘ్రంగా ప్రయాణం చేయగల గుర్రాలతో నేను సారథిగా వచ్చాము. నాకు అశ్వశాస్త్రం, పాకశాస్త్రం తెలుసు. అందుకే ననే్న రథసారథిగా, వంటవానిగా నియమించారు’’.
కేశిని వార్ణ్షేయునికి నలుని గురించి తెలుసునా అని అడిగితే బాహకుడు తెలియదని చెప్పాడు. మరల ఇలా అన్నాడు ‘‘నలుని గురించి ఎవరికీ తెలియదు. అతను తన రూపాన్ని కోల్పోయి నిగూఢంగా తిరుగుతున్నాడు. అతను తన గుర్తులు ఎవరికీ చెప్పలేదు’’.
కేశిని బాహుకునితో ఇలా అన్నది. ‘‘ఒక బ్రాహ్మణుడు అయోధ్యానగరానికి వచ్చి ఇలా ఒక స్ర్తి మాటలు చెప్పాడు ‘‘నేను నిద్రిస్తున్న సమయంలో, నా చీరను సగం చింపుకొని, నన్ను ఏకాకిగా విడిచి ఎక్కడికి వెళ్లావు? నీకోసం రాత్రింబగళ్లు దుఃఖిస్తున్న నీ భార్య నీ కోసం ఎదురుచూస్తూ ఆ సగం చీరలోనే ఉంది. ఆమెకు నలుని గురించి వినాలని ఉంది. పూర్వం బ్రాహ్మణునికి మీరు చెప్పిన సమాధానాన్ని దమయంతి మరల వినగోరుతున్నది’’.
కేశిని ఇలా మాట్లాడగానే నలునకు దుఃఖం వచ్చింది. అతను ఇలా అన్నాడు ‘‘కష్టాల సమయంలో కుస్ర్తీలు నిగ్రహంతో ఉండాలి. భర్త విడిచి వెళ్లినా సాధ్వులు ఎన్నడు ఆగ్రహం చెందరు. ఆ భర్త అన్ని సంపదలు పోగొట్టుకొని భార్యను విడిచిపెట్టి ఉండవచ్చు. పక్షులు కట్టుకున్న వస్త్రాన్ని కూడా ఎత్తుకొనిపోవడం చేత అతను నిస్సహాయుడైనాడు. భర్త ఎలాంటి వాడైనా భార్య అతన్ని గౌరవించాలి’’ ఇలా చెప్తూ అతను తన దుఃఖం ఆపుకోలేక భోరుమని ఏడ్చాడు. కేశిని ఈ విషయం దమయంతికి నివేదించింది.
కేశిని చెప్పింది విన్న దయమంతి అతడే నలుడని అనుమానించి మరల బాహకుని దగ్గరకు వెళ్లి అతను వంట ఏవిధంగా నీరు, అగ్ని లేకుండా చేస్తాడో చూసి రమ్మంది. కేశిని ఆ విధంగా బాహుకుని దగ్గరకు వెళ్లి అంతా గ్రహించి తిరిగి వచ్చి దమయంతితో ఇలా చెప్పింది. ‘‘బాహుకుని పరిశుభ్రత చాలా ఎక్కువ. అతను పొట్టిగా ద్వారం దగ్గర కూడా తలవంచడు. అతను రాగానే ద్వారం తానంతట తానే పైకి లేస్తుంది. అతను ఏ ఇబ్బంది లేకుండా ద్వారంలోంచి వెళ్తాడు. ఋతుపర్ణుని కోసం అతను అనేక ఖాద్య పదార్థాలను తయారు చేస్తున్నాడు. ఆ వంటింట్లో మాంసం రాసిపోసి ఉంది. కాని దాన్ని కడగాలంటే కుండల్లో నీరు లేదు. కాని అతను వాటివైపు దృష్టి నిలుపగానే అవి నీటితో నిండిపోయాయి. అలాగే పిడికెడు గడ్డి తీసుకొని సూర్యుని వైపు చూపగానే అది మండింది. దానితో అగ్నిని సిద్ధం చేశాడు. కాని అతను అగ్నిని తాకినా ఏమీ కాలేదు. అతను రెండు పువ్వులు తీసుకొని నలుపగానే అవి ఎంతో సువాసనతో విచ్చుకున్నాయి.
ఈ విషయాలు విన్న దమయంతి అతను కచ్చితంగా నలుడే అని భావించింది. కేశినిని పంపి బాహుకుడు వండిన మాంసాన్ని తెప్పించి రుచి చూడగా అది నలుని వంట వలె ఉన్నది.
అప్పుడు ఆమె తన పిల్లలను కేశినితో బాహుకుని దగ్గరకు పంపింది. అతను వారిద్దరినీ ప్రేమతో తన తొడపై కూర్చోబెట్టుకొని దుఃఖించాడు. వారిని చూస్తే తన పిల్లలు గుర్తుకు వస్తున్నారని కేశినితో అన్నాడు.
కేశిని మరల దమయంతికి అతని ప్రవర్తన వివరించింది. తర్వాత ఆమె తన తల్లితో, తనకు బాహకుడు నలుడేనన్న అనుమానం కలుగుతున్నదని, దాన్ని నివారించడానికి తాను బాహుకునితో మాట్లాడాలి కనుక అతను అంతఃపురంలో ప్రవేశించడానికి అనుమతి కోరింది. తల్లి తండ్రికి చెప్పగా, అతను అనుజ్ఞ ఇవ్వగా నలుని అక్కడికి రప్పించింది. ఆమెను చూడగానే నలునికి దుఃఖం పొర్లి వచ్చింది.
ఆమె మలిన వస్త్రంతో జుత్తు జడలు కట్టి శోకంతో ఉన్నది. మరల ఆమె బాహకునితో తాను ముందు విప్రుల ద్వారా పంపిన వాక్యాలనే అంది. తనని జీవితాంతం వీడనని ప్రమాణం చేసిన నలమహారాజు ఎక్కడ ఉన్నాడు అని ఆమె అడుగుతూ ఉంటే బాహకుని దుఃఖం ఆగలేదు. అతను దుఃఖిస్తూనే ఆమెతో ఇలా పలికాడు. ‘‘రాజ్యం పోయింది. ఇవన్నీ కలిపురుషుడు తెచ్చిన కష్టాలు. రాత్రింబవళ్ళు నా గురించి ఆలోచించి నీవు కలిని శపించగా అతను నా శరీరంలో ప్రవేశించి నన్ను దహించాడు. అతను నా శరీరాన్ని వదలిపెట్టిన తర్వాత నేను నీ కోసమే ఇక్కడికి వచ్చాను. నాకు నీ సంగతి పూర్తిగా తెలుసు. ఇలాటి పతివ్రత ఇంకొక స్వయంవరం చేసుకోదు. ఈ విషయం తెలియని ఋతుపర్ణుడు ఇక్కడకు వచ్చాడు’’. ఈ మాటలు విన్న దమయంతి ఇలా అంది. ‘‘నీ జాడ తెలుసుకోవడానికి ఆ మాటలు బ్రాహ్మణులతో అన్ని ప్రదేశాలలో అనిపించాను. నీవు తప్ప నూరు యోజనాల ప్రయాణం ఇంకొకరు చేయలేరు. నాకే ఎందైనా పాపచింతన ఉంటే సకలలోక సంచారియైన వాయువు, సూర్యుడు, నా ప్రాణాలు హరించుగాక! చంద్రుడు నా ప్రాణాలు తీయుగాక! నా మాటలు సత్యాలైతే దేవతలు నాకు హాని చేయరు’’.
ఆమె మాటలు విన్న వాయుదేవుడు ఆకాశం నుండి ఇలా అన్నాడు. ‘‘నలమహారాజా! ఈమె కళంకరహిత. ఈమె సౌశీల్యం సురక్షితంగా ఉంది. నిన్ను రప్పించడానికే ఆమె ఈ విధంగా చేసింది. భార్యతో కలిసి సుఖాన్ని పొందు’’. అప్పుడు దేవదుందుభులు మ్రోగి పుష్పవర్షం కురిసింది.
నలమహారాజు కర్కోటకుని వస్త్రాన్ని కప్పుకొని పూర్వరూపం పొందాడు. చిరకాలానికి కలిసిన ఆ భార్యాభర్తలు పరస్పర సమాగమసుఖాన్ని అనుభవించారు. మరునాడు అతను మంగళస్నానం చేసి భార్యతో సహ అత్తమామల్ని దర్శించి వారి ఆశీర్వచనాన్ని పొందాడు.
నలుని రాకవలన సంతోషం పొందిన పురజనులు నగరమంతా అలంకరించారు. ఋతుపర్ణునికి ఇన్ని రోజులు తన దగ్గర సారథిగా ఉన్నవాడే నలమహారాజు అని తెలిసి ఆశ్చర్యపోయాడు. అతను నలునితో ఒకవేళ తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని వేడుకొన్నాడు. దానికి నలుడు అటువంటిదేమీ జరుగలేదని చెప్పి అతనికి సంపూర్ణంగా అశ్వవిద్యారహస్యము నేర్పి అతని నుండి అక్షహృదయ విద్యను నేర్చుకున్నాడు. భార్యతో నలమహారాజు కొంతకాలం విదర్భలో ఉన్నాడు.
నెలరోజులు విదర్భలో ఉండి కొంతసైన్యాన్ని తీసుకొని నిషధరాజ్యానికి వచ్చి పుష్కరుని దూతక్రీడకు పిలిచాడు. ఒకవేళ పుష్కరుడు జూదానికి ఇష్టపడకపోతే యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకుంటానని చెప్పాడు. నలునితో ఇలా అన్నాడు. ‘‘నైషధా! మళ్లీ జూదమాడడానికి ధనం సంపాదించి తెచ్చావు. నీ ధనాన్ని నేను గెలిస్తే ధనంతో పాటు దమయంతిని కూడా స్వీకరిస్తాను’’.
అతని ప్రలాపాలు విని నలునికి అతని శిరస్సు ఖండించాలని అన్నంత కోపం వచ్చింది. తర్వాత వారిద్దరి మధ్య జూదం మొదలైంది. పుష్కరుడు తన ప్రాణంతో సహితం సమస్త ధనాగారాన్ని పందెంగా పెట్టి మొదటి ఆటలోనే ఓడిపోయాడు.
నలుడు అతనితో ఇలా అన్నాడు ‘‘ఈ రాజ్యం అంతా నాది. ఇకపై నీవు దమయంతిని చూడలేవు. సపరివారంగా నీవు ఇప్పుడు దమయంతికి దాసుడవు. పూర్వం నీవు నన్ను కలిపురుషుని ప్రభావంతో జయించావు. నిన్ను ప్రాణాలతో వదలిపెడ్తున్నాను. సుఖంగా జీవించు. నీవు నా సోదరుడివి. నీకు కష్టం కలిగించను’’. పుష్కరుడు నలునికి నమస్కరించి తనవారితో తిరిగి తన నగరానికి వెళ్లాడు. పురజనులు, మంత్రులు, ప్రముఖులు నలుని సేవించడానికి అతని దగ్గరకు సంతోషంగా వచ్చారు.
ఆ సంతోషసమయంలో నలుడు వెళ్లి దమయంతిని పిల్లలను తీసుకొని వచ్చి గొప్ప మహారాజుగా కీర్తిని పొంది రాజ్యాన్ని పాలించాడు.
నలదమయంతులను కీర్తించినవారికి కలిదోషం అంటదు. ఈ కద విన్నవారికి దారిద్య్రం ఉండదు. వారు సిరిసంపదలతో ఉంటారు.
ఇంకావుంది...