డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండవులు మాయాజాదంలో దుర్యోధనుడి చేతిలో ఓడిపోయి అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో వారు అనేక నదీ ప్రాంతాలలో కొండగుహలలో కాలం గడిపారు. ఒకమారు వారు సరస్వతీ నదీ తీరాన్ని చేరి ద్వైతవనంలోని ఒక సరస్సు దగ్గరకు వెళ్ళారు. ఆ నదీతీరంలో వారు సుఖంగా జీవించసాగారు.
పాండవులందరిలో భీమసేనుడు చాలా బలం కలవాడు. అక్కడ ఉన్న సింహాలను చంపుతూ అతను ఆనందించసాగాడు. అలా జంతువులను వేటాడుతూ ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ ఒక పెద్దపాము కోరలకు చిక్కాడు. ఆ పాము తన పెద్ద శరీరాన్ని అతనిచుట్టూ చుట్టి అతణ్ణి అచేతననుడిని చేసింది. అలా చేయగల శక్తి ఆ పాముకి వరబలంవల్ల వచ్చింది. ఎన్నో ఏనుగుల బలం గల భీముడు ఆ పాము పట్టునుండి తప్పించుకోలేకపోయాడు.
అతడు ఆ సర్పాన్ని ఇలా అడిగాడు ‘‘ఓ సర్పరాజమా! ఎంతో బలం గల రాక్షసులు, పిశాచాలు కూడా నా భుజబలాన్ని ఓర్చుకోలేరు. అలాంటి నా బలాన్ని నీవు అణగద్రొక్కావు. ఇది ఎలా సాధ్యం? ఇది నీ వరబలమా? లేక విద్యాబలమా!’’
అప్పుడు అతన్ని చుట్టి ఉన్న పాము ఇలా అంది ‘‘చాలాకాలం నుంచి ఆకలిగా ఉన్న కారణాన దేవతలే నిన్ను నాకు ఆహారంగా పంపారని అనుకుంటున్నాను. నేనెలా ఈ భయంకర సర్పరూపం పొందానో నీకు చెప్తాను విను. నేను కొందరి మహాత్ములవల్ల ఈ శరీరాన్ని పొందాను. నేను నహుషుడనే రాజర్షిని. నీ పూర్వీకులకు ముందు వాడిని. ఆయువు పుత్రుడిని. అటువంటి నేను తాపసులను అవమానించి అగస్త్యుని శాపం వలన ఈ రూపాన్ని పొందాను. నా దురదృష్టం చూడు.
నీవు నా వంశంలోనే జన్మించి, ఇప్పుడు నాకు ఆహారంగా వచ్చావు. రోజుయొక్క ఆరవభాగంలో ఏ ప్రాణి, అది ఏనుగైనా సరే నాకు చిక్కితే అది నానుండి విడిపించుకోలేదు. ఇది నాకు ఉన్న వరము. నేను పతనమై ఇంద్ర సింహాసనం నుండి పడిపోతూ అగస్త్యుని శాపవిమోచనం చేయమని ప్రార్థించగా ఆ ముని ‘‘కొంత కాలమైన తర్వాత విముక్తి లభిస్తుందని’’ చెప్పాడు.
నేను భూమి మీద పడిపోయినా నాకు జ్ఞాపకశక్తి పోలేదు. నేనడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పినవాడు నాకు శాపవిమోచనం కలిగిస్తాడని ముని చెప్పాడు. ఆ తర్వాత ఆ బ్రహ్మర్షులు అంతర్ధానమైనారు. నేను ఈ నరకంలో ఉన్నాను. ఈ శరీరం నుంచి విముక్తి కోసం నేను ఎదురుచూస్తున్నాను.’’
తను ఆ పాము పడగలలో చిక్కుకున్నందుకు భీముడు ఎన్నో విధాలుగా విలపించాడు. కాని దైవాన్ని ఎవరు ఎదురించగలరు? అతను తన తల్లిని, సోదరులను, ద్రౌపదిని తలచుకుని దుఃఖించాడు.
ఆశ్రమంలో ఉన్న ధర్మరాజుకు ఎన్నో అపశకునాలు కన్పించగా అతను భీముని వెతుక్కుంటూ వెళ్ళి పాముకు చిక్కి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తమ్ముని చూశాడు. అతను తమ్ముని దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు ‘‘్భమసేనా! నీవు ఎలా ఈ పాము కోరలకు చిక్కావు?’’
అప్పుడు భీముడు విషయం అంతా ఇలా వివరించాడు. ‘‘అన్నా ఇతడు పాము రూపంలో ఉన్న నహుషుడనే రాజర్షి. ఇతను నన్ను ఆహారంగా గ్రహించాడు.’’
అప్పుడు ధర్మరాజు ఆ పెనుబాముతో తన తమ్ముని విడిచిపెట్టమని దానికి వేరే ఆహారాన్ని సమకూరుస్తానని చెప్పాడు. దానికి ఆ పాము ఇలా అన్నది. ‘‘ఇతడు నా ఆవాసం దగ్గరకు వచ్చి నాకు ఆహారమైనాడు. నా దగ్గరకు వచ్చినవాడు నాకు ఆహారమగును. కనుక ఇతన్ని విడిచి నీవు మరలిపో. ఇతన్ని నేను విడువను ఇంకొకరిని కోరను.’’
అప్పుడు యుధిష్ఠురుడిలా అన్నాడు - ‘‘ఓ సర్పరాజమా! సత్యం చెప్పు! నీవు దేవతవా, దైత్యుడివా లేక మామూలు సర్పానివా! ఏమి తెచ్చి నిన్ను సంతోషపెట్టగలను? నీవు ఏంచేస్తే నా తమ్ముని విడిచిపెడతావు?’’
అప్పుడు సర్పము ఇలా చెప్పింది - ‘‘్ధర్మరాజా! నేను నీ పూర్వీకుడనైన నహుషుడు అనే రాజును. ఆయువు కుమారుడను. వేదాధ్యయనం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞాలు చేయటం - ఈ మూడింటివలన నాకు త్రిలోకాధిపత్యం లభించింది. ఆ ఆధిపత్యంవల్ల నాలో గర్వం పెరిగి వేయి మంది బ్రాహ్మణుల చేత నా పల్లకీ మోయించాను. ఐశ్వర్యమదంతో నేను వారిని అవమానించగా మహర్షి అయిన అగస్త్యుడి శాపంచేత ఇలా అయ్యాను కాని నా జ్ఞాపకశక్తి పోలేదు. ఈ రోజు నీ తమ్ముడు నా ఆహారమైనాడు. నేను వేసే ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెపితే అతన్ని విడిచిపెడ్తాను’’.
దానికి ధర్మరాజు ‘‘సర్పరాజమా! నీ ప్రశ్నలకు నేను సమాధానాలు ఇస్తాను’’ అని పలికెను.
అప్పుడు వారిరువురి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది.
పాము: బ్రాహ్మణుడు ఎవరు? తెలియదగినది ఏది?
ధర్మరాజు: నాగేంద్రా! ఎవనియందు సత్యం, దానగుణం, అకౄరత సత్ప్రవర్తన, తపస్సు, దయ ఉంటాయో అతనినే బ్రాహ్మణునిగా చెప్పవచ్చును.
ఇక తెలియదగినది పరబ్రహ్మము. అది సుఖదుఃఖాకతీమైనది. దాన్ని తెలుసుకుంటే శోకాన్ని జయిస్తాడు.
సర్పము: యుధిష్ఠిరా! నాలుగు వర్ణాలవారికి సత్యం, వేదం, భూతం మేలు చేసేవే. శూద్రులయందు సత్యదానగుణాలు లేకపోవడం, కోపం, క్రూరస్వభావం, హింసా ప్రవృత్తి లేకపోవడం ఉన్నాయి. దయ కలిగి ఉండేవారు కలరు. సుఖదుఃఖాలకు అతీతమైనది తెలియవలసిన తత్త్వమని చెప్పావు. ఈ రెండు లేని మరొక వస్తువు ఉన్నట్లు నాకు తెలియదు.’’
అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా బదులు ఇచ్చాడు.
‘‘పైన చెప్పిన సత్యం, దానం మొదలైనవి శూద్రునిలో ఉండి బ్రాహ్మణునిలో లేనిచో శూద్రుడు శూద్రుడు కాడు బ్రాహ్మణుడు. సత్యం మొదలైనవి ఎవరియందు ఉంటాయో అతనే బ్రాహ్మణుడు. ఆ గుణములు లేనివానిని శూద్రుడనవలెను. సుఖదుఃఖాలు లేని తత్త్వమే లేదు. వాటికి అతీతమైన స్థానముందని నేను భావిస్తున్నాను’’.
పాము మరల అంది - ‘‘రాజా! ప్రవర్తన చేత బ్రాహ్మణుని నిర్ణయించాలని నీవు చెప్తున్నావు. అప్పుడు ప్రవర్తించనంతవరకు జాతి వ్యర్థమగును’’.
ధర్మరాజు ఇలా అన్నాడు - ‘‘మానవులు అన్ని జాతుల స్ర్తీలయందు సంతానము కనుచున్నారు కనుక వర్ణ సాకర్యంవల్ల జాతిని నిర్ధారించటం కష్టము. దాంపత్యం, పుట్టుక, చావు అందరికీ సమానం. ‘యజ్ఞం చేయుచున్న వారమని’ వేదం జాతిని చెప్తున్నది. కనుక ప్రవర్తన ప్రధానం అని తత్త్వవేత్తలు అంటారు. కనుక వేదోక్త సంస్కారముతోపాటు సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడే బ్రాహ్మణుడవును’’.
పాము మరల అన్నది - ‘‘నీ మాటల ద్వారా తెలియవలసినది తెలిసినది. నీ తమ్ముని నేనెలా తినగలను?’’
యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు - ‘‘నీకు సకల శాస్త్రాలు తెలుసు. నీకు ఉత్తమస్థితి ఎలా కలుగునో చెప్పు.’’
పాము అతని మాటలకు ఇలా అంది - ‘‘తగినవాడికి దానంచేయటం, సత్యం పలకటం, ప్రియం పలకటం, అహింసా ధర్మాన్ని పాటించినవాడు స్వర్గాన్ని చేరును’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి