డైలీ సీరియల్

అన్వేషణ -40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిరుధ్‌కి ఆ క్షణం. ఇంటికెళ్లగానే హిమజకి ఫోన్ చెయ్యాలనుకున్నాడు.
***
ఎందుకోగానీ ఆ రాత్రి అనిరుధ్‌కి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు. ఏవో ఆలోచనలు మనస్సంతా గందరగోళపరిచాయి. డిఎన్‌ఎ టెస్టులో ఎలాంటి ఫలితం వస్తుంది? నారాయణ తనకి జన్మనిచ్చినవాడవుతాడా? అయితే వాడినేం చెయ్యాలి? చెడామడా తిట్టెయ్యాలా? వాడు కాకపోతే ఇక మిగిలింది ఇద్దరిలో ఎవడో ఒకడు కచ్చితంగా అవుతాడు.. థామస్.. కనకారావు.. వాళ్లెలాంటి వాళ్లు?.. వాళ్లనీ గురుమూర్తి తిట్టాడు నీతిలేని వెధవలని... నీతిలేని వెధవలు కనకనే ఆ నీచమైన పనిచేశాడు. నీతిమంతులైతే అలా ఎందుకు ప్రవర్తిస్తారు? తనలాంటి వాళ్లకి ఇలాంటి దుస్థితి ఎందుకు కలుగుతుంది?.. అలా అతడి ఆలోచనలు సాగాయి.. తెల్లవారు జామున ఎప్పుడో నిద్రపట్టింది.
బాగా పొద్దెక్కాక నిద్రలేచాడు అనిరుధ్. గత రాత్రి ఏ అర్థరాత్రికో ఇంటికొచ్చిన మనవడిని ఆమె ఉదయం నిద్ర లేపలేదు, వాడే లేస్తాడులే అని.
‘‘రాత్రి ఎన్నింటికొచ్చావురా అనిరూదూ?’’ అడిగిందామె మనవడికి కాఫీ ఇస్తూ.
‘‘అర్థరాత్రయ్యిందే అమ్మ మ్మా..’’ అన్నాడు.
‘‘నిన్న మీ మామయ్య వచ్చాడురా.. అదే సాయి గురించి అడగడానికి.. అనిరుదుకు చెప్పావా అనడిగాడు.. చెప్పాను.. వాడిప్పుడే పెళ్లి చేసుకోడట్రా అన్నాను.. పోనీ ఎప్పుడు చేసుకుంటాడో చెప్పు.. ఆగుతాను.. అన్నాడు.. ఏం చెప్పాలో నాకు తోచలేదురా.. వాడికోసం చూడొద్దన్నాడని చెప్పేశాను..’’ చెప్పిందామె.
‘‘ఏమన్నాడు మామయ్య?’’
‘‘కోపం వచ్చిందిరా మీ మామయ్యకి... ఏం నా కూతురు అందంగా లేదా?.. లేక నేనిచ్చే కట్నకానుకలు చాలవా.. పోనీ వాడికి ఏం కావాలో, ఎంత కావాలో చెప్పమను.. అన్నాడు.. నేనేం చెప్పను?,.. అవేం కాదురా.. వాడికిప్పుడు పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదుట.. అన్నానురా.. కోపంలో లేచి విసవిసా వెళ్లిపోయాడు’’ అమ్మమ్మ చెప్పింది.
అనిరుధ్ ఏమీ మాట్లడలేదు చాలాసేపు.. విని ఊరుకున్నాడు. ఇంక హిమజ గురించి అమ్మమ్మకి చెప్పకుండా తాత్సారం చెయ్యడం మంచిదికాదనుకున్నాడు.
‘‘అమ్మమ్మా!.. సాయిరమ్య అందంగా ఉండదనీ కాదు.. లేక మామయ్య ఇచ్చే కట్నకానుకలు చాలకా కాదు.. అసలు నాకు కట్నకానుకలతో సంబంధం లేదమ్మమ్మా.. హైదరాబాద్‌లో నేనో అమ్మాయిని ఇష్టపడ్డాను.. ఆమె చాలా మంచిది.. నేనంటే ఆమెకూ చాలా ఇష్టం.. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను.. ఈలోగా నీకు బాగులేదని కబురొస్తే వచ్చాను.. ఆ సందర్భంలో చెప్పడం బాగుండదని చెప్పలేదు.
అప్పుడే నువ్వు మా అమ్మ గురించి, జరిగిన దారుణం గురించీ చెప్పావు.. అమ్మని పాడుచేసిన ఆ నలుగురిలో నాకు నాన్న ఎవడు అవుతాడో తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చాను.. ప్రస్తుతం నేను ఆ పనిమీదనే ఉన్నాను అమ్మమ్మా.. ఈ విషయం ఎవరికీ చెప్పకు.. నేను హైదరాబాద్‌లో ఇష్టపడ్డ అమ్మాయి పేరు హిమజ! ఇదిగో ఆమె ఫొటో..’’ అంటూ తన మొబైల్‌లో వున్న ఫొటో చూపించాడు అనిరుధ్.
ఆమె ఆత్రంగా మనవడు చూపించిన ఫొటో చూసింది. ఒకటికి నాలుగుసార్లు చూసింది. ఫొటోని జూమ్ చేసి కూడా చూపించాడు అనిరుధ్.
‘‘పిల్ల లక్షణంగా ఉందిరా అనిరూదూ! సాయికన్నా బావుంది..’’
‘‘ఆమె కూడా అక్కడ ఉద్యోగం చేస్తోంది అమ్మమ్మా.. చాలామంచి అమ్మాయి. చక్కగా మాట్లాడుతుంది. పద్ధతులూ అవీ తెలిసి ఉన్న అమ్మాయి.. పైగా ఆమెకు నా గురించి అన్నీ తెలుసు.. నేనే ఏమీ దాచకుండా చెప్పాను.. అయినా ఆమె నన్ను ఇష్టపడుతోంది’’ అంటూ ఆమె గురించిన వివరాలు పూర్తిగా చెప్పాడు అనిరుధ్. ఆమె సంతోషించింది.
‘‘అమ్మమ్మా.. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు.. సాయిరమ్యని నేను చేసుకోకపోతే నువ్వు ఏమీ అనుకోవుగా?’’ అనడిగాడు ఆమెకేసి చూస్తూ.
‘‘్ఛఛ! అదేం లేదురా.. మొదట్నుంచీ మామయ్యా, అత్తమ్మా నీ పట్ల అభిమానంగా వుంటే అపుడు బాధపడేదాన్ని.. కానీ, వాళ్లు నీ విషయంలోనే కాదు, నా విషయంలో కూడా ఏ మాత్రం ప్రేమాభిమానాలు లేకుండా ప్రవర్తించారు.. మీ మామయ్య నాకు కొడుకే.. కానీ వాడికి నేను తల్లినన్న ఇంగితజ్ఞానం లేదురా.. కన్న ప్రేగు కాస్త కలుక్కుమన్నా వాడు చేసిన పనికి అభిమానం చచ్చిపోయిందిరా.. సాయిని నువ్వు చేసుకోనన్నావని నేనేమనుకోను... నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోరా అనిరూదూ!.. ఒకవేళ మీ మామయ్యకి నువ్వు అల్లుడివైనా వాళ్లు నిన్ను గౌరవంగా చూస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇపుడు సాయికోసం వాళ్లు నీ పట్ల ఈ అభిమానాలు చూపిస్తున్నారుగానీ, ఇంతకుముందెప్పుడైనా మనం వాళ్లకి జ్ఞాపకం వచ్చామా? ఈ కూరలు ఇవ్వడాలు, ఈ స్వీట్లు ఇవ్వడాలూ అప్పుడెందుకు లేవు.. వాళ్లకి నిలువెల్లా స్వార్థంరా. మీ తాత ఆస్తి ఉన్న ఒక్క పెంకుటిల్లూ తన పేర రాస్తేకానీ నన్నూ, మీ అమ్మని చూడనన్నాడు మీ మామయ్య. రాసిచ్చేశాను.. ఏం చేశాడు? మీ అమ్మ చనిపోయింది నిన్ను కనేసి.. మరి నన్నూ, నిన్నూ వాడు చూడాలి కదా?.. చూశాడా... నిన్ను.. నిన్ను.. ఛ! నిష్టదరిద్రుడు.. వద్దురా. ఆ సంబంధం మనకొద్దు.. నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోరా అనిరూదూ...’’ ఆమె సంతోషంగా దగ్గరకొచ్చి మనవడి తల నిమిరింది.
‘‘మరి నువ్వు నా దగ్గరకొస్తేనే పెళ్లిచేసుకుంటాను..’’ అన్నాడు ఆమె చేతులు పట్టుకుని.
‘‘పిచ్చిసన్నాసి.. నేనెందుకురా.. మీరిద్దరూ హాయిగా ఉండండి..’’ అన్నది.
‘‘అయితే నేను చేసుకోనే అమ్మమ్మా.. ’’ బుంగమూతి పెట్టాడు అనిరుధ్.
‘‘అలాక్కాదుగానీ.. వస్తాను.. కొన్నాళ్లుండి వచ్చేస్తాను.. మళ్లీ వస్తుంటాను..’’ అననునయించిందామె.
సరే అన్నట్లు తలూపాడు అనిరుధ్. ఆ మాత్రమేనా అమ్మమ్మ అక్కడనుంచి కదిలితే చాలనుకున్నాడు.
‘‘మరి నాకు అమ్మాయిని ఎపుడు చూపిస్తావురా..’’ అనడిగిందామె.
‘‘తొందరలోనే చూసిస్తానే..’’ అన్నాడు సంతోషంతో. హిమజ విషయంలో ఆమె అంత చప్పున ఆనందంగా ఒప్పుకుంటుందని అనుకోలేదు. అనిరుధ్. మామ కూతుర్ని చేసుకుంటే బాగుంటుందేమోరా అని సలహా ఇస్తుందనుకున్నాడు. కానీ ఆమె కరాకండీగా ఆ సంబంధం వద్దేవద్దని చెప్పడం అతడికి ఆశ్చర్యంగానూ అనిపించింది, సంతోషంగానూ అనిపించింది. అరగంట పోయాక హిమజకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు.
‘‘అవునా!?.. నా ఫొటో కూడా చూసిందా అమ్మమ్మ? సో వాట్ నెక్స్‌ట్ అనిర్?..’’ అనడిగిందామె కవ్వింపుగా కిసుక్కున నవ్వి.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842