డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం ఉత్తంకుడు అనే మహాముని ఉండేవాడు. ఆయన విష్ణువు అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ ముని ఎన్నో విధాలుగా విష్ణువును స్తుతించాడు. అతని స్తోత్రాలతో సంతుష్టి చెంది వరాన్ని కోరుకొమ్మన్నాడు విష్ణువు. అప్పుడు ఉత్తంకుడిలా అన్నాడు. ‘‘శ్రీహరీ! నీవు ఈ సకల జగత్తుకు సృష్టికర్తవు. నీ దర్శనమే నాకు గొప్ప వరం. నాకిది చాలు’’.
కాని విష్ణువు అంగీకరించక తప్పక వరం పొందాలని చెప్పాడు.
అప్పుడు ఉత్తంకుడు ఇలా వరం కోరుకొన్నాడు. ‘‘స్వామీ! నీకు నాపై అనుగ్రహం ఉంటే నాకు నిత్యమూ ధర్మంపై, సత్యంపై, దమంపై బుద్ధి నిలిచేటట్లు చేయి. నిన్ను స్మరించుటయే నాకు కావలసి వరం’’.
ఉత్తంకుడు కోరుకున్న వరాన్ని విని మహావిష్ణువు మహా సంతృప్తుడయ్యాడు.
విష్ణువు ఇలా అన్నాడు ‘‘నా అనుగ్రహం వలన నీవు కోరినదంతా లభిస్తుంది. ఇంకా యోగవిద్య కూడా లభిస్తుంది. ఆ విద్యతో నీవు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. ధుంధువనే రాక్షసుడు ఈ లోకాలను నాశనం చేయాలని ఘోర తపస్సు చేస్తున్నాడు. అతనిని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలాశవుడు నీ ఆదేశం ప్రకారం నీ యోగబలాన్ని ఆశ్రయించి ఆ ధుంధువుని చంపి ధుంధు మారుడవుతాడు’’.
ఇక్ష్వాకు వంశంలో బృహదశయుడు అనే రాజు ఉండేవాడు. అతడు మహాబలుడు. అతని కొడుకు కువలాశవుడు. మహావీరుడు. అతనికి ఇరవై ఒక్క వేలమంది కుమారులు. వారు కూడా గొప్ప పరాక్రమవంతులు. కువలాశవుడు ధార్మికుడు, శత్రుంజయుడు. బృహదశవుడు కుమారునికి రాజ్యాభిషేకం చేసి తపస్సు కోసం అరణ్యానికి వెళ్లడానికి సిద్ధమగుతున్నాడు.
ఉత్తంకునికి ఈ వార్త తెలిసి బృహదశవుని దగ్గరకు వెళ్లి అతన్ని ఆపి ఇలా అన్నాడు ‘‘ఓ రాజా! ప్రజలను కాపాడడం నీ కర్తవ్యం. నీవు అలా చేస్తే ఈ భూమి సురక్షితంగా ఉంటుంది. కనుక బాధ్యతను విడిచి నీవు అరణ్యానికి వెళ్లరాదు. ప్రజాపాలనే రాజులకు గొప్ప ధర్మం. ఈ ధర్మం అరణ్యవాసంలో లేదు. కనుక నీవు ప్రజారక్షణ కోసం దానవుని సంహరించాలి. వాని పేరు ధుంధుడు నా ఆశ్రమ సమీపంలో ఇసుకతో నిండిన సముద్రముంది. ఈ ధుంధుడు మధుకైటభుల పుత్రుడు. అతను ఈ లోకాలను నాశనం చేయాలని తపస్సు చేస్తున్నాడు.
అతన్ని దేవతలు, దైత్యులు, రాక్షసులు, నాగులు, యక్షులు, గంధర్వులు చంపలేరు. అటువంటి వరం కలిగి ఉన్నాడు. కనుక అతన్ని చంపి శుభం పొందు. అంతేకాని వనవాసానికి పోవద్దు. ఆ రాక్షసుడు ఇసుక క్రింద నిద్రిస్తూ సంవత్సరానికి ఒకసారి గాలి పీల్చుకుంటాడు. అలా అతను గాలి పీల్చుకొనే సమయంలో పర్వతాలతో, వనాలతో సహ భూమి కంపిస్తుంది. దానివలన లేచిన దుమ్ముని సూర్యుని మార్గాన్ని కప్పివేస్తుంది.
ఈ భూమిపై అలా ఏడు రోజులు కంపిస్తుంది. అప్పుడు నిప్పురవ్వలు మంటలతో వాతావరణం భయంకరంగా ఉంటుంది. కనుక ఆ రాక్షసునితో పోరాడి వధించి ప్రజలను కాపాడు. అతన్ని చంపడానికి విష్ణువు తన తేజస్సును నీ తేజస్సుతో కలిపి వృద్ధి చేయును. ఆ విధంగా విష్ణువు నాకు వరమిచ్చాడు. కనుక నీవు వైష్ణవతేజాన్ని ధరించి రాక్షస సంహారం చేయి. వైష్ణవశక్తి నీలో ప్రవేశించకపోతే నూరు సంవత్సరాలు పోరాడినా ఆ రాక్షసుని చంపలేవు’’ అన్నాడు.
అప్పుడు బృహదశవుడు మునికి నమస్కరించి ఇలా అన్నాడు. ‘‘బ్రాహ్మణోత్తమా! నీ రాక వ్యర్థం కారాదు. ఇతను నా పుత్రుడు. కువలాశవుడు. గొప్ప పరాక్రమశాలి. ఇతనికి సమర్థులైన కుమారులు కలరు. నేను వనవాసం కోసం అస్తస్రన్యాసం చేశాను. కనుక నా కుమారుడు తన పుత్రులతో కలిసి నీ కార్యం నెరవేరుస్తాడు’’. దీనికి ఉత్తంకుడు ఒప్పుకున్నాడు.
ధుంధువు మధుకైటభుల కొడుకు. అతడు మహా బలవంతుడు. అతడు ఘోర తపస్సు చేశాడు. చాలాకాలం ఒంటికాలిపై నిల్చుని ఆహారం లేకుండా తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ అతను కోరిన వరం అనుగ్రహించాడు. ఆ వరాన్ని పొంది, తన తండ్రి వధకు ప్రతీకారం చేయాలని ముందు విష్ణువు దగ్గరకు వెళ్లాడు. అతను దేవతలను, గంధర్వులను జయించి వరబలంతో విష్ణువును కూడా బాధించసాగాడు. ధుంధువు ఉజ్జాలకమనే ఇసుక సముద్రం దగ్గరకు వచ్చి తన శక్తితో అందరినీ బాధించ సాగాడు. అతను ఇసుక లోపలే ఉండి ఉత్తంకాశ్రమాన్ని బాధించసాగాడు. ఆ ఆశ్రమానికి దగ్గరగా ఇసుకలో శయనించి లోకనాశనం చేయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఆ సమయంలో కువలాశ్వరుడు తన పుత్రులతో సైన్యంతో, ఉత్తంకునితో కలిసి ధుంధువుపై యుద్ధానికి బయలుదేరాడు. విష్ణువు ఉత్తంకునితో చెప్పినట్లుగానే తన తేజస్సును కువలాశ్వనునిలో ప్రవేశపెట్టాడు. దేవదుందుభులు మ్రోగాయి. నేలపై దుమ్ము రేగకుండా ఇంద్రుడు వర్షం కురిపించాడు. ధుంధువు శయనించిన చోటనే దేవతల విమానాలు నిలిచాయి. వారిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి గంధర్వులు మహర్షులు అంతా అక్కడికి వచ్చారు.
కువలాశవుడు తన కుమారులచేత సముద్రాన్ని అన్ని వైపులా త్రవ్వించాడు. వారు ఏడు రోజులు త్రవ్వి ధుంధువుని చూశారు. అతని ఆకారం భయంకరంగా ఉంది. కువలాశవుని పుత్రులు అతనిపై అన్ని వైపులనుంచి దాడి చేశారు. వారు పరిఘలు, కత్తులు, పట్టిశలు అతనిపై విసిరారు. నిద్రిస్తున్న ధుంధువు క్రోధంతో నిద్రలేచి నిప్పులు కక్కుతూ వారు ప్రయోగించిన శస్త్రాలన్నీ మ్రింగి వారిని దహించివేశాడు. తన కుమారులు దహించబడడం చూసిన కువలా శవుడు ఆ రాక్షసుని సమీపించి, తన యోగశక్తితో జలరూపమైన తేజస్సును త్రాగి, బ్రహ్మాస్త్రంతో ఆ రాక్షసుని దహించివేశాడు. ఈ విధంగా కువలాశవుడు ఆ రాక్షసుని సంహరించి ధుంధుమారుడు అని ప్రఖ్యాతి చెందాడు.
దేవతలు, ఋషులు అతన్ని వరం కోరుకోమనగా అతను వినయంగా ఇలా అన్నాడు. ‘‘నేను బ్రాహ్మణశ్రేష్ఠులకు ధనాన్ని దానమివ్వ గలగాలి. శత్రుంజయుడను అవాలి. విష్ణువుతో స్నేహం ఉండాలి. ప్రాణులను దయతో చూడాలి. సదా ధర్మబుద్ధితో ఉండాలి’’. దానికి వారంతా తథాస్తు అన్నారు.
కువలాశ్వుని కోరిక విని ఆహా మనిషి జన్మనెత్తి ఎంత పేరుసంపాదించాడు. తండ్రి తాతల వలన లభించిన సంస్కారబుద్ధితో ఇతను ఇంతగా ఎదిగిపోయాడు. లోకంలో అందరూ వీరి నడవడిని అలవాడు చేసుకోవాలి. స్వార్థాన్ని విడనాడి లోకోపకారం చేయడానికి ముందుకు వస్తేనే మనుషులనిపించు కుంటారు అని అనుకొని అందరూ కువలాశ్వుని కొనియాడారు.
తర్వాత దేవతలు, మునులు తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. ఆ యుద్ధంలో కువలాశ్వరునికి ముగ్గురు పుత్రులు మాత్రమే మిగిలారు. మహాభయంకరుడైన ధుంధుమారుని సంహరించి లోక కల్యాణం చేసినందువలన అప్పటినుంచి ధుంధుమారుడు అని పిలువబడ్డాడు. ఈ కథ ధుంధు మారోపాఖ్యానంగా ప్రసిద్ధి చెందినది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి