డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ... 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిత ప్రవర్తన అంత అనుమానాస్పదంగా ఎందుకుంటుంది? హత్యే అయితే పోస్టుమార్టమ్ రిపోర్టులో సహజ మరణం అని ఎలా వచ్చింది? హత్య చేసినది మనిషా దెయ్యమా? ఇంత కన్ఫూజింగ్ కేసు నేనెప్పుడూ చూడలేదు. ఇపుడు మనకి నిజమెవరు చెబుతారంటారు?’’ తను కూడా నవ్వుతూ అన్నాడు రవీంద్ర.
‘‘గెస్ట్‌హౌస్ వాచ్‌మెన్ తిరుపతయ్య. మనం ఒకసారి లాకప్‌లో ఉన్న అతడితో మాట్లాడాలి’’.
***
వాళ్ళు పోలీస్ స్టేషన్ చేరుకున్న పది నిమిషాల్లో లాకప్‌లో ఉన్న తిరుపతయ్య వాళ్ళ ముందు ఉన్నాడు. ‘‘నమస్కారం బాబయ్యా’’ అన్నాడు తిరుపతయ్య పాణిని చూడగానే.
అతడి తరఫున బెయిల్ కోసం ప్రయత్నించేవాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో, జరిగినదాన్ని చూసి సమాచారం ఇచ్చిన పాపానికి అతడు ఇంకా లాకప్‌లోనే మగ్గుతున్నాడు. అతడ్ని చూడగానే మళ్లీ ‘ఉరుము మంగలం’ సామెత గుర్తుకు వచ్చింది పాణికి. ‘‘తిరుపతయ్యా, నేను అడిగిన కొన్ని ప్రశ్నలకి బాగా గుర్తుతెచ్చుకుని సమాధానం చెప్పాలి’’ అన్నాడు.
‘‘అడగండి బాబయ్యా’’
‘‘గెస్ట్‌హౌస్‌కి భరణి లేకుండా కూడా కొంతమంది స్నేహితులు అప్పుడప్పుడూ వచ్చి వెడుతూ ఉంటారన్నావు కదా?’’
‘‘అవునండీ. తన స్నేహితులు ఎవరొచ్చినా ఎపుడొచ్చినా అడ్డు చెప్పద్దని భరణి బాబుగారి ఆర్డర్’’
‘‘ఈమధ్యకాలంలో గెస్టుహౌస్‌కి వచ్చిన భరణి స్నేహితులు ఎవరెవరో గుర్తుతెచ్చుకుని చెప్పగలవా?’’
తిరుపతయ్య తల గోక్కున్నాడు. ‘‘చాలామందే వస్తూ ఉంటారయ్యా. ఇలా అడిగితే చెప్పడం కష్టం’’ అన్నాడు.
‘‘మరేం ఫరవాలేదు. జాగ్రత్తగా గుర్తుతెచ్చుకుని నీకు గుర్తున్నవాళ్ల పేర్లు చెప్పు’’
‘‘శ్రీనుగారూ రాజుగారూ నాలుగైదుసార్లు ఎవరెవరో అమ్మాయిలని తీసుకుని వచ్చేరయ్యా’’ అన్నాడు తిరుపతయ్య.
‘‘సూర్య ఎప్పుడైనా వచ్చాడా?’’ రవీంద్ర అడిగాడు.
‘‘సూర్యగారు ఇదివరకూ భరణి బాబుగారితో కలిసి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. కానీ ఈమధ్యకాలంలో ఆయన ఎప్పుడూ గెస్ట్‌హౌస్‌కి రాలేదు’’.
‘‘ఇంకా ఎవరు వచ్చారు? బాగా గుర్తుచేసుకుని చెప్పు’’.
‘‘సుందరంగారు ఒకసారి నలుగురైదుగురు స్నేహితులతో వచ్చి రాత్రంతా ఉన్నారు.
వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు’’.
పాణి మనసంతా చేదుగా అయిపోయింది అతడి మాటలకి. ఇద్దరు అమ్మాయిలని తీసుకుని నలుగురు అబ్బాయిలు అదీ చదువుకునే అబ్బాయిలు గెస్ట్‌హౌస్‌లో రాత్రంతా గడిపి స్వేచ్ఛగా వెళ్లిపోయారు. ఎక్కడికి పోతున్నాం మనం?!
‘‘నేనడిగేది రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళ సంగతి కాదు. ఎప్పుడూ పెద్దగా రాని వాళ్ళెవరైనా ఈమధ్యన గెస్ట్‌హౌస్‌కి వచ్చేరా? ఎవరి ప్రవర్తన అయినా అనుమానాస్పదంగా నీకు అనిపించిందా?’’ అన్నాడు పాణి.
తిరుపతయ్య బుర్ర గోక్కుంటూ బాగా ఆలోచించి కొద్దిసేపటి తరువాత అన్నాడు. ‘‘గుర్తొచ్చింది బాబయ్యా. ఆమధ్యన ఒకసారి రాజేష్ గారు గెస్ట్‌హౌస్‌కి వచ్చి రెండు గంటలు గడిపి వెళ్ళారు. ఆయన భరణిగారి ఫ్రెండ్. చాలా రోజుల క్రితం భరణి
గారితో వచ్చేవారు. చాలా బాగా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో ఆయన ఇటువైపు రాలేదు. మొన్నొకరోజు సడెన్‌గా వచ్చి నా దగ్గర తాళం తీసుకుని ఒక రెండు గంటలు గెస్ట్‌హౌస్‌లో ఉండి వెళ్ళారు.
సాధారణంగా గెస్ట్‌హౌస్‌కి వచ్చేవాళ్ళు అమ్మాయిలతోపాటే వస్తారు. లేదా స్నేహితులతో మందు పార్టీలకి వస్తారు. ఈయనేంటిలా ఒక్కళ్ళే వచ్చారు అనుకున్నాను నేను ఆ రోజు. అది బాగా గుర్తుంది’’.
పాణి కళ్ళు మెరిసాయి ఆ మాటలకి. ‘‘అతడు సరిగ్గా ఏ రోజు వచ్చాడో చెప్పగలవా?’’ అన్నాడు.
‘‘పదిహేను రోజుల క్రితం అనుకుంటానయ్యా. ఆ రోజు గురువారం’’ అన్నాడు తిరుపతయ్య.
‘‘్థంక్స్ తిరుపతయ్య. నువ్విక వెళ్లచ్చు’’ అన్నాడు పాణి.
‘‘అయ్యా- నాకే పాపమూ తెలియదు. నన్ను వదిలిపెట్టమని చెప్పండయ్యా. మీరు చెబితే వాళ్లు వింటారు’’ రవీంద్రని చూపిస్తూ అన్నాడు తిరుపతయ్య పాణితో.
‘‘నిన్ను త్వరలో వదిలేస్తారులే తిరుపతయ్య’’ అన్నాడు పాణి అతడికి అభయమిస్తున్నట్టుగా. అతడిని ఒక కానిస్టేబుల్ తిరిగి తీసుకెళ్లిపోయాడు.
‘‘రాజేష్ అంటే ఎవరు?’’ తిరుపతయ్య వెళ్లిపోయాక రవీంద్ర అడిగాడు పాణిని.
‘‘చనిపోయిన సంధ్య మాజీ ప్రియుడు!’’ చెప్పాడు పాణి.
‘‘అతడికీ ఈ కేసుకీ సంబంధం ఏమిటి? అతడు గెస్ట్‌హౌస్‌కి ఎందుకు వెళ్లినట్టు?’’
‘‘సంధ్య ఆత్మతో మాట్లాడడానికి వెళ్లి ఉండచ్చు’’ చిన్నగా నవ్వాడు పాణి. ‘‘నా అనుమానం నిజమైతే అతడు తిరుపతయ్యకి తెలియకుండా ఇంకా చాలాసార్లు గెస్ట్‌హౌస్‌కి వెళ్లి ఉండాలి.
అతడి ద్వారానే మనకి ఈ కేసుని నిరూపించగలిగే సాక్ష్యాధారాలు లభిస్తాయి. నాకు మీ డిపార్టుమెంటు నుంచి కొంతమంది మనుషులు కావాలి’’.
‘‘దేనికి?’’’
‘‘చార్మినార్ దగ్గరా, పాతబస్తీలోనూ మారు తాళం చెవులు తయారుచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక తాళం చెవి అచ్చుని మైనం మీద అద్ది తీసుకువెడితే అచ్చం అలాంటి తాళం చెవులు తయారుచేయడంలో వాళ్ళు దిట్టలు. వాళ్ల దగ్గరకి రాజేష్ వెళ్ళేడేమో కనుక్కోవాలి. అది మనకి మొదటి సాక్ష్యం. మామూలు మనుషులు వెళ్లి అడిగితే వాళ్ళు నిజం చెప్పరు. అందుకే మీ డిపార్టుమెంటు వాళ్ళే వెళ్లాలి’’ అన్నాడు పాణి.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ