డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయం పోయిన ద్రౌపది నర్తనశాల కాపలావాళ్లను పిలిచి ఇలా అంది. ‘‘రండి, చూడండి! పరస్ర్తీని కామించిన ఈ కీచకుడిని నా పతులైన గంధర్వులు ఏమి చేశారో చూడండి! ఇక్కడ చచ్చి పడి ఉన్నాడు’’.
కాపలావాళ్ళు వెంటనే లోపలికి కాగడాలతో వచ్చి అక్కడ చచ్చి మాంసం ముద్దగా పడిఉన్న కీచకుడిని చూశారు. అతని స్థితిని చూసి వారు గంధర్వులే ఈ పని చేశారని నిశ్చయానికి వచ్చారు.
కీచకుని మరణవార్త విన్న బంధువులంతా రోదిస్తూ అక్కడికి వచ్చారు. మాంసం ముద్దలా ఉన్న అతణ్ణి చూసి భయభ్రాంతులయ్యారు. అతన్ని బయటకు తీసుకొని వస్తుండగా అతని సోదరులు అక్కడికి వచ్చారు. వారు దగ్గరలో నిలుచున్న ద్రౌపదిని చూసి కోపంతో ఇలా అనుకున్నారు.
‘‘ఈ దుష్టురాలైన సైరంధ్రి వల్లనే కీచకుడు మరణించాడు. కనుక ఈమెను కూడా కీచకునితో పాటు తగలబెట్టాలి. అప్పుడు కీచకుని ఆత్మ శాంతిస్తుంది’’. వారు విరాటరాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తన అన్నతోపాటు దహనం చేయడానికి అనుజ్ఞ కోరారు.
రాజుకు వారి పరాక్రమం తెలుసు కాబట్టి అనుమతి ఇచ్చాడు. అప్పుడు వారు ద్రౌపదిని పట్టుకొని శవంతో కలిపి త్రాళ్లతో కట్టి పాడెపై ఎక్కించారు. వారు ఇలా లాక్కుని పోతూ ఉంటే ద్రౌపది రోదించసాగింది. ఇలా వారిని పిలిచింది. ‘‘జయా, జయంతా, విజయా, జయత్సేనా, జయద్బలా! నా మొర వినండి.
ఈ సూతపుత్రులు నన్ను తోసుకొని పోతున్నారు. నన్ను రక్షించండి’’. భీముడు ఆ మాటలు విని వెంటనే లేచి తన శరీరం పెంచి వేషం మార్చుకున్నాడు. పాకశాల నుండి బయటకు వచ్చి ఉపకీచకుల కంటే ముందే శ్మశానం చేరుకున్నాడు.
దగ్గరలో ఉన్న తాడిచెట్టును పెకలించి పట్టుకొని ఉపకీచకులవైపు యముడిలా పరుగెత్తాడు. అతణ్ణి చూసి వారంతా భయంతో వణికిపోయారు.
వారు సైరంధ్రిని విడిచిపెట్టారు. అన్ని వైపులా పరుగెత్తారు. కాని భీముడు వారిని తరిమి తరిమి చంపాడు. తర్వాత అతను ద్రౌపదిని ఓదారుస్తూ ఇలా అన్నాడు.
‘‘ఏ పాపమూ ఎరుగని నిన్ను హింసించినవారు ఇలాగే మరణిస్తారు. ఇక నీవు ధైర్యంగా నగరానికి వెళ్లు’’ ఈ విధంగా కీచకునితో కలిపి నూట ఆరుగురు (ఉప) కీచకులు దిక్కుమాలిన చావు చచ్చారు. నగరంలో జనమంతా రాజు దగ్గరికి వెళ్లి ఈ వార్త చెప్పారు. ‘‘కీచకులంతా నేలపై పడి ఉన్నారు.
సైరంధ్రి నగరానికి తిరిగి వస్తున్నది. ఆమె వస్తే ఈ నగరము, ప్రజలు ఉంటారా? ఆమె ఎంత అందగత్తో ఆమె భర్తలు అంత బలవంతులు. ఆమెవల్ల ఈ నగరం నశించకుండా చూడండి’’.
రాజు భయంతో రాణి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు.
‘‘దేవీ! సైరంధ్రి ఇక్కడకు వస్తే నా మాటగా ఆమెకు చెప్పు ‘సైరంధ్రీ! నీకు శుభం కలుగుతుంది. నీ ఇష్టమైన చోటికి వెళ్లిపో. గంధర్వులు నిన్ను రక్షిస్తున్నారు. నీతో నేను మాట్లాడరాదు. అందుకని నా భార్య ద్వారా నీకు చెప్తున్నాను’ అని చెప్పుము’’ అన్నాడు.
ద్రౌపది మెల్లగా నగరం చేరి నీటిలో స్నానం చేసి బట్టలు శుభ్రం చేసుకొంది. ఆమెను చూసి భయపడి జనం అన్నివైపులా పరుగులు పెట్టారు.
పాకశాల దగ్గర భీముడు నిలిచి ఉన్నాడు. ఆమె అతనికి నమస్కరించి నర్తనశాలకు వెళ్లి కన్యలకు నాట్యం నేర్పుతున్న అర్జునుని చూసింది.
కన్యలు ఆమెతో ఇలా అన్నారు. ‘‘సైరంధ్రీ! నీవు అదృష్టం వల్ల బయటపడ్డావు. నిన్ను కష్టపెట్టిన ఆ కీచకుడూ అతని సోదరులూ మరణించారు.’’
అప్పుడు బృహన్నల ఇలా అడిగాడు. ‘‘సైరంధ్రీ! ఈ కష్టం నించి నీవు ఎలా బయటపడ్డావు? ఆ విషయం గురించి చెప్పు’’
ద్రౌపది అతనితో ఇలా అంది. ‘‘బృహన్నలా! నీకు నా కష్టాలతో ఏం పని? అంతఃపురంలో సుఖంగా ఉన్నావు కదా! నాలాంటివారు పడే కష్టాలు నీకెలా అర్థం అవుతాయి?’’
అది విని బృహన్నల ఇలా అన్నాడు ‘‘నాది నీచపు పుట్టుక కనుక ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. కనుక బాధపడ్తున్నాను’’.
ద్రౌపది తర్వాత అంతఃపురానికి వెళ్లింది. సుధేష్ణ ఆమెను చూసి రాజు మాటలుగా ఇలా చెప్పింది.
‘‘సైరంధ్రీ! నీవు వెంటనే నీకు నచ్చిన చోటికి వెళ్లిపో. రాజు తనను గంధర్వులేమి చేస్తారో అని భయభీతితో ఉన్నాడు. నీవు సౌందర్యరాశివి. పురుషులు నిన్ను మోహించడం సహజం. గంధర్వులకు కోపం ఎక్కువ’’. సైరంధ్రి ఆమెతో ఇలా అంది. ‘‘రాణీ! ఇక పదమూడు రోజులు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. దానికి అనుమతి ఇవ్వు. తర్వాత గంధర్వులు నన్ను తీసుకుపోతారు. నిన్నూ, రాజునూ, అందరినీ క్షేమంగా ఉంచుతారు. భయపడకు’’.
సోదరుల మరణంతో దుఃఖం పొందిన సుధేష్ణ ద్రౌపదితో మరల ఇలా అంది. ‘‘పూజ్యురాలా! నీకు ఇష్టమైనంతకాలం ఉండు. నిన్ను శరణు వేడుతున్నాను. నా భర్తను, పిల్లలను రక్షించు’’.
అజ్ఞాతవాసం అనంతరం విరాజరాజు దగ్గర సంవత్సరకాలం గడిపినందుకు కృతజ్ఞతగా పాండవులు విరాటుని కూతురు ఉత్తరను అర్జునుని పుత్రుడైన అభిమన్యునికి భార్యగా చేసుకొని ఆమెను పాండవులకు కోడలిగా తెచ్చుకున్నారు. ఆమెకు పుట్టినవాడే భరతవంశాన్ని నిలిపాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి