డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలకు అధిపతి అయిన దేవేంద్రునికి మాతలి రథసారథి. ఆయన కుమార్తె లోకోత్తర సౌందర్యవతి. ఆమె పేరు గుణకేశ. ఆమెకు యుక్తవయస్సు వచ్చాక మాతలి ఆమె వివాహం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అతను ఈ విషయమై భార్యతో చర్చిస్తూ ఇలా అన్నాడు. ‘‘గొప్ప వంశంలో పుట్టిన శీలవతి, సౌందర్యవతి అయిన కన్య మాతృవంశాన్ని, పితృవంశాన్ని అత్త వారింటిలోని సత్పురుషులను సందేహం లో పడవేస్తుంది. నేను మానవలోకంలోను దేవలోకంలోనూ అమ్మాయికి తగిన వరుని కోసం వెతికాను. కాని నాకు ఒక్కరూ నచ్చలేదు’’.
వరుని కోసం రాక్షసులలో, గంధర్వులలో, మహర్షులలో వెతికాడు. కాని అక్కడా అతనికి ఎవరూ నచ్చలేదు. చివరకు భార్య అయిన సుధర్మతో మాట్లాడి నాగలోకానికి వరుని కోసం వెళ్లాలని మాతలి అనుకున్నాడు.
మాతలికి దారిలో నారద మహర్షి కలిశాడు. ఆ సమయంలో నారదుడు వరుణుని దర్శనానికై వెళ్తున్నాడు. నారదుడు మాతలితో అతను ఏ పనిమీద వెళ్తున్నాడో అడిగాడు. మాతలి అతనితో తన కుమార్తె వరునికోసం వెళ్తున్నానని చెప్పగా నారదుడు ఇలా అన్నాడు. ‘‘ఇద్దరం కలిసి వెళ్దాము. నేను కూడా వరుణదర్శనం కోసం వెళ్తున్నాను. నేను నీకు క్రింద లోకాలన్నింటినీ పరిచయం చేస్తాను. నీకు నచ్చిన వరుని చూచి ఎన్నుకోవచ్చును’’.
తర్వాత వారిద్దరూ ముందుగా వరుణుని దర్శనం చేసుకున్నారు. ఇద్దరూ సత్కారాలు పొందారు. వరుణునికి తాము వచ్చిన పని చెప్పారు. నారదునికి నాగలోకంలో అందరి గురించి తెలుసు. అతను వారి గురించి మాతలికి వివరించి చెప్పసాగాడు. అతను మాతలితో ఇలా చెప్పాడు. ‘‘మాతలీ! పుత్రపౌత్రులతో చుట్టుముట్టి ఉన్న వరుణుని చూశావు కదా! ఇది వరుణుని నివాసస్థానం. ఇతను గోపతి అయిన వరుణుని కుమారుడు. శీలం, ప్రవర్తన, పవిత్రత వలన ఈ స్థానాన్ని పొందాడు’’ అని ఇంకొకరిని చూపి ‘‘ఈయన వరుణుని పుత్రుడు. చాలా అందగాడు. పేరు పుష్కరుడు.సోముని కుమార్తె ఇతనిని భర్తగా వరించింది. వరుణునితో పోరాడి ఓడిపోయిన దైత్యుల ఆయుధాలు ఈ భవనంలో ఉన్నాయి.
మహా తేజస్వి అయిన అగ్నిదేవుడు వరుణుని సరోవరంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ అగ్ని విష్ణుమూర్తి సుదర్శనచక్రాన్ని కూడా అడ్డగించాడు. అందుకే ఈ చాపానికి గాండీవమని పేరు. వజ్రాయుధపు కణుపులకు గాండీ అని పేరు. దీన్ని దేవతలు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు. దీనిని వరుణుని కుమారులు ధరిస్తూ ఉంటారు. ఇది కాక వరుణుని ఛత్రం ఉంది. అది మేఘంలాగ ఎప్పుడూ నీరు చిమ్ముతూ ఉంటుంది.
తరువాత వారిరువురూ నాగలోకానికి వెళ్లారు. దానికి మధ్యభాగంలో ఉన్న నగరానికి పాతాళమని పేరు. ఇక్కడ దైత్యులూ, దానవులూ నివసిస్తారు. నీటినే ఆహారంగా స్వీకరించే అసురాగ్నిఇక్కడ ఎప్పుడూ మండుతూ ఉంటుంది. దేవతలు శత్రువులను సంహరించి అమృతాన్ని సేవించి మిగిలిన అమృతాన్ని ఇక్కడ దాచుకున్నారు. అమృతమయమైన సోమం తగ్గినా మరల పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదితి పుత్రుడైన హయగ్రీవ విష్ణువు ఉంటాడు. ఇక్కడ ప్రాణులు పగలు మృతప్రాయులై ఉండి రాత్రి చంద్రకిరణాల స్పర్శ వలన మరల లేస్తారు. భూతనాథుడు ఇక్కడ తపస్సు చేశాడు.
స్వర్గాన్ని జయించిన బ్రాహ్మణులు ఇక్కడ గోవ్రతం చేస్తూ నివసిస్తారు. ఎక్కడ అవకాశముంటే అక్కడ నివసించడం, ఏది దొరికితే అది తినడం, ఎలాంటి వస్త్రాలు లభిస్తే వాటిని ధరించడం ఇది గోవ్రతం. ఇక్కడ గొప్ప గజరాజులు ఐరావతమూ, కుముదమూ మొదలైనవి ఉన్నాయి. నీకు ఇక్కడ ఎవరైనా నచ్చితే నేను పోయి తెస్తాను’’ అని నారదుడు నాగలోకాన్ని వర్ణించాడు. కాని మాతలికి అక్కడ ఎవరూ నచ్చలేదు.
వారిద్దరూ అక్కడినుండి దైత్య దానవులకు స్థానమైన హిరణ్యపురానికి వెళ్లారు. ‘‘అసురుల విశ్వకర్మ అయిన మయుడు ఈ నగరాన్ని నిర్మించాడు. మాయలు తెలిసిన దానవులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వీరిని ఏ దేవతా లొంగదీసుకోలేడు. విష్ణువు పాదాల నుండి పుట్టిన కాలఖంజులనే రాక్షసులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. యుద్ధోన్మాదం కలిగిన నీవాచకవచుల నివాసం ఇదే’’. ఈ విధంగా ఆ నగర విశేషాలు చెప్పి నారదుడు మాతలిని అక్కడ తగిన వరుని వెతుకమన్నాడు.
అక్కడ క్రీడోద్యానాలు, విహార స్థలాలు కూడా ప్రశస్తంగా ఉన్నాయి. మాతలి ఇలా అన్నాడు. ‘‘నేను దేవతలకు నచ్చని పని ఎన్నడూ చేయను. దేవతలకూ, దానవులకూ ఎప్పుడూ శత్రుత్వమే. శత్రుపక్షంతో ఎలా వియ్యమందను? ఇంకొక చోటికి వెళ్దాం. దానవులను చూడడానికి కూడా నేను ఇష్టపడను’’.
తర్వాత వారిద్దరూ గరుడలోకానికి వెళ్లారు. ఆ లోకం గురించి నారదుడు ఇలా చెప్పాడు. ‘‘ఇది పాములను ఆహారంగా తినే గరుడుల లోకం. ఎంత దూరమైనా ఎగరడంలో, ఎంత బరువైనా మోయటంలో వీరిని మించినవారు ఎక్కడా లేరు. గరుత్మంతుని ఆరుగురు పుత్రులు ఇక్కడ తమ వంశాలను విస్తరించి ఉన్నారు. బ్రాహ్మణవంశంలో పుట్టినవీరు క్షత్రియ కర్మలను పాటించేవారు. వేలకొలది సర్పాలను నాశనం చేశారు. సర్పభక్షకులు కనుక వీరికి బ్రాహ్మణత్వం లభించలేదు. వీరిలో ముఖ్యుల గురించి చెప్తాను విను. వీరు విష్ణుసేవలో ఉండడం చేత ప్రాముఖ్యం లభించింది. వీరికి విష్ణువే గతి, పరమాశ్రయం. నాగుశి, దారుణుడు, కుండలి, అనిలుడు, వైనతేయుడు, సుముఖుడు మొదలైన వారు గరుడ ప్రముఖులు. వీరు కాక ఇంకా ఎందరో మహాబలవంతులు ఉన్నారు.
వీరిని చూచి ఎవరైనా నచ్చితే ఎంచుకో. లేకపోతే ఇంకొక లోకానికి పోదాం.’’ మాతలి తనకు అక్కడ ఎవ్వరూ నచ్చలేదని చెప్పాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి