డైలీ సీరియల్

అన్వేషణ -50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఎవరికైనా బ్లడ్ శాంపిల్స్ వగైరా తీసేది ఈమెనే.. ఏదో ముట్టచెబుతామని, కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పాను థామస్‌గాడి విషయంలో’’ ఇవతలకి వచ్చాక కొండబాబుకి చెప్పాడు పరమేశ్వరం.
కొండబాబు కృతజ్ఞతగా చూశాడు పరమేశ్వరంకేసి.
‘‘మీరు మరీ అంత ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వనక్కర్లేదు.. లైట్‌గా తీసుకోండి..’’ నవ్వుతూ అన్నాడు పరమేశ్వరం. కొండబాబు నవ్వేశాడు. ఆ విషయం అనిరుధ్‌కి చెప్పాడు కూడా.
‘‘ఓకె! .. ఈవినింగ్ కలుద్దాం.. ఈలోగా మీరు విశాఖ అందాలు చూడాలనుకుంటే చూసెయ్యండి.. లేదంటే రూములో ముసుగుదన్ని పడుకోండి.. నేను ఆఫీసుకు వెళతాను..’’ చెప్పాడు పరమేశ్వరం సిటీ బస్టాప్ ఎక్కడుందా అని చుట్టూ కలయచూస్తూ.
‘‘మేం మిమ్మల్ని ఆఫీసు దగ్గర ఆటోలో డ్రాప్ చేసి లాడ్జికి వెళతాం..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘అబ్బే.. ఎందుకు.. పది లక్షల ఖరీదు చేసే బస్సులో వెళతాను..’’ పరమేశ్వరం చెప్పాడు.
‘‘రోజూ అలానే వెళుతున్నారుగా. ఇవ్వాళ మాత్రం ఆటోలో వెళ్లండి..’’ కొండబాబు అన్నాడు చనువుగా.
‘‘అంతేకాదు.. మీ బాస్.. అదే మీ త్రాష్ఠుడు ఎలా ఉంటాడో మావాడు చూడాలనుకుంటున్నాడు కూడా..’’ మళ్లీ కొండబాబే చెప్పాడు.
‘‘పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు వాడు.. నల్ల తుమ్మమొద్దులా ఉంటాడు.. బహుశా తుమ్మమొద్దే బావుంటుందేమో..’’ అని సిగరెట్ ముట్టించాడు పరమేశ్వరం.
‘‘మీరు సిగరెట్లు బాగా కాలుస్తారనుకుంటాను..’’ కొండబాబు అడిగాడు.
‘‘రోజూ ఎంత తగలేస్తున్నారని అడగచ్చుగా డైరెక్టుగా..’’ పరమేశ్వరం అన్నాడు గంభీరంగా సిగరెట్ దమ్ము వదులుతూ.
ఆ మాటకి ముగ్గురూ నవ్వుకున్నారు. ఈలోగా ఆటో పిలిచాడు అనిరుధ్. ముగ్గురూ ఎక్కి కూర్చున్నారు. థామస్ ఆఫీసుకు వెళ్లడానికి నలభై నిముషాలుపైనే పట్టింది, ఉదయం పూట ట్రాఫిక్ బాగా ఉండడంవల్ల.
‘‘మా బాస్‌గాడు ఇంకా రాలేదు. పదకొండు గంటలకి వస్తాడు. వాడి రంగులాగానే ఓ నల్లటి మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు వస్తుంది. అందులో దిగుతాడు. వాడిని మీరెలా చూస్తారు?.. ఓ పని చెయ్యండి. ఆఫీసులోపలికి రండి.. అక్కడ ఓ నందివర్థనం చెట్టుంది. దాని నీడన నిల్చోండి. వాడొస్తాడు, సరిగ్గా చూడచ్చు.. ఒకవేళ ఎవరికోసం వచ్చారని వాడు మిమ్మల్ని అడిగితే నాకోసం వచ్చామని చెప్పండి.. హండ్రెడ్ పర్సెంట్ అడగడు. ఎందుకంటే వాడికా సంస్కారం లేదుగనుక.. ఓకె..’’ అని పరమేశ్వరం ఆఫీసులోకి వెళ్లిపోయాడు.
అప్పుడు సమయం పదిన్నరకావస్తూంది. అంటే మరో అరగంట థామస్‌ని చూడ్డానికి ఎదురుచూడాలన్నమాట అనుకున్నారు కొండబాబు, అనిరుధ్. పరమేశ్వరం చెప్పినట్లు ఆఫీసులోపల నందివర్థనం చెట్టునీడలో నిల్చున్నారు. ఆఫీసుకు సెక్యూరిటీ అంటూ ఎవరూ లేరు.
పదకొండు గంటలకు వస్తాడనుకున్నవాడు మరోపావుగంట ఆలస్యంగా వచ్చాడు థామస్. అచ్చం పరమేశ్వరం చెప్పినట్లే తుమ్మమొద్దులా ఉన్నాడు. ‘వీడి డిఎన్‌ఎతో నాది మ్యాచ్ కాకుండా ఉంటే బాగుండును’ అప్రయత్నంగా అనుకున్నాడు అనిరుధ్ మనసులో.
‘‘అచ్చు పరంగారు చెప్పినట్లే ఉన్నాడ్రా.. త్రాష్టుడు..’’ కొండబాబు పైకి అనేశాడు.
ఆఫీసు లోపలికి వెళుతూ చెట్టుక్రింద నిల్చున్న వాళ్ళిద్దర్నీ చూశాడు. మీ మాట్లాడకుండా ఆఫీసులోనికి వెళ్లిపోయాడు. వాడు వెళ్లిన ఐదు నిముషాలకి పరమేశ్వరం బయటికి వచ్చాడు.
‘‘పదండి.. నాకోసం ఎవరో వచ్చారని చెప్పి వచ్చాను.. అలా వెళ్లి టీ తాగుదాం... మీరు వెళ్లిపోదురు గాని..’’ అంటూ దారితీశాడు.
‘‘అవునూ.. ఎలా ఉన్నాడు తుమ్మమొద్దు?’’ ఆ వెంటనే అడిగాడు ఇద్దర్నీ ఉద్దేశించి. సమాధానంగా నవ్వేశారు.
లాడ్జికొచ్చిన ఇద్దరికీ ఏం చెయ్యాలో తోచలేదు. ఓ గంట సేపు టీవీలో ఏదో సినిమా వస్తుంటే చూశారు. మధ్యాహ్నం ఒంటిగంట దాటుతుంటే భోజనం చేసి వచ్చారు. తర్వాత టీవీ చూస్తూనే నిద్రలోకి జారుకున్నారు.
వాళ్లకి మెళకువ వచ్చేసరికి నాలుగున్నర గంటలయ్యింది. ఇద్దరూ ఫ్రెష్షయి బయటికి వెళ్లి టీ తాగి పరమేశ్వరానికి ఫోన్ చేశారు- ఎక్కడ కలవమంటారు అని. ఆరు గంటలకి లాడ్జికి వస్తానన్నాడు పరమేశ్వరం.
‘‘కాస్త ఫ్రెష్షవుతారా?’’ అడిగాడు అనిరుధ్ అతడిని.
‘‘అయామ్ ఆల్వేస్ ఫ్రెష్..’’ అన్నాడు నవ్వుతూ పరమేశ్వరం.
‘‘పదండి ఏదన్నా తిని టీ తాగుదాం..’’ లేస్తూ అన్నాడు కొండబాబు.
‘‘అవును తినాల్సిందే.. ఎందుకో ఈరోజు ఆకలేస్తోంది.. ధారాళంగా ఖర్చుపెట్టే మిమ్మల్ని చూసి కాబోలు..’’ అంటూ సిగరెట్ ముట్టిద్దామనుకుని మళ్లీ ఎందుకో మానేశాడు పరమేశ్వరం. ముగ్గురూ హోటల్‌కెళ్లారు ఆకలి లేకపోయినా తాము వద్దంటే అతడూ వద్దంటాడని. టిఫిన్ తిన్నారు, కాఫీలు తాగారు.
‘‘ఆసుపత్రికి వెళదాం.. ఎందుకంటే థామస్ పనె్నండు గంటలకి బయటికి వెళ్లాడు. డాక్టర్ చెప్పినట్లు ఒకవేళ వాడు బిపి చెకప్‌కి వెళ్లి వుంటే.. మన పని అయినట్లే..’’ చెప్పాడు పరమేశ్వరం.
ముగ్గురూ ఆసుపత్రికి వెళ్లేసరికి వెయిటింగ్ హాల్లో జనం పల్చగానే ఉన్నారు. కొండబాబుని రమ్మని సౌంజ్ఞ చేస్తూ పరమేశ్వరం లాబ్‌లోకి వెళ్లారు. అక్కడ తాను ఉదయం మాట్లాడిన నర్స్ ఉంది. ఇతడిని చూడగానే తలూపుతూ దగ్గరకొచ్చింది. ‘వచ్చాడు... తీశాను..’ అని ఎవరికీ వినపడకుండా పరమేశ్వరానికే వినిపించేట్లు చెప్పి వెళ్లిపోయింది.
కొండబాబుకి బొటనవ్రేలు చూపించాడు పనయినట్లు పరమేశ్వరం. అనిరుధ్‌కి ఆ విషయం చెప్పాడు కొండబాబు. ఆ తర్వాత నర్స్‌కి ఇస్తామన్నది ముట్టజెప్పి డాక్టర్‌ని కలవడానికి కూర్చున్నారు ముగ్గురూ. ఓ అరగంటకి డాక్టర్ మధుకర్‌ని కలిశారు.
‘‘్థమస్ వచ్చాడు బిపి చెకప్‌కి.. అఫ్‌కోర్స్ అతడికి బిపి తగ్గదనుకోండి.. మీరు కోరిన విధంగా శాంపిల్స్ తీయించాను.. మీరు ఎల్లుండి రండి రిపోర్టు వస్తుంది..’’ చెప్పాడు మధుకర్. డాక్టర్‌కి విష్ చేసి వచ్చేశారు బయటికి.
‘‘సో.. ఎల్లుండి మీ పని అయిపోతుంది...’’ పరమేశ్వరం అన్నాడు.
‘‘కాద్సార్.. ఇంకోడు ఉన్నాడు.. వాడి విషయం కూడా తేలాకనే మా పని పూర్తయినట్టు..’’ చెప్పాడు కొండబాబు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842