డైలీ సీరియల్

అన్వేషణ -51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అఫ్‌కోర్స్.. అఫ్‌కోర్స్.. ఒక త్రాష్ఠుడి విషయం అయిపోతుంది అన్నది నా ఉద్దేశ్యం..’’ పరమేశ్వరం నవ్వి అన్నాడు. సిగరెట్ ముట్టించాడు.
‘‘రూముకు వెళదాం..’’ కొండబాబు చెప్పాడు.
‘‘నేను వెళతాను..’’ పరమేశ్వరం అన్నాడు.
‘‘వెళుదురుగాని.. రూముకు రండి.. మీ పని మీరు చేసుకుంటే.. నేను మీకు స్మాల్ కంపెనీ.. బీర్‌తో ఇస్తాను’’ నవ్వి అన్నాడు కొండబాబు.
‘‘అవును.. రండి..’’ అనిరుధ్ చెప్పాడు. సరే అన్నట్లు భుజాలెగరేశాడు పరమేశ్వరం.
ఎల్లుండిదాకా ఆగడం మళ్లీ చికాగ్గా అనిపించింది అనిరుధ్‌కి. థామస్ డిఎన్‌ఎతో తనది మ్యాచ్ అవుతుందా.. ఆ నల్ల తుమ్మమొద్దు తనకి జన్మనిచ్చిన వాడవుతాడా? పరమేశ్వరం అన్నట్లు వాడు తనకి ఏమీ కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది అని చాలాసార్లు అనుకున్నాడు అనిరుధ్.
కానీ పెద్దలన్నట్లు జరిగేదేదో జరగక మానదు.. అనుకున్నాడు. ఇద్దరు తనకి ఏమీ కాకుండా తప్పిపోయారు. మూడోవాడి భవితవ్యం ఎల్లుండి తేలుతుంది. వాడు కూడా కాకపోతే ఇక నాలుగోవాడు. వాడి వివరాలు పరమేశ్వరం చెబుతుంటేనే వళ్లు కంపరంగా అనిపించింది అతడికి. వాడి జీన్స్ కూడా తనలో ఉండకుండా వుంటే బాగుండును.. మరి వీళ్లు కాక ఎవరు?.. ఉహూ.. ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తన పుట్టుకకు బీజం వేసినవాడు కాక తప్పదు..
ఆ రాత్రి అనిరుధ్ చాలాసేపటిదాకా నిద్రపోలేదు- రాత్రి పదకొండు గంటలదాకా మందుకొడుతూ పరమేశ్వరం, అతడికి కంపెనీగా బీరు తాగుతూ కొండబాబు కబుర్లు చెప్పుకుంటుంటే, అన్యమనస్కంగా తను వాళ్లతో కూర్చున్నాడు. పదకొండు గంటలకి రూములోనే పడుకోమన్నా కాదని పరమేశ్వరం వెళ్లిపోయాడు. అరగంట గడిచేసరికి కొండబాబు నిద్రలోకి జారుకున్నాడు.
అనిరుధ్‌కి మాత్రం నిద్రపట్టలేదు. మంచంమీద అటూ ఇటూ చాలాసేపు దొర్లాడు. కళ్లు అస్సలు మూతపడలేదు. ఇక విసుగొచ్చి మంచంమీద నుంచి లేచి కుర్చీలో కూర్చున్నాడు.
వాతావరణం కాస్త చల్లగానే ఉంది. కొండబాబు దుప్పటి ముసుగుపెట్టాడు. తలా తోకాలేని సమాధానాలు దొరకని ప్రశ్నలతో మనస్సంతా గందరగోళంగా తయారైంది. ఏ తెల్లవారు జాముకో అతడికి కునుకుపట్టింది. అలానే కుర్చీలోనే నిద్రపోయాడు. ఉదయానే్న కొండబాబు అతడిని లేపి మంచంమీద పడుకోరా అన్నపుడు బద్ధకంగా లేచి మంచంమీద పడుకున్నాడు అనిరుధ్.
అతడి పరిస్థితి కొండబాబుకి అర్థమయ్యింది. మానసికంగా అతడు ఎంత ఆదుర్దాపడుతున్నాడో, విచలితుడవుతున్నాడో అర్థం చేసుకోగలిగాడు.
తొమ్మిది గంటలకు బద్ధకంగా నిద్రలేచాడు అనిరుధ్. రాత్రంతా నిద్రలేమి అతడి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది కొండబాబుకి.
‘‘ఏంట్రా.. రాత్రి అస్సలు నిద్రపోలేదా..’’ అనడిగాడు.
‘‘పట్టలేదురా..’’
‘‘మరీ ఆలోచిస్తూ కూర్చున్నావా?,, ఎందుకు? జరిగేదేదో జరగనీ.. నువ్విప్పుడేమీ నాన్నకోసం పరితపించిపోవడంలేదుగా.. జస్ట్ ఎవరో తెలుసుకోవడంవరకే నీ తాపత్రం.. అలాంటప్పుడు.. టెన్షన్ ఎందుకు?..’’ ఓదార్పుగా అన్నాడు మిత్రుడి పక్కనే కూర్చుని కొండబాబు.
ఆ మాటలకి అనిరుధ్ ఏమీ మాట్లాడలేదు. కానీ, అసలు ఇలాంటి ప్రయత్నం తాను తలపెట్టకుండా ఉంటే బాగుండునేమో అని ఇప్పుడనిపిస్తోంది అతడికి. అనిపిస్తోందే కానీ, మనస్సు మాత్రం అందుకు అంగీకరించడంలేదు.. ఆ స్టుపిడ్ ఎవరు.. తెలుసుకోవడంలో తప్పేంటి.. అని మనస్సు సమాధానపడుతోంది మళ్లీ.
‘‘ఏం చేద్దాం ఈ రోజు. సింహాచలం వెళదామా?’’ అడిగాడు కొండబాబు అతడికి కొంత రిలాక్స్‌గా ఉంటుందని.
అవునూ, కాదన్నట్లు తలూపాడు అనిరుధ్. పరమేశ్వరానికి ఫోన్ చేసి అడిగాడు కొండబాబు- ‘‘సింహాచలం వెళదాం, సెలవు పెట్టి రాగలరా’’ అని.
‘‘నాకు సెలవు సమస్య లేదు.. నేను ఆఫీసుకు వస్తే వచ్చినట్లు.. రాకపోతే సెలవు పెట్టినట్లు.. ఎందుకంటే నా ఆహార్యం.. అంటే డ్రెస్సు కోడ్ అన్నమాట.. చూసి నాకు నక్సలైట్‌తో సంబంధాలున్న మనిషిగా అనుకుంటారంతా.. ఎప్పుడెళదాం... బస్సులో ఉన్నాను ఆఫీసుకు వెళుతూ.’’ అడిగాడు పరమేశ్వరం.
‘‘అయితే ఇటొచ్చెయ్యండి.. మీరు రాగానే వెళదాం.. ఈలోగా మేం రెడీ అవుతాం...’’ చెప్పాడు కొండబాబు.
పరమేశ్వరం రూముకొచ్చిన పావుగంటకి ముగ్గురూ సింహాచలం బయల్దేరి వెళ్లారు. పరమేశ్వరం బస్సులో వెళదాం అన్నాడు. అనిరుధ్ ఆటో బేరమాడాడు.
‘‘మీ దగ్గర అమెరికా డబ్బులున్నాయా?’’ ఆటోలో కూర్చున్నాక అడిగాడు అనిరుధ్‌ని పరమేశ్వరం.
‘‘మావాడు అక్కడ ఓ ఐదేళ్లుండి వచ్చాడు... ఇపుడు ఓ లకారం జీతం.. ’’ చెప్పాడు కొండబాబు.
‘‘ఇప్పుడర్థమయ్యింది..’’
‘‘పరంగారూ.. మీరు మాతో హైదరాబాద్ వచ్చెయ్యకూడదూ..’’ అడిగాడు కొంతదూరం వెళ్లాక అనిరుధ్.
‘‘అక్కడ నేనేం చెయ్యను?’’
‘‘మీరు వస్తానంటే చెప్పండి.. మీకు సూటబుల్ జాబ్ నేనిస్తాను.. నాకు మీలాంటివాళ్లు.. అంటే బాగా చొరవ వున్నవాళ్లు.. సమాజాన్ని బాగా స్టడీ చేసినవాళ్లు..’’ అనిరుధ్ గంభీరంగానే అన్నాడు.
‘‘నేను అలా అనిపిస్తున్నానా మీకు?.. మా బంధువులంతా నన్ను చేతకానివాడంటారు..’’
‘‘బంధువుల దృష్టిలో స్థలాలు కొనేసి, కార్లూ బంగ్లాలూ కొనేసిన వాళ్లు సమర్థులక్రింద లెక్క.. నాకు అలాంటి సమర్థులొద్దు.. కొండబాబుని రారా అంటే వాడు ఆ సిటీ వదిలిపెట్టి రాడు.. రాలేడు కూడా.. అందుకే వాడిని నేను బలవంతపెట్టను కూడా.. మీరు రండి. నాకు అండగా ఉంటారనిపిస్తోంది..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘మావాడి ప్రపోజల్ బావుంది సర్. మీరు హైదరాబాద్ వెళ్లండి..’’ కొండబాబు చెప్పాడు.
‘‘నా నుంచి మీరు ఓవర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నరేమో..’’’ పరమేశ్వరం అన్నాడు.
‘‘లేదండి.. ఒక మనిషిని స్టడీ చేయడానికి ఏళ్లూ పూళ్లూ అక్కర్లేదు..’’ చెప్పాడు అనిరుధ్.
‘‘ఆలోచిస్తాను.. మీ ఆఫర్‌ని ఎందుకు కాదనుకోవాలి!.. నాకూ ఇక్కడ ఉండాలనిపించడంలేదు.. కానీ, నేను మీకు ఎలా ఉపయోగపడతానో నాకు తెలీడంలేదు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842