డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు వారు క్రింద లోకాలో ఏడవదైన రసాతలానికి వెళ్లారు. గోమాత సురభి అక్కడ నివసిస్తూ ఉంటుంది. ఆమె తన పొదుగు నుండి పాలను ప్రవహింపజేస్తూ ఉంటుంది. నారదుడు ఆ లోకం గురించి ఇలా చెప్పాడు. ‘‘ఈ గోమాత పాలు చాలా శ్రేష్ఠమైనవి. ఈమె క్షీరధారలతో ఏర్పడినదే క్షీరసాగరం. ఈ సాగరం నుండి వచ్చే నురుగును త్రాగుతూ ఫేనపులనే మహర్షులు ఈ రసాతలంలో నివసిస్తూ ఉంటారు. వారు తీవ్రతపస్సులు చేస్తారు. వారిని చూచి దేవతలు కూడా భయపడ్తారు. ఈ సురభికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. అవి అన్ని దిక్కులలో నివసిస్తూ ఉంటాయి. ఈ సురభి పాలు త్రాగేవారికి పాలుగా, స్వధను భుజించే పితరులకు స్వధగా, అమృతం భుజించే దేవతలకు అమృతంగా ఉంటాయి. రసాతలంలో నివసించే సుఖం ఇంకే లోకంలోను లభించదు’’.
కాని మాతలికి అక్కడ కూడా ఎవరూ నచ్చలేదు. మరల వారిద్దరూ బయలుదేరి నాగరాజైన వాసుకి నివసించే భోగవతి వెళ్లారు. నారదుడు ఆ పురం గురించి ఇలా చెప్పాడు ‘‘ఈ పురం ఇంద్రుని అమరావతిలాగా ఉన్నది. దీనిని సర్వదా ఆదిశేషుడనే సర్పం తలపై ధరించి ఉంటుది. ఆదిశేషునికి వేయి తలలు. దివ్యమయిన ఆభరణాలు ధరించి ఉంటాడు. ఇక్కడ సురస పుత్రులు అయిన నాగులు జీవిస్తూ ఉంటారు. వీరు స్వాభావికంగా భయంకరమైన స్వభావం కలవారు.
చాలా బలవంతులు. వీరిలో కొందరు వేయి తలల వారు, కొందరు పది తలలవారు, కొందరు పెద్ద శరీరం కలవారు ఉన్నారు. వారలో వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, కాళీయుడు, నహుషుడు, ఖగుడు, ఏలపుత్రుడు, పోతకుడు, పద్ముడు ఇంకా ఎంతో మంది ముఖ్యులు. వీరందరిలో నీకు ఎవరైనా నచ్చినవారు ఉన్నారేమో చూడు’’.
మాతలి స్థిరంగా ఒక నాగుని వైపు చూసి నారదునితో ఇలా అన్నాడు. ‘‘ఆ కౌరవ్యార్యకుల ముందు నిలబడి ఉన్న నాగకుమారుడు చూడముచ్చటగా ఉన్నాడు. అతను ఏ వంశానికి చెందినవాడు? అతని తల్లి తండ్రులు ఎవరు? అతని ధైర్యం, రూపం, వయస్సు నాకు నచ్చాయి. ఇతడే గుణకేశినికి తగిన వరుడు’’.
నాదర మహర్షి మాతలి సుముఖుని చూచి ఆనందించడం గమనించి అతని వివరాలు ఇలా చెప్పాడు. ‘‘ఇతను ఐరావత వంశంలో పుట్టాడు. పేరు సుముఖుడు. ఆర్యకుని పౌత్రుడు. వామనుని దౌహిత్రుడు. ఇతని తండ్రి చికురుడు గరుత్మంతునికి ఆహారమయ్యాడు’’ ఈ మాటలు విని మాతలి ‘‘తండ్రీ! ఈ సుముఖుడు నాగశ్రేష్ఠుడు. నా అల్లుడు కాదగినవాడు. నాకు చాలా నచ్చాడు. నా పుత్రికను ఇతనికే ఇవ్వాలనుకుంటున్నాను. కనుక ఇతని కోసం ప్రయత్నించు’’ అని అన్నాడు.
మాతలి నిశ్చయం తెలిసి నారదుడు మాతలిని తీసుకొని వెళ్లి అతనిని నాగరాజు ఆర్యకుమారునితో పరిచయం చేసి ఇలా అన్నాడు. ‘‘ఇతడు ఇంద్రుని మిత్రుడు, సారథి అయిన మాతలి. ఇతడు తేజోసంపన్నుడు. గుణవంతుడు. ఇతడు దేవాసుర సంగ్రామంలో వేయి గుర్రాలను పూన్చిన రథాన్ని మనస్సుతోనే నియంత్రిస్తాడు. మాతలి శత్రువును దెబ్బకొట్టిన తర్వాతే ఇంద్రుడు దెబ్బకొడతాడు. ఇతని కుమార్తె గుణకేశి చాలా సౌందర్యవతి, గుణవతి, శీలవతి. ఈమెకు తగిన వరుని కోసం మాతలి వెతుకు తున్నాడు. ఇతనికి నీ పౌత్రుడు సుముఖుడు తన కుమార్తెకు తగిన వరునిగా నచ్చాడు. ఆర్యకా! నీకు కూడా ఈ సంబంధం నచ్చితే వెంటనే ఈ వివాహం చేయండి. నీ మీద, ఐరావంతునిపైనా నాకు ఎంతో గౌరవం. సుముఖుడు శీలం, ఇంద్రియనిగ్రహం కలవాడు. కనుక తండ్రి లేనివాడయినా గుణాల కారణంగా అతనికి తన కన్యను ఇవ్వటానికి మాతలి సుముఖంగా ఉన్నాడు. నీవు కూడా అతని మాట మన్నించాలి’’.
అప్పుడు ఆర్యకుడు దీనంగా ఇలా అన్నాడు. ‘‘దేవర్షీ! నా పుత్రుడు మరణించాడు. ఇప్పుడు పౌత్రుడుకూడా మృత్యువును చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో గుణకేశిని కోడలిగా ఎలా స్వీకరించను? మహర్షీ! నీ మాట నాకు ఇష్టం లేదని కాదు, ఇంద్రునికి మిత్రుడైన మాతలితో సంబంధం ఎవరికి ఇష్టం ఉండదు? కాని ఈ కారణం చేత నేను సందేహిస్తున్నాను. సుముఖుని తండ్రిని గరుత్మంతుడు భక్షించాడు. సుముఖుడిని కూడా ఒక నెలలో తింటానని చెప్పి వెళ్లాడు. మేమందరం ఆ దుఃఖంలో ఉన్నాము. ఎందుకంటే గరుత్మంతుని పట్టుదల మాకు తెల్సు. అతను చెప్పినట్లుగానే చేస్తాడు’’.
అప్పుడు మాతలి ఆర్యకునితో ఇలా అన్నాడు. ‘‘నేను ఈ విషయం గురించి ఆలోచించాను. నేను సుముఖుడిని అల్లునిగా చేసుకోవాలనుకుంటున్నాను. కనుక అతను నాతోను, నారదమహర్షితోనూ కలిసి త్రిలోకాధిపతి అయిన ఇంద్రుని దర్శిస్తాడు. తర్వాత నేను ఇతని ఆయువు హామీని తీసుకొంటాను. సుపర్ణుడు ఇతన్ని చంపలేనట్లుగా కూడా ప్రయత్నిస్తాను. నాగరాజా! నీకు శుభం జరుగుతుంది. సుముఖుడు ఈ కార్యసిద్ధి కోసం మాతో కలిసి ఇంద్రుని దగ్గరకు రావాలి’’.
తరువాత వారందరూ సుముఖుని తీసుకొని దేవేంద్రుని దగ్గరకు వెళ్లి అతని దర్శనం చేసుకున్నారు. దైవికంగా అక్కడ విష్ణువు కూడా ఉన్నాడు. నారదుడు వారితో మాతలి విషయాన్ని సమస్తమూ వివరించాడు. అప్పుడు విష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు. ‘‘వాసవా! ఈ సుముఖునికి అమృతాన్ని ఇచ్చి ఇతన్ని అమరులతో సమానుని చెయ్యి. మాతలీ, నారదుడు, సుముఖుడు అందరూ నీ నుంచి అమృతం పొందాలి. వారి మనోరథం సఫలం కావాలి’’.
అప్పుడు దేవేంద్రుడు గరుత్మంతుని పరాక్రమం తలచుకొని విష్ణువునే వారికి అమృతాన్ని ఇవ్వమన్నాడు. విష్ణువు ఇలా అన్నాడు. ‘‘ఇంద్రా! సర్వలోకాలకీ నీవే ప్రభువువు. నీవు ఇచ్చిన దానిని కాదనడానికి ఎవరికి సాహసం కలదు?’’ దేవేంద్రుడు విష్ణువు మాటలు విని సుముఖునికి మంచి ఆయువును అనుగ్రహించాడు. కాని అమృతాన్ని ఇవ్వలేదు. ఇంద్రుని వరం పొంది అతను దీర్ఘాయువు కలవాడు అయ్యాడు. మాతలి అతణ్ణి తీసుకొని వెళ్లి వైభవంగా వివాహం చేశాడు. ఆర్యకుడు కూడా పౌత్రుని వివాహం చూసి దేవేంద్రుని పూజించి తన లోకానికి వెళ్లిపోయాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి