డైలీ సీరియల్

అన్వేషణ -52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఐటి రంగం కాదు.. సైన్సు పిజిని..’’ పరమేశ్వరం ఎటో చూస్తూ చెప్పాడు.
‘‘ఇవ్వాళ బిటెక్ చదివినవాడు ఇంజనీరుగానే లేడు.. అనేకమంది బ్యాంక్ జాబ్‌లు చేస్తున్నారు.. అలాగని ఎంకామ్‌లు చదివినవారు అకౌంటెన్సీలో లేరు.. వేరే వేరే జాబ్‌లు చేస్తున్నారు.. మనం చదివే చదువుకీ, చేసే ఉద్యోగానికి ఇపుడు ఏ మాత్రం పొంతన లేదు..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘ఐ అగ్రీ విత్ యూ... అనిరుధ్.. లెట్ అజ్ డిస్కస్ అగైన్ లేటర్ దిస్ మేటర్..’’ సింహాచలం ఆలయం రావడంతో అన్నాడు పరమేశ్వరం.
కొండబాబు వెళ్లి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తీసుకొచ్చాడు.
‘‘ఇపుడు మనం అర్జంటుగా వెళ్లి ఏం చెయ్యాలి.. ఆరామ్‌సే.. సర్వదర్శనం క్యూలో వెళ్ళేవాళ్లంగా..’’ అన్నాడు పరమేశ్వరం.
‘‘అమెరికా డబ్బులండి పరంగారూ.. దేముడికీ అందులో వాటా ఇవ్వాలిగా మరి...’’ అని అనిరుధ్ నవ్వేశాడు.
‘‘అవును కదా!.. పదండి..’’ అంటూ ముందుకు దారితీశాడు పరమేశ్వరం.
అతడు ఇలా పుణ్యక్షేత్రాలని పనిగట్టుకు ఎప్పుడూ రాడు. అలాగని అతడు నాస్తికుడు కాదు. ఆస్తికుణ్ణని మత గ్రంథాలు చేత్తో పట్టుకుని తిరగడు. ఏ విషయమైనా హేతుబద్ధకంగా ఆలోచించాలంటాడు.
భారతీయ జీవనవిధానం అంతా సైన్సుమీద ఆధారపడి ఉందని నమ్మేవాళ్లల్లో అతడొకడు. మనం చేస్తున్న పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, నియమాలు, నిష్టలు అన్నీ ఎక్కడో అక్కడ ఏదో విధంగా సైన్సుతో ముడిపడి ఉన్నాయని, ఆ శాస్ర్తియ విజ్ఞానాన్ని వెలికితీయాలని, కానీ, ఆ పనే జరగడంలేదని, అదే ఇపుడు జరుగుతున్న పెద్ద లోపమనీ ఎప్పుడూ అతడు వాదిస్తూంటాడు.
ఆలోచనాపరులు అతడి వాదనను అగీకరిస్తుంటారు. చాందసులు పిడివాదం అని కొట్టిపారేస్తుంటారు. ఎవరేమనుకున్నా తన ధోరణి మాత్రం అదే అంటాడు పరమేశ్వరం.
వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆటో ఎక్కి క్రిందకి వచ్చేశారు. మంచి హోటలుంటే చెప్పండి, భోజనం చేద్దాం అని కొండబాబు కోరడంతో ఆటోవాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు పరమేశ్వరం. ఒక పాకలాంటి హోటల్‌కి తీసుకొచ్చాడు ఆటోడ్రైవర్. ఖర్చు తక్కువ కోసం పరమేశ్వరం ఇక్కడికి తీసుకొచ్చాడా అనుకున్నారు అనిరుధ్, కొండబాబు. కాని, అక్కడ భోజనం చేశాక మాత్రం పరమేశ్వరాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు.
ఇంట్లో భోజనం చేస్తున్నంత హాయిగా ఉందక్కడ. కొసరి కొసరి వడ్డించడాలు, నాలుగు రకాల పచ్చళ్ళు.. బాగుంది భోజనం. ఆ మాటే అన్నాడు కొండబాబు.
‘‘సాధారణంగా నేను ఇలాంటి హోటళ్లే ప్రిఫర్ చేస్తాను బాబుగారూ. పటాటోపంగా వున్న హోటళ్లంటే నాకు పడవు. ఆ డిమ్‌లైట్లలో కూర్చుని భోజనం చేయడం అంటే ఏదో చీకట్లో తింటున్నట్లుంటుంది నాకు.. ఇక్కడ చూడండి ఎంత హాయిగా ఉందో..’’ చెప్పాడు పరమేశ్వరం.
ముగ్గురూ లాడ్జికొచ్చారు.
‘‘మీరు పడుకోండి.. నేనిలా కుర్చీలో కూర్చుంటాను.. అలాగే కాస్త కునుకు తీస్తాను. అది నాకలవాటు..’’ అంటూ కుర్చీలో కూర్చున్నాడు పరమేశ్వరం.
మరునాడు సాయంత్రం ఆరు గంటలు కావస్తూంది.
హడావిడిగా ఆసుపత్రికి వచ్చాడు పరమేశ్వరం. అప్పటికే అక్కడ అనిరుధ్, కొండబాబు అతడికోసం ఎదురుచూస్తున్నారు. అతడు రాగానే ఆసుపత్రి లోపలికి వెళ్లి రిసెప్షనిస్టుతో తాము డాక్టర్‌ని కలవాలని చెప్పారు. ఆమె పది నిముషాలు వెయిట్ చెయ్యమన్నది.
సాయంత్రం నుంచి టెన్షన్ మొదలైంది అనిరుధ్‌కి.. ఈ రోజు డాక్టర్ ఏం చెబుతాడు.. ఏం వినాల్సి వస్తుంది అని. ‘ఏదైతే అదవుతుందిరా.. టెన్షన్ పడకు’ అని కొండబాబు అతడిని అనునయిస్తూనే ఉన్నాడు.
డాక్టరుగారు రమ్మంటున్నారనగానే అనిరుధ్‌కి చెమటలు పట్టాయి ఒక్కసారిగా. ముగ్గురూ లోపలికి వెళ్లారు: ‘‘సారీ! మ్యాచ్ కాలేదు..’’ అంటూ రిపోర్టు అందించాడు అనిరుధ్‌కి డాక్టర్ మధుకర్. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఊపిరి అందినట్లయ్యింది అనిరుధ్‌కి. ఆయనకిస్తామన్న డబ్బు కవర్ అందించి, నమస్కారం పెట్టి బయటికి వచ్చేశారు ముగ్గురూ.
ఎందుకో తెలీదు ఒక్కసారిగా నిస్త్రాణంగా అనిపించింది అనిరుధ్‌కి. అలా ఎందుకు జరిగిందో అతడికి ఏమీ అర్థం కాలేదు. అతడి భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చి కొబ్బరిబోండాం తాగించాడు కొండబాబు.
‘‘డోంట్ వర్రీ అనిరుధ్.. ఆ త్రాష్టుడు నీకు ఏమీ కానందుకు హ్యాపీగా ఫీలవ్వు..’’ పరమేశ్వరం అనునయంగా అన్నాడు. పది నిముషాలకి అనిరుధ్ తేరుకున్నాడు. ఫర్వాలేదన్నట్లు తలూపాడు.
వేడి ఇడ్లీ తింటే మంచిదని హోటల్‌కి తీసుకెళ్లాడు కొండబాబు.
‘‘మీరన్నట్లే జరిగింది పరంగారూ... వాడికి నేను ఏమీ కానందుకు సంతోషంగా ఉంది..’’ ఇడ్లీ తింటూ అన్నాడు అనిరుధ్.
‘‘కానీ మీ లైఫ్‌లో... మీరు తెలుసుకోవాల్సిన మరో త్రాష్టుడు ఉన్నాడు.. కనకారావు..’’ పరమేశ్వరం నెమ్మదిగా చెప్పాడు.
ఆ మాటకి అనిరుధ్ ఏమీ మాట్లాడలేదు కాస్సేపు..
‘‘ఇక ఈ పని ముగించి వెళ్లిపోవాలని ఉంది.. కానీ మనస్సు ఊరుకోవడంలేదు.. వాడెవడో తెలుసుకోవాలనే ఉంది.. కానీ ఇంక తెలుసుకోవాల్సిన అవసరం లేదు.. వాడే.. కనకారావే ఆ దుర్మార్గుడు..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘అలా ఎలా కన్‌ఫర్మ్ చేస్తారు?.. టెస్టులో తేలాలి కదా?’’ పరమేశ్వరం అన్నాడు.
‘‘తేలాల్సిందేముంది పరంగారూ.. నలుగురు దుర్మార్గుల్లో ముగ్గురుకాదని తేలింది.. ఇక మిగిలింది ఒకడు.. వాడే కదా.. ఇంక తెలుసుకోవడం ఎందుకు?’’ అనిరుధ్ అడిగాడు
‘‘అక్కడే మీరు రాంగ్‌గా ఆలోచిస్తున్నారంటాను.. ఓ దుర్మార్గపు పనికి నలుగురు వెళ్లాలని ఎవరో మీకు చెప్పారు.. మధ్యలో ఒకడు వాళ్లల్లో జాయిన్ అవలేదని ఏమిటి గ్యారంటీ.,. లేదా ఈ నలుగురిలో ఒకడు మధ్యలో దిగిపోలేదని మీకు తెలుసా..’’ పరమేశ్వరం చెప్పిన లాజిక్ అనిరుధ్‌ని ఒక్కసారిగా కుదుపినట్లయ్యింది.
ఆ మాటకి కొండబాబూ కంగారు పడ్డాడు. పరమేశ్వరం చెప్పినదాంట్లో నిజాలున్నాయనిపించింది వాళ్లిద్దరికీ. ఇక నాలుగోవాడే తన మిత్రుడు, అనిరుధ్‌కి తండ్రి అని నిర్థారించుకున్న కొండబాబు ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.
‘‘నిజంరా! పరంగారు చెప్పింది ఆలోచించాల్సిందే.. మనం కనకారావునీ టెస్టు చేయించాల్సిందే..’’ అన్నాడు కొండబాబు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842