డైలీ సీరియల్

గాలవోపాఖ్యానం -- (మహాభారతంలో ఉపాఖ్యానాలు -- 57)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు యమధర్మరాజుకు ఆకలి వేయగా అతను వశిష్ఠుని రూపం ధరించి విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. విశ్వామిత్రుడు అతనికి మంచి పాయసాన్ని పెట్టాలని తలచి వంట ప్రారంభించాడు. కాని ధర్ముడు ఆకలికి తాళలేక ఇతర మహర్షులకు పెట్టిన భోజనాన్ని ఆరగించాడు. ఇంతలో వడివడిగా విశ్వామిత్రుడు వేడి అన్నాన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు ధర్ముడు ‘‘నేను భోజనం చేశాను. నీవు అక్కడే ఉండు’’ అని వెళ్లిపోయాడు. తేజస్వి అయిన విశ్వామిత్రుడు ఆ మాటతో అక్కడే నిలబడిపోయాడు. అన్నాన్ని నెత్తిన పెట్టుకొని ఉండిపోయాడు. ఆ స్థితిలో అతనికి గాలి మాత్రమే ఆహారం. అతని మీద ప్రేమతో, గౌరవంతో గాలవముని విశ్వామిత్రునికి సేవలు చేశాడు. మరల వంద సంవత్సరాలకు యమధర్మరాజు వశిష్ఠుని రూపం ధరించి భోజనం చేయాలని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చాడు. అతను విశ్వామిత్రుడు తలపై మోస్తున్న అన్నం ఇంకా వేడిగా, ఉండడం చూసి దానిని అప్పుడే వండినదిగా తిని ‘‘బ్రహ్మర్షీ! పరమానందంగా ఉంది’’ అని వెళ్లిపోయాడు. క్షాత్రభావం నుండి బ్రహ్మభావం పొందిన విశ్వామిత్రుడు ధర్ముని మాటలకు ఎంతో ఆనందించాడు.
విశ్వామిత్రుడు తన శిష్యుడు గాలవుని సేవల వలన సంతృప్తి చెంది ఇలా అన్నాడు. ‘‘నాయనా గాలవా! నేను నీకు స్వేచ్ఛగా వెళ్లడానికి అనుమతిస్తున్నాను’’
ఆ మాటతో సంతోషించి గాలవుడు విశ్వామిత్రుని గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని అడిగాడు. విశ్వా మిత్రుడు అతను చేసిన ఉపచారాలను దృష్టిలో ఉంచుకొని ఏమీ ఇవ్వక్కర లేదని చెప్పాడు. కాని గాలవుడు వినక పదే పదే గురుదక్షిణ తీసుకొమ్మని కోరాడు. అలా అతను పట్టు పట్టడంతో కోపం వచ్చి విశ్వామిత్రుడు ఇలా అడిగాడు - ‘‘గాలవా! ఒకవైపు చెవులు నల్లగా ఉండి చంద్రకాంతితో తెల్లగా ఉండే ఎనిమిది వందల గుర్రాలను తెచ్చి ఇవ్వు వెళ్లు’’.
విశ్వామిత్రుడు ఈ విధంగా గురుదక్షిణ అడుగగా గాలవుడు భయపడిపోయాడు. అతనికి నిద్ర రాలేదు. తిండి తినలేకపోయాడు. అలా శోకంలో మునిగిపోయి అతను చిక్కిపోయాడు. అతను ఇలా ఆలోచించసాగాడు - ఎనిమిది వందల గుర్రాలు నాకెవరు ఇస్తారు? గుర్రాలు కొనడానికి నాకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?
ఇక నాకు ఈ జీవితం వద్దు. ఏ సముద్రతీరానికో పోయి శరీర త్యాగం చేస్తాను. మాట తప్పినవాడు ఉండి కూడా లేనట్లే. కృతఘు్నడికి స్థానం లేదు, సుఖం లేదు. గురుదక్షిణ ఇస్తానని మాట ఇచ్చి దాన్ని పూర్తి చేయలేకపోతున్నాను. మొదట నా ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా విష్ణువుని ప్రార్థిస్తాను’’ ఇలా భావించి గాలవుడు విష్ణువును ప్రార్థించాడు. వెంటనే అతని మిత్రుడు గరుడుడు ప్రత్యక్షమై ‘‘గాలవా! నీవు నాకు మిత్రుడవు. మిత్రులకు ధనసహాయం తప్పక చేయాలి. నాకున్న సంపద విష్ణుమూర్తియే. ఇంతకు మునుపే నీ గురించి అతన్ని ప్రార్థించగా అతను మన్నించి నా కోర్కెను తీర్చాడు. పద సముద్రానికి ఆవల వైపుకి నిన్ను తీసుకొని వెళతాను’’ అన్నాడు.
మరల సుపర్ణుడిలా అన్నాడు ‘‘గాలవా! నీకు సహాయం చేయమని విష్ణుమూర్తి నాకు చెప్పాడు. అందుకే నేను వచ్చాను. నీకిష్టమైన దిక్కుకు వెళదాము. ఇది తూర్పు దిక్కు. పగటికీ సూర్య మార్గానికీ ఇది ద్వారం. సంధ్యాసమయంలో సాధ్యులు ఈ దిక్కునే తపస్సు చేస్తారు. ధర్మానికి కళ్లవంటి సూర్యచంద్రులు ఈ దిక్కునే ఉదయిస్తారు. పవిత్ర హవిస్సును ముందు ఈ దిక్కుననే హోమం చేస్తారు. ఈ దిక్కుననే అదితి మొదలైన వారు తమ తొలి సంతానాన్ని కన్నారు. ఈ దిక్కుననే ఇంద్రుని పట్ట్భాషేకం జరిగింది. అందుకే దీనిని పూర్వదిక్కు అంటారు.
సుఖాన్ని కోరేవారు ఏ పనైనా ముందు ఈ దిక్కుననే చేయాలి. సవితృదేవత బ్రహ్మవాదులకు ఈ దిక్కుననే సావిత్రీమంత్రాన్ని ఉపదేశించాడు. సూర్యుడు యాజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని ఈ దిక్కుననే ఇచ్చాడు. ఈ దిక్కునే వశిష్ఠ మహర్షి పుట్టుక, మరణం కూడా జరిగింది. స్వర్గానికీ, సుఖానికీ ఈ పూర్వ దిక్కే ద్వారము. నీకిష్టమయితే ఈ దిక్కులోకి వెళదాము. లేక ఇంకొక దిక్కు గురించి చెప్పనా! అయితే విను’’ తర్వాత సుపర్ణుడు దక్షిణ దిక్కు గురించి గాలవునకు ఇలా చెప్పాడు.
‘‘పూర్వం సూర్యుడు యజ్ఞం చేసి ఈ దిక్కును కశ్యపునికి దక్షిణగా ఇచ్చాడు. అందుకే దీనికి దక్షిణ దిక్కు అన్న పేరు వచ్చింది. మూడులోకాలకి చెందిన పితృగణాలకి ఇది స్థానం. పితృదేవతలతో పాటు విశ్వదేవులు ఇక్కడే ఉంటారు. వీరు శ్రాద్ధకర్మలలో పితరులతో పాటు సమాన భాగాన్ని పొందుతారు. ధర్మదేవతకిది రెండవ ద్వారం. కాలాంశాలను లెక్కించి ప్రాణుల ఆయువును నిర్ణయించేది ఇక్కడే. ఇక్కడ ఎప్పుడూ రాజర్షులూ, పితృలోక ఋషులూ, దేవర్షులూ సుఖంగా, నిశ్చింతగా నివసిస్తారు. మరణించినప్రాణులకు ఈ దిక్కే దిక్కు. సమస్త ప్రాణులూ మరణించిన తర్వాత ఈ దిక్కునుంచే వెళ్లాలి. ఇక్కడ ప్రతికూల స్వభావం గల రాక్షసులు ఉంటారు. ఇక్కడే సావర్ణి మనువు కుమారుడు సూర్యుని గమనానికి హద్దులు గీచాడు. సూర్యుడు వాటిని ఎన్నడూ దాటడు. ఈ దిక్కుననే రావణుడు తపస్సు చేశాడు. ఇక్కడ వైతరిణీనది పాపులతో నిండి ఉంటుంది. ఈ దిక్కుననే వాసుకి చేత పాలింపబడి తక్షక ఐరావతులచే రక్షింపబడుతున్న భోగవతీనగరం ఉంది. ఈ దిక్కులో గాఢాంధకారముంటుంది. గాలవా! ఇక ఇప్పుడు పశ్చిమ దిక్కుకు వెళ్దాము’’.
అలా అని గరుడుడు గాలవుని తీసుకొని పశ్చిమదిశకు వెళ్లి దాని ప్రాశస్త్యము గురించి ఇలా చెప్పసాగాడు. ‘‘ఈ దిక్కు జలాధిపతి అయిన వరుణునికి చాలా ఇష్టమైన దిక్కు. రోజంతా ప్రయాణం చేసిన సూర్యుడు ఈ దిక్కునే తన కిరణాలను ఉపసంహరించుకుంటాడు.

-- ఇంకావుంది...

-- డాక్టర్ ముదిగొండ ఉమాదేవి