డైలీ సీరియల్

అన్వేషణ -54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏదైనా కానీ.. నువ్వు బుర్ర పాడుచేసుకోనవసరంలేదు..ప్రశాంతంగా పడుకో..’’ చెప్పాడు కొండబాబు.
ఏ సమాధానమూ చెప్పకుండా నిశ్చలంగా కూర్చున్నాడు అనిరుధ్. పెద్ద లైటుతీసేసి బెడ్‌లైటు వేసి మంచం ఎక్కాడు కొండబాబు.
యధాప్రకారం మనసంతా గందరగోళంగా తయారైంది అనిరుధ్‌కి. నిద్ర రావడంలేదు. ఏ ఆలోచనకీ మనస్కరించడంలేదు. హిమజ చెప్పినట్లు కనకారావు విషయం కూడా తేలిపోతే ఇంక ఈ అంశానికి ఫుల్‌స్టాప్ పెట్టేద్దామా అనుకుంటున్నాడు అనిరుధ్. చదువూ, మంచి ఉద్యోగం, మంచి సంస్కారి అయిన హిమజ లాంటి హ్నేహితురాలిని, కాబోయే భాగస్వామిని ఇచ్చిన భగవంతుడు ఈ ఒక్క విషయంలో ఇలా ఎందుకుచేశాడు.. ఎప్పటిలానే ప్రశ్న! సమాధానం దొరకని ప్రశ్న అతడిని విచలితుడిని చేసింది.
ఒక్కసారిగా రహీంపాషా, నారాయణ, థామస్ కళ్లలో మెదిలారు. వారి రూపాలు అతడికి భయంకరంగా అనిపించాయి. కానీ, వాళ్లెవరూ తన జీవితంలోకి రాలేదు.. అదే సంతోషం అనుకున్నాడు. ఇపుడు కనకారావు అనే మరో దుర్మార్గుడు.. పరమేశ్వరం మాటల్లో త్రాష్టుడు. వీడి విషయం తేలాలి.. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు అలా కుర్చీలో అనిరుధ్.
తెల్లవారు జామున బాత్‌రూముకు లేచిన కొండబాబు, అలా కుర్చీలో నిద్రపోతున్న మిత్రుడిని చూసి జాలిపడ్డాడు. లేపి మంచంమీద పడుకోమని చెబుదామనుకున్నాడు. కానీ, లేపితే మళ్లీ నిద్రపట్టడం కష్టం అనుకుని, కొంచెం చలిగా ఉండడంవల్ల దుప్పటి తీసి కప్పాడు.
ఉదయం ఏడు గంటలు కావస్తూంటే మెలకువ వచ్చింది కొండబాబుకి. అనిరుధ్ ఇంకా అలానే నిద్రపోతున్నాడు. అతడిని లేపలేదు. తాను కాలకృత్యాలు తీర్చుకున్నాడు. స్నానం కూడా చేశాడు. ఎనిమిది గంటలు కావస్తూంటే మత్తుగా లేచాడు అనిరుధ్.
‘‘కుర్చీలోనే పడుకుండిపోయావురా.. లేపితే మళ్లీ నీకు నిద్ర పడుతుందో లేదోనని లేపలేదు..’’ చెప్పాడు కొండబాబు.
‘‘చాలాసేపటిదాకా నిద్రపట్టలేదురా..’’ ఆవులిస్తూ లేచాడు అనిరుధ్.
మరో పావుగంటకి పరమేశ్వరం వచ్చాడు. కుర్చీలో కూర్చుంటూ-‘‘ చూశారా బేవార్స్‌గా ఎవరైనా టిఫినూ, కాఫీలు, భోజనాలు వగైరా పెడుతున్నారంటే ఎంత టంచన్‌గా వాలిపోతున్నానో..’’ అని తనమీద తనే జోకులేసుకున్నాడు.
‘‘్ఛఛ! అలా అనుకోకండి పరంగారూ.. మీరు మాకు చాలా మేలు చేస్తున్నారు..’’ కొండబాబు అన్నాడు.
‘‘కనకారావుగారి గురించి నేనో ప్లాను వేశాను.. అంతకుమించి నాకు వేరే దారి కనిపించలేదు..’’ అన్నాడు సిగరెట్ కాల్చుకోనా అంటూ సిగరెట్ తీసి చూపిస్తూ.
‘‘కాల్చుకోండి సర్.. ఇంతకీ ఏమిటి మీ ప్లాను..’’ కొండబాబు అడిగాడు. ఇంతలో బాత్‌రూమునుంచి బయటికి వచ్చాడు అనిరుధ్.
‘‘తప్పదు.. మనం కొంచెం సాహసం చేయాలి..’’ చెప్పాడు పరమేశ్వరం.
‘‘చేద్దాం పరంగారూ... మనకి పని ముఖ్యం.. ఎవర్నేనా కొట్టాలా’’ అనడిగాడు కొండబాబు.
‘‘అందుకు మావాడు రెడీ..’’ అనిరుధ్ అన్నాడు నవ్వుతూ.
‘‘అవసరం లేదు..’’
‘‘ప్లాన్ చెప్పండి.. ’’ అనిరుధ్ అడిగాడు.
ఇద్దర్నీ దగ్గరికి రమ్మన్నట్లు సైగచేశాడు. ఇద్దరూ కుర్చీలు లాక్కుని కూర్చున్నారు. పరమేశ్వరం వాళ్లకి చెయ్యాల్సిన పని గురించి చెప్పాడు.
‘‘వర్కవుట్ అవుతుందా?’’ అనిరుధ్ అడిగాడు అంతా విన్న తర్వాత-
‘‘అవుతుందనే అనుకుంటున్నాను.. ఇంతకుమించి వేరే దారిలేదు..’’ పరమేశ్వరం చెప్పాడు.
‘‘సరే సర్..’’ కొండబాబు అన్నాడు. అనిరుధ్ కూడా తలూపాడు.
‘‘ఈరోజే..’’ అనిరుధ్, కొండబాబు సరే అన్నట్లు తలలూపారు.
‘‘ఈ విషయం.. అంటే మళ్లీ డిఎన్‌ఎ టెస్టు చేయించి పెట్టాలని డాక్టర్ మధుకర్‌కి చెప్పాను సాయంత్రమే.. గురుడు అలాగే తప్పకుండా.. అన్నాడు.. భారీగా డబ్బులొస్తుంటే ఎవరికి చేదుగనుక!’’ చెప్పాడు పరమేశ్వరం.
బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాక తొమ్మిదిన్నరకి పరమేశ్వరం ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి పరమేశ్వరం ప్లాను ప్రకారం జరుగబోయే తతంగం గురించి ఎవరి ఆలోచనల్లో వాళ్లు చాలాసేపు అన్యమనస్కంగా టీవీ చూస్తూ కూర్చుండిపోయారు అనిరుధ్, కొండబాబు.
ఆరోజు టైము చాలా నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపించింది. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ప్లాను అమలు జరపడానికి వెళదామా అని టెన్షన్‌గా ఉన్నాడు అనిరుధ్. కొండబాబు కూడా అలానే ఆలోచిస్తున్నాడు కానీ అతడు అనిరుధ్ అంత టెన్షన్ పడడంలేదు.
లంచ్‌చేసి వచ్చి మధ్యాహ్నం పడుకున్నారన్నమాటే గానీ, ఎంతకీ నిద్రపట్టలేదు ఇద్దరికీ. చాలాసేపు టీవీ చూస్తూ కూర్చున్నారు ఏదో పిచ్చి సినిమా వస్తోంది.
ఆరున్నరకి పరమేశ్వరం వచ్చాడు రూముకి. అతడితో కొంతసేపు బాతాఖానీ వేశాక ఏడున్నర నుంచి తొమ్మిది గంటలదాకా అతడికి కంపెనీ ఇచ్చాడు కొండబాబు. అనిరుధ్ టీవీ చూస్తూ, మధ్యమధ్యలో వీళ్లతో మాట్లాడుతూ గడిపాడు. తొమ్మిదిన్నర కావస్తూంటే డిన్నర్‌కి వెళ్లి అయిందనిపించారు. ముగ్గురూ ఆటోలో బయలుదేరారు. మధ్యలో ఓ ఆర్‌ఎంపి డాక్టర్‌ని ఎక్కించుకున్నారు.
డాక్టర్ ప్రసాద్ కూడా పరమేశ్వరం మాదిరిగానే మాట్లాడుతాడు. పనికిమాలిన రాజకీయ నాయకులు, లంచగొండి అధికార్లతో ఈ దేశం నాశనం అయిపోతోందని ఎప్పుడూ వాపోతుంటాడు. పరమేశ్వరానికి అతడు మంచి మిత్రుడు.
ఒక అన్యాయానికి బలైపోయిన యువకుడికి మనం మానసిక ధైర్యాన్నివ్వాలని, ఇందులో ఒక దుర్మార్గుడిని గుర్తించాలని, అందుకు మనం కొంత రిస్కు తీసుకోవాలని పరమేశ్వరం అతడికి చెప్పటంతో ఈ పనిలో సాయం చేయడానికి డాక్టర్ ప్రసాద్ వీళ్లతో రావడానికి అంగీకరించాడు. దీనికి ఫీజు కూడా ఇప్పిస్తానని చెప్పాడు పరమేశ్వరం.
వాళ్లు షైనీ ఎంటర్‌ప్రైసెస్ ఆఫీసుకు ఫర్లాంగు దూరంలోనే ఆటో దిగిపోయాడు. అమావాస్య రోజులు కావడం, సిటీ శివారు ప్రాంతం కావడంతో వీధి లైట్లు అక్కడక్కడా మాత్రం వెలుగుతున్నాయి.
షైనీ ఎంటర్‌ప్రైజెస్ ఆఫీసుకు నడుచుకుంటూ వచ్చారు. ఆఫీసుపైన ఇంకా లైట్లు వెలుగుతున్నట్లుగా కిటికీలోంచి కనిపిస్తోంది.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842