డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారు అలా వెళ్తూ ఉండగా విశ్వామిత్రుడు కన్పించి గాలవునితో ఇలా అన్నాడు. ‘‘గాలవా! నీ అంతట నీవుగా ఇస్తానన్న గురుదక్షిణ ఇవ్వటానికి కాలం సమీపిస్తున్నది. నేను నీ దక్షిణ కోసం నిరీక్షిస్తున్నాను’’.
ఆ మాటలు విని గాలవుడు బాధపడ్డాడు. అలా బాధపడుతున్న గాలవునితో గరుడుడు ఇలా అన్నాడు. ‘‘ద్విజశ్రేష్ఠా! నీ గురువు అన్న మాటలు నేను కూడా విన్నాను. ఇద్దరం కలిసి ప్రయత్నించి నీ గురువుకు గురుదక్షిణ మొత్తం ఇచ్చేందుకు ప్రయత్నిద్దాం’’.
గరుడుడు గాలవునితో మరల ఇలా అన్నాడు. ‘‘్భమి లోపల ఉన్న భూసారతత్త్వాన్ని తపింపజేసి అగ్ని తయారు చేసినదాన్ని వాయువు శుద్ధి చేశాడు. అదే హిరణ్య. ఈ జగత్తు అంతా ధరించేది, ధరింపజేసేది కూడా ధనమే. ఆ ధనం లేకపోతే ఇప్పుడు నీకు కావలసిన గుర్రాలు దొరకవు. కనుక నీవు ధనం కోసం ఏ రాజునైనా యాచించు. చంద్రవంశంలో పుట్టిన రాజు ఒకడున్నాడు. అతను నాకు మిత్రుడు. అతని పేరు యయాతి. అతను సంపన్నుడు. నేను అతనికి వివరాలు చెప్తాను. నీవు స్వయంగా యాచించితే అతను నీకు కావలసినంత ధనం ఈయగలడు. ఇలా చేసి గురుదక్షిణ ఇచ్చి ఋణ విముక్తుడవు కమ్ము. ఇలా మాటలాడుకొని వారిరువురూ యయాతి దగ్గరకు వచ్చారు. మహారాజు ఇచ్చిన సత్కారాలను స్వీకరించారు. గరుడుడు యయాతితో తమ రాకకు కారణం వివరించాడు. వివరాలు చెప్పి ఇలా అన్నాడు. ‘‘ఈ నా మిత్రుడు గాలవుడు విశ్వామిత్రునికి కోరిన గురుదక్షిణ ఇవ్వలేక చాలా బాధపడు తున్నాడు. అతను నీ శరణం కోరి వచ్చాడు. మహారాజా! నీ నుండి ఆ భిక్షను స్వీకరించి దాన్ని గురుదక్షిణగా సమర్పించి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాడు. తన తపస్సులో కొంతభాగం నీకిస్తాడు. ఇతనికి దానం ఇవ్వగల దాతవు నీవు. స్వీకరించడానికి తగిన ప్రతిగ్రహీత ఇతను’’.
గరుడుని మాటలు విన్న యయాతి చాలాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ‘‘సూర్యవంశంలో రాజులని కాదని మీరు నా దగ్గరకు వచ్చారు. కనుక నా జన్మ సఫలమైంది. నా వంశం ఉద్ధరింప బడింది. కాని మీరనుకున్నట్లు నేను అంత సంపన్నుడను కాను. ఈ రాకను సఫలం చేయడానికి తగిన సంపద లేదు. అలాగని ఈ ద్విజశ్రేష్ఠుని నిరాశపరచడం కూడా నాకిష్టం లేదు. కనుక మీ పని సానుకూలమయ్యేటట్లు ఒకటిస్తాను. ఎందుకంటే యాచకుడు వచ్చి అడిగినపుడు రిక్తహస్తాలతో పంపితే వంశ నాశనవౌతుంది. కనుక నా పుత్రికను మీకిస్తాను. ఈమె నాలుగు వంశాలను వృద్ధి చేయగల శక్తి కలది. ఈమె రూపాన్ని చూసి దేవతలు, అసురులు, మానవులు ఈమెను పొందాలని కోరుతున్నారు. ఈమెను స్వీకరించు. ఈమెను శుల్కంగా చూపి కావలసిన గుర్రాలను పొందు. ఐతే నేను దౌహిత్రుడు గలవాడనయ్యే వరమీయి’’.
గాలవుడు ఆ కన్యను స్వీకరించి ఆమెతో గరుడునితో బయలుదేరాడు. గరుడుడు గాలవునికి గుర్రాలు సంపాదించే మార్గం దొరికినందున సంతోషంగా తన నివాసానికి వెళ్లిపోయాడు.
గాలవుడు కన్యతో సహా అయోధ్యకు వెళ్ళి ఇక్ష్వాకు వంశస్థుడైన హర్యశ్వ మహారాజును దర్శించాడు. హర్యశ్వనుడు ధనం బలం సంపద కలవాడు. గాలవుడు అతనితో ఇలా అన్నాడు. ‘‘రాజేంద్రా! ఈ కన్య తన సంతానంతో వంశాన్ని ఉద్ధరించగలది. కనుక తగిన శుల్కమిచ్చి ఈమెను భార్యను చేసుకో. ఆ శుల్కమేమిటో చెప్తాను విను. తర్వాత నిర్ణయించుకో’’ అని తన గురుదక్షిణ గురించి వివరించాడు.
రాజు ఆమె అన్ని శుభలక్షణాలు కలిగి ఉండడం గమనించి గాలవునితో ఇలా అన్నాడు. ‘‘విప్రోత్తమా! ఈమె దేవదానవులలో చాలా అందమైనది. బహు సంతానాన్ని పొందగలదు. నా వైభవాన్ని చూసి శుల్కం చెప్పు’’ అనగా విప్రుడు మరల అంతా చెప్పి శుల్కంగా ఎనిమిది వందల గుర్రాలు ఇమ్మన్నాడు. అతని మాటలు విని రాజు తన దగ్గర అటువంటి గుర్రాలు రెండు వందలే ఉన్నాయి అన్నాడు. కనుక ఆమెయందు ఒక పుత్రుని పొందెదనని చెప్పాడు.
అతని మాటలు విన్న కన్య మాధవి గాలవునితో ఇలా అంది. ‘‘ఒక మహాత్ముడు నాకు వరం ఇచ్చాడు. సంతానాన్ని పొందిన తర్వాత కూడా నా కన్యాత్వం చెడదని ఆ వరం. కనుక మీరు రెండు వందల గుర్రాలు తీసుకొని నన్ను రాజుకు ఇవ్వవచ్చు. నలుగురు రాజుల నుంచి మీకు కావలసిన ఎనిమిది వందల గుర్రాలు సమకూరుతాయి. నాకు నలుగురు పుత్రులు ఉంటారు. ఈ విధంగా మీరు గురుదక్షిణ సంపాదించవచ్చు. నేను మీకు చేయగలిగిన సహాయం ఇదే. ఆపైన మీ యిష్టం.’’
మాధవీకన్య ఇలా చెప్పగానే గాలవుడు ఆమెను తీసుకొని వెళ్ళి హర్యశ్వ మహారాజుతో ఇలా అన్నాడు. ‘‘హర్యశ్వా! ఈమెకు నిశ్చయించిన శుల్కంలో నాల్గవ భాగం గుర్రాలు ఇచ్చి ఈమెను స్వీకరించు. ఈమె వలన ఒక్క కుమారుని మాత్రమే పొందు. హర్యశ్వుడు గాలవునకు రెండు వందల గుర్రాలను శుల్కంగా ఇచ్చి ఆ కన్యను స్వీకరించాడు. హర్యశ్వనికి ఆమె వలన ఒక కుమారుడు కలిగాడు. అతడు కాంతిమంతుడూ, ధనవంతుడూ గొప్ప దాత అయ్యాడు.
తర్వాత గాలవుడు వచ్చి ఆ కన్యను తీసుకొని వెళ్లిపోయాడు. గుర్రాలను మాత్రం రాజు దగ్గరే ఉంచమన్నాడు. గాలవుడు మాధవితో ఇలా అన్నాడు. ‘‘కాశీరాజు దివోదాసు మహాపరాక్రమశాలి. కీర్తిమతుడు. అతను ధర్మాత్ముడు. సత్యపరాయణుడు. అతని దగ్గరకు వెళ్దాం.’’
గాలవుడు దివోదాసు దగ్గరకు పోయి, అతని సత్కారాన్ని పొంది, అతన్ని శుల్కాన్నిచ్చి కన్యను పొందమని కోరాడు. దానికి దివోదాసు ఇలా అన్నాడు. ‘‘తక్కిన రాజులను వదలిపెట్టి నా దగ్గరకు రావడం నన్ను గౌరవించడమే. అయితే నా దగ్గర కూడా రెండు వందల గుర్రాలు మాత్రమే ఉన్నాయి. కనుక నేను కూడా ఈమె యందు ఒక పుత్రుని పొందెదను’’.
గాలవుడు అతని దగ్గర నుండి రెండు వందల గుర్రాలు తీసుకొని కన్యను అతనికిచ్చాడు. వారిద్దరు అన్యోన్యంగా జీవించి ఒక కుమారుని కన్నారు. అతని పేరు ప్రతర్దనుడు. కొలదికాలంలోనే గాలవుడు వచ్చి మాధవిని తీసుకొని వెళ్లిపోయాడు. గుర్రాలను మాత్రం రాజు దగ్గరే ఉంచాడు.
తర్వాత గాలవుడు మాధవిని తీసుకొని ఉసీనర మహారాజు కోసం భోజనగరానికి వెళ్లాడు. అక్కడ రాజుని కలిసి ఇలా అన్నాడు. ‘‘రాజా! ఈ కన్య నీకు భూపాలకులు కాగల కుమారులని ఇద్దరిని ప్రసాదిస్తుంది. తగిన శుల్కమిచ్చి ఆమెను స్వీకరించు. ఆ శుల్కం ఒక చెవివైపు నల్లగా ఉండి చంద్రకాంతి రంగు గల నాలుగు వందల గుర్రాలు. అప్పుడు మహారాజు ఇలా అన్నాడు. ‘‘మహర్షీ! నాకు సంతానం పొందాలన్న కోరిక గాఢంగా ఉంది. కాని నా దగ్గర కూడా అట్టి గుర్రాలు రెండు వందలే ఉన్నాయి.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి