డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాచ్‌మెన్ తిరుపతయ్యకి భరణి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం అతడి స్నేహితులు ఎవరు ఎప్పుడు వచ్చినా అతడు కాదనడు. ఆ ప్రకారమే పదిహేను రోజుల క్రితం రాజేష్ వచ్చినా అతడు కాదనలేదు. తను ఎప్పుడు పడితే అప్పుడు స్వేచ్ఛగా వచ్చే వీలున్న ఆ గెస్ట్‌హౌస్‌కి డూప్లికేట్‌కీ చేయించుకుని దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?!
ఆ ఆలోచనతోనే ఒక్కసారి నిటారుగా అయ్యాడు అతడు. అనుమానం వెంట అనుమానం.. ప్రతి అనుమానం ప్రశ్నలకి దారి తీస్తోంది. ‘ప్రశ్నలు నిన్ను నిజానికి దగ్గర చేస్తాయి’ అన్న పాణి మాటలు గుర్తొచ్చాయి.
వెంటనే తన మేనల్లుడు శివకి ఫోన్ చేశాడు.
‘‘ఏమిటి మామయ్యా ఈ టైములో ఫోన్ చేసావు?’’ అన్నాడు శివ.
‘‘ఒక్క విషయం అడుగుతాను చెప్పు? భరణికి ప్రతి బుధవారం వచ్చే బెదిరింపు ఉత్తరాలు నువ్వు కాలేజీ లెటర్ బాక్సులోంచి తీసేవాడివా లేక నీకు వేరే ఎవరైనా తీసుకువచ్చి ఇచ్చేవారా?
‘‘లెటర్‌బాక్సులోంచే తీసేవాడిని’’
‘‘‘బాగా గుర్తుచేసుకుని చెప్పు. నువ్వు లెటర్ బాక్సు తెరిచినపుడు అందులో నీకు భరణికి వచ్చిన ఉత్తరం కనిపించేదా?’’
‘‘కాలేజీకి చాలా ఉత్తరాలు వచ్చేవి. అన్నీ తీసుకుని ఒక కవరులో వేసి ఆఫీసు రూమ్‌కి వెళ్లి సార్టు చేసుకునేవాడిని. నాకు సరిగ్గా గుర్తులేదు’’.
రవీంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి అన్నాడు. ‘‘లెటర్ బాక్సులోంచి తీసినవి కాకుండా ఇంకా ఎవరైనా వచ్చి నీకు ఉత్తరాలు ఇచ్చేవారా?’’
‘‘లెటర్ బాక్సులోంచి కాకుండా..’’ అంటూ ఒక్క నిమిషం ఆలోచించి ఏదో గుర్తుకు వచ్చినట్టుగా ‘‘ఆ- అప్పుడప్పుడు ఎవరైనా వచ్చి ‘శివా ఈ ఉత్తరాలు సెకెండ్ పోస్టులో వచ్చాయట. పోస్టుమెన్ నీకిమ్మన్నాడు’ అంటూ కొన్ని ఉత్తరాలు ఇచ్చేవారు.
వాటిని కూడా నేను బ్యాగ్‌లో వేసుకుని ఆఫీసుకు వచ్చి అన్నింటితోపాటూ సార్ట్ చేసి పంచేవాడ్ని’’.
ఒక్క క్షణం రవీంద్ర గుండె ఆగి, మళ్లీ కొట్టుకుంటున్నట్టు అనిపించింది. ‘‘్భరణికి ఉత్తరాలు వచ్చే బుధవారంనాడు రెగ్యులర్‌గా అలా ఎవరైనా ఇచ్చేవారా? ఒక్కసారి బాగా గుర్తుచేసుకుని చెప్పు’’ అన్నాడు. అతడికి మరింత బాగా అర్థమవ్వాలని ‘‘అంటే నా ఉద్దేశం భరణికి వచ్చే ఆ ఉత్తరాలు పోస్టులో కాకుండా, ఎవరైనా నీకు ప్రత్యేకంగా తీసుకువచ్చి ఇచ్చారేమో ఆలోచించి చెప్పు’’.
‘‘సరిగ్గా గుర్తురావడంలేదు కానీ అలా ఇచ్చినట్టే అనిపిస్తోంది’’.
‘‘బుధవారం నాడు ఖచ్చితంగా సెకెండ్ పోస్ట్ అందేదా? ఆ సెకెండ్ పోస్ట్ నీకు ఇచ్చిన వాళ్ళలో రాజేష్ ఉన్నాడా?’’ తన ఆఖరి ప్రశ్నని మెల్లగా, సూటిగా సంధించాడు రవీంద్ర.
అవతలివైపునుంచి రెండు నిమిషాలు నిశ్శబ్దం. శివ కళ్ళు మూసుకుని ఏదో గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది రవీంద్రకి. కొద్దిసేపు అతడు కూడా ఏమీ మాట్లాడలేదు.
నిశ్శబ్దం బద్ధలైనట్టుగా అవతల నుంచి హఠాత్తుగా వినిపించింది శివ కంఠం ‘‘గుర్తొచ్చింది మావయ్యా.. భరణికి ఉత్తరం వచ్చే ప్రతిసారీ, కారిడార్లోనో దారిలోనో నాకెవరో ఒకరు తీసుకువచ్చి సెకెండ్ పోస్టు వచ్చిందని ఇచ్చేవారు. ఒకటి రెండుసార్లు రాజేష్ ఇచ్చాడు. తరువాత కూడా ఇచ్చినవాళ్ళు ‘సెకెండ్ పోస్టు వచ్చిందట, రాజేష్ నీకిమ్మన్నాడు’ అని అనడం ఇపుడు గుర్తొస్తోంది. ఆ మాటలని అపుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. నువ్వు అడగడంవల్ల బాగా గుర్తుతెచ్చుకుంటే గుర్తుకువచ్చింది. ఎందుకిదంతా అడుగుతున్నావు?’’
‘‘తరువాత చెబుతాను. నేను చెప్పినది గుర్తుంది కదా? ఎవరితోనూ ఈ విషయాలు చర్చించకు’’ అన్నాడు రవీంద్ర.
‘‘అలాగే’’ అని ఫోన్ పెట్టేశాడు శివ.
ఫోన్ పెట్టేశాక రవీంద్ర ఆలోచనలు వేగంగా సాగాయి. సైబర్ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి అక్కడ ఎస్సైగా పనిచేసే తన స్నేహితుడు వేణుతో అన్నాడు. ‘‘నేను ఒక మొబైల్ నెంబరు చెబుతాను, ఆ మొబైల్‌కి గత నెల రోజులుగా రెగ్యులర్‌గా వచ్చిన కాల్స్ వివరాలు కనుక్కుని చెప్పగలవా?’’ అన్నాడు.
‘‘అది పెద్ద విషయం కాదు. పది నిమిషాల్లో డేటా నీ ముందు ఉంటుంది. నెంబరు చెప్పు’’ అన్నాడు అతడు.
రవీంద్ర రాజేష్ నెంబరు చెప్పాడు. ‘‘అంతేకాదు, ఆ నెంబరు నుంచి ఈ నెంబరుకి ఏమైనా కాల్స్ వెళ్ళాయా, వెడితే ఎప్పుడెప్పుడు వెళ్ళాయి? కాల్ డ్యూరేషన్ ఎంతా? ఆ డీటెయిల్స్ కూడా కావాలి?’’
‘‘తప్పకుండా. నేను ప్రస్తుతం డ్యూటీలో వున్నాను. నువ్వడిగిన సమాచారం ఎక్స్ఛేంజి నుంచి తెప్పించి అరగంటలో నీకు ఇస్తాను’’ అన్నాడు వేణు.
రవీంద్ర అతడికి ఇచ్చిన రెండో నెంబరు హరితది!
సరిగ్గా అరగంట తరువాత వేణు దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. ‘‘నువ్వు ఇచ్చిన రెండు నెంబర్లకీ చాలా తరచుగా కాల్స్ వెడుతున్నాయి. కాల్ డ్యూరేషన్ మరీ ఎక్కువగా లేదు గానీ తరచుగా కాల్స్ వెడుతున్నాయి. మొత్తం డీటెయిల్స్ నీ మొయిల్ ఐ.డి.కి పంపించాను’’ అన్నాడు వేణు.
తన మెయిల్ తెరిచి చూడకుండానే జరిగినది ఏమిటో కొద్ది కొద్దిగా అర్థవౌతోంది అతడికి. సంధ్యని మోసం చేసి, ఆమె చావుకి కారణమైన భరణిమీద పగ తీర్చుకోవాలనుకున్నాడు రాజేష్.
సంధ్య బ్రతికి ఉన్నపుడు తను సంచరించిన ప్రదేశాల్లో తిరుగుతోందని తెలిసి ఆమెతో మాట్లాడడానికి ఎవరికీ తెలియకుండా తరచూ గెస్ట్‌హౌస్‌కి వెళ్ళేవాడు.
తన వెంట పడుతున్న భరణిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్న హరితతో చేతులు కలిపాడు. హరిత భరణితో సన్నిహితంగా ఉంటున్నట్టు నటిస్తూ అతడ్ని గెస్ట్‌హౌస్‌కి రప్పించాడు.
గెస్ట్‌హౌస్ దగ్గర సంధ్య ఆత్మ భరణిని చంపేసింది. హరిత, రాజేష్ గుట్టు చప్పుడు కాకుండా మాయమయ్యారు.
జరిగిన సంఘటనలనీ, పరిశోధనలో బయటపడ్డ విషయాలనీ క్రోడీకరించుకుంటే, ఆ విధంగా తప్ప మరో విధంగా జరిగే అవకాశం కనిపించలేదు అతడికి.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ