డైలీ సీరియల్

అన్వేషణ -56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రండి ప్రసాద్‌గారూ.. ఆటోలో వెళదాం..’’ అన్నాడు.
ఇద్దరూ వెళ్లి ఓ గంటలో తిరిగొచ్చారు విజయగర్వంతో.
***
నిర్వికారంగా కుర్చీలో కూర్చున్న అనిరుధ్‌ని చూసి కొండబాబుకి మనస్సు అదోలా అయిపోయింది. అతడినే తదేకంగా చూస్తున్న పరమేశ్వరానికి కూడా మనస్సు అదోలా అనిపించింది.
అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు కావస్తూంది. అరగంట క్రితమే వాళ్లు ముగ్గురూ డాక్టర్ మధుకర్ దగ్గరికి వెళ్లొచ్చారు. అక్కడ రిపోర్టు ఫలితం చూశాక అనిరుధ్ మాటా పలుకూ లేకుండా రూముకొచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచీ అలా కుర్చీలో వౌనంగా కూర్చుండిపోయాడు. కొండబాబు పిలిచినా, పరమేశ్వరం పిలిచినా ఊ.. ఊ.. అంటూ సమాధానం చెబుతున్నాడేగానీ ఏమీ మాట్లాడ్డంలేదు.
‘‘అనిరుధ్‌గారూ..’’ పిలిచాడు పరమేశ్వరం.
అభావంగానే అతడికేసి చూశాడు అనిరుధ్.
‘‘ఎందుకలా ముభావంగా ఉంటున్నారు? ఇప్పుడేమైంది.. ఈ త్రాష్ఠుడు కూడా మీకు ఏమీ కానందుకు సంతోషించండి.. నాకు మొదట్నుంచీ అనుమానంగానే ఉంది.. వీళ్ళు మీకు ఎంతమాత్రం ఏమీ కారని.. ఆ మాట మీకు మొన్ననే చెప్పాను. వాళ్ల జీన్స్ మీలో ఏమాత్రం లేవు. వాళ్లు నికృష్టులు.. నీచులు.. ఇప్పుడు మీరు ఉండాల్సింది హ్యాపీగా.. విచారంగాకాదు.. ఈ నలుగురూ కాదు.. మరెవరో మీ పుట్టుకకు బీజం వేశాడు.. ఇక ఈ విషయం వదిలెయ్యండి.. మీరు భగవంతుడిని నమ్మితే ఒక ఉన్నతమైన ఉద్యోగంలో మీ స్థితిని నిలబెట్టాడు..మీకు ఆప్యాయతను పంచి ఇచ్చే అమ్మమ్మనిచ్చాడు.. అన్నింటికంటే ముఖ్యమైనది మీకు మంచి మనస్సునిచ్చాడు. జీవితంలో ఇంతకంటే ఏం కావాలి అనిరుధ్‌గారూ.. ప్లీజ్ లీవ్ దట్ నానె్సన్స్..’’ అనునయంగా చెప్పాడు పరమేశ్వరం తన కుర్చీని అనిరుధ్‌కి దగ్గరగా లాక్కుని.
‘‘మీరన్నది నిజమేనండి.. కానీ... నేనెవరికి పుట్టాను.. నా తండ్రెవరు అనంటే నేనేం చెప్పుకోవాలి.. అదే నా బాధ..’’ ఎట్టకేలకు పెదవి విప్పాడు అనిరుధ్.
‘‘నువ్వు.. పద్మకి పుట్టావు.. మా పద్మత్తకు పుట్టావు..’’ అరిచినట్టు అన్నాడు కొండబాబు.
‘‘ఎస్!.. మీరు పద్మ అనే కల్లాకపటం తెలీని ఓ స్వచ్ఛమైన మంచి ముత్యానికి పుట్టారు.. దట్సాల్.. మంచి ముత్యానికి పుట్టారు..’’ పరమేశ్వరం అన్నాడు నవ్వుతూ.
‘‘పరంగారు చెప్పింది అక్షరాలా నిజంరా.. పద్మత్త మంచి ముత్యమేరా..’’ కొండబాబు అన్నాడు.
‘‘ఇంక ఈ అనే్వషణ ఇక్కడితో ఆపెయ్యండి.. హ్యాపీగా వెళ్లండి..’’ పరమేశ్వరం చెప్పాడు.
‘‘అలాగే సర్.. హ్యాపీగానే వెళతాను.. ఆ దుర్మార్గులు నాకేం కానందుకు నాకు నిజంగా హ్యాపీగానే ఉంది.. కానీ అసలు వ్యక్తి ఎవరన్నదే కొంచెం బాధగా ఉంది.. ఇపుడు ఆ బాధ కూడా ఇక్కడే వదిలేస్తున్నాను.. హ్యాపీగా వెళతానరు..’’ అంటూ లేచాడు అనిరుధ్. బట్టలు సర్దుకోసాగాడు. కొండబాబుకు కూడా సర్దమని సౌంజ్ఞ చేశాడు.
‘‘పరంగారూ.. మీరూ మాతో రండి.. రెండు మూడు రోజుల్లో మనం హైదరాబాద్ వెళ్లిపోదాం..’’ అన్నాడు పరమేశ్వరంతో అనిరుధ్.
‘‘నేను మీకు భారం అవుతాను అనిరుధ్‌గారూ..’’ పరమేశ్వరం అన్నాడు నవ్వుతూ.
‘‘కారు.. భారం కారు.. అక్కడ మీకు నచ్చిన, మీకు సూటయిన జాబ్ చేద్దురుగాని.. నా మనసులో కొన్ని ఆలోచనలున్నాయి.. వాటిని అమలు చేద్దాం..’’ చెప్పాడు అనిరుధ్.
‘‘ఆల్‌రైట్.. ఓ పని చెయ్యండి.. ముందు మీరు వెళ్లండి.. మీరు హైదరాబాద్ వెళ్లాక నాకు ఫోన్ చెయ్యండి.. అపుడు నేను వస్తాను.. ఈలోగా ఇక్కడ అన్నీ సెటిల్ చేస్తాను.. అంటే అప్పులు గట్రా ఏమీ లేవు.. మీరు వెళ్ళాక నేను తప్పకుండా వస్తాను.. ఎందుకంటే.. ఈ జాబ్ నాకూ చికాగ్గానే ఉంది. మాటిమాటికీ ఉద్యోగాలు మారడం ఇష్టంలేక ఏదో ఉన్నానిక్కడ..’’ చెప్పాడు పరమేశ్వరం ఏదీ దాచకుండా.
‘‘సరే సర్!..మేం వెళతాం.. ఏ ట్రెయిన్ ఉంటే ఆ ట్రెయిన్‌కి వెళ్లిపోతాం..’’ చెప్పాడు అనిరుధ్.
వాళ్లు స్టేషన్‌కి వచ్చేసరికి ట్రెయిన్ సిద్ధంగా ఉంది. రిజర్వేషన్ బోగీ ఎక్కారు, అవకాశం ఉంటే టిటిఇతో మాట్లాడి ఏదైనా సీటు సంపాదిద్దామని. వారం మధ్యలో కావడంవల్ల అంత రద్దీగా లేదు ట్రెయిన్. అరగంటలోనే వాళ్లకి బెర్తు దొరికింది. వాళ్లు ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండుగంటలు దాటింది.
యధాప్రకారం అనిరుధ్‌కి రాత్రి ఇక నిద్రపట్టలేదు. ట్రెయిన్‌లో అతడు నిద్రపోయిందేమీ లేదు. ప్రస్తుతం అతడి మెదడంతా ఖాళీగా తయారైంది. ఏ ఆలోచనలూ లేవు. ఏ టెన్షన్‌లూ లేవు. అయినా కంటిమీద కునుకు రావడంలేదు.
ఉదయం బాగా ప్రొద్దుపోయాక నిద్రలేచాడు అనిరుధ్.
‘‘ఏరా అనిరూదూ.. వెళ్లిన పనయిందా’’ అనడిగింది అమ్మమ్మ. అతడు ఆఫీసు పనిమీద వెళ్లాడని అనుకుంటోందామె. అయిందన్నట్లు తలూపాడు అస్పష్టంగా.
కాఫీ ఇచ్చిందామె. మనవడికోసం ఉప్మా టిఫినూ చేసింది. కాస్సేపున్నాక టిఫిన్ పెట్టింది. వౌనంగా తిన్నాడు. మళ్లీ కాఫీ ఇచ్చిందామె.
‘‘అమ్మమ్మా. ఈ పదిహేను రోజులూ నేను ఇక్కడికొచ్చి చేసిందేమిటో తెలుసా?’’ అని ప్రశ్నించాడు.
‘‘అదేమిట్రా.. నాలుగు రోజులు ఉందామని వచ్చానే అమ్మమ్మా అన్నావ్.. ఆఫీసు పని కూడా ఉందన్నావ్!’’ అన్నదామె.
‘‘లేదు అమ్మమ్మా!.. నేను వచ్చింది నా నాన్న ఎవరో తెలుసుకోవాలని వచ్చాను.. వైజాగ్ వెళ్లిందీ అందుకే..’’ నెమ్మదిగా చెప్పాడు.
అంతపని చేశావా అన్నట్లు చేతితో నోటిమీద చిన్నగా తట్టుకుంది. తర్వాత అడిగింది- ‘‘మరి తెలిసిందా?’’ అని.
‘‘లేదమ్మమ్మా!.. తెలీలేదు.. ఆ నలుగురిలో ఎవరూ కాదు.. మరి ఎవరికి నేను పుట్టానో తెలీదు.. ’’ అన్నాడు నిర్వికారంగా..
‘‘వాళ్లెవరూ కాదా.. పద్మని చెరిచినవాళ్లెవరూ కాదా!..’’ ఆశ్చర్యంగా అడిగిందామె.
‘‘కాదని డాక్టర్ పరీక్షల్లో తేలింది..’’
‘‘అంటే.. అంటే.. ఆ వెధవే!.. అని స్వగతంలా అనుకున్న మాటలు పైకి అనేసిందామె.’’
‘‘ఏ వెధవ!?..’’ చటుక్కున అమ్మమ్మకేసి చూశాడు అనిరుధ్.
‘‘ఏం లేదు.. ఏం లేదు..’’ అంటూ మాట మార్చబోయిందామె.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842