డైలీ సీరియల్

అన్వేషణ -57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మమ్మా.. చెప్పు ఎవరు ఆ వెధవ.. ఏదో దాస్తున్నావ్.. చెప్పు అమ్మమ్మ..’’ అంటూ ఆమె భుజాలు పట్టుకుని కుదిపాడు అనిరుధ్.
అప్రయత్నంగా ఆమె కళ్ల వెంట నీళ్లు జలజలా రాలాయి.
‘‘అమ్మమ్మా.. ఏమైంది చెప్పు.. ఎవరు ఆ వెధవ..?’’ మళ్లీ ఆమెను కుదుపుతూ అడిగాడు అనిరుధ్.
‘‘వాడేరా.. మీ మామయ్య బావమరిది.. మీ అత్తమ్మ తమ్ముడు.. ప్రకాశంగాడు... వాడు తరచూ వచ్చేవాడు. మీ అమ్మకేసి వెధవ చూపులు చూసేవాడు.. అక్కడికి నేను ఓసారి తిట్టాను దాని జోలికి వెళ్లొద్దని.. వాడినేమన్నా అంటే మీ అత్తమ్మకి కోపం వచ్చేది. కానీ వాడు ఎప్పుడూ పద్మతో పరాచికాలు ఆడేవాడు..వాడే ఏదో చేశాడు.. దాన్ని నేను ఇరవై నాల్గుగంటలూ కాపలా కాయలేనుగా.. వాడు దుర్మార్గుడురా..’’ అంటూ ఆమె గుడ్ల నీరు కుక్కుకుంది వణికిపోతూ.
అనిరుధ్‌లో ఏదో ఆలోచన తళుక్కున మెరిసింది. పరమేశ్వరం అన్నమాటలు గుర్తుకొచ్చాయి.. ‘ఈ నలుగురిలో ఒకరు తప్పుకోవచ్చు.. మరొకడు కలవచ్చు..’ అని. అంటే అత్తమ్మ తమ్ముడు ప్రకాశం.. మతిస్థిమితం లేని పద్మమీద.. తన తల్లిమీద అత్యాచారం చేశాడా..?! అనిరుధ్‌లో ఆలోచనలు గిర్రున తిరిగాయి.
చటుక్కున లేచి కొండబాబు దగ్గరికి వెళ్లాడు.. అప్పుడే నిద్రలేచి కొండబాబు బ్రష్‌చేసుకుంటున్నాడు. అనిరుధ్‌ని చూడగానే సావిత్రి రండన్నయ్యా అని చెప్పి వంటింట్లోకి వెళ్లింది అతడికి, భర్తకీ కాఫీ కలపడానికి. ఐదు నిముషాల్లో కొండబాబు వచ్చాడు ముఖం తుడుచుకుంటూ.
ఏ ఉపోద్ఘాతమూ లేకుండా తనకి ప్రొద్దునే్న అమ్మమ్మ చెప్పిన ప్రకాశం గురించి వివరించాడు అనిరుధ్.
‘‘అమ్మమ్మ అలా చెప్పిందంటే ఏదో ఆలోచించాల్సిందేరా?.. ప్రకాశం చెడ్డవాడని చెప్పలేంగానీ, అప్పటికి వాడు వయస్సులో ఉన్నాడు..ఇంట్లో ఏమీ తెలీని వయసులో ఉన్న ఆడపిల్ల కనిపిస్తోంది.. వాడు కక్కూర్తిపడుంటాడు.. అయినా.. ఇప్పుడు మనం వాడి గురించీ ఆలోచించాల్సిందే..’’ అన్నాడు కొండబాబు భార్య సావిత్రి ఇచ్చిన కాఫీ కొద్ది కొద్దిగా తాగుతూ.
అతడు చెబుతున్నదంతా వింటూ కూర్చున్న అనిరుధ్ చేతిలో కాఫీ కొద్దిగా చల్లారడంతో రెండు గుక్కల్లో తాగేశాడు-
‘అయ్యో చల్లారిపోయిందేమోరా’ అని కొండబాబు అంటున్నా వినకుండా-
‘‘ఇప్పుడేం చేద్దాం?’’ అడిగాడు అనిరుధ్.
వెంటనే ఏ సమాధానమూ చెప్పలేదు కొండబాబు. కాస్సేపు ఆలోచిస్తూండిపోయాడు.
‘‘వాడిని కూడా టెస్టు చేయిస్తే..?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘చేయిద్దాం.. ఈసారి సీక్రెట్‌గా కాదు.. విషయం వాడికి చెప్పి.. మర్యాదగా టెస్టుకి ఒప్పుకోమందాం.. లేకుంటే కేసు పెడతాం అని బెదిరిద్దాం.. కాదంటే నాలుగు తన్నయినా వాడి మెడలు వంచి టెస్టుచేయిద్దాం..’’ కొండబాబు అన్నాడు దవడ కండరాలు బిగిస్తూ.
‘‘అంతే.. అలాగే చెయ్యాలి..’’ అనిరుధ్ వంత పలికాడు.
‘‘అభం శుభం తెలీని ఆడపిల్లని అనుభవించడం ఈ నా...కి ఎంత తేలికైపోయిందిరా..’’ కొండబాబు అదే స్థాయిలో అన్నాడు.
‘‘ఎప్పుడు వెళదాం వాడి దగ్గరికి?’’ అడిగాడు అనిరుధ్. వాడి విషయం కూడా తొందరగా తేల్చుకోవాలని ఉందతడికి.
‘‘ఎప్పుడో ఎందుకు? ఈరోజే వెళదాం.’’ చెప్పాడు కొండబాబు.
‘‘వాడెక్కడుంటాడు?’’
‘‘జస్ట్.. ఓ పది కిలోమీటర్ల దూరంలో.. దగ్గరే..’’
‘‘సరే! నేను పది గంటలకొస్తాను. వెళదాం.’’ అని చెప్పి లేచి వచ్చేశాడు అనిరుధ్.
వీళ్లు వెళ్లేటప్పటికి ప్రకాశం ఇంట్లోనే ఉన్నాడు. కొండబాబు వెళ్లి పిలవడంతో బయటికివచ్చాడు. మనిషి చూడ్డానికి అరవై ఏళ్లవాడిలా ఉంటాడుగానీ ఏభయ్యేళ్లుంటాయి. ఈమధ్యనే కాస్త వళ్లు చేశాడు. తల పూర్తిగా నెరసిపోయింది. ఎప్పుడూ తెల్ల లుంగీమీదనే ఉంటాడు. పొట్టి చేతుల చొక్కా వేసుకుంటాడు. భుజంమీద ఓ తుండుమాత్రం విధిగా ఉంటుంది. చొక్కా జేబు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. డబ్బుతో కాదు, పిచ్చి కాగితాలతో. ఏవేవో పనులు చేస్తాడు. ఏదీ నికరంగా చెయ్యడు. ఆ విషయంలో ఎప్పుడు అతడి బావ సత్యం తిడుతూనే ఉంటాడు. అప్పుడప్పుడు అక్క భూదేవి దగ్గరికెళ్లి చేతులు చాస్తుంటాడు. మనిషి చెడ్డవాడుకాదు కానీ, అవసరాలు అతడి చేత చెడ్డ పనులు చేయిస్తూంటాయి. పోయిన ఏడాదే కూతురికి కష్టపడి పెళ్లిచేశాడు. కొడుకు డిగ్రీ సగంలో ఆపేసి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు అతడే కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పవచ్చు.
కొండబాబుతో రోడ్డుమీదకొచ్చి ప్రకాశం అక్కడ అనిరుధ్‌ని చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు, వీడు ఎందుకొచ్చాడా అనీ
రోడ్డుమీద కొంతదూరం తీసుకొచ్చాడు కొండబాబు అతడిని. వాళ్లిద్దర్నీ వౌనంగా అనుసరించాడు అనిరుధ్.
‘‘చూడు బాబాయ్.. నీకు మాణిక్యమ్మ కూతురు పద్మ తెలుసు కదా!’’ అని ప్రశ్నించాడు కొంతదూరం వచ్చాక ఓ ప్రక్కగా నిల్చుంటూ ప్రకాశాన్ని కొండబాబు.
ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు వేశాడో అని క్షణం ఆశ్చర్యపోయాడు ప్రకాశం. అయినా సర్దుకుని అన్నాడు. ‘‘తెలుసు.. పాపం పిచ్చిది కదా!’’ అని.
‘‘కదా!.. ఆ పిచ్చిదాన్ని నువ్వు అనుభవించావు కదా?!’’ నెమ్మదిగా అతడికి మాత్రమే వినిపించేట్లు అడిగాడు కొండబాబు.
‘‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు..’’ ప్రకాశం అన్నాడు బింకంగా.
‘‘అబద్ధాలొద్దు బాబాయ్.. దానికి సాక్ష్యాలున్నాయి. ఈ మధ్యనే బయటపడ్డాయి.. నిజం చెప్పు..’’ కొండబాబు అన్నాడు.
‘‘్ఛఛ!.. అదేం లేదు..’’ ప్రకాశం మళ్లీ కొట్టిపారేశాడు.
‘‘ఇతడెవరో తెలుసుకదా?!.. నీమీద కేసు పెట్టబోతున్నాడు.. నీ పరువు బజారుకి ఈడ్చడం ఖాయం.. ఆలోచించు.. నిజం చెబుతావో.. కేసులో ఇరుక్కుంటావో నీ ఇష్టం..’’ అన్నాడు కొండబాబు.
‘‘నాకేం తెలీదు.. నామీద ఎందుకు కేసు పెడతారు.. ఏమని పెడతారు?’’
‘‘ఏమనా?.. ఇతడే నాకు తండ్రి అని.. అపుడు ఉనీ మీద కోర్టు డిఎన్‌ఎ టెస్టు చెయ్యమని ఆదేశిస్తుంది.. తెలుసుగా ఈమధ్య ఓ మాజీ గవర్నర్ ఇలాంటి కేసులో ఇరుక్కుని పరువు పోగొట్టుకున్నాడు. పేపర్లనిండా వార్తలొచ్చాయి..’’ బెదిరింపుగా అన్నాడు కొండబాబు.
ప్రకాశం మాట్లాడలేదు. బెదురుగా ఆ ఇద్దరికేసి చూశాడు.
‘‘ఆలోచించుకో ఇపుడు లాయర్ దగ్గరకెళుతున్నాం.. ఎందుకేనా మంచిదని నీకు చెబుతున్నాను.. అందుకే ఇటొచ్చాం..’’ కొండబాబు చెప్పాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842