డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పృథువుకు భూమి దున్నకుండానే పంటలనిచ్చింది. ఆవులన్నీ కామధేనువు లైనాయి. ప్రతి చెట్టు ప్రతి ఆకులోను తేనె నిండి ఉంది. దర్భలు సువర్ణమయ్యాయి. పండ్లు తీయగా అమృతంలాగ రుచిగా ఉండేవి. మనుష్యులంతా ఆరోగ్యంగా ఉండేవారు. వారికి ఎలాంటి భయమూ ఉండేది కాదు. వారు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే యధేచ్ఛగా ఉండేవారు.
ఒకప్పుడు పృథు చక్రవర్తి దగ్గరకు వనస్పతులు, పర్వతాలు, దేవతలు, అసురులు, నరులు, నాగులు, సప్తఋషులు, యక్షులు, గంధర్వులు, పితరులు వచ్చి ఇలా అన్నారు. ‘‘మహారాజా! నీవు సమ్రాట్టువు, క్షత్రియుడివి, రక్షకుడివి, మాకు తండ్రివి, ప్రభువువు. మాకు కావలసిన వరాలు ఇవ్వు. తృప్తిగా, సుఖంగా ఉంటాము’’.
రాజు సరేనని ముందు ధనుర్బాణాలు తీసుకొని కొంచెం ఆలోచించి భూదేవితో ఇలా అన్నాడు. ‘‘వసుధా! ఇక్కడికి వచ్చి వీరు కోరిన పాలధారలను కురిపించు. నీకు మేలు కలుగుతుంది. అందువల్ల వీరికి కావలసిన ఆహారం ఇస్తాను’’.
భూదేవి ఇలా అంది - ‘‘రాజా! నన్ను పుత్రికగా స్వీకరించు’’.
పృథువు దానికి ఒప్పుకున్నాడు. కావలసినవన్నీ సిద్ధం చేశాడు. అప్పుడు ప్రాణుల సమూహాలు ఆ వసుధను పితికాయి. మొదట వనస్పతులు ఆమెను పిదికాయి. గోరూపంలో ఉన్న వసుధ వాత్సల్యంతో దూడను పిదికేవానిని, పిదికే పాత్రను కోరింది. అప్పుడు సృష్టించిన మద్దిచెట్టు దూడగాను, జువ్విచెట్టు పిదికేవానిగాను ఖండితమైనవి. చిగురించటం పాలుగాను, మేడిచెట్టు పిదికే పాత్రగాను అయినాయి.
తర్వాత ఉదయ పర్వతం దూడ, మేరు పర్వతం పిదికేవాడు, రత్నాలు, ఔషధులు పాలు రాయి పాలపాత్ర అయినాయి.
దేవతలలో ఒకరు పిదికేవారు, ఒకరు దూడ అయ్యారు. వారు అమృతమయమైన దుగ్ధాన్ని పితికారు. అసురులలో ద్విశిరుడు పిదికేవాడు, విరోచనుడు దూడ అవగా పచ్చికుండలో మాయ అనే పాలను పిదికారు.
నరులు భూమి మీద కృషినీ సస్యాన్ని పిదికారు. స్వాయంభువు మనువు దూడ అవగా పృథు చక్రవర్తి పిదికేవాడు అయ్యాడు. నాగులు సొరకాయ బుర్రలలో గోరూప అయిన భూమి నుండి విషం పిదికారు. ధృతరాష్ట్రుడనే నాగరాజు పిదికేవాడు, తక్షకుడు దూడ అయ్యారు.
సుకర్మలు చేసే సప్తర్షులు తపస్సు వేదాలనే పాలను పిదికారు. బృహస్పతి పిదికేవాడు, ఛందస్సు పాత్ర సోముడు దూడ అయ్యారు.
యక్షులు ఆమ పాత్రలో అంతర్థాన విద్యను పిదికారు. కుబేరుడు పితికేవాడు శంకరుడు దూడ అయ్యారు.
గంధర్వులు, అప్సరసలు పద్మపాత్రలో పవిత్రమైన గంధాలను పిదికారు. వారిపై చిత్తరథుడు దూడ, విశ్వరుచి పిదికేవాడు అయ్యారు. పితృదేవతలు వెండి పాత్రలో స్వధను భూధేనువు నుండి పిదికారు. వైవస్వతుడు దూడ, యముడు పిదికేవాడు అయ్యారు.
ఈ విధంగా సర్వప్రాణులు గోరూప భూదేవి నుండి తమకు కావలసినవి పితుకుతున్నారు. వారు ఇప్పటికీ ఆ పాత్రలతోనే, ఆ దూడలతోనే తమ జీవితాలను వెళ్లదీస్తున్నారు.
పృథు చక్రవర్తి ఎన్నో యజ్ఞాలు చేసి ప్రాణులన్నింటికీ వాటికి కావలసిన కోర్కెలు తీర్చాడు. అతను భూమిలోంచి లభించే వస్తువులను సువర్ణమయం చేసి వాటిని అశ్వమేదయజ్ఞం చేస్తున్న సమయంలో బ్రాహ్మణులకు దానం చేశాడు. భూమండలాన్ని సువర్ణమయం చేసి బ్రాహ్మణులకు దానం చేశాడు.
ఈ దాతృత్వం వలన భూమికి అతని పేరు మీద పృథివి అన్న పేరు వచ్చింది.
7. శిబి చక్రవర్తి
ఉసీనరుని కుమారుడు శిబి. అతను తన శత్రువులను సంహరిస్తూ పర్వతాలు, నదులు, ద్వీపాలు గల ఈ భూమిని తన రదచక్ర ధ్వనితో ప్రతిధ్వనింపజేశాడు. అతను ఎన్నో యజ్ఞాలను చేసి దక్షిణలతో దానాలతో బ్రాహ్మణులని సంతృప్తపరచాడు. ఆయన వేయి కోట్ల సువర్ణ ముద్రలను దానం చేశాడు. అతను ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు కలవో అన్ని గోవులను దానం చేశాడు. అతను చేసిన యజ్ఞాలు ప్రాణుల సమస్త కోర్కెలను తీర్చేవి. అతని యజ్ఞాలలో బ్రాహ్మణులకు ఉత్తమ భోజన పానీయములు సమకూరేవి. అతని దానాలకు తృప్తి చెంది రుద్రుడు అతనికి ‘‘రాజా! నీ దానాలు, శ్రద్ధ, కీర్తి, ఉత్తమ కర్మలు అక్షయంగా ఉంటాయి. నీకు ఉత్తమ స్వర్గ ప్రాప్తి కలుగుతుంది’’ అని వరం ఇచ్చాడు.
శిబి చక్రవర్తి దానానికే కాదు త్యాగానికి కూడా ఉదాహరణగా నిలుస్తాడు. అతను తనను శరణు కోరినవారికోసం ప్రాణం సైతం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఒకసారి శిబి చక్రవర్తి సభలో ఉండగా ఒక డేగ ఒక పావురాన్ని తరుముకుంటూ వచ్చింది. పావురం డేగ నుండి తప్పించుకొని శిబి ఒడిలో చేరి అతన్ని శరణు వేడింది. అదే సమయంలో డేగ శిబిదగ్గరకు వచ్చింది. తనకు ఆహారంగా లభించిన పావురాన్ని విడిచిపెట్టమని అడిగింది. అప్పుడు శిబి దానితో ఇలా అన్నాడు. ‘‘నీ కడుపు నింపుకోవడం కోసం దీనిప్రాణాలు తీయడం తప్ప వేరే ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పు, చేస్తాను’’.
డేగ ఇలా అన్నది - ‘‘డేగలను పక్షులను వేటాడి చంపడ సహజం. ఇందులో తప్పు లేదు. అయినా నీవు దీన్ని రక్షించాలనుకుంటే దీనితో సమానమైన నీ కుడి తొడ మాంసాన్ని ఇవ్వు’’.
వెంటనే సంతోషంతో శిబి త్రాసు తెప్పించి ఒకవైపు తక్కెడలో పావురాన్ని పెట్టి రెండవ వైపు తక్కెడలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఎంత మాంసము వేసినా పావురం ఉన్న తక్కెడ పైకి లేవలేదు. చివరకు రాజు స్వయంగా త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు డేగ పావురాలు తమ తమ నిజరూపాలు ప్రదర్శించాయి. ఇంద్రాగ్నుగులుగా మారి శిబిచక్రవర్తి త్యాగగుణాన్ని ప్రశంసించాయి. అతని త్యాగం లోకానికి ఆదర్శంగా నిలిచిపోయింది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి