డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ... 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే సమయంలో లక్ష్మి ద్వారా రాజేష్‌కి భరణి నన్ను వేధిస్తున్న సంగతి తెలిసింది. భరణికెలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటన్న రాజేష్‌కి దానికి సంధ్యని ఆయుధంగా వాడుకోవచ్చునని ఐడియా వచ్చింది. అందుకు సంధ్య కూడా ఆనందంగా ఒప్పుకుంది. భరణి తన తప్పు తెలుసుకుంటే, సంధ్య మామూలు మనుషుల్లోకి త్వరగా వస్తుందన్న మరో ఆశ కూడా జరగబోయే నాటకానికి రాజేష్ ప్లాన్ చేసేలా చేసింది.
సంధ్య, లక్ష్మి, నేను, రాజేష్ కలిసి మేము ఆడదలచుకున్న నాటకానికి ప్లాన్ చేసుకున్నాము. అందులో భాగంగానే నేను భరణికి లొంగిపోయినట్టుగా నాటకం ఆడాను. హాస్టల్ బిల్డింగ్‌లోనూ, ఐమాక్స్ థియేటర్లోనూ, మరికొన్నిచోట్ల సంధ్య భరణికి దెయ్యంలా కనిపించేలా రాజేష్ ప్లాన్ చేశాడు.
సంధ్య అలవాటు ప్రకారం ‘యువర్ లవింగ్లీ’ అని రాసి ఉన్న బెదిరింపు ఉత్తరాలు భరణికి వారం వారం అందేలా ప్లాన్ చేశాడు రాజేష్. పబ్లో పేపర్ న్యాప్‌కిన్‌మీద లిప్‌స్టిక్‌తో ‘నిన్ను వదలను’ అని బెదిరింపు వ్యాఖ్యలు రాసి భరణి కళ్ళ పడేటట్టు చేసేదాన్ని నేను. భరణి భయపడి వాటిని నాకు చూపిస్తే ‘నాకేం కనిపించడం లేదే’ అని నాటకం ఆడేదాన్ని.
ఆ విధంగా భరణిలోని భయాన్ని పీక్ స్టేజీకి తీసుకెళ్ళాక భరణితో గెస్ట్‌హౌస్ ప్రోగ్రామ్ వేసాను నేను. పథకం ప్రకారం గెస్ట్‌హౌస్ డూప్లికేట్ కీ తయారు చేయించి మేము వెళ్ళే సమయానికి వాచ్‌మెన్ అక్కడ ఉండకుండా జాగ్రత్తపడ్డాము.
డూప్లికేట్ తాళం సహాయంతో సంధ్య మాకన్నా ముందే గెస్టుహౌస్‌కి చేరుకుని, బెడ్‌రూమ్‌లో ఉన్న వాష్‌రూమ్‌లో దాక్కుంది.
మేము వేసుకున్న పథకం ప్రకారం బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాక కొద్దిసేపటికి నేను వాష్‌రూమ్‌కి వెళ్లాలని భరణితో చెప్పి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాను. భరణి మంచమీద పడుకొని నా రాక కోసం చూడసాగాడు.
నేను ఎంతకీ రాకపోయేసరికి ‘హరితా ఇంకా ఎంతసేపు? త్వరగా రా’ అంటూ హడావిడి చేసాడు. సరిగ్గా అప్పుడు వాష్‌రూమ్ తలుపు తెరుచుకుని నా బదులుగా తెల్లచీర కట్టుకుని జుట్టు విరబోసుకున్న సంధ్య బయటికి వచ్చింది. ఆమె భరణిని బెదిరించలేదు. భయపెట్టలేదు.
కేవలం ఇన్నాళ్ళూ అతడంటే తనలో గూడు కట్టుకున్న అసహ్యాన్నంతటినీ ప్రదర్శిస్తూ ఒక్క చూపు చూసింది.. ఆ ఒక్క చూపుకే అప్పటికే భయంతో గడ్డకట్టుకుని పోయిన భరణి గుండె ఆగి మరణించాడు’’ అంటూ హరిత చెప్పడం పూర్తిచేసింది.
‘‘వెల్ ప్లాన్డ్.. కోల్డ్ బ్లడెడ్ మర్డర్..’’ ఒక్కో పదాన్నీ ఒత్తి పలుకుతూ అన్నాడు రవీంద్ర.
‘‘నో..’’ దాదాపుగా అరుస్తున్నట్టుగా అంది హరిత. ‘‘నో.. రవీంద్రగారూ, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ నాటకం ఆడదామనుకున్నపుడు కానీ, నాటకం ఆడేటప్పుడు కానీ మాకెవ్వరికీ భరణిని చంపాలన్న ఆలోచన లేదు. భరణి దృష్టిలో స్ర్తి అంటే ఒక విలాస వస్తువు. ‘వాడుకుని మర్చిపోయేది’ అన్నటువంటి అతడి మనస్తత్వంలో మార్పు రావాలనుకున్నాం.
లేకపోతే సంధ్యలాంటి, నాలాంటివాళ్ళు ఎంతోమంది ఆత్మాభిమానం అతడికి బలైపోతుంది.
అప్పటికే సంధ్య ఆత్మ పట్ల చాలా భయపడుతున్నాడు భరణి. అతడితో క్లోజ్‌గా మూవ్ అవుతున్న నాకు ఆ సంగతి తెలుస్తూనే ఉంది. అమ్మాయిలతో అతని ప్రవర్తనలో కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తోంది. ఆ రోజు గెస్ట్‌హౌస్‌లో సంధ్య దెయ్యంలా కనిపిస్తే అతడు భయపడి పారిపోతాడనుకున్నాం. ఆ తరువాత ఏ అమ్మాయినీ గెస్ట్‌హౌస్ తీసుకొచ్చే ధైర్యం కాదు కదా కనె్నత్తి చూడటానికి కూడా సాహసం చేయడని మేమనుకున్నాం.
అంతే తప్ప అతడు సంధ్యని చూడగానే ఇలా షాక్‌తో గుండె ఆగి చచ్చిపోతాడని మేము కలలో కూడా అనుకోలేదు. ఇలా జరుగుతుందని ఊహించకపోవడం మినహా జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదు. మమ్మల్ని నమ్మండి’’ ఏడుస్తూ అంది హరిత.
‘‘నిజమే రవీంద్రగారూ, ఆ విషయం నాకు తెలుసు. భరణి ఎంతటి దుర్మార్గుడైనా అతడ్ని చంపాలన్న ఆలోచన మాకెవ్వరికీ లేదు. రాజేష్ ఈ ప్లాన్ చెప్పినపుడు దీనికి మొదట నేను ఒప్పుకోలేదు. కానీ అతడు కొట్టిన దెబ్బవల్ల సంధ్య మానసికంగా ఎంత కృంగిపోయిందో నేను కళ్ళారా చూశాను.
సంధ్య మా సేహితురాలు కనుక ఆమె బాధను మేము తెలుసుకునే అవకాశం కలిగింది. సంధ్యకి ముందు భరణి తప్పుతోవ పట్టించిన ఆడవాళ్ళెంతోమంది నాకు తెలుసు. వాళ్ళు కూడా ఇలాగే బాధపడి ఉంటారు కదా అనిపించింది నాకు సంధ్యని చూశాక. స్ర్తి ఒక విలాస వస్తువుగా పరిగణించే భరణి ఆలోచనా ధోరణి సమాజానికి హానికరం.
ఆడవాళ్ళ పట్ల జరిగే ఎనె్నన్నో అత్యాచారాలకీ, అకృత్యాలకీ అలాంటి ఆలోచనా ధోరణే కారణం. భరణి లాంటి వాడికి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలనుకున్నాం కానీ, అది ఇలా అతడి ప్రాణాలమీదకి వస్తుందనుకోలేదు. నిజం చెప్పాలంటే భరణిని చంపింది మేమ్మెవ్వరమూ కాదు- అతడిలోని అపరాధ భావం. అతడిలోని భయం.. మేము చెప్పదలచుకున్నది నిజాయితీగా మీకు చెప్పేము. తరువాత మీ ఇష్టం’’ అంది లక్ష్మి.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ