డైలీ సీరియల్

అనంతం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ టేకు చెట్టుదగ్గర బాణావతు నిలబడి ఉన్నాడు.
వినమ్రంగా తల వొంగి టేకుచెట్టుకు నమస్కరిస్తూ, కొద్ది క్షణాలు వౌనం పాటించాడు.
నెమ్మదిగా కళ్ళుతెరచి ఆర్తిగా చూశాడు!
టేకు చెట్టు కాండం నిండా బెరడు పొడలు నెత్తుటి గాయాల్లా ఉన్నాయి.
విషాదంగా నవ్వాడు బాణావతు.
అతని చిత్తడి కళ్ళనుంచి అశ్రుకణాలు బొట్లుబొట్లుగా జారి చెక్కిళ్ళగుండా నేల తల్లిని స్పృశిస్తున్నాయి.
సుప్త చేతనలోకి జారిపోతోన్న బాణావతు మనోఫలకంమీద గతం ఓ చలన చిత్రమై కనిపించసాగింది.
***
బాణావతు తండ్రి పేరు రెడ్డియానాయక్... తల్లి పేరు మీరీ. అన్యోన్య దాంపత్యం. ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకు అమితమైన ప్రేమ.
కళ్ళు కన్నీళ్ళలా కలిసిపోయారు వాళ్ళు!
రెడ్డియానాయక్ అన్యాయాన్ని సహించేవాడు కాదు. ఎవరు తప్పుచేసినా నిర్ద్వందంగా ఖండించేవాడు. దారినపోయే సమస్యలన్నీ తనవే అన్నట్టు భుజానవేసికొని న్యాయంవైపు నిలబడి పోరాడేవాడు.
కలప దొంగల్ని చూస్తే అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కి చింత నిప్పులు కురిపించేవి. ఎలగీసి తొడ కొట్టేవాడు. వేటకొడవలి చేతబట్టి సమరానికి సమాయత్తమయ్యేవాడు.
అడవి జంతువులను మాటువేసి మట్టుపెట్టే వేటగాళ్ళంటే రెడ్డియాకు పరమ అసహ్యం. వాళ్ళను వెంటపడి పట్టుకొని చింత బరికలతో కొట్టేవాడు. చెట్లకు కట్టేసి వొళ్ళంతా పచానం చేసేవాడు.
అంతలో ఫారెస్టుగార్డులు రావటం, కలప దొంగల్నీ వేటగాళ్ళనూ ‘అదుపులోకి’ తీసుకొని రక్షించి విడిచిపెట్టటం జరిగేది!
గౌరారం సంతలోనూ అతని తీరు అంతే!
సంతలోకి రాకుండా దళారీలను తరిమికొట్టేవాడు. వాళ్ళకు అడవి సంపద అందనివ్వకుండా నేరుగా వినియోగదారులతో చవుక బేరం సాగించేవాడు.
అది దేశభక్తో? దేశ ద్రోహమో?
శత్రువులు చాలామంది తయారయ్యారు గనుక రెడ్డియానాయక్‌ది దేశభక్తే అనిపిస్తుంది. దేశద్రోహం అయితే అతగాడికి అంతమంది శత్రువులుండరు కదా!?
దళారీలు ఫారెస్టు అధికారులూ కలప దొంగలు అక్రమ వేటగాళ్ళూ కలసికట్టుకా వెళ్ళి, రెడ్డియానాయక్ ‘దేశద్రోహి’ చర్యల మీద అప్పటి ఎమ్మెల్యే కీ.శే.పెద్దిరెడ్డికి ఫిర్యాదుచేశారు.
పెద్దిరెడ్డి వెంటనే తొందరపడి ఓ నిర్ణయానికి రాలేదు!
ఏ సమస్యనైనా ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లో క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించనిదే ఓ నిర్ణయానికి రాడు, పెద్దిరెడ్డి.
అది అతగాడి రాజకీయ నైపుణ్యం!
ముందుగా ఆర్థిక కోణంలో ఆలోచించి-
కలప దొంగల, దళారీల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటే వాళ్ళు, బలహీనపడతారు. వాళ్ళలా బలహీనపడితే రాజకీయ వ్యవస్థ బలహీనపడుతుంది. రాజకీయ వ్యవస్థ బలహీనపడితే అధికార పీఠాలు కదిలిపోతాయి.
‘అంచేత ఆర్థికకోణంలో రెడ్డియా క్షంతవ్యుడు కాదు’అన్న నిర్ణయానికొచ్చాడు పెద్దిరెడ్డి.
సామాజిక కోణంలో ఆలోచించి-
అడవిపుత్రులు అజ్ఞానులు. లోకం తెలియని అమాయకులు.
వాళ్ళ అజ్ఞానం అమాయకత్వమే పాలికవర్గాలకు శ్రీరామరక్ష!
అలాంటి వాళ్ళకు జ్ఞానం బోధించి పోరుబాటపట్టిస్తే వాళ్ళంతా నిప్పురవ్వలై జ్వలిస్తారు. పాలక వర్గాలకెంత ప్రమాదం!
అంచేత సామాజిక కోణంలోకి కూడా వాడు క్షంతవ్యుడు కాదు.
ఇక, రాజకీయ కోణంలో-
పాలకవర్గాల మనుగడకు మూల స్తంభాలైన వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వాళ దెబ్బతీస్తున్నవాడు, రేపు రాజకీయ ప్రయోజనాలను మాత్రం దెబ్బతియ్యకుండా ఆగుతాడా!
జ్ఞానం నేర్పి, పిల్లుల్లాంటి అమాయక అడవి పుత్రుల్ని పులులుగా తీర్చిదిద్దితే ఎంత ప్రమాదం!
అంచేత రాజకీయ కోణంలోకి కూడా రెడ్డియా నాయక్ క్షంతవ్యుడు కాదు అన్న నిర్ణయానికొచ్చాడు కీ.శే.పెద్దిరెడ్డి!
‘‘కానివ్వండి’’అన్నాడు తన అనుచరులతో.
నాయకుడు క్రూరుడైనప్పుడు మరింత క్రూర చర్యలతో అతన్ని మెప్పించాలని అనుచరులు ఉవ్విళ్ళూరటం రాజకీయాల్లో మామూలే!
కీ.శే.పెద్దిరెడ్డి అనుచరులు రహస్యంగా సమావేశమయ్యారు. ఏం చెయ్యాలి? ఎలాచెయ్యాలి? అన్న విషయంలో సుదీర్ఘంగా చర్చించి, చివరికో నిర్ణయానికొచ్చారు!
అక్కడ, పట్నంలో తనకు వ్యతిరేకంగా ఏదో వ్యూహరచన జరుగుతున్నదన్న విషయం రెడ్డియానాయక్‌కు బొత్తిగా తెలియదు.
* * *
ఆకలిగొన్న క్రూర మృగం ఒకటి లోతట్టు అడవిలోనుంచి క్రూరంగా గర్జించింది.
విలయకాల ప్రభంజనంలా, లోహ ఘంటల గర్జారావంలా, ప్రళయ దుందుభీ ధ్యానంలా, మేఘగర్జనలా అది తరంగ తరంగాలుగా విస్తరిస్తూ అడవి అంతా వ్యాపించింది.
ముని పర్ణశాలలో విస్ఫోటం జరిగినట్టు అంతవరకూ నిర్మలంగా, శాంత గంభీరంగావున్న అడవిలో అంతలోనే అలజడి చెలరేగింది.
గూటి పక్షులు భయంతో బిక్కచచ్చిపోతున్నాయి.
గుబురు కొమ్మల మీద సేద తీరుతోన్న పెద్ద పక్షులు రెక్కలు విప్పార్చి ‘టప..టప’లాడించి, యుద్ధ విమానాల్లా దూరంగా ఎగిరిపోతోన్నాయి.
సాధుజంతువులు పొదల్లో తల దాచుకున్నాయి.
ఉత్కంఠతో అలా కొద్దిక్షణాలు గడిచిపోతూ అడవిని క్రమంగా నిశ్శబ్దం ఆవరించింది.. అలజడి, అంతలోనే ప్రశాంతత..
అడవి తీరు అంతే!
గర్జించిన క్రూర మృగానికేదో ప్రాణి ఆహారంగా దొరికినట్టుంది!
అది మళ్లీ గర్జించలేదు. నిశ్శబ్దంగా వుంది.
ఆ నిశ్శబ్దం భయంకరంగా వుంది!
* * *
తెల్లవారి చాలాసేపై, బారెడు ప్రొద్దెక్కినా రెడ్డియానాయక్ యింకా నిద్ర లేవనే లేదు. రుూతాకుల చాప మీద అలా పొర్లుతూనే ఉన్నాడు. మధ్య మధ్యలో కళ్ళు తెరచి ప్రక్కన పడుకున్న గారాల కొడుకు బాణావతును మురిపెంగా చూస్తూ, తలమీద సుతారంగా నిమురుతూ- పుత్ర వాత్సల్య మాధుర్యంలో తమకంగా తేలిపోతోన్నాడు.
భర్త యింకా నిద్ర లేవనందుకు మీరీబాయికి చాలా ఆశ్చర్యం వేసింది!
సూర్యుడికన్నా ముందుగానే నిద్ర లేచి, పలుదోముపుల్లతో దంతధావనం గావించి, రెండు కడవల నీళ్ళతో తనివితీరా స్నానంచేసి, అంతలోనే తయారై సంపదకోసం అడవి బాటపట్టే భర్త తీరు ఇవ్వాళ అలా వుందేం?
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు