డైలీ సీరియల్

అనంతం-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైనెట్లతో పొడుస్తున్నారు.
నిస్సహాయంగా బాధను భరిస్తూ, బాధ ఆవేదనై, ఆవేదన కోపమై కోపం క్రోధంగా మారి, అంతకన్నా చేసేదేమీలేక వాళ్ళమీద కాండ్రించి ఉమ్మేశాడు రెడ్డియానాయక్.
అతని కళ్ళు జ్వలిత జ్వాలలయ్యాయి. ఎర్ర మందారాలయ్యాయి.
ఒక్క అవకాశం చిక్కితే ఎంత బావుంటుందో!
కొండదేవర కరుణించి వరం ప్రసాదిస్తే తనను బంధించిన తాళ్ళు తుంపులు తుంపులుగా తెగిపోవాలి. వేట కొడవలి చేతిలో ప్రత్యక్షం కావాలి.
అప్పుడు జరిగే మహారణంలో-
తన యుద్ధక్రీడా విన్యాసాలకు విస్తుపోతూ, కాళ్ళూచేతులూ ఖండించబడుతూ, తలలు తెగి బంతుల్లా నేలమీద దొర్లుతూ, దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదాలు చేస్తూ నేలకు వొరుగుతూ శత్రుమూకలు చిందించే రక్తంతో కొండదేవరకు నైవేద్యంగా ‘బలెన్నం’ పెట్టాలి!
నాయక్ ఆశించిందేమీ జరగలేదు.
కొండదేవర అజాపజాలేడు.
కనీసం దూరంనుంచైనా తన మహిమ చూపించలేదు.
నల్లకొండ మీద కొలువుతీరి జాతర్లకోసం ఎదురుచూస్తూ-
అమాయకులైన అడవి పుత్రులు మహిమలు నిజమని నమ్మి సమర్పించుకొనే మేకలకోసం గొర్రెలకోసం బలెన్నంకోసం ఎదురుచూడటం తప్ప, దేవర మరెందుకూ పనికిరాడా?
మహిమలే వుంటే అడవిపుత్రుడ్ని ఆపదలో ఆదుకొనేందుకు కొండమీంచి కదిలి రాడేం? అంత శక్తి కొండదేవరకు లేదా?
అశ్రునయనాలతో వౌనంగా నల్లకొండ వైపు చూశాడు రెడ్డియానాయక్!
సరిగ్గా అప్పుడే శత్రువుల తుపాకులు గర్జించాయి.
అడవి నివ్వెరపోయింది.
తూటాలు దూసుకొనివెళ్ళి నాయక్ గుండెకు తూట్లుపొడిచాయి. రక్తం లొడలొడా కారుతోంది. ఆర్తనాదం వెలువడింది. అది హృదయ విదారకంగా వుంది.
హంస లేచి పోయింది.
నాయక్ తల వాలిపోయింది..
* * *
గతం చలనచిత్రమై వర్తమానంలో కళ్ళ ఎదుట కనిపిస్తుంటే బాణావతునాయక్ నిలువెల్లా చలించిపోయాడు.
తన తండ్రి రెడ్డియానాయక్‌ను దుండగులు బంధించి కాల్చి చంపిందా టేకు చెట్టుకే!
అశ్రునయనాలతో పరీక్షగా చూశాడు!
టేకు చెట్టుకు ఎన్ని గాయాలో!!
బాణావతు రెండు చేతులూ ఎత్తి, టేకు చెట్టుకు నమస్కరించాడు.
బలంగా తల విదిల్చి, తండ్రి జ్ఞాపకాలనుంచి బయటపడి అక్కడ్నించి కదిలాడు. కన్నీళ్ళు తుడుచుకొని నడక ప్రారంభించాడు.
దారిలోవున్న నీటి కొలనుదాటి, అక్కడికి కొంచెం దూరంగావున్న ‘నెమలిగుట్ట’కు చేరాడు.
అక్కడ కనిపించిన దృశ్యం హృద్యంగా వుంది.
గుంపు కూడిన నెమళ్ళు రకరకాల నృత్య భంగిమలతో ‘విన్యాసాలు’ చేస్తున్నాయి. పురివిప్పిన వాటి అందాలు కనువిందుగా ఉన్నాయి.
కొంతసేపు బాణావతు అక్కడే నిల్చొని నెమళ్ళ నృత్యాలు చూస్తూ పరవశించి పోయాడు.
మళ్ళీ నడక..
తాడితోపు దగ్గర ఆగి తలెత్తి చూశాడు!
తాడిచెట్లమీద కట్టిన కల్లుముంతలు నిండుతున్నాయి.
కల్లుతో నిండిన ముంతల్ని క్రిందికి దించి, జాగ్రత్తగా నేలమీదపెట్టి, గీత కార్మికులు దూరంగా వెళ్ళిపోయారు. అక్కడ ఎవ్వరూ లేరు.
చెట్లక్రింద కనిపించిన కల్లుముంతల మీద చూపు నిలిపాడు నాయక్. నాలుకతో పెదవులు తడుపుకుంటూ దగ్గరికి వెళ్ళాడు.
చేతిలో చిల్లిగవ్వలేదు. కల్లు తాగాలంటే డబ్బులు కావాలి.
ఏం చెయ్యాలి?
అడవి సంపద అమ్మితే వొచ్చిన డబ్బంతా చిల్లర దుకాణంలో ఊడ్చుకుపోయింది. ఒక్క రూపాయి షావుకారు కింకా బాకీ మిగిలింది.
ఎన్నాళ్ళనుంచి ఓ ఎర్ర రిబ్బను కావాలని అడుగుతున్నదో మీరీ!
ఒక్క రూపాయి మిగిల్చి రెబ్బను కొందామంటే నల్లగాకొచ్చింది.
ఇంటికి వెళ్ళగానే రిబ్బనుకోసం మీరీ ఆశగా చూస్తుంది.
రిక్తహస్తాలతో వచ్చాడని తెలిసి ఎంతగా ఖిన్నురాలౌతుందో!
భార్య మురిపెం తీర్చేందుకు చేతిలో ఒక్క రూపాయే లేనప్పుడిక కల్లు తాగటం కుదిరేదెలా?
ఒక్క క్షణం ఆలోచించాడు!
చెట్లకు కట్టిన కల్లుముంతలు నిండటానికి కొంత సమయం పడుతుంది. అందుకే గీత పనివాళ్ళు ఏదో పనిమీద వెళ్ళుంటారు. రావటం ఆలస్యం కావొచ్చు.
వాళ్ళు తిరిగి వచ్చేలోగా నేలమీద వున్న ముంతల్లోనుంచి కల్లు తాగితే ఎలా ఉంటుంది? దొంగ కల్లుతాగేందుకు అది మంచి అవకాశం! తాగినంత తాగి, తన దారిన తను వెళ్ళిపోతే ఎవ్వరికీ అనుమానం రాదు అని మనసులోనే అనుకున్నాడు బాణావతు.
ఇక ఆలస్యం చెయ్యలేదు. ముందుకు జరిగి నడుములదాకా వొంగి ముంతల్లోకి తొంగి చూశాడు.
ఒకటే మదపు కంపు.
ఆ కంపు యింపుగా వుంది!
నురగలు తేలింది కల్లు. ముంత అంచుల మీద తెట్టి కట్టింది. నోటితో గాలి ఊది నురగను తొలగకొడితే ‘అమృతం’ తాగొచ్చు.
బాణావతు పెదవులు నాలుకతో తడుపుకుంటూ ఓ కల్లుముంత అందుకోబోయాడు.
అమృతం పెదవుల గుండా కడుపులోకి జారి ఆనందం పండించడమే యిక తరువాయి!
హఠాత్తుగా ఆగిపోయాడు బాణావతు.
నల్లకొండ శిఖరంమీద నుంచి ఎవ్వరో పెద్దగా గొంతెత్తి ‘‘అది తప్పు.. తప్పు’’ అని వారిస్తున్నట్లు తోచింది!
అలా వారిస్తున్నదా కొండ దేవరేనా?
అదే నిజమైతే, అపుడు తన తండ్రి విషయంలో కొండదేవర ఎందుకు కలుగజేసికోలేదు? ఎందుకు వౌనం దాల్చాడు? తప్పు చేసిన వాళ్ళనెందుకు సహించాడు? తండ్రిని వాళ్ళు కాల్చి చంపుతుంటే ఎందుకు నిస్సహాయంగా మిగిలిపోయాడు?
జిహ్యచాపల్యంతో నోరూరి-అదే డబ్బు లేక దొంగ కల్లు తాగాలనిపిస్తే, యింత చిన్న విఃయానికి ‘తప్పు.. తప్పు’ అని అరిచినవాడు అప్పుడెందుకు నోరు మెదపలేదూ?
ఇంతకూ అలా వారించింది కొండదేవరా? తన మనసా? నాయక్ గుండె ఝల్లుమన్నది!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు