డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావిత్రి ఇలా అంది. ‘‘మహాభాగా! మీరు చాలాసేపు నిజంగానే నిదురించారు. ఇప్పుడు బాగా చీకటిపడింది. పూజ్యుడైన యమ ధర్మరాజు వెళ్లిపోయాడు. నీవు లేవగల్గితే లే’’.
సత్యవంతుడు ఇలా అడిగాడు ‘‘సావిత్రీ! నేను పండ్లు, కట్టెలు తేవడానికి నీతో కలిసి ఇక్కడకు వచ్చాను. కట్టెలు కొడ్తుంటే నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. నేను నీ ఒడిలో పడుకున్నాను. అప్పుడు నేను గాఢాంధకారాన్ని ఒక తేజస్వి అయిన దివ్యపురుషుని చూశాను. ఎవరతను? నీకు తెలిస్తే నాకు వివరించు. నేను చూసింది అంతా కలా లేక నిజమా?’’
అప్పుడు సావిత్రి ఇలా అంది. ‘‘రాకుమారా! రాత్రి గడిచిపోతున్నది. ఇప్పుడు ఆశ్రమానికి వెళ్దాం. రేపు అంతా వివరంగా చెప్తాను. ముందు నీ తల్లిదండ్రులను చూడు. ఇప్పుడు అరణ్యంలో క్రూరమృగాలు సంచరించే సమయం. ఈ చీకటిలో దారి కూడా సరిగ్గా కనపడడం లేదు.’’
సత్యవంతుడు ఇలా అన్నాడు. ‘‘ఈ రాత్రి ఇక్కడే గడిపి సూర్యోదయాన ఆశ్రమానికి వెళ్ళి తల్లిదండ్రుల దర్శనం చేసుకుందాం. నా తలనొప్పి తగ్గిపోయింది. నా తల్లిదండ్రులు నన్ను తలచుకుంటూ ఉంటారు. వారి జీవితము నా మీద ఆధారపడి ఉన్నది. వారిని పోషించవలసింది నేనే కదా!’’
ఇలా అని సత్యవంతుడు తల్లిదండ్రులను తలచుకొని రోదించసాగాడు. అప్పుడు సావిత్రి అతని కన్నీటిని తుడిచి ఇలా అంది. ‘‘నేను ఎన్నడూ అసత్యం ఆడకపోతే ఆ ఫలితం వల్ల నా అత్తామామలకు భర్తకు శుభం జరుగుగాక’’.
సత్యవంతుడు వెంటనే తల్లిదండ్రులను చూడాలని అన్నాడు. సావిత్రి భర్తను లేపి, పండ్లను, కట్టెల మోపు తీసుకొని ఆశ్రమం వైపు నడిచింది. అదే సమయంలో ద్యుమత్సేనునికి చూపు వచ్చింది. దృష్టి రావడంతో అతను భార్యతో కలిసి సత్యవంతునికై ఆశ్రమాలన్నీ తిరిగాడు. ఆశ్రమాలు, నదులూ వనాలలో తిరిగారు. వారి కాళ్లకు గాయమై నెత్తురు కారసాగింది. ఆశ్రమవాసులు వారిని ఓదార్చి ఆశ్రమానికి తీసుకొని వచ్చారు. వారు కొడుకు కోడలు కోసం విలపించసాగారు. ఆ సమయంలో సావిత్రీ సత్యవంతులు ఆశ్రమానికి చేరుకున్నారు.
బ్రాహ్మణులంతా వారిని చూసి ద్యుమత్సేనుని తో ఇలా అన్నారు. ‘‘రాజా! నీ కొడుకు క్షేమంగా వచ్చాడు. నీకు చూపు వచ్చింది. నీ కోడలు వచ్చింది. ఇదంతా నీకు శుభం జరుగుతుందని చెప్తున్నాయి. సావిత్రి, సత్యవంతుడు, తల్లిదండ్రులు, బ్రాహ్మణులు అంతా కూర్చున్నారు. వారు అతని రాక ఆలస్యానికి కారణం అడిగారు.
అప్పుడు సత్యవంతుడు జరిగిన విషయం చెప్పాడు. తనకు తలనొప్పి రావడం తను నిదురించడం అన్నీ వివరించాడు.
గౌతముడనే బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. ‘‘నీ తండ్రికి చూపు వచ్చింది. దీనికి కారణం నీకు తెలియదు. సావిత్రియే చెప్పాలి. సావిత్రీ! జరిగిందంతా చెప్పు’’.
సావిత్రి ఇలా చెప్పింది - ‘‘మీరనుకున్నది నిజమే! నారదమహర్షి నా భర్త మరణం గురించి వివాహానికి ముందే నాకు చెప్పాడు. నేడే ఆ రోజు. అందుకే నేను ఈ రోజు నా భర్తను క్షణమైనా విడిచి ఉండ లేదు. సత్య వంతుడు శిరోవేదనతో నా ఒడిలో నిద్రిస్తూ ఉంటే యముడే స్వయంగా వచ్చాడు. ఈయన ప్రాణం పాశంతో బంధించి దక్షిణాభి ముఖుడై కొనిపోయాడు. నేను అతన్ని అనుసరించి సత్యవచనాలతో స్తుతించాను. అతను నాకు ఐదు వరాలు ఇచ్చాడు. అవి మామగారికి దృష్టి, రాజ్యప్రాప్తి, నా తండ్రికి వందమంది పుత్రులు, సత్యవంతునికి నాలుగు వందల సంవత్సరాల ఆయుష్షు, నాకు వందమంది ఔరసపుత్రులు - ఇవీ ఆ ఐదు వరాలు. మేము ఆలస్యంగా రావడానికి ఇదే కారణము. అప్పుడు ఋషులు ఇలా అన్నారు. ‘‘సాధ్వీ! ద్యుమత్సేనుని వంశం బాధలకు లోనై అంధకారం అనే ఊబిలో మునిగిపోతుంటే నీవు నీ సౌశీల్యంతో, వ్రతాలతో దానిని మరల ఉద్ధరించావు’’ ఇలా ప్రశంసించి వారు తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
మరునాడు ఉదయం శాల్వ దేశం నుంచి ప్రజలు వచ్చి శత్రువు తమ మంత్రులచే వధింపబడ్డాడని చెప్పారు. మరల ద్యుమత్సేనునే రాజు కమ్మని కోరారు. ద్యుమత్సేనుడు వారి కోర్కెను మన్నించి, ఆశ్రమ వాసులందరికీ నమస్కరించి నగరానికి తిరిగి వెళ్లాడు. పురోహితు లు ద్యుమత్సేనునిరాజుగా అభిషే కించారు. సత్యవంతుని యువరాజుగా అభిషే కించారు. అనంతరకాలంలో సావిత్రికి వంద మంది కీర్తివర్ధనులు వీరులు బలవంతులైన కుమారులు పుట్టారు. సావిత్రి తండ్రికి వందమంది పుత్రులు కలిగారు. ఈ విధంగా సావిత్రి తన పాతివ్రత్య మహిమ చేత తల్లిదండ్రుల వంశాన్ని, అత్తమామల కులాన్ని ఉద్ధరించింది. సావిత్రీ సత్యవంతులు ఎన్నో యజ్ఞాలు, ధర్మకార్యాలు చేశారు.
కౌశికోపాఖ్యానము
పూర్వకాలంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నాలుగు వేదాలను ఆరు అంగాలతో, ఉపనిషత్తులతో అధ్యయనం చేస్తూ ఉండేవాడు. అతను తపస్సంపన్నుడు, ముని, ధర్మశీలుడు. ఒక రోజు అతను చెట్టు కింద కూర్చుని అధ్యయనం చేస్తున్న సమయంలో చెట్టు మీద నుంచి ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది. అప్పుడు బ్రాహ్మణుడు కోపంతో కొంగను చూడగా, అది క్రిందపడి చనిపోయింది. అలా చచ్చి పడిఉన్న కొంగను చూసి అతనికి పశ్చాత్తాపం కలిగింది. ‘‘కోపానికి లొంగి చేయకూడని పని చేశాను’’ అని బాధపడ్డారు. చాలా సార్లు అలా చింతించి అతను గ్రామంలోకి భిక్షాటనకు వెళ్లాడు. అతను ఎప్పుడూ కొందరి ఇళ్ళలో మాత్రమే భిక్షను అడిగేవాడు. అదే విధంగా ఆ రోజు కూడా తాను ఎప్పుడూ వెళ్లే ఒక ఇంటి ముందు నిలబడి ‘‘్భవతీ భిక్షాందేహి’’ అన్నాడు. లోపల నుండి ఆ ఇంటి గృహిణి ‘‘వస్తున్నాను ఉండు’’ అని అన్నది. ఆమె ఒక పాత్రలో భిక్ష పెట్టుకొని వచ్చే సమయానికి ఆకలితో, దప్పికతో ఆమె భర్త ఇంటికి వచ్చాడు.
ఆ ఇల్లాలు బ్రాహ్మణుడి విషయం వదలి, వినయంతో భర్తకు కాళ్లు కడగడానికి, త్రాగడానికి నీరు అందించింది. అతన్ని ఆసనం మీద కూర్చుండబెట్టి మంచి రుచి గల భోజన పదార్థాలను వడ్డించింది. ఆ ఇల్లాలు గుణవతి. పతినే దైవంగా భావించేది. అతనికి అనుకూలంగా ప్రవర్తించేది. ఇంద్రియనిగ్రహం కలది. ఆయనను ఎన్నడూ వ్యతిరేకించేది కాదు. అలాగే కుటుంబ వ్యవహారాలు సమర్థతతో నిర్వహించేది. అత్తమామలకు సేవలు చేసేది. భర్త భోజనం పూర్తి అవుతున్న సమయంలో ఆమెకు భిక్షకై వచ్చిన బ్రహ్మచారిని తాను ఆగమని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.
ఆమె తన పొరపాటుకు సిగ్గుపడి భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. కోపంతో ఉన్న బ్రాహ్మణుడు ఆమెను చూచి ఇలా అన్నాడు - ‘‘ఓ కల్యాణీ! ఏమిటీ నువ్వు చేసిన పని? ఇంత ఆలస్యం ఉంటే ననె్నందుకు ఉండమని చెప్పావు? వెంటనే పొమ్మంటే ఇంకొక గృహానికి పోయేవాడిని కదా!’’
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి