డైలీ సీరియల్

కౌశికోపాఖ్యానము-75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓ మహాత్మా! నాకు ఇవి సిద్ధించడానికి కారణం నీవే. స్వయంగా లోపలికి వచ్చి చూడు’’ అని అతను కౌశికుని ఇంటిలోపలికి తీసుకొని వెళ్లాడు. లోపల ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంది. ధర్మవ్యాధుని తల్లిదండ్రులు శుభ్రమైన వస్త్రాలు ధరించి భోజనం చేసి లోపల ఒక అరుగుమీద కూర్చుని ఉన్నారు. ఒకవైపు పడుకోవడానికి మంచాలు ఉన్నాయి. ధర్మవ్యాధుడు వారి పాదాలు స్పృశించి నమస్కరించాడు. వారు అతన్ని దీవించి ఇలా అన్నారు. ‘‘్ధర్మం నిన్ను సదా రక్షించుగాక! నీచే సేవించబడుతూ మేము సంతోషంగా ఉన్నాము. ఉత్తమ పుత్రునిగా నీవు మాపట్ల అన్ని విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నావు. నీ మనస్సు పవిత్రంగా ఉంది. నీవు శమదమాదులు కలిగి ఉన్నావు. నీవు మా పట్ల చూపే గౌరవం, నీ ఇంద్రియ నిగ్రహం మాకు మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది’’. తర్వాత వ్యాధుడు కౌశికుని వారికి పరిచయం చేయగా వారు అతన్ని తగినరీతిలో సత్కరించి గౌరవించారు.
తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు - ‘‘మహాత్మా! నాకు మా తల్లిదండ్రులే ముఖ్యమైన దేవతలు. దేవతలకు చేసే పూజలను నేను వీరికే చేస్తాను. వీరికే పూలు, పండ్లు, రత్నాలు ఇచ్చి సంతోషపెడ్తాను. విద్వాంసులు చెప్పే అగ్నులు, యజ్ఞాలు అన్నీ నాకు వీరే. నా భార్యాపుత్రులతో నిత్యము వీరినే సేవిస్తాను. నేనే స్వయంగా వీరికి స్నానం చేయిస్తాను. స్వయంగా ఆహారం వండి వడ్డిస్తాను. వీరికి ఇష్టం లేని విషయాలు మాట్లాడను. ఓ బ్రాహ్మణోత్తమా! ఆత్మోన్నతిని కోరే వ్యక్తికి తండ్రి తల్లి అగ్ని పరమాత్మ గురువు ఈ ఐదుగురే గురువులు. వీరిని సేవిస్తే యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఇదే సనాతన ధర్మం. నా తల్లిదండ్రుల సేవ వలన కలిగిన ప్రభావం చూడు. నాకు దివ్యదృష్టి కలిగింది. పతిసేవ చేయడం వలన ఆ ఇల్లాలు నా గురించి నీకు చెప్పింది.’’
వ్యాధుడు ఇంకా ఇలా అన్నాడు ‘‘ఓ బ్రాహ్మణోత్తమా! నాకు నీపై అనుగ్రహం కలుగుట చేతనే ఇదంతా నీకు చెప్పాను. నీవు నీ విద్య కోసం తల్లిదండ్రులను విడిచి వచ్చావు. నీవు చేసినది ఉచితం కాదు. నీ తల్లిదండ్రుల సేవయే నీ ధర్మం. పితృసేవకు దూరం అవడం చేత నీ ధర్మానుష్ఠానం అంతా వ్యర్థము. ఇప్పుడే బయలుదేరి వెళ్లి వాళ్ల సేవ చేయుట ప్రారంభించు. ఇంతకంటే గొప్ప ధర్మం ఇంకొకటి లేదు’’.
అతని బోధలు విన్న కౌశికుడు ఆనదంతో ఇలా అన్నాడు. ‘‘మహాత్మా! నా అదృష్టం వలన నీ సాంగత్యం లభించింది. ధర్మమార్గాన్ని చూపేవారు దుర్లభులు. నరకంలో పడబోతున్న నన్ను ధర్మమార్గం చూపించి ఉద్ధఱించావు. ఇకపై నీవు చెప్పిన విధంగా నడుచుకుంటాను. నీకు తెలియని ధర్మం లేదు. మరి నీకు ఈ శూద్రజన్మ ఏ కర్మఫలితమో నాకు తెలియాలి. దయచేసి వివరించు’.
ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. ‘‘ద్విజోత్తమా! నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదాధ్య యనం చేశాను. ఆ జన్మలో ధనుర్వేద పారంగతుడైన రాజు నాకు మిత్రుడు అయ్యాడు. అతని సాంగత్యం వలన నేను ఆ ధనుర్విద్య నేర్చుకున్నాను. ఒకసారి అతనితో నేను కూడా వేటకు వెళ్లాను. అతను ఒక మహర్షి ఆశ్రమం దగ్గర ఎన్నో మృగాలను వేటాడాడు. నేను కూడా ఒక బాణం వదిలాను. అది ఒక మునికి తగిలింది. అప్పుడు అతను నేలపై బడి ‘‘నేను ఎవ్వరికీ ద్రోహం చేయలేదు. మరి ఈ పాపకార్యం ఎవరిది?’’ అని శోకించాడు. నేను అది ఒక కౄరమృగంగా భావించి అక్కడికి వెళ్లి నా బాణం చేత దెబ్బతిన్న మునిని చూశాను.
‘‘మహాత్మా! తెలియక తప్పు చేశాను. క్షమించుమని’’ ఆయన కాళ్ల మీద పడ్డాను. కాని ఆగ్రహంతో ఆ ముని ‘‘కౄరాత్మా! నీవు శూద్రజాతిలో పుట్టిన వ్యాధుడిగా జీవిస్తావు’’ అని శపించాడు. అప్పుడు నేను ‘‘మహాత్మా! తెలియక చేసిన ఈ తప్పుకు ఇంత శిక్ష వేయకు’’ అని ప్రార్థించాను. కాని ఋషి ‘‘తప్పుకు శిక్ష పడవలసిందే. నీవు శూద్రజాతిలోనే పుడ్తావు. కాని నీకు అన్ని ధర్మాలు తెలిసి ఉంటాయి. నీవు తల్లిదండ్రుల సేవాభాగ్యం వలన మహత్వాన్ని, సిద్ధిని పొందుతావు. చివరకు స్వర్గానికి వెళ్తావు. శాపఫలం పోయినతర్వాత మరల బ్రాహ్మణుడివి అవుతావు’’ అని పలికాడు. కనుక బ్రాహ్మణోత్తమా! ఆయన చెప్పినట్లు నేను స్వర్గానికి వెళ్తాను’’.
కౌశికుడు ఇలా అన్నాడు ‘‘మహాత్మా! నీవు తల్లిదండ్రుల సేవ వలన సాధించినది ఇతరులకు దుర్లభం. నా దృష్టిలో ఇంత జ్ఞానం కల నీవు బ్రాహ్మణుడివే. మానవుడు సదాచారం వల్లనే బ్రాహ్మణుడు అవుతాడు. కర్మదోషం వల్లనే వారికి దుర్గతి సంభవిస్తుంది’’.
ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. ‘‘‘సత్యం తెలిసిన వారు తమ శరీరానికి కలిగిన వ్యాధులను మందులతోను, మానసిక వ్యాధులను, కష్టాలను ప్రజ్ఞ చేత తొలగించుకుంటారు. కాని చింతించరు. కాని మందబుద్ధులు సత్యానికి దూరంగా ఉంటారు. కనుక ప్రతీదానికి దుఃఖిస్తూ ఉంటారు. త్రిగుణాల వల్ల ఒకసారి సంయోగం ఇంకొకసారి వియోగాన్ని పొందుతారు. వీటిలో ఏదీ శోకకారణం కాదు. బాధపడినందువల్ల ప్రయోజనం లేదు. జ్ఞానతృప్తులు సుఖదుఃఖాలను వదిలి జ్ఞానంలో సంతోషంగా ఉంటారు. వారు ఆ మార్గంలోనే వెళ్ళి పరమాత్మ సాక్షాత్కారం పొందుతారు. ఏ విషయంలోను శోక విషాదాలు పొందకుండా పనిచేయాలి. అలా ప్రయత్నిస్తే దుఃఖం నుండి విముక్తి పొందుతారు. ప్రపంచంలో అన్ని పదార్థాలు అనిత్యం. ఒక పరమాత్మ మాత్రమే సత్యం’’.,
బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ‘‘నీవు శోక దుఃఖాతీతుడవు. నీవు జ్ఞానివి. నీవు ధర్మాలను చక్కగా ఆచరిస్తావు. జ్ఞానంతో తృప్తి పొందుతావు. కనుక నీ విషయంలో నీవు చేస్తున్న వృత్తి గురించి ఇక నేను చింతించను. ఈ విధంగా ఈ ఉపాఖ్యానంలో పతివ్రతా ధర్మాలయొక్క మాహాత్మ్యం ,ఇక నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను’’ ఇలా అని అతను వ్యాధుని పాదాలకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు అన్ని విధాలుగా సేవలు చేశాడు. వారు కూడా అతని సేవలకు ఎంతో ఆనందించారు. ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్పిన తల్లిదండ్రుల సేవ యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వివరించాడు.

ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి