డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ..50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదేమిటలా తీసుకువెళ్తున్నావ్?’’ అడిగింది డ్రైవర్ని.
‘‘అటువైపు రూట్ రోడ్ రిపేర్‌లో వుందమ్మా’’ చెప్పాడు డ్రైవరు.
ఆమె ఈవైపు వచ్చి చాలా రోజులైంది. కాంపౌండ్ వాల్ దాటి విశాలమైన తమ కాలేజ్ గేట్ సమీపించింది. అది చూస్తుంటే హరికి తను కావేరితో కలిసి మొదటిసారిగా అక్కడికి రావడం గుర్తొచ్చింది.
కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉండిపోయింది. తనకి ఎన్నో అనుభూతులని, అనుభవాలనీ పంచి ఇచ్చిన ప్రాంగణం.. తన జీవితాన్ని మలుపు తిప్పిన ప్రాంగణం..
‘‘ఒక్కసారి కారాపు’’ చెప్పింది డ్రైవర్‌తో.
డ్రైవర్ పక్కకి తీసి కారాపాడు.
హరిత అలా చూస్తూ ఉండిపోయింది. తను మొదటిరోజు కావేరితోకలిసి చూసినపుడెలా వుందో ఇప్పటికీ అలాగే వుంది. కాలేజ్ వదిలిపెట్టే వేళ కావడంతో స్టూడెంట్స్ బయటికి వస్తున్నారు. జంటలు జంటలుగా.. గుంపులు గుంపులుగా..
మళ్లీ అదే దృశ్యం.. అమ్మాయిలు అబ్బాయిల బైక్‌లమీద ఎక్కి నవ్వుకుంటూ వెళ్లిపోతున్న దృశ్యం.. తనని కొత్తలో కలవర పెట్టిన దృశ్యం.
ఆమెకి వరుణ్ గుర్తుకువచ్చాడు. ఆమెకిప్పటికీ ఒకటే అనుమానం.. తను వరుణ్‌నెందుకు ప్రేమించింది? తనే కాదు.. ఏ అమ్మాయి అబ్బాయి జీవితం చూసినా, పదహారు- పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో తప్పనిసరిగా ఒక ప్రేమ కథ వుండి తీరుతుంది.. ఒక్కొక్కళ్ళలో ఒక్కో స్థాయిలో!
వాటిలో నూటికి తొంభై ప్రేమలు సక్సెస్ కావు.. రకరకాల కారణాలవల్ల, కొందరు కారణాలు తెలుసుకోగలుగుతారు. తెలుసుకోలేని వాళ్ళు పరిస్థితులే దానికి కారణమనుకుని ఆత్మవంచన చేసుకుంటారు.
అసలదంతా ప్రేమేనా? లేక ఆపోజిట్ సెక్స్ దగ్గిర గుర్తింపు పొందాలన్న తపనా?
ఏదేమైనా తనలాంటివాళ్ళందరూ ఆ వయసులో తెలుసుకోవాల్సింది ప్రేమ గురించి కాదని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. అలా తెలుసుకోవాలంటే లక్ష్మి లాంటి స్నేహితులు వుండాలి. కానీ ఎంతమందికి దొరుకుతారు అలాంటి స్నేహితులు?!
అలా అనుకోగానే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది.. ‘తనలాంటివాళ్ళ కోసం తన జీవితానే్న కథగా రాస్తే..?!’
ఆ రోజు రాత్రే కూర్చుని ఆమె కథ రాయడం మొదలుపెట్టింది.
మర్నాడు లక్ష్మిని కలిసి తను రాసిన కథని చూపించింది హరిత. ‘‘ఈ కథ నాకథే అయినా ఇందులో హీరోయిన్‌వి మాత్రం నువ్వే’’ అంది ఆమెతో కథని చూపిస్తూ.
కథ చదివి లక్ష్మి అంది ‘‘బావుంది. కానీ చివరికి హరితా వరుణ్, సంధ్యా, రాజేష్ ఒకటయ్యారా లేదా అన్న విషయాన్ని చెప్పకుండానే ముగించేసావేం కథని?’’
హరిత నవ్వింది. ‘‘ప్రేమకథలకి మన దేశంలో కొదవు లేదు లక్ష్మీ. పొద్దున్న లేచింది మొదలూ, టీవీ చూసినా, పత్రికలు చూసినా, సినిమాలు చూసినా వందలకొద్దీ ప్రేమకథలూ, ముక్కోణపు ప్రేమలూ మనకి కనిపిస్తూ వుంటాయి. హరిత తనని తాను తెలుసుకోకుండా వరుణ్‌ని ప్రేమించినా ఒకటే, భరణికి లొంగిపోయినా ఒకటే, రవిచంద్రని పెళ్లిచేసుకున్నా ఒకటే!
అవడానికిది ఒక అమ్మాయి ప్రేమ తాలూకు కథే అయినా ఈ కథలో నేను చెప్పదల్చుకున్నది మాత్రం ప్రేమ గురించి కాదు.. జీవితం గురించి’’. లక్ష్మి కూడా ఆనందంగా నవ్వింది.

అయిపోయంది

వరలక్ష్మి మురళీకృష్ణ