డైలీ సీరియల్

అనంతం-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు పట్టు యింకా స్పష్టంగా కనిపిస్తున్నది.
తేనె పట్టునిండా చలన రహితంగా కుదురుకున్న తేనెటీగలు ఉదయభానుడి వెల్తురు కిరణాలు పరావర్తనం చెందుతూ మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి!
పట్టు సగభాగంమీద ఎండ పొడపడుతూ, మిగిలిన సగ భాగం నీడలో వుంటే- గ్రహణం విడుస్తున్న చందమామలా వుందా తేనెపట్టు!
వాళ్ళు ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. ‘‘జాగ్రత్త’’అని హెచ్చరించుకున్నారు, కనుసైగలతోటే!
పట్టుకొట్టి తేనె పిండటం అంత సులభంకాదు. పైగా, అది అందరికీ సాధ్యంకాదు. ఏమాత్రం అజాగ్రత్తగావున్నా ప్రమాదం తప్పదు.
అవకాశం యిస్తే కసితీరా కుడతాయి తేనెటీగలు.
ఒళ్ళంతా కదుములు తేలి, ములుకులతో చేసిన గాయాలనుంచి రక్తం పాయలుగా కార్తున్నా, అవ్వోపట్టాన మనిషిని విడిచిపెట్టవు.
తేనెటీగలు కుట్టి చనిపోయినవాళ్ళు చాలామంది ఉన్నారు.
అదీ కాకుండా,
అనుభవం లేనివాళ్ళు తేనెపట్టు కొడితే దిగుబడికూడా తగ్గుతుంది పట్టులో వున్న మొత్తం తేనె చేతికి అందదు.
మైనంతో చేసిన గదుల్లావుండే తేనెపట్టు పిండి బుంగలకు తేనె పట్టటంలో చిన్న పొరపాటు జరిగినా తేనె దగుబడి తగ్గిపోతుంది. మైనంలా వుండే తేనె పట్టు చిదురైపోతుంది.
ఆ బాధ వాళ్ళకు లేదు!
బాణావతు, కాళీచరణ్ ఇద్దరూ తేనెపట్లు కొట్టి, తేనె పిండటంలో అనుభవం ఉన్నవాళ్ళే!
‘‘రెడీ...?’’అని బాణావతు అడిగాడు.
‘‘అవల్రైట్’’ అన్నాడు కాళీచరణ్.
వాళ్ళు అక్కడ్నించి కదిలివెళ్ళారు. అక్కడక్కడా వున్న అడవి చిదుగులు ఏరితెచ్చారు. సరిగ్గా తేనెపట్టు క్రింద నేలమీద గుట్టగావేశారు.
‘‘నిప్పెట్టెగావాలి’’ కాళీచరణ్ అడిగాడు.
‘‘రెడీగుంది’’అంటూ బొడ్లోనుంచి అగ్గిపెట్టె బైటికి తీశాడు బాణావతు.
ఇద్దరూ మందపాటి కంబళ్ళు కప్పుకున్నారు.
చిదుగులకు నిప్పంటించటమే తరువాయి!
నిప్పు అంటించగానే చిదుగులు మండి దట్టమైన పొగలు విడుస్తాయి.
పొగ తేనెటీగల్ని ఆక్రమించి ఊపిరి ఆడకుండా చెయ్యటంతో దూరంగా పారిపోతాయి.
అప్పుడు పిండాలి తేనె.
అగ్గిపుల్ల గీసి అడవి చిదుగులకు అగ్గి అంటించాడు బాణావతు కొంచెం దూరం జరిగి నిలబడి చిదుగుల వైపే చూస్తున్నాడు.
బాగా ఎండినట్టున్నాయి! చిదుగులు కణకణామండుతూ, గాలివాటుకు ఒంపులు తిరుగుతూన్న మంటలు నేలమీద కదిలే నీడబొమ్మలు గీస్తున్నాయి!
చిటపట్లాడుతూ మండుతున్న చిదుగుల్లోంచి తెలుపూ, నలుపూ పొగలు విడతల వారిగా వెలువడుతున్నాయి. చిన్న, పెద్ద పొగ మేఘాల్లావున్న పొగలు తేనెపట్టును పరామర్శించి, గాలి తరంగాల వెంట దూరంగా సాగిపోతోన్నాయి.
బాణావతు. కాళీచరణ్ కళ్ళు విశాలంచేసి చిదుగులవైపే చూస్తున్నారు.
పట్టుమీద కదలకుండా కుదురుకున్న తేనెటీగలు నెమ్మదిగా కదలసాగాయి. అప్పుడే వాటికి చలనం వచ్చినట్టుంది. లుకలుకలాడ్తున్నాయి.
చిదుగుల మంటసెగకూ పొగకూ తట్టుకోలేక, వొళ్ళూకళ్ళూ మండి- పట్టుమీదనుంచి లేచి పారిపోయే సన్నాహాల్లో ఉన్నట్టుంది!
అప్పుడు ఇద్దరూ ఒకళ్ళ వైపొకళ్ళు చూశారు. ‘్భద్రం’అన్నట్టు సైగలు చేసి, తేనెటీగలకు తమ ఒళ్ళు కంపించకుండా కంబళ్ళు జాగ్రత్తగా కప్పుకొని కుదుటపడ్డారు.
అలాంటప్పుడు తేనెటీగల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది!
పువ్వు పువ్వుకూ తిరిగి మకరందం సేకరించి, తేనెపట్టు మైనం గదుల్లో దాచుకొని కొసరికొసరి పిల్ల తేనెటీగలకు తాగిస్తూవుంటే- వాటి తేనెకోసం దౌర్జన్యం ప్రదర్శించే మనుషుల్ని అవ్వసలికి విడిచిపెట్టవు’.
కోపంతో రెచ్చిపోతాయి.
తిరుగుబాటు చేస్తాయి.
చుట్టుముట్టి, వళ్ళంతా సూదులు పొడిచి, జల్లెడ చేస్తాయి. ఓ పట్టాన విడిచిపెట్టవు. వాటి బారినుంచి బైటపడటం తేలిక కాదు.
‘‘భద్రంరొరేయ్’’అని కాళీచరణ్‌ను బాణావతు హెచ్చరించాడు.
ఇద్దరూ కంబళ్ళను కొంచెం తొలగించి తదేకంగా తేనెటీగల వైపే చూస్తున్నారు.
పారిపోయినవి పారిపోగా పట్టుమీద యింకా చాలా తేనెటీగలున్నాయి. ఈగలన్నీ వెళ్ళిపోవాలంటే కొంత సమయం పడుతుంది.
‘‘సిత్రంగుంటుంది కదూ?’’ అసందర్భంగానే కాళీచరణ్‌తో బాణావతు అన్నాడు.
కాళీచరణ్ అయోమయానికి గురయ్యాడు.
సమాధానం చెప్పలేదు.
‘‘తేనె పట్ల యవ్వారఁవే’’
‘‘అవును! ఒక్కోసారి పిసరంత పట్టులో సెరువంత తేనొచ్చుద్ది. ఒక్కోసారి సెరువంత పట్టులో శారెడంతగూడా రాదు.’’
‘‘ఏంటికంటావ్?’’ బాణావతు అడిగాడు.
‘‘గాచారఁవ్.’’
‘‘వల్లకాడు గాదూ.’’
‘‘ఐతే, ఏంటిదంటావూ?’’అన్నాడు కాళీచరణ్.
‘‘పిల్ల తేనెటీగె లాగిన పట్టులో తేనుండదు. అంతే.’’
‘‘ఇంతకీ తేనె మన అతికారఁవ్ ఈగెల్దా? మడుసుల్దా?’’అని యధాలాపంగానే కాళీచరణ్ అడిగాడు.
బాణావతు వౌనంగా అతనివైపు చూశాడు.
‘‘ఈగెలు దాపెట్టుకున్న తేనె మడుసులు నూకటఁవ్ తప్పుగదూ?’’
ఏం సమాధానం చెప్పాలో బాణావతుకు తోచలేదు. ఒక్క క్షణం ఆగి, ‘‘అంతా నూకితే తప్పే’’అన్నాడు. అంతకన్నా ఏంచెప్పాలో అతని బుర్రకి తోచలేదు.
నాలుగు అడుగులువేసి, చిదుగుల దగ్గరికి వెళ్ళాడు. ఓ పొడవాటి వెదురుకట్టెతో చిదుగుల్ని ఎగదోశాడు. అవ్వి మళ్ళీ కణకణా మండసాగాయి.
పట్టునింకా విడిచిపెట్టని తేనెటీగలుకూడా ఒక్కొక్కటే పట్టువదలి పారిపోతోన్నాయి.
ఈగలన్నీ వెళ్ళింతర్వాత ఇద్దరూ కప్పుకున్న కంబళ్ళుతీసి ప్రక్కనపెట్టి, తేనెపట్టు దగ్గరికి వెళ్ళారు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు