డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. వారు యుక్త వయస్కులై స్వయంవరానికి సిద్ధంగా ఉన్నారు. రాజు వారి స్వయంవరానికి సమస్త దేశాల రాజులను ఆహ్వానించాడు. ఆ స్వయంవరానికి తన తమ్ముడైన విచిత్రవీర్యుని కోసం, భీష్ముడు కూడా వెళ్లాడు. అతను అక్కడ సమావేశమైన రాజులందరినీ హెచ్చరించి, తాను ఆ కన్యలను తన తమ్ముని కోసం తీసుకొనిపోతున్నాని చెప్పి వారిని రథం పైకి ఎక్కించాడు. ఎందుకంటే వారు పరాక్రమమే శుల్కంగా కలవారు. రాజులందరికీ భీష్ముని పైన కోపం వచ్చి అతనితో యుద్ధానికి సిద్ధమైనారు. కాని భీష్ముడు వారిపై బాణవర్షం కురిపించి వారందరినీ ఓడించాడు. తర్వాత అతను ఆ కన్యలను తీసుకొని హస్తినాపురానికి వచ్చి వారిని సత్యవతికి అప్పగించాడు. అతను సత్యవతి పాదాలకు మ్రొక్కి ఇలా అన్నాడు. ‘‘అమ్మా! వీరు కాశీరాజు కుమార్తెలు. పరాక్రమమే వీరికి శుల్కం. కనుక నేను అందరి రాజులను జయించి నా తమ్ముని కోసం వీళ్ళను తెచ్చాను’’.
సత్యవతి వారిని చూసి చాలా సంతోషించింది. వివాహం ఇక జరుగబోతుందనగా కాశీరాజు పెద్ద కూతురు అంబ మెల్లగా సత్యవతితో తాను సాళ్వరాజుని వరించానని చెప్పింది. ఆమె మాటలు విన్న భీష్ముడు తన పొరపాటు తెలుసుకొని ఆమెను సాళ్వరాజు దగ్గరకు పంపాడు. ఆమె సాళ్వరాజు దగ్గరకు వెళ్ళి ‘‘నేను నీ గురించే వచ్చేశాను’’ అంది.
అంబ మాటలు విని సాళ్వరాజు ఇలా అన్నాడు. ‘‘సుందరీ! నేను భీష్ముని చేతిలో ఓడిపోయాను. అతను మమ్మల్నం దరినీ జయించి నిన్ను గెలుచు కున్నాడు. నీవు పరాయి సొత్తు అయినావు. నిన్ను నేను భార్యగా స్వీకరించలేను. ధర్మం తెలిసిన నేను పరాయి స్ర్తీని ఎలా స్వీకరిస్తాను? కనుక నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళు. ఇక్కడ సమయం వ్యర్థం చేసుకోకు.’’
అంబ సాళ్వుని అనునయిస్తూ ఇలా అంది. ‘‘రాజా! దయచేసి అలా అనకు. నేను భీష్మునితో ఆనందంగా వెళ్ళలేదు. అతడు అందరు రాజులను జయించి నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళాడు. నేను ఏ తప్పు చేయలేదు.
నీ పట్ల అనురాగం కల నన్ను విడిచిపెట్టడం ధర్మం కాదు. నేను భీష్మునితో మన విషయం చెప్పి అతని అనుమతితోనే ఇక్కడకు వచ్చాను. ఆ భీష్ముడు నన్ను కోరలేదు. నా చెల్లెళ్ళను తన తమ్మునికిచ్చి వివాహం చేశాడు. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ భర్తగా వరించలేదు. నినే్న కోరుకున్నాను. కనుక నన్ను భార్యగా స్వీకరించు’’.
అంబ ఇలా వేడుకుంటూ ఉన్నా సాళ్వుడు ఆమెను స్వీకరించడానికి ఇష్టపడలేదు.
అతను ఇలా అన్నాడు. ‘‘వెళ్ళు, వెళ్ళు! నేను భీష్మునికి భయపడుతున్నాను. భీష్ముడు నిన్ను పరిగ్రహించాడు. నాకు నువ్వు అక్కరలేదు’’.
అంబ ఏడుస్తూ అక్కడినుండి బయలుదేరింది. ఆమె ఇలా మనసులో చింతించింది. ‘‘నాలా ఇలాంటి దుస్థితిలో ఉన్నవారు ఎవరూ లేరు. బంధువులకు ముందే దూరమయ్యాను. ఇప్పుడు సాళ్వుడు కూడా తిరస్కరించాడు. మళ్ళీ హస్తినాపురికి తిరిగి వెళ్ళలేను. ఇప్పుడు ఎవరిని నిందించను? నన్నా లేక వీరుడైన భీష్ముడినా లేక నాకు స్వయంవరం ప్రకటించిన మా తండ్రినా?
వీర్యశుల్కంగా నన్ను జనం మధ్యలో నిలబెట్టిన
వివేకశూన్యుడు అయిన నా తండ్రికీ, భీష్మునికీ, నాకూ బుద్ధిలేదు. నాకు జరిగిన ఈ అన్యాయానికి భీష్ముడే కారణము కనుక తపస్సు చేసి శక్తి సంపాదించుకొని, భీష్మునిపై ప్రతీకారం తీర్చుకుంటాను’’.
ఈ విధంగా ఆలోచిస్తూ మునుల ఆశ్రమాలకు వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపింది. అక్కడి మునులతో అంబ తన విషయాలు అన్నీ చెప్పింది. ఆ ఆశ్రమంలో గొప్ప తపస్వి అయిన శైఖావత్యముని ఉన్నాడు. అతను ఆమెతో ఇలా అన్నాడు - ‘‘ఈ స్థితిలో ఆశ్రమవాసులై తపస్సు చేసుకొనే మునులు నీకు ఏమి సహాయం చేయగలరు?’’
అంబ ఇలా అంది - ‘‘నా మీద దయచూపండి. నేను సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సు చేసుకుంటాను’’. అప్పుడు ముని ఆమెను ఓదార్చి తక్కిన వారితో ఆమె పని సానుకూలమయ్యేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పాడు.
అప్పుడు మునులందరూ అంబ కోసం ఏదో ఒకటి చేయాలని అనుకొన్నారు. కొందరు ఆమెను తండ్రి ఇంటికి పంపే యాలనుకున్నారు. కొందరు భీష్ముని నిందించాలనుకొన్నారు. ఇంకొందరు ఆమెను సాళ్వునికి నచ్చచెప్పి అతనికి అప్ప జెప్పాలన్నారు. కొందరు ఆ పని వద్దన్నారు. వారంతా ఆమెతో ఇలా అన్నారు. ‘‘అమ్మా! నీవు సన్యాసం స్వీకరించవద్దు. నీవు నీ తండ్రి దగ్గరకు వెళ్ళు. అతను ఏం చేయాలో అది చేస్తాడు. తండ్రి యొక్క ఆశ్రయం లాగ ఇంకే ఇతర ఆశ్రయముండదు. స్ర్తీలకు భర్త కాని, తండ్రికాని గతి. కష్టకాలంలో తండ్రి ఆశయంలో ఉండడమే స్ర్తీలకు ఉత్తమం. ఆశ్రమంలో ఉంటే అనేక కష్టాలు రావచ్చు. తండ్రి దగ్గర అలాంటి కష్టాలు ఉండవు’’.
అప్పుడు అంబ వారందరికీ నమస్కరించి ఇలా అన్నది. ‘‘మహాత్ములారా! నేను తిరిగి కాశీరాజు ఇంటికి వెళ్ళను. అలా వెళితే బంధువులందరిలో అవమానం పాలవుతాను. కనుక మీ తాపసుల సమక్షంలో తపస్సు చేసుకుంటాను. ఇలాంటి కష్టం మరల వచ్చే జన్మలో కలగకూడదనే తపస్సు చేస్తానం టున్నాను’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి