డైలీ సీరియల్

అనంతం-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం-
కలివికోడికి మనిషి పొడే గిట్టదు. తాకితే రెండురోజుల్లోనే ప్రాణాలు విడుస్తుంది. అంత అలర్జీ ఎందుకో?
భారతీయులేనా, అమెరికావాళ్ళు అంటుకున్నా చనిపోతుందా? అన్నది పరిశోధనలో తేలాలి!
మూడో రౌండు పూర్తయ్యింది! రాగ్యా గుర్తొచ్చాడు!
‘ఆపరేషన్’ పూర్తయ్యేదాకా తన వెంట రాగ్యా ఉండి తీరాలి...
అడవిలో వాడు కొండంత అండ!
వాడికి అడవి పుత్రుల్ని నమ్మించే మాటకారితనం వుంది. లౌక్యం వుంది. అవసరమైతే ఎవర్నైనా ఎదిరించగల గుండె ధైర్యం, జబ్బపుష్ఠి వుంది.
ముల్లును ముల్లుతోనే తియ్యాలి.
అడవి పుత్రుల్ని అడివి పుత్రుడితోటే ఎదుర్కోవాలి.
వాడికి తండావాళ్ళ స్వభావం తెలుసు. అమాయకత్వంతో ఎలా మోసపోతారో తెలుసు. ఎలా బుట్టలోవెయ్యాలో తెలుసు. వాళ్ళ మూఢ విశ్వాసాలు ఆచారాలు కట్టుబాట్లూ తెలుసు.
తండాలు ఖాళీచేయించి, అడవి భూముల్ని స్వాధీనం చేసుకొని బహుళ జాతి కంపెనీలకు అప్పగించాలంటే రాగ్యా సహకారం కావాలి!
పైగా,
వ్యసనాలు మరిగి రాగ్యా బాగా రాటుతేలాడు. నాగరికుల స్నేహంకోసం తహతహలాడుతూ, వాళ్ళతో తిరిగితే తనూ గొప్పవాడై పోతానన్న భ్రమతో కర్చుక్కూడా వెనుకాడటం లేదు.
ఈమధ్య నాలుగు ఇంగ్లీషుముక్కలు కూడా నేర్చాడు. సినిమాలు చూస్తున్నాడు.
పట్నం కుర్రాళ్ళని వెంటపెట్టుకొని బార్లకువెళ్తూ, బిల్లులు తనే చెల్లిస్తూ స్వంత లాభం తగలేస్తున్నాడు.
అలాంటివాడు, అప్పనంగా డబ్బు వేళకింత మందూ అనువైన భోజనం దొరికితే చెప్పిందెందుకు చెయ్యడూ!
‘‘మంచింగ్ సార్’’ అన్నాడెవ్వరో సేవకుడొచ్చి.
‘‘వ్వాట్ మంచింగ్?’’ గరుడాచలం అడిగాడు.
‘జాతీయ పక్షి’.
‘వాడ్డూయూ మీన్?’’
‘‘నెమలి మాంసం!’’
‘‘అది తెలుసు...’’
‘‘్ఫరిన్ విస్కీతో ఇండియన్ నెమలి మాంసం తింటే స్వర్గం కనిపిస్తుంది.’’
‘‘చూపించు’’అన్నాడు గరుడాచలం.
సేవకుడు బైటికి వెళ్ళాడు. గుడారం నిశ్శబ్దంగా వుంది.
* * *
దూరంగా అడవిలోనుంచి నలుపు, తెలుపు మేఘాల్లా పొగలు గాలి వాటుకు గుడారాల వైపు రావటం అక్కడేవున్న ఓ పోలీసు ఉద్యోగి గమనించాడు!
అవ్వి గుడారాల దగ్గరున్న గాడి పొయ్యిల పొగలు కావు. అడవిలోనుంచే వస్తున్నాయి.
ఏమై ఉంటుంది?
అడవిలోనుంచి పొగలెందుకు వస్తున్నట్టు?
అడవికి నిప్పంటుకుందా?
సందేహం లేదు! అడవి పుత్రులు పక్షినో, జంతువునో వేటాడి చిదుగు మంటల్లో కాలుస్తున్నట్టుంది. అందుకే అంత దట్టమైన పొగలు.
పోలీసు ఉద్యోగి భృకుటి ముడిపడింది!
వాళ్లు నెమలిని పట్టికాల్చటం లేదు కదా?
అదే నిజమైతే, కావాల్సిన కార్యం గంధర్వులే తీర్చినట్టవుతుంది!
నెమిలిని కాల్చి తినటం చట్టరీత్యా నేరం! అది జాతీయ పక్షి!
పోగలు వస్తున్నవైపు సిబ్బందితో వెళ్లాలి. అడవిపుత్రులు నెమళ్ళను చంపి మంటల్లో కాలుస్తుంటే వలపన్ని పట్టుకోవాలి. అరెస్టు చేసి ఖైదు కొట్టుకు పంపించాలి.
అలా వేధింపుల పర్వం ప్రారంభించి కీర్తిని తనే కొట్టెయ్యాలని బయల్దేరాడా పోలీసు అధికారి. సిబ్బంది కూడా అతని వెంట కదిలారు. మధ్య మధ్యలో తలలు పైకెత్తి పొగల వైపు చూస్తూ గబగబా నడుస్తూ ముందుకు సాగిపోతున్నారు.
వాళ్ళకది అత్యుత్సాహంగా వుంది!
అనుకున్నట్టే నేరం చేస్తూ అడవిపుత్రులు స్పాట్లో దొరికితే లాఠీలతో కుళ్ళబొడిచి, చేతులకు సంకెళ్ళు వెయ్యొచ్చు!
లాఠీ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళంతా ఆర్తనాదాలు చేస్తే ఎంత మంచి సంగీత రాగాలు వినిపిస్తాయో!?
పోలీసు సిబ్బంది వేగంగా నడుస్తూ నల్లకొండ అటు వైపునకు చేరుకున్నారు.
ఇద్దరు అడవి పుత్రుల్ని దూరం నుంచి చూసి-
‘‘ఎవర్రా.. మీరు?’’ అని పెద్దగా అరిచారు.
లోహఘంటల గర్జారావమై గగనంలో కూడా ప్రతిధ్వనిస్తూ కర్ణకఠోరంగా వినిపించిన అరుపులు అడవిని తుళ్ళించి, గూటి పక్షుల్ని వణికించి- నెమలి గుట్ట దగ్గర నర్తిస్తూ పరవశించిపోతోన్న నెమళ్ళను భయపెట్టి-
అపుడు వినిపించాయి తేనెపట్టు దగ్గరికి!
బాణావతు కాళీచరణ్ గడగడా వణికిపోతూ భయంతో గువ్వల్లా కృంగిపోయారు.
ఇనుప నాడాల బూట్ల చప్పుళ్ళ వెంటే వస్తున్న పోలీసు సిబ్బందిని దూరంగా చూసి స్థాణువులై నిల్చున్నారు.
సాయుధ పోలీసులు అక్కడికిచేరారు.
పూర్తిగా ఆరని చిదుగుల వైపూ అడవి పుత్రుల వైపూ మార్చి మార్చిచూస్తూ-
‘‘నెమళ్ళను చంపారా?’’ అని ఓ పోలీసు ఉద్యోగి అడిగాడు.
‘‘సంపలేద్దొరా’’ బాణావతు చెప్పాడు.
‘‘మంటల్లో కాల్చిందేమిటి?’’
‘‘తేనెపట్టుకు పొగెట్టినావు.. అంతే..’’
‘‘నీ పేరు?’’
‘‘బాణావొదు’’
‘‘వాడి పేరు?’’
‘‘కాలీశరన్’’
‘‘ఏ తండా మీది?’’
‘‘రెడ్డియానాయక్ తండా’’
పోలీసు సిబ్బంది ఉలిక్కిపడ్డారు! ముందుగా ఖాళీ చేయించాల్సిందా తండానే!’’
‘‘తేనెపట్టు కొట్టి తేనె పడుతున్నారా?’’
‘‘ఔ.. దొరా’’
‘‘తేనెనేం చేస్తారు?’’
‘‘గౌరారఁవ్ సంతలో అమ్ముతావు’’
‘‘ఎవడబ్బ సొమ్మని అమ్ముతార్రా.. దొంగనా కొడకల్లారా! ప్రతి దొంగనా కొడుక్కీ అడవి ఇష్టారాజ్యమైపోయింది. అడవి బిడ్డలం అంటూ అడవిని దోచుకుంటున్నారు. ఎన్‌కౌంటర్ చెయ్యాలి’’ అని ఆ పోలీసు ఉద్యోగి నేలమీద కనిపించిన కంబళ్ళు అందుకున్నాడు. కోపంగా చిదుగులమీదికి విసిరేశాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు