డైలీ సీరియల్

అనంతం-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిదుగుల్లో దాగిన నిప్పురవ్వలు, కంబళ్ళూ కలిసి మళ్లీ మంటలు లేచాయి.
‘‘్ఛర్జ్..’’ అని అరిచాడతను.
ముందుగా లఠీలతో కొట్టి తేనె కుండలు పగులగొట్టారు.
వొలికిపోయిన తేనె మైనం ముద్దలతో కలిసి పాయల్లా పారుతూ నేలమీద దారులు వెదుకుతోంది.
మైనం ముద్దలు తేనె కన్నీళ్ళు కారుస్తున్నాయి!
సిబ్బంది అపుడు బాణావతు, కాళీచరంలపై విరుచుకొని పడ్డారు.
లాఠీలు గాల్లోకి లేచి వాళ్ళ శరీరాల మీద బలంగా పడుతున్నాయి. వాతలు తేలుతున్నాయి. భరించలేని బాధ. వాళ్ళ ఆర్తనాదాలతో అడవి దద్దరిల్లిపోతోంది.
‘‘మా తప్పేంటిది?’’ దెబ్బల్ని తప్పించుకొంటూ, కొంచెం ధైర్యం కూడగట్టుకొని బాణావతు అడిగాడు.
పోలీసు సిబ్బంది నివ్వెరపోయారు!
చదువులేదు, చట్టం తెలియదు, ఓట్లెయ్యటం తప్ప ఓట్లేసి గెలిపించినవాళ్లు ఏం చేస్తున్నారో తెలియదు. హక్కులు తెలియవు. హక్కుల్ని హరిస్తున్నది ఎవ్వరో తెలియదు.
వాడో అజ్ఞాని.
అలాంటివాడు ‘‘నా తప్పేంది’’ అని అడగటం, అందునా పోలీసుల్నే అడగటం ఎంత తప్పు!?
సృష్టి వైచిత్రం అనిపించింది!
‘‘పొగపెట్టటం మొదటి తప్పు! అడవిలో అధికారం చలాయించటం రెండో తప్పు. నివాసాలు ఏర్పాటుచేసుకొని అడవిని ఆక్రమించటం మూడో తప్పు. ఏమిటి? ఎందుకు? అని పోలీసులను ప్రశ్నించటం నాలుగో తప్పు.
కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్!
ఇదే మీకు లాస్ట్ వార్నింగ్! వెంటనే తండా ఖాళీచేసి ఎక్కడికైనా వెళ్లిపోండి. మళ్లీ కనిపిస్తే కాల్చేస్తాం జాగ్రత్త’’ అని హెచ్చరించి గుడారాల వైపునకు సాగిపోయారా పోలీసు సిబ్బంది.
బాణావతు, కాళీచరణ్ భయంనుంచి నెమ్మదిగా తేరుకొన్నారు.
ఒకళ్ళగాయాలొకళ్ళు చూసి కళ్ళతోనే ఓదార్చుకున్నారు. కొంత సమయం గడిచింది.
‘‘ఇంటికి బోదావా’’ అడిగాడు బాణావతు.
కాళీచరణ్ ఎందుకో అమాంతం ముందుకు వొంగాడు. నేలమీద పార్తోన్న తేనెలో చూపుడు వ్రేలు ముంచి నోట్లో పెట్టుకొని చప్పరించి ‘‘యమ్‌డన్ తేనెని సెడగొట్టారు’’ అన్నాడు.
బాణావతు కళ్ళల్లో కన్నీళ్ళు మెరిసాయి!
‘‘ఈగలు మళ్లీ వాల్తాయ్యి, కొత్త పట్టు పెడతయ్యి’’ అన్నాడు కాళీచరణ్‌తో బాణావతు.
వాళ్ళు దిగులు మొహాలతో ఇంటిదారి పట్టారు.
***
నగ్గూరాం ఇంట్లో లేడు. భూక్యా తండాలో వున్న ఎవ్వరో బంధువు జ్వరం తగిలి వైద్యం అందక మృతి చెందితే కబురంది వెళ్లాడు.
రాగ్యా ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.
ఆలస్యంగా నిద్రలేచి హడావుడిగా కాలకృత్యాలు తీర్చుకున్నాడు.
ఆకలిగా వుంది. రాత్రి అన్నం తినే్లదు.
కల్లు తాగితే కడుపుబ్బరిస్తుందని అక్కడికి కోసుదూరం నడిచి వెళ్లి అడవి అంచులో నాగరికులు కాస్తున్న నాటుసారా తాగొచ్చాడు. అక్కడే నాలుగు చీకులు తిన్నాడు.
కడుపుబ్బరం లేదు కానీ, కడుపులో వికారంగా వుంది. ఒకటే మంట. పేగులు లుంగచుట్టుకొనిపోతూ విపరీతంగా నెప్పి!
అంత దూరం కాలినడకన తిరిగి ఎలావచ్చాడో కానీ, ఇంటికి చేరటంతోనే అమాంతం చాపమీద వాలిపోయాడు.. సరిగా నిద్రలేదు.
మగతనిద్రలో గరుడాచలాన్ని కలువరించాట్ట!
తండ్రి చెబితే ప్రొద్దునే్న ఆ విషయం తెలిసింది రాగ్యాకి!
వారం క్రితం పట్నంలో గరుడాచలాన్ని కలిశాడు. విందు భోజనం తిన్నాడు. విస్కీ తాగుతూ సిగరెట్లు కాల్చాడు.
అపుడు గరుడాచలం చెప్పిందాని ప్రకారం అతను ఎప్పుడైనా మళ్లీ అడవికి రావొచ్చు. వస్తే కొంతకాలం వుంటానని, ముఖ్యమైన పనేదో అడవిలో ఉందని కూడా చెప్పాడు గరుడాచలం.
అతనికోసం ఎదురుచూస్తూ రోజులు లెక్కిస్తున్నాడు రాగ్యా!
బైట్నించి ఎవ్వరో పిలుస్తున్నారు!
ఆలకించి విన్నాడు రాగ్యా. గొంతు గుర్తుపట్టాడు. సంతోషంగా రెండే రెండు అంగల్లో గుడిసెలోనుంచి బైటికి వెళ్లాడు. రాగ్యా ఊహించినట్టే-
ఫారెస్టు గార్డు యాదయ్య కనిపించాడు ఎదురుగా!
‘‘ఏంటి యిసయవ్?’’ యాదయ్యని రాగ్యా అడిగాడు.
‘‘గరుడాచలంగారొచ్చారు. నిన్ను రమ్మంటున్నారు’’ చెప్పాడు యాదయ్య.
రాగ్యా మొహం విప్పారింది.
‘‘యాడుండాడు సారు?’’ అని అడిగాడు.
‘‘నల్లకొండ దగ్గరున్నారు’’
‘‘తండాకి రావొచ్చుగదా..’’
యాదయ్య ఫక్కున నవ్వాడు.
‘‘అంత పెద్దసారు నీ గుడిసెకొస్తాడా’’ అన్నాడు.
రాగ్యా మొహం వాడిపోయింది.
‘‘పద.. పద’’ తొందరపెట్టాడు యాదయ్య.
‘‘బండలమీన కూకున్నాడా? సెట్లకింద కూకున్నాడా’’ అని రాగ్యా అడిగాడు.
‘‘వాళ్ళకేం కర్మ! రాత్రి టెంట్లు వేశారు. వంటా వార్పూ కూడా అక్కడే! మందు కేసులు ఉంచంరు. ఫారిన్ సిగరెట్లు కార్టన్లున్నాయి. టెంట్లలో ఎన్ని సదుపాయాలున్నాయో’’
‘‘ఒక్కడే వొచ్చిండా’’
‘‘కాదు! ఆఫీసర్లు, పోలీసులు..’’
‘‘పోలీసోళ్ళా? ఏంటికి?’’ అడిగాడు రాగ్యా.
‘‘తెలియదు. మొత్తానికేదో పెద్ద పనిమీదే వచ్చారు. ఎమ్మెల్యే సారు గూడా ఉన్నాడు’’.
రాగ్యా మాటలు పొడిగించకుండా తడక తలుపు దగ్గరికి వేసి, యాదయ్య వెంట బయల్దేరాడు.
‘‘సారేవన్నాడింకా?’’ దార్లో రాగ్యా అడిగాడు.
‘‘నిన్ను త్వరగా రమ్మన్నారు’’
‘‘అద్సరే! ఇంకేమన్నాడూ’’
‘‘అదృష్టం అంటే నీదేరా రాగ్యా’’
‘‘ఏంటికో’’
‘‘అంత గొప్పవాళ్ళు నీ కోసం ఎదురుచూట్టం..’’
రాగ్యా ఛాతీ ఉబ్బింది. గర్వంగా చూశాడు!
తండా గుడిసెల దాటి పదడుగులు వెయ్యగానే ఎందుకో రాగ్యా ఆగాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు