డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు అంబ ఇలా అంది ‘‘ప్రభూ! నేను శోకం అనే ఊబిలో కూరుకొనిపోయాను. నన్ను ఉద్ధరించు’’ అలా అని ఆమె జరిగినదంతా భార్గవరామునికి నివేదించింది. అప్పుడు అతను అంబతో ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నిన్ను భీష్ముని దగ్గరకు పంపుతాను. అతను నా మాట జవదాటడు. ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే యుద్ధంలో అతన్ని నా శస్త్రాలతో దహించివేస్తాను. అది నీకిష్టం లేకపోతే వీరుడైన సాళ్వుని ఈ పని చేయమంటాను.’’
అంబ ఇలా అంది - ‘‘్భగవాన్! నేను అంతా వివరంగా మీకు చెప్పాను. ఇప్పుడు ఏది యుక్తమో అది చేయండి. కాని నా ఈ దుఃఖానికి భీష్ముడే కారణం. ఎవరి వల్ల నేను ఇంత దుఃఖమనుభవిస్తున్నానో ఆ భీష్ముని చంపండి. ఆ భీష్ముడు నీచుడు, లోభి, జయకాంక్ష కలవాడు. అతడిని చంపితే నా కోరిక తీరుతుంది’’.
అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు. ‘‘రాజపుత్రీ! నేను వేదవేత్తలైన వారి గురించి తప్ప నేను శస్త్రం పట్టటానికి ఇష్టపడను. సాళ్వుడు, భీష్ముడు ఇద్దరూ నా మాట వింటారు. నేను నీ పని చేస్తాను. నువ్వు దుఃఖించకు’’.
అంబ మళ్లీ ఇలా అంది ‘‘ప్రభూ! మీరు నా దుఃఖాన్ని పోగొట్టాలి. అది కూడా భీష్ముని వల్లనే కలిగింది. భీష్ముడిని యుద్ధానికి పిలిచి చంపు. నీవు ప్రతిజ్ఞ నిలబెట్టుకో’’.
ఈ సంభాషణ విన్న ఆకృతవ్రణుడు ఇలా అన్నాడు. ‘‘రామా! నీ శరణుకోరిన ఈ కన్యను విడిచి పెట్టరాదు. అతను నీతో యుద్ధం చేసే సమయంలో భీష్ముడు నీ చేతిలో ఓడిపోవాలి లేదా నీ మాట పాటించాలి. అప్పుడే ఈ అమ్మాయి కోరిక నెరవేరుతుంది. నీ మాట కూడా నిలబడుతుంది. నీవు చేసిన ప్రతిజ్ఞ ఇది - భయంతో శరణుకోరి వచ్చిన శరణార్థులను వదిలి వేయను. భీష్ముడు అందరి క్షత్రియు లను జయించి ఉన్నాడు. కనుక అతని తో యుద్ధం చేసి జయించు’’.
దానికి పరశురాముడు ఇలా అన్నాడు. ‘‘ఈ కార్యం నేను సామోపాయం చేతనే జరిగేలా చూస్తాను. ఈ కన్య మనసులో కోరుకున్న పని చాలా గొప్పది. నేను ఈమెను తీసుకొని స్వయంగా భీష్ముని దగ్గరకు వెళతాను. భీష్ముడు నా మాటను పాటించకపోతే అప్పుడు యుద్ధం చేస్తాను’’ ఇలా అని తరువాత పరశురాముడు ఆ బ్రహ్మజ్ఞానులందరితో కలిసి అంబను వెంటపెట్టుకొని కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఆ ఋషులం దరూ పరశురామునితో సహా సరస్వతీ నదీతీరంలో విడిది చేశారు.
తర్వాత మూడోరోజున పరశురాముడు హస్తినాపురం బయట నిలబడి భీష్మునికి ఇలా సందేశం పంపాడు. ‘‘రాజా! నేను వచ్చాను. నాకు ప్రియమైనది చేయి’’.
తన గురువు అయిన భార్గవరాముడు రాజ్యం పొలిమేరలోకి వచ్చాడని తెలిసి భీష్ముడు ఆనందంగా అతన్ని కలియడానికి వెళ్ళాడు. పండితులతో గోవులతో పురోహితులతో కలిసి వెళ్ళి గురువును సత్కరించాడు. రాముడు అతని సత్కారాన్ని స్వీకరించి భీష్మునితో ఇలా అన్నాడు.
‘‘కాశీరాజు కూతురు అంబను వివాహం చేసుకోవాలనే కోరిక లేకపోతే ఎందుకు తీసుకొని వచ్చావు? మళ్ళీ ఆమెను ఎందుకు వదలిపెట్టావు? నీ వల్ల ఈమె ధర్మభ్రష్టురాలైంది. కనుక నా ఆజ్ఞ మేరకు ఈమెను వివాహం చేసుకో. ఈమెను ఇలా అవమానపరచడం నీకు తగదు’’.
అప్పుడు భీష్ముడిలా అన్నాడు - ‘‘బ్రహ్మర్షీ! నేను నా తమ్మునికిచ్చి ఈమెకు వివాహం చేయలేను. ఆమె పూర్వమే తాను సాళ్వునికి చెందానని చెప్పింది. నేను సరేనని ఆమెను సాళ్వుని దగ్గరకు పంపాను. భయం చేత కాని, ఇష్టం వలన కాని, దయచేత కాని, ధనలోభం చేత కాని నేను నా క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టను అని వ్రతం పూనాను’’.
భీష్ముని మాటలతో ఆగ్రహం చెంది భార్గవరాముడు ఇలా అన్నాడు - ‘‘్భష్మా! నా మాటను వినకపోతే నిన్ను ఇప్పుడే చంపగలను’’.
భీష్ముడు తన గురువుని అనునయ వాక్యాలతో శాంతపరిచాడు. కాని అతని ఆగ్రహం చల్లారలేదు. భీష్ముడు మరల ఇలా అన్నాడు - ‘‘మీరు నాతో యుద్ధం చేయడానికి ఎందుకు సంకల్పించారు? నాకు చతుర్వేద శాస్తమ్రులు మీరే ఉపదేశించారు కదా! నేను మీ శిష్యుడిని.’’
దానికి భార్గవరాముడు ఇలా అన్నాడు - ‘‘మూర్ఖుడా! నీవు నన్ను గురువుగా గుర్తిస్తున్నావు. కాని నా ఆదేశాన్ని పాటించడం లేదు. నేను చెప్పినట్లు కాశీరాజు కూతుర్ని స్వీకరించడం లేదు. ఈమెను స్వీకరించి నీ వంశాన్ని రక్షించుకో. ఈమె నీ వల్ల భ్రష్టు రాలైది. భర్తను పొందలేకపోతోంది’’.
భీష్ముడు దానికి ఇలా సమాధానం చెప్పాడు - ‘‘బ్రహ్మర్షీ! అది జరిగే పని కాదు. నాకు ఆజన్మ బ్రహ్మచర్యవ్రతం ఉంది. అదీ గాక పరపురుషునియందు ప్రేమ కలిగిన స్ర్తీని తెలిసి తెలిసి ఎవరు ఇంటిలో ఉంచుకుం టారు? నేను నా ధర్మాన్ని విడిచిపెట్టను. కార్యాకార్యాలు తెలియక చెడుమార్గంలో నడుస్తున్న అహంకారపూరితమైనవాడు గురువు అయినా విడిచిపెట్టాలి. నేను నిన్ను గురువని గౌరవించాను. కాని నీవు గురు ధర్మాన్ని తెలుసుకోలేకపోయావు. కనుక నీతో యుద్ధం చేస్తాను. నిన్ను యుద్ధంలో చంపను. నీవు గురువువు, పైగా బ్రాహ్మణుడివి, మహాతపస్వివి. బ్రాహ్మణోత్తమా! నేను క్షత్రియుడిని. రామా! నీవు న్యాయాన్ని అతిక్రమిస్తున్నావు కనుక నీతో యుద్ధం చేయడం తప్పు కాదు. మనం కురుక్షేత్రంలో యుద్ధం చేద్దాము. అనేక సభలలో ఒక్కడినే క్షత్రియుల దర్పం అణిచాను అని చెప్పుకుం టున్నావు. అప్పుడు ఈ భీష్ముడు పుట్టలేదు. నీవు గడ్డిపరకలలాంటి రాజులతో యుద్ధం చేశావు. ఇప్పుడు నీ దర్పాన్ని యుద్ధంలో నాశనం చేస్తాను’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి