డైలీ సీరియల్

అనంతం-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అటు సూడు’’ అన్నాడు.
యాదయ్య తలెత్తి అటువైపు చూశాడు.
అక్కడ, వాల్యా, చాంద్‌నీ పొదల్లో దాగుడుమూతలు ఆడుతున్నారు.
ఇంకొంచెం ముందుకు వెళ్లారు.
ఇపుడు చాంద్‌నీ స్పష్టంగా కనిపిస్తున్నది!
రాగ్యా నరాలు జివ్వున లాగాయి!
ఇనుమడించిన అందంతో చాంద్‌నీ మరింత అందంగా వుంది. నపు వెల్తరు వలయం ఆమె చుట్టూ ప్రకాశిస్తున్నది!
అడవి పూల సుగంధమో, మేని పరిమళమో గాలి తరంగాల వెంట తేలివస్తూ ఆహ్లాదంగా వుంది.
రాగ్యా యాదయ్యను అక్కడే ఆపి, ఒక్కడే చాంద్‌నీ దగ్గరికి వెళ్ళాడు.
‘‘ఇయ్యాళింకా సక్కంగుండావు. ఒకపాలి..’’ అంటూ వంకరగా నవ్వుతూ అర్థోక్తిగా ఆపాడు.
‘‘ఏటొకపాలి?’’ అడిగింది చాంద్‌నీ.
తడుముకున్నాడు. సమాధానం లేదు.
‘‘సెప్పవేటి?’’
బేలగా చూస్తూ నిల్చున్నాడు రాగ్యా.
‘‘ఒకపాలి సెంబుతో గొట్టిందిసాల్లేదురా నీకు! ఒక్కపాలి అని మళ్లా అడిగినావంటే సీపుర్తో గొడతాను. జాగరాత’’ అని రాగ్యా మొహమీదే కాండ్రించి ఉమ్మేసింది చాంద్‌నీ.
వాల్యా చెయ్యి అందుకొని గుడిసెల వైపునకు వెళ్లిపోయింది.
యాదయ్యకు అంతా అయోమయంగా వుంది.
ప్రశ్నార్థకంగా రాగ్యా వైపు చూస్తూ-
‘‘ఎవ్వరా అమ్మాయి? నిన్ను చెంబుతో కొట్టిందా?’’ అని అడిగాడు.
‘‘సెంబూ లేదు గింబూ లేదు. శాందినీ అంటార్దాన్ని’’ అని పేలవంగా నవ్వాడు రాగ్యా.
‘‘నీ వాలకం చూస్తే కొట్టినట్టే వుంది’’
‘‘సెప్పుతో గొట్టినా, సెంబుతో గొట్టినా..చివరాకరికైనా ఒక్కపాలి తొంగుంటే సాలు దాన్తో! దీని యిసయవ్ గరుడాచలం సార్తో జెప్పాలి.’’
‘‘ఏమని చెప్తావ్?’’ యాదయ్య అడిగాడు.
‘‘ఈ పిట్టమీద పరిశోధన సెయ్యవని’’
‘‘అంత తీరికా సారుకు’’
‘‘నాకోసరవ్ సారేమైనా శాత్తాడు’’ అన్నాడు రాగ్యా.
గుడారాల దగ్గరికి చేరారు.
వాతావరణం చూసి రాగ్యా భయపడ్డాడు!
డేగ కళ్ళతో చూస్తున్న సాయుధ పోలీసులు- సూటు బూట్లలో హుందాగా, హడావుడిగా తిరుగుతున్న అధికారులూ...
‘‘సారు యాడుండాడు?’’ అని రాగ్యా అడిగాడు.
‘‘అదే, గరుడాచలంసారు గుడారం.. లోపలికి వెళ్ళు’’ అని చూపుడు వ్రేలుతో గుడారాన్ని చూపించాడు యాదయ్య.
కాపలా పోలీసు సిబ్బంది రాగ్యాను అడ్డుకోలేదు. ఎలాంటి ప్రశ్నలూ వెయ్యలేదు. యాదయ్య సైగలతో అతన్ని లోపలికి అనుమతించారు.
రాగ్యా ఎందుకో కొంచెం జంకుతూనే వెళ్లాడు.
ఒంటరిగా కూర్చొని మందు తాగుతూ ఏదో ఆలోచిస్తున్న గురుడాచలం తలెత్తి రాగ్యాని చూశాడు.
‘‘అక్కడే ఆగావేం! వచ్చి కూర్చో’’ అన్నాడు నవ్వుతూ.
సంకోచిస్తూ నిలబడే ఉన్నాడు రాగ్యా.
‘‘ఎందుకు భయపడుతున్నావు?’’
రాగ్యా వౌనంగా నిల్చున్నాడు. సమాధానం లేదు.
గ్లాసులో వున్న మందంతా ఒకేవిడత తాగాడు గరుడాచలం.
నిషా తలకెక్కి తాత్త్వికత మొలకెత్తిందేమో!
‘‘రాగ్యా! సృష్టి విచిత్రమైంది కదూ! ‘నేను’ అంటే ఎవరు? ‘నువ్వు’ అంటే ఎవరు?’’
‘‘మీరు గరుడాశలవ్ సారు.. నేను రాగ్యాగాడ్ని’’ అని మధ్యలోనే చెప్పాడు రాగ్యా.
గరుడాచలం మూడ్ పాడైంది!,
రాగ్యా అడ్డు తగలకపోతే, నిర్నిరోధంగా తత్త్వం బోధించి ఆ అజ్ఞానిని జ్ఞానిగా మార్చేవాడే!
సదవకాశం కోల్పోయినందుకు సానుభూతిగా రాగ్యా వైపు చూస్తూ,
‘‘మందు తాగుతావా’’ అని అడిగాడు గరుడాచలం.
వౌనంగా తల వూపాడు రాగ్యా.
తన గ్లాసు, మరో గ్లాసు-రెండు గ్లాసుల్లో మందు పోసి ‘కానివ్వు’ అన్నాడు.
రాగ్యా నిలబడే మందంతా తాగాడు.
‘కూర్చో’ అన్నాడు గరుడాచలం.
ఖాళీ గ్లాసును చూస్తూ నిల్చునే ఉన్నాడు రాగ్యా.
‘కూర్చో’ అని మళ్లీ అన్నాడు.
‘‘తవరి ముందు కూకోటవా.. తప్పు’’ అని, రాగ్యా టీపాయ్‌మీది సీసా అందుకున్నాడు. గ్లాసులో మందు వొంపుకున్నాడు.
గరుడాచలం ఇంకా గ్లాసు ఖాళీ చెయ్యలేదు.
రాగ్యా ఆ గ్లాసు కూడా పూర్తిచేశాడు!
ఖాళీ గ్లాసు టీపాయ్‌మీద పెట్టి, తల గుడ్డ తీసి భుజమీద వేసుకున్నాడు. కొంచెం తూల్తూ-
‘‘తవర్తో సగవాసవ్ యనక జల్మ పునె్నం’’ అంటూ గరుడాచలానికి ఎదరగా వున్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు.
గ్లాసులోకి మందు వొంపుకున్నాడు.
గరుడాచలం అదేమీ పట్టించుకోలేదు. రాగ్యావైపు తాత్త్వికంగా చూస్తూ-
‘‘అనంత విశ్వంలో మనం నలుసులకన్నా తక్కువ! పెద్ద చిన్న అన్నది మనుషుల మధ్య అంతరాలు సృష్టించేందుకు మనసు చేసే మాయాజాలం.. అంతే కదూ!’’ అని అడిగాడు.
‘‘గళాసులో మందు ఆ మోపునే వుంది’’ అని
గరుడాచలానికి గుర్తుచేశాడు రాగ్యా.
‘‘తల్లిగర్భంలో వున్నపుడు తెలియని అంతరాలు పుట్టి పెరిగాకనే తెలుస్తున్నాయంటే, అవ్వన్నీ కల్పితాలు కదూ’’ అని గ్లాసు ఖాళీచేశాడు గరుడాచలం.
‘‘తల్లి కడుపులో వుండప్పుడేటి తెలుసుద్దేటి’’ అని, రాగ్యా ఎంతో చనువుగా రెండు గ్లాసుల్లోకి తనే మందు వొంపాడు.
‘‘తండా సంగతులేమిటి?’’ గురుడాచలం అడిగాడు.
‘‘ఏటుంటయ్యి సారూ.. మావూలే’’
‘‘నాకోసం నువ్వొక సహాయం చెయ్యాలి’’.
‘‘నిప్పుల్లో దూకేనా సారూ’’
‘‘నాకేమిటి లాభం’’
‘‘ఏం గావాల్నేటీ..’’
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు