డైలీ సీరియల్

అనంతం-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్ళ చేతుల్లో అధికార పార్టీ జెండాలూ, జేబుల్లో సర్వీసు రివాల్వర్లూ ఉన్నాయి.
‘‘్భరత్ మాతాకీ జై.. పెంటారెడ్డికీ జై’’ అని గొంతెత్తి అరుస్తూ మఫ్టీ కానిస్టేబుళ్ళు తండా అంతా ఓ చుట్టు చుట్టి, చివరకి ఎమ్మెల్యేతో కలిసి చింతచెట్టు క్రిందకి చేరారు.
గుమికూడిన తండావాళ్ళ నుద్దేశించి-
‘‘నా ప్రియమైన అడవి పుత్రులారా’’ అనగానే-
‘‘మీ కాట్టాలు గాల.. మీ పీనిగెలెల్ల.. తలేపు దీపవెట్ట.. మీ పీనిగెల్ని రాబొందుల్దిన.. మిమ్మల్ని వొలుకుల్లో గాల్స..’’ అని గొంతెత్తి అరుస్తూ బాణావతు భార్య లక్ష్మీబాయి సుడిగాల్లా విరుచుకుపడుతూ ఎమ్మెల్యే ముందుకు వచ్చింది.. అందరూ నిర్ఘాంతపోయారు.
ఎమ్మెల్యే శాంతంగా ఒక్క క్షణం ఆలోచించాడు.
‘‘నా సోదరికేదో కట్టం వచ్చినట్టుంది’’ అన్నాడు.
‘‘నా పెనివిట్ని పోలీసోళ్ళు గొట్టారు. పక్కనుండ కాలీశరాన్నీ గొట్టారు. గొడ్లని బాదినట్టు సావబాదారు.
తేనె బట్టటవ్ తప్పంట.. అడవి మీ అబ్బ సొత్తా? అని అడిగినారంట.. మాదీ మీదీ గాదది, దేవుడిచ్చిన అడివి.
అడివిలోబుట్టి అడివిలోనే వుంటన్న మాగ్గాక యింకెవుడికుంటుంది అదికారఁవ్? తడాగూడా ఖాళీజేసి ఎలిపోవాల్నంట.
ఊళ్ళల్లో ఉండనియ్యకా, అడువుల్లో ఉండనియ్యకా... ఇంకేడికి బోవాలె మేవంతా’’అని ఎమ్మేల్లేని నిలదీసింది లక్ష్మీబాయి.
‘‘కొట్టారా’’ శాంతంగా అడిగాడు ఎమ్మెల్లే.
‘‘సావగొట్టారు.’’
‘‘ఎవరు.’’
‘‘పోలీసోళ్ళే.’’
‘‘నేను ఖండిస్తున్నాను’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘కండిచ్చి ఏంబీకుతావ్’’అంటూ, గుంపులోనుంచి ముందుకు వచ్చింది చాంద్‌నీ. ‘‘మా అయ్యని సూత్తే ఏడుపొత్తుంది లాటీదెబ్బలకి వొళ్ళంతా సీరుకుపోనాది’’అన్నది, ఆవేశం బాధ మిళితం చేసి.
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్లే పెంటారెడ్డి చాందినీ మీదనుంచి చూపులు మరల్చుకోలేకపోయాడు.
ఎంత అందంగా వుంది!
‘‘నీ పేరేమిటి’’అని అడిగాడు.
‘‘శాందినీ.’’
‘‘ఎవరమ్మాయివి.’’
‘‘కాలీశరణ్ కూతుర్ని.’’
‘‘మీ నాన్నని కూడా కొట్టారా.’’
‘‘సావగొట్టారు.’’
‘‘ఐతే పీకుతా! వాళ్ళని ఉద్యోగాల్లోనుంచి పీకేస్తా! వెంటనే కమిటీవేసి విచారణ జరిపిస్తా’’అని హామీఇచ్చాడు ఎమ్మెల్లే.
సద్దుమణిగింది.
‘‘నా ప్రియమైన అడవి పుత్రులారా! నేను తండా బాటపట్టింది ఎందుకంటే...’’
‘‘కానిస్టేబుళ్ళ ఉజ్జోగాలూడబీకి అప్పుడొచ్చిచెప్పు’’అన్నది లక్ష్మీబాయి పెద్దగా... తండావాళ్ళంతా ముసిముసి నవ్వులు నవ్వుతూ. అక్కడ్నించి దూరంగా వెళ్ళిపోయారు.
చింత చెట్టుక్రింద ఎమ్మెల్లే, మఫ్టీ కానిస్టేబుళ్ళు మాత్రమే మిగిలారు... ఇక, ఉపన్యాసం ఎవరికి చెప్పాలి?
తండా బాట గురించి కానిస్టేబుళ్ళకు చెప్పటం అనవసరం అనుకున్నాడు ఎమ్మెల్యే! చేసేదేమీ లేక-
గుడారాల బాట పట్టాడు!
ఎమ్మెల్లే వెంట పార్టీ జండాలతో వచ్చినవాళ్ళు వరిబువ్వ పెట్టకుండానే వెళ్ళిపోవటంతో,
‘‘వరి బువ్వ...వరి బువ్వ’’అంటూ పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు వాల్యా!
* * *
రాగ్యా నిద్ర లేచాడు. నిషా పూర్తిగా తగ్గిపోయింది.
చన్నీళ్ళతో మొహం కడుక్కొని తలగుడ్డతో తుడుచుకున్నాడు.
గరుడాచలం కోసం చూశాడు.
‘‘నిద్ర లేచావా...గుడ్’’ అన్నాడు అప్పుడే బైట్నించి వచ్చిన గరుడాచలం.
‘‘నిషా తలకెక్కింది. తొంగున్నాను. గొడవేఁవీ సెయ్యలేదుగదా’’అని గరుడాచలాన్ని రాగ్యా అడిగాడు.
‘‘అలాంటిదేమీ లేదు. మామూలే’’అన్నాడు తేలిగ్గా కొట్టిపారవేస్తూ. రాగ్యా కళ్ళు షోకేస్ వైపుకు తిరిగాయి.
‘‘మళ్ళీ కావాలా’’ అడిగాడు గరుడాచలం.
‘‘తఁవరూ దాగాల.’’
‘‘అలాగే’’ అన్నాడు గరుడాచలం.
తాగుతూ కూర్చున్నారు.
‘‘చాంద్‌నీ అంత బాగుంటుందా’’ మధ్యలో గరుడాచలం అడిగాడు.
‘‘సూత్తేనే గుబులైతది. శారెడంత కళ్ళూ సందమాఁవ మొకఁవూ... మొగిలి పువ్వులా వుంటుంది’’ చెప్పాడు రాగ్యా.
‘‘చలాకి పిల్లేనా.’’
‘‘దాని శలాకీతనఁవ్ సూడార్నంటే దేవర సంబరాల్లోనే!’’
‘‘సంబరం అంటే.’’
‘‘జాతర. కొండదేవర జాతర.’’
‘‘ఏం చేస్తారూ.’’
‘‘అడివిలో వుండ అన్ని తండాలవోళ్ళూ నల్లకొండ కొత్తారు..’
‘‘వచ్చి, ఏం చేస్తారూ.’’
‘‘గులాపులు సల్లుకుంటా, కొమ్ము బూరాలూదుకుంటా, డప్పులు వాయిచ్చుకుంటూ సిందులేత్తారు. కల్లుదాగినోళ్ళు, తాగనోళ్ళు గూడా తప్పెట్లసప్పుడికి సిందులేత్తారు. దేవరకి బలులిచ్చి, బువ్వలో రగ్తం గలిపి బలెన్నఁవ్. నైవీజ్జిగఁవెడతారు- కొండ దేవరకి.’’
‘‘చాంద్‌నీ చలాకితనానికీ, దానికీ ఏమిటి సంబంధం.’’
‘‘శాందినీ కాలికి గజ్జెకట్టుద్ది. కోక ఎగ్గట్టుద్ది...అది సిందులేసినట్టు సంబరఁవ్లో ఎవ్వురూ ఎయ్యలేరుసారూ’’ అన్నాడు రాగ్యా.
ఇక చాందినీ విషయం ఎత్తలేదు. కర్తవ్యం గుర్తొచ్చింది గరుడాచలానికి. విషయాన్ని మరోవైపుకు మళ్ళిస్తూ-
‘‘మనం అడవికి వెళ్ళాలి. కలివికోడి జాడలకోసం వెతకాలి. త్వరగా భోంచేసి వెళ్ళొద్దాం’’ అన్నాడు రాగ్యాతో.
సేవకు భోజనాలు వడ్డించారు. మందు గ్లాసులు తీసి, మంచినీళ్ళ గ్లాసులు పెట్టారు.
వహ్వా... ఏం భోజనం!
మృష్టాన్న భోజనం.
సంపన్నుల భోజనం.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు